<b> నవంబర్ 2019 కరెంట్ అఫైర్స్ </b>

నవంబర్ 2019 కరెంట్ అఫైర్స్

నవంబర్ 2019 అంతర్జాతీయం

ట్విట్టర్‌లో రాజకీయ ప్రచారం నిలిపివేత

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ట్విట్టర్‌ను వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ అక్టోబర్ 31న పేర్కొన్నారు.

యునెస్కో డిఫెన్సెస్ నివేదిక విడుదల

నవంబర్ 2ను ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెనైస్ట్ జర్నలిస్ట్స్గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో నవంబర్ 1న ఇంటెన్సిఫైడ్ అటాక్స్, న్యూ డిఫెన్సెస్ అనే నివేదికను విడుదల చేసింది.

యునెస్కో డిఫెన్సెస్ నివేదిక-ముఖ్యాంశాలు

2017, 2018లో 55 శాతం జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావరణంలేని ప్రాంతాల్లోనే జరిగాయి.

నేరాలు, అవినీతి, రాజకీయాలపై పాత్రికేయులు జరిపిన రిపోర్టింగ్ కారణంగానే ఈ హత్యలు జరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్యలకు బాధ్యులైన వారిలో 90 శాతం మందికి శిక్షలు పడలేదు.

2014 కన్నా ముందు ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్యల కన్నా 2014 తరువాతి ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్య లు 18 శాతం పెరిగాయి.

ముఖ్యంగా పాత్రికేయుల హత్యల్లో 30 శాతం అరబ్ దేశాల్లో, 26 శాతం లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో, 24 శాతం ఆసియా పసిఫిక్ దేశాల్లో చోటు చేసుకున్నాయి.

బ్యాంకాక్‌లో తూర్పు ఆసియా దేశాల సదస్సు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 4న 14వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(ఈఏఎస్) జరిగింది. ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేరాలను అరికట్టడానికి మరింత ముమ్మరమైన ప్రయత్నాలు చేయాలని, ఐరాసలోని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఈ సదస్సు తీర్మానించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈఏఎస్‌ను 2020లో భారత్‌లోని చెన్నైలో నిర్వహించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు.

ఈఏఎస్‌లోని 18 సభ్య దేశాలు

ఆస్ట్రేలియా, బ్రూనై, కాంబోడియా, చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, మయన్మార్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్, అమెరికా, వియత్నాం.

జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో మోదీ భేటీ

తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, వియత్నాం ప్రధాని గుయెన్ చాన్ ఫుక్, జపాన్ ప్రధాని షింజో అబెలతో ప్రధాని మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. కీలక ద్వైపాక్షిక, భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలపై వారితో చర్చలు జరిపారు. మరోవైపు మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుబాటుదారులను నియంత్రించేందుకు సహకారం అందించాలని ఆమెను మోదీ కోరారు.

 థాయ్‌లాండ్‌లో ఆర్‌సెప్ సదస్సు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 4న జరిగిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... ఆర్‌సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు. భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు అని ప్రకటించారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.

ఆర్‌సెప్ ఆమోదం పొందితే...

ఆర్‌సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40 శాతం, ప్రపంచ జీడీపీలో 35 శాతం ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి.

15 దేశాలు సిద్ధం

ఆర్‌సెప్ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. 2020వ సంవత్సరంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఆర్‌సెప్‌లో భారత్ చేరకపోవడానికి కారణాలు

వాణిజ్య లోటు భర్తీని తీర్చడానికి, ధరల మధ్య వ్యత్యాసానికి తగిన పరిష్కారం కనిపించకపోవడం.

దాదాపు 90% వస్తువులపై దిగుమతి సుంకాలను ఎత్తివేసేలా ఒప్పందం ఉండడం.

వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం.

అత్యంత ప్రాధాన్య దేశాల (ఎంఎఫ్‌ఎన్) హోదాను మరికొన్ని దేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు రానుండడం.

టారిఫ్ తగ్గింపులకు ప్రాతిపదిక ఏడాదిగా 2014ని పరిగణించాలనడం.

2012 నుంచి చర్చలు

ఆర్‌సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన లక్ష్యంగా ఆర్‌సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి.

చైనా ఒత్తిడి

అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది.

రుగ్మతగా ఆన్‌లైన్ షాపింగ్ : గార్టనర్

ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక వ్యసనపరమైన రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ వెల్లడించింది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్‌వో గుర్తించినట్టు పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్‌ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని వివరించింది. 2024 ఏడాదికల్లా ఆన్‌లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని తెలిపింది.

పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా

భూతాపాన్ని కట్టడి చేయడానికి కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం-2015 నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా లాంఛనంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి తెలియజేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక నోటీసు అందజేశారు. నోటీసు ఇచ్చిన ఏడాది తర్వాత అది అమలవుతుంది. అంటే.. 2020 ఏడాది నవంబర్ 4న అమెరికా ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది.

చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందంపై భారత్ సహా 188 దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇందులో కీలక పాత్ర పోషించారు. ఒబామా తర్వాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా పరిశ్రమల పోటీతత్వాన్ని దెబ్బతీయడానికి భారత్, చైనా వంటి దేశాలకు సాధికారత కల్పించడానికే దీన్ని తెచ్చారని ఆరోపించారు. ఒప్పందం నుంచి వైదొలుగుతామని 2017, జూన్ 1న ప్రకటించారు.

నవంబర్ 2019 జాతీయం

అరేబియా సముద్రంలో మహా తుపాను

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు మహాగా పేరు పెట్టారు. ఈ తుపాను లక్షదీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 130 కి.మీ, కోజికోడ్‌కి పశ్చిమ వాయువ్య దిశగా 340 కి.మీ దూరంలో కొనసాగుతూ గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోందని భారత వాతవరణ శాఖ(ఐఎండీ) అక్టోబర్ 31న వెల్లడించింది. తీవ్రరూపం దాల్చుతున్న మహా ప్రభావంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, లక్షదీవులను వర్షాలు ముంచెత్తనున్నాయి.

మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న క్యార్ తుపాను క్రమంగా బలహీనపడనుందని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు తుపాన్లు ఏర్పడటం అరుదు. 1965వ సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్లీ ఇలా ఒకేసారి రెండు తుపాన్లు ఏర్పడ్డాయి.

వాట్సాప్ లో వ్యక్తిగత సమాచారం తస్కరణ

వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని పెగాసస్అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయని వాట్సాప్ సంస్థ అక్టోబర్ 31న ప్రకటించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగిందని వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థపై అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు వాట్సాప్ నిరాకరించింది.

తాజా వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై 2019, నవంబర్ 4లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని వాట్సాప్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారుల్లో భారత్‌లో 40 కోట్ల మంది ఉన్నారు. ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థ పెగాసస్ స్పైవేర్‌ను అభివృద్ధి చేసింది.

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్

జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం-2019 భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ 144వ జయంతి రోజైన 2019, అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. దీంతో దేశంలోని రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి పెరిగింది.

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019, ఆగస్టు 5వ తేదీన కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ప్రమాణం

నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్‌జీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము, లదాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న ప్రమాణం స్వీకారం చేశారు. లదాఖ్ రాజధాని లెహ్‌లో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ మాథుర్(ఆర్‌కే మాథుర్)తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. నంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గిరీశ్ చందర్ ముర్ము(జీసీ ముర్ము)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.

లదాఖ్ రాజధాని : లెహ్‌

జమ్మూకశ్మీర్ రాజధాని : శ్రీ నగర్‌(వేసవి), జమ్మూ (శీతాకాలం)

జమ్మూకశ్మీర్ అంశానికి సంబంధించిన మరిన్ని కథనాల కోసం ఇక్కడి లింక్‌లపై క్లిక్ చేయండి.

ఆర్టికల్ 370 రద్దుపై ప్రకటన

370వ అధికరణ రద్దుకు రాజ్యసభ ఆమోదం

ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం

ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులు

ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని మోదీ ప్రసంగం

జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు ఆమోదం

దేశంలో అతిపెద్ద యూటీగా జమ్మూ కశ్మీర్

ఆర్టికల్ 370 పూర్వాపరాలు

జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీశ్

చెన్నైలో ఎన్‌ఐఓటీ రజతోత్సవాలు ప్రారంభం

తమిళనాడు రాజధాని చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓటీ) రజతోత్సవాలు నవంబర్ 3న ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్‌ఐఓటీ రజతోత్సవ స్మారక స్టాంపును విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు మరింత సౌలభ్యాన్ని అందించేలా శాస్త్ర, సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్, లదాఖ్‌కొత్త మ్యాప్ విడుదల

2019, అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్‌ను కేంద్ర హోంశాఖ నవంబర్ 2న విడుదల చేసింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) జమ్మూకశ్మీర్‌లో ఉండగా, గిల్గిత్-బల్టిస్తాన్ లదాఖ్‌లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్ భారత సరిహద్దుగా ఉంది. తాజా మ్యాప్ ప్రకారం లదాఖ్ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్) కలిగి ఉంది. పాత కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నవంబర్ 3న నిర్ణయించింది. కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్నాయని తేలిన విషయం తెలిసిందే.

ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128ర్యాంకు

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు దక్కింది. అలాగే ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా.. 2019, సెప్టెంబర్ నెలకు గాను నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం అంతర్జాతీయంగా సగటు డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక 81వ ర్యాంకు, పాకిస్తాన్ 112వ స్థానం, నేపాల్ 119వ ర్యాంకుల్లో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో భారత్‌లో 11 పెద్ద నగరాల్లో ఎయిర్‌టెల్ వేగవంతమైన మొబైల్ నెట్ ఆపరేటరుగా అగ్రస్థానంలో నిలిచింది.

సుముద్ర మట్టాల పెరుగుదలతో భారత్‌కు ముప్పు

మావనవాళి మనుగడకు వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సుముద్ర మట్టాలు పెరగడం వల్ల జపాన్, చైనా, బంగ్లాదేశ్ సహా భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050నాటికి 300మిలియన్ల మంది ప్రజలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు హాజరైన గుటెరస్ అక్కడి విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 4న ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన క్లైమేట్ సెంట్రల్ అనే సైన్స్ ఆర్గనైజేషన్ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి నేచర్ కమ్యూనికేషన్స్ పేరుతో ఇటీవల ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్ లైన్ కిందకు కుంగే ప్రమాదముంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలో చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభం

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నవంబర్ 5న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2019 ప్రారంభమైంది. నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. చంద్రయాన్-2 విజయవంతమైన ప్రాజెక్టేనని, ఆ ప్రయోగం కారణంగా దేశ యువతకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్నారు. సైన్స్ లో వైఫల్యం అనేది ఉండదని, అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. గతంలో అవసరాలే ఆవిష్కరణలకు దారితీసేవని భావించేవారు... కానీ ఇప్పుడు ఆవిష్కరణలు అవసరాల పరిధి దాటి విస్తరించాయన్నారు.

మహిళల రక్షణపై నేతా యాప్ అధ్యయనం

పాలనలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన నేతా యాప్.. భారత్‌లో మహిళల రక్షణ అనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. లక్ష మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో 42 శాతం మంది తాము సురక్షితంగా లేమనీ, లేదా అత్యంత అభద్రతలో జీవిస్తున్నామనీ తెలిపారు. ప్రధానంగా హరియాణా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని మహిళలు తాము ఎక్కువ అభద్రతకు లోనౌతున్నట్టు వెల్లడించారు. దేశం మొత్తంమీద చూస్తే మెట్రోనగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు కనీస భద్రతలేని ప్రాంతమని సర్వేలో వెల్లడయి్యంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో కేవలం 27 శాతం మంది మాత్రమే తాము సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు.

నేతా యాప్ సర్వేలో వెల్లడైన అంశాలు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సంస్కరణల ఆవశ్యకతను, కఠినతరమైన చట్టాల అవసరాన్నీ నొక్కిచెపుతున్నాయని నేతా యాప్ వ్యవస్థాపకుడు ప్రథమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు.

మహిళలు సురక్షితంగా ఉన్నామని భావిస్తోన్న రాష్ట్రాల ర్యాంకింగ్‌లు....

ర్యాంకు

రాష్ట్రం

1

హిమాచల్ ప్రదేశ్

2

త్రిపుర

3

కేరళ

4

ఆంధ్రప్రదేశ్

5

గుజరాత్

6

తమిళనాడు

7

రాజస్తాన్

8

ఉత్తరాఖండ్

9

కర్ణాటక

10

తెలంగాణ

11

ఒడిశా

12

మధ్యప్రదేశ్

13

పంజాబ్

14

అస్సాం

15

బిహార్

16

ఉత్తరప్రదేశ్

17

పశ్చిమబెంగాల్

18

జార్ఖండ్

19

ఢిల్లీ

20

మహారాష్ట్ర

21

ఛత్తీస్‌గఢ్

22

అరుణాచల్ ప్రదేశ్

23

హరియాణా

 

భూతాపంతో ఏటా 15 లక్షల మంది మృత్యువాత

భూతాపం వల్ల 2100 సంవత్సరం నుంచి భారతదేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడే అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌తో(టీసీడీ) కలిసి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ 15 లక్షల మరణాల్లో 64 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవిస్తాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో 4,02,280, బిహార్‌లో 1,36,372, రాజస్థాన్‌లో 1,21,809, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(ఏపీ, తెలంగాణ) 1,16,920, మధ్యప్రదేశ్‌లో 1,08,370, మహారాష్ట్రలో 1,06,749 మరణాలు సంభవిస్తాయని బహిర్గతమైంది.

క్లైమేట్ ఇంపాక్ట్ అధ్యయనం-అంశాలు

ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. 2100 నాటికి అది 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది.

కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి.

2019 సెప్టెంబర్‌లో గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ స్థాయి 408.55 పార్‌‌ట్స పర్ మిలియన్‌గా(పీపీఎం) నమోదైంది. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు, 2100 నాటికి 940 పీపీఎంకు చేరుకోనుంది.

2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరుగుతాయి.

సముద్ర తీరం వెంట మట్టి క్షయం తప్పదు. భారీగా తీరం కోతకు గురవుతుంది.

తీర ప్రాంతాలు తీవ్రమైన తుఫాన్ల బారినపడే అవకాశాలున్నాయి. సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి.

నవంబర్ 26పార్లమెంట్ ప్రత్యేక భేటీ

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2019, నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీ అవనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఈ సమావేశానికి హాజరై ప్రసంగించనున్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో పాటు, మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పార్లమెంటు 50 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని 1997లో కూడా ఇటువంటి సభ జరిగింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

నవంబర్ 2019 రాష్ట్రీయం

కేంద్ర హోంమంత్రితో కేటీఆర్ సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 31న జరిగిన ఈ భేటీలో హైదరాబాద్‌ను గ్లోబల్ స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా అమిత్ షాను కేటీఆర్ కోరారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్డీ)లో భాగంగా చేపడుతున్న పలు రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ కలిసారు. హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్‌పీసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సహా బడ్జెటరీ సాయం చేయాల్సిందిగా గోయల్‌ను కేటీఆర్ కోరారు. ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని పండిళ్లపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే సైడింగ్ వసతి ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

యునెస్కో సృజనాత్మక నగరాల్లో హైదరాబాద్

ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) క్రియేటివ్ సిటీస్(సృజనాత్మక నగరాలు) జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 31న క్రియేటివ్ సిటీస్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో గ్యాస్ట్రానమీ (రుచికరమైన ఆహారం, తినుబండారాలకు సంబంధించింది) కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా 10 నగరాలను ఎంపిక చేయగా, అందులో హైదరాబాద్ స్థానం సంపాదించింది. టర్కీ, పెరు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇటలీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఈక్వెడార్, చైనా దేశాలకు చెందిన నగరాలు కూడా ఈ జాబితాలో ఎంపికయ్యాయి.

మరోవైపు క్రియేటివ్ సిటీస్-ఫిల్మ్ కేటగిరీలో దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చోటు దక్కింది. భారత్ నుంచి హైదరాబాద్, ముంబైలు మాత్రమే క్రియేటివ్ సిటీల జాబితాలో స్థానం సంపాదించాయి. ప్రపంచవ్యాప్తంగా 246 నగరాలను వివిధ కేటగిరీల్లో పరిశీలించిన యునెస్కో 66 నగరాలను ఎంపిక చేసింది. విన్నూత పద్ధతులు, ఆలోచనల ద్వారా నగర ప్రాంతాల ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలగజేస్తోన్న నగరాలను క్రియేటివ్ సిటీలుగా యునెస్కో ప్రకటించింది. ప్రస్తుతం యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఆడ్రే అజౌలే ఉన్నారు.

అమ్మ ఒడి పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం

ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అక్టోబర్ 30న సచివాలయంలోముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం

మంత్రివర్గ కీలక నిర్ణయాలు

వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించిన వారికి, ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులను అందించేందుకు ఆమోదం. ఏటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15వ తేదీన 50 మంది చొప్పున ప్రతి సంవత్సరం 100 మందికి అవార్డులిస్తారు.

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ మత్స్యకార నేస్తం అమలుకు ఆమోదం.

9 జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు.

కార్పొరేట్ రెస్పాన్స్ బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రా పేరిట సంస్థ ఏర్పాటు.

కృష్ణా-గోదావరి డెల్టా కాల్వల శుద్ధికి ప్రత్యేక మిషన్ ఏర్పాటు.

కంకర నుంచి రోబో శ్యాండ్ (ఇసుక) తయారు చేసే స్టోన్ క్రషర్స్ యూనిట్లను కొత్త యంత్రాలతో అప్‌గ్రేడ్ చేసుకునేవారికి రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ పావలా వడ్డీ కింద రుణాలివ్వడం.

అభ్యంతరం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆమోదం. 300 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ చేస్తారు.

విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన 13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందం రద్దు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 498.93 ఎకరాల కేటాయింపును రద్దు.

అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ (ఏడీపీ) లిమిటెడ్ మూసివేత.

పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లోని సబ్‌ప్లాన్ ఏరియాల్లో 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు ఆమోదం.

నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు. 3,69,655 మందికి సుమారు రూ.264 కోట్లు చెల్లింపు.

హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపుకు ఆమోదం. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు.. వార్షికాదాయం రూ.మూడు లక్షలకు పైబడి ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతారు.

ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం.

ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో సీఎం జగన్

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 1న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుగు సాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. 2014 ముందు వరకు జరిగినట్టుగానే నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అవతరణ: అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర ప్రాంతం, మద్రాసులో కొంతభాగం కలసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కొంతభాగం, ఆంధ్ర రాష్ట్రం కలసి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించింది.

యాదాద్రిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుచేసిన టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభమైంది. తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు 2019, నవంబర్ 1న ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్-టు-వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు.

ఏపీలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4న ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే ఏపీసీవోఎస్ తక్షణ కార్యకలాపాలు ప్రారంభించడానికి రూ.10 కోట్ల సీడ్ క్యాపిటల్‌ను ప్రభుత్వం సమకూర్చింది. ఈ కార్పొరేషన్ సబ్‌స్క్రిప్షన్ క్యాపిటల్ రూ.10 లక్షలుగా ఉంటుంది.

మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులతో ఏర్పాటైన ఏపీసీవోఎస్‌కు సాధారణ పరిపాలన విభాగం(సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం)కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ప్రధాన కార్యదర్శి/ప్రభుత్వ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎటువంటి లాభాపేక్ష లేని ఈ సంస్థకు ఆదాయాన్ని వివిధ విభాగాల సంక్షేమ నిధుల నుంచి సమీకరిస్తారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడడంతోపాటు దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా, సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేయడం లక్ష్యంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది.

నవంబర్ 2019 ఎకానమీ

మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్

ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఈ మేరకు బెంగళూరులో నవంబర్ 5న జరిగిన 16వ నాస్కామ్ ప్రోడక్ట్ సదస్సులో దేశీ టెక్నాలజీ స్టార్టప్ వ్యవస్థపై ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ ఉన్నారు.

నాస్కామ్ నివేదికలోని ముఖ్యాంశాలు

2019 ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900-9,300 స్థాయికి చేరినట్లయింది.

2018లో టెక్ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800-8,200 దాకా ఉంది.

2014-2025 మధ్య కాలంలో భారత స్టార్టప్ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదు.

2025 నాటికి యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) సంఖ్య దేశీయంగా 95-105 శ్రేణిలో ఉండొచ్చు.

సంఖ్యాపరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత స్థానంలో ఉంది.

కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్‌ల్లో 12-15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటున్నాయి.

2014లో 10-20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్ వ్యవస్థ వేల్యుయేషన్ 2025 నాటికి 350-390 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదు.

స్టార్టప్స్‌లోకి 2018 ఏడది 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2019 ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి.

2018 ఏడాది 17గా ఉన్న యూనికార్న్‌ల సంఖ్య 24కి పెరిగింది.

2018లో టెక్ స్టార్టప్‌లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి.

2019లో 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.3-1.8 లక్షల పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగింది.

దేశీ స్టార్టప్‌లకు మార్కెట్, నిధుల లభ్యతపరమైన సవాళ్లు ఉంటున్నాయి.

ఇళ్ల ప్రాజెక్టుల కోసం పెట్టుబడి నిధి ఏర్పాటు

నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం నవంబర్ 6న ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు ఏఐఎఫ్ సాయపడుతుందనిపేర్కొంది. ఏఐఎఫ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...

మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఏఐఎఫ్ నిధిని పొందేందుకు అర్హమైనవి.

రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అందిస్తాయి.

నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఏఐఎఫ్ తోడ్పడుతుంది.

రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉన్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుంది.

నవంబర్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు

ప్రధాని మోదీతో జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ భేటీ

రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నవంబర్ 1న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదం, రక్షణ, ఇంధనం, 5జీ, కృత్రిమ మేధ వంటి అంశాలపై ఇరువురు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) భేటీకి మోదీ, మెర్కెల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత నగరాల్లో హరిత రవాణా వ్యవస్థల కోసం 100 కోట్ల యూరోల ఆర్థిక సాయాన్ని అందించడానికి జర్మనీ అంగీకరించింది.

కర్తార్‌పూర్‌కు పాస్‌పోర్ట్ అవసరం లేదు: ఇమ్రాన్‌ఖాన్

పాకిస్తాన్‌లోని పవిత్రస్థలం కర్తార్‌పూర్‌ను సందర్శించే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు అవసరం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించే సిక్కులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన కూడా లేదని, తగిన గుర్తింపు కార్డు ఉన్న వారంతా కర్తార్‌పూర్‌నకు రావచ్చని తెలిపారు.

సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతిని (నవంబరు-12) పురస్కరించుకొని 2019, నవంబర్ 9న ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. పాక్‌లోని నారోవల్ జిల్లా రావి నది ఒడ్డున కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఉంది.

థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ

ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడురోజుల థాయ్‌లాండ్ పర్యటనకు నవంబర్ 2న బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో మోదీ సమావేశం కానున్నారు. నవంబర్ 3న జరగనున్న ఈ భేటీలో వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత, అనుసంధానం వంటి అంశాల్లో సహకారం పెంపు వంటి అంశాలపై ప్రయూత్, మోదీ చర్చలు జరపనున్నారు. మరోవైపు 14వ తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ ఇండియా సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అలాగే గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు.

ఆసియాన్-ఇండియా సమావేశంలో మోదీ

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలోని నొంతబురిలో నవంబర్ 3న జరిగిన ఆసియాన్-ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ... ఆసియాన్‌తో సంబంధాలను మరింత విసృ్తతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని తెలిపారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. బ్యాంకాక్‌లో నవంబర్ 2న భారత సంతతి ప్రజలతోనూ మోదీ బేటీ అయ్యారు.

ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి

భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విసృ్తతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని తెలిపారు.

ఆసియాన్ గురించి..

ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య) 1967 ఆగస్టు 8న వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ అనే నినాదంతో ఏర్పడింది. పరస్పర సహకారంతో ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే సమాఖ్య ముఖ్య ఉద్దేశం. ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఇందులో పది సభ్యదేశాలున్నాయి.

ఆసియాన్ సభ్యదేశాలు

ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, {బూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా

థాయ్‌లాండ్ ప్రధానితో మోదీ సమావేశం

థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 3న జరిగిన ఈ భేటీలో రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకునేందుకు మోదీ, ప్రయూత్ అంగీకరించారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

కాలాపానీ గ్రామం మాదే : నేపాల్

భారత ప్రభుత్వం 2019, నవంబర్ 2నవిడుదల చేసిన పటం(ఇండియా మ్యాప్)లో కాలాపానీ గ్రామాన్ని భారత్‌లో ఉన్నట్లు చూపిందని, అయితే అది తమకు చెందినదంటూ నేపాల్ అభ్యంతరం లేవనెత్తింది. కాలాపానీ ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్ జిల్లాలో ఉన్నట్లు భారత మ్యాపులో కనిపించగా, ఆ ప్రాంతం తమ దేశంలోని దార్చులా జిల్లాకు చెందినదని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 6న తెలిపింది. భారత ఎంబసీ అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు.

నవంబర్ 2019 సైన్స్ & టెక్నాలజీ

చైనాలో 5జీ సేవలు ప్రారంభం

చైనాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు అక్టోబర్ 31న 5జీ సర్వీసులు ప్రారంభించాయి. చైనా మొబైల్, చైనా టెలికం, చైనా యూనికామ్ సంస్థలు... బీజింగ్, షాంఘై తదితర ముఖ్య పట్టణాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్హ్రిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ వంటి 5జీ సేవలు ఉపయోగపడతాయి.

2020 ఏడాదికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో, 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనా.

తెలంగాణలో బండికూట్ రోబో సేవలు

మ్యాన్‌హోల్‌లో పూడిక తీసే కార్మికుల స్థానంలో ఇకపై రోబోలు మ్యాన్‌హోల్‌లోకి దిగి పూడిక తీయనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4న తొలిసారి రోబోతో పూడిక తీత పనులు ప్రారంభించింది. ఈ పనుల కోసం జెన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన బండికూట్అనే రోబోను జీహెచ్‌ఎంసీ ఉపయోగించింది. కేరహేజా గ్రూపు సీఎస్‌ఆర్‌లో భాగంగా ఈ రోబోను జీహెచ్‌ఎంసీకి అందించింది. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన బండికూట్ రోబో ఖరీదు రూ.32 లక్షలు. ఇప్పటికే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, హరియాణా, మహారాష్ట్రల్లో ఈ రోబోను ఉపయోగించి లోతైన మ్యాన్‌హోల్స్‌లో పూడిక తీస్తున్నారు.

సౌర కుటుంబం అంచులు దాటిన వాయేజర్-2

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్-2 అంతరిక్ష నౌక సౌర కుటుంబం అంచులు దాటి వెళ్లింది. సూర్యుడి ప్రభావం లేని, నక్షత్ర మండలంలోకి (ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ మీడియం-ఐఎస్‌ఎంకు) 2018 నవంబర్ 5వ తేదీన చేరుకుంది. ఈ విషయాలను నాసా నవంబర్ 6న వెల్లడించింది. దీంతో ఆ ఘనతను సాధించిన రెండో వ్యోమనౌకగా వాయేజర్-2 నిలిచింది. అంతకుముందు నాసాకి చెందిన వాయేజర్-1 2012లో సౌర కుటుంబాన్ని దాటి వెళ్లింది.

వాయేజర్-2 విశేషాలు

అంతరిక్షంలో ప్రయాణించిన కాలం : 41 ఏళ్లు

వేగం /గంటకు మైళ్లలో : 34,191

సూర్యుడి నుంచి వాయేజర్ -2 ఉన్న దూరం : 1,770 కోట్ల కిలోమీటర్లు...

ప్రయాణించిన మొత్తం దూరం : 3,000 కోట్ల కిలోమీటర్లు

సందర్శించిన గ్రహాల సంఖ్య : 4 (గురు, శని, వరుణ, నెప్ట్యూన్)

సూర్య కిరణాలు వాయేజర్‌ను చేరేందుకు పట్టే సమయం : 16 గంటల 36 నిమిషాలు

వాయేజర్-2 నుంచి భూమికి సమాచారం అందడానికి పడుతున్న సమయం : 19 గంటలు

గ్రహాంతర వాసుల కోసం ఒక సందేశాన్ని ముద్రించిన బంగారు ఫలకం వాయేజర్-2 ఉంది. ఈ ఫలకంపై 14 ప్రత్యేక నక్షత్రాల సాయంతో సూర్యుడిని ఎక్కడ గుర్తించవచ్చు?, హైడ్రోజన్ పరమాణవు చిత్రంతోపాటు మరికొన్ని సంకేతాలు ఉన్నాయి.

1977లో కొన్ని వారాల వ్యవధిలో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. రెండు అంతరిక్ష నౌకలూ సూర్యుడి ప్రభావం నుంచి దాదాపు ఒకే దూరం తరువాత బయటపడ్డాయి. దీన్ని బట్టి సౌరకుటుంబం ఆకారం గోళాకారంగానే ఉంటుందని అర్థమైందని ఐయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్త బిల్‌కుర్త్ తెలిపారు.

నవంబర్ 2019 అవార్డ్స్

నటుడు రజనీకాంత్‌కు గోల్డెన్ జూబ్లీ అవార్డు

ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ నవంబర్ 2న ప్రకటించారు. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డుల కార్యక్రమంలో రజనీకాంత్‌కు గోల్డెన్ జూబ్లీ అవార్డును ప్రదానం చేయనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా రజనీకాంత్‌కు ఈ అవార్డు దక్కింది. మరోవైపు విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

2019, నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ప్రదర్శిస్తారు.

సుదర్శన్ పట్నాయక్‌కు ఇటాలియన్ గోల్డెన్ అవార్డ్

భారత్‌కి చెందిన చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్ఠాత్మక ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డు-2019కు ఎంపికయ్యారు. 2019, నవంబర్ 13 నుంచి 18 వరకు ఇటలీలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ స్కోరా నా శాండ్ నేటివిటీ కార్యక్రమంలో పట్నాయక్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున పట్నాయక్ నేతృత్వం వహించనున్నారు. సుదర్శన్ పట్నాయక్ సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను 2014లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే.

విశిష్ట సేవకులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నవంబర్ 6న ఉత్తర్వులు జారీచేసింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు.

వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు-విధి విధానాలు

2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు.

ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు.

ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేస్తారు.

సోషల్ వర్క్, ప్రజావ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపార వాణిజ్య రంగాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెద్య రంగం, కళలు, సాహిత్యం, విద్య, ప్రజాసేవ, క్రీడారంగంతోపాటు సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.

కమిటీ ద్వారా ఎంపిక

వైఎస్సార్ లైఫ్‌టైమ్ పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం.

ఎల్ అండ్ టీకి సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు లభించింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఎంటర్‌ప్రైజ్ ఇన్నోవేషన్ సదస్సు-2019లో ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున ఐటీ, ఎంటర్‌ప్రెజైస్ హెడ్ అనిర్బన్ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు. క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ డార్విన్ బాక్స్ హెచ్‌ఆర్‌ఎంఎస్ను అమలు చేసినందుకుగాను ఎల్ అండ్ టీకి ఈ అవార్డు దక్కింది.

నిర్మల్ జిల్లాకు డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవార్డు

తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అందించే డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్-2019 అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో నవంబర్ 6న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు చేతుల మీదుగా నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. నిర్మల్ జిల్లాలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రయోగాత్మకంగా రైతుయంత్ర యాప్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ విజయవంతం కావడంతో జిల్లాకు ఈ అవార్డు దక్కింది.

నవంబర్ 2019 స్పోర్ట్స్

బాక్సింగ్‌లో శివ థాపా, పూజలకు స్వర్ణాలు

ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు శివ థాపా, పూజా రాణి బంగారు పతకాలు సాధించారు. జపాన్ రాజధాని టోక్యోలో అక్టోబర్ 31న జరిగిన పురుషుల 63 కేజీల కేటగిరీ ఫైనల్లో నాలుగు సార్లు ఆసియా చాంపియన్ అయిన శివ 5-0తో ఆసియా కాంస్య విజేత సనతలి టోల్తయెవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. మహిళల 75 కేజీల కేటగిరీ ఫైనల్లో ఆసియా క్రీడల కాంస్య విజేత పూజా రాణి 4-1తో ఆస్ట్రేలియాకు చెందిన కై ట్లిన్ పార్కర్‌పై గెలుపొందింది.

మరో భారత బాక్సర్ ఆశిష్ పురుషుల 69 కేజీల కేటగిరీ ఫైనల్లో 1-4తో సెవొన్ ఒకజవా (జపాన్) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు. ఈ టెస్టు ఈవెంట్‌లో నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (91 కేజీలు), వహ్లిమ్‌పుయా (75 కేజీలు) కాంస్యాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ మొత్తం 7(2 సర్ణ+ 1 రజత+ 4 కాంస్యం) పతకాలతో టోర్నీని ముగించినట్లయింది.

ఒలింపిక్స్‌కు బాక్సింగ్ అంబాసిడర్‌గా మేరీకోమ్

2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ బాక్సింగ్ అథ్లెట్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ప్రకటించిన 10 మంది సభ్యుల బాక్సింగ్ అథ్లెట్ అంబాసిడర్స్ బృందంలో మేరీ కోమ్ చోటు లభించింది. మేరీ కోమ్ ఆసియా బాక్సర్ల తరఫున అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఇలా బృందంలోని ఒక్కో దిగ్గజ బాక్సర్‌ను ఒక్కో ప్రాంతానికి కేటాయించారు.

అంబాసిడర్స్- ప్రాతినిధ్యం వహించే ప్రాంతం

పురుషులు: లుక్మో లవల్(ఆఫ్రికా), జులియో సీజర్ లా క్రజ్(ఉత్తర-దక్షిణ అమెరికా), జియాంగ్వాన్ అషియాహు(ఆసియా), వాసిల్ లామచెంకో(యూరోప్), డేవిడ్ ఎన్‌యిక(ఓషియానియా).

మహిళలు: మేరీ కోమ్(ఆసియా), ఖాదిజ మార్డి(ఆఫ్రికా), మిఖైలా మేయర్(ఉత్తర-దక్షిణ అమెరికా), సారా ఔరహమౌనీ(యూరోప్), షెల్లీ వాట్స్(ఓషియానియా).

ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్లు అర్హత

2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు అర్హత సాధించాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నవంబర్ 2న జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో అమెరికాపై 1-5తో నెగ్గిన భారత మహిళల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం 1-4తో ఓటమి పాలయ్యింది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో... నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్ ఆధారంగా బెర్త్ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. ఇక్కడ భారత్ 6-5 గోల్స్ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి టోక్యో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడం ఇది మూడోసారి (1980, 2016) మాత్రమే.

మరోవైపు తొలి అంచె మ్యాచ్‌లో రష్యాపై 4-2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7-1 గోల్స్ తేడాతో రష్యాను చిత్తు చేసి టోక్యో బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11-3తో పైచేయిగా నిలిచింది.

సార్లర్‌లక్స్ ఓపెన్ చాంపియన్‌గా లక్ష్య సేన్

సార్లర్‌లక్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నీలో భారత యువ షట్లర్ లక్ష్య సేన్ చాంపియన్‌గా నిలిచాడు. జర్మనీలోని సార్‌బ్రాకెన్‌లో నవంబర్ 3న ముగిసిన ఈ టోర్ని ఫైనల్లో లక్ష్య సేన్ 17-21, 21-18, 21-16తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)పై గెలిచాడు. విజేత లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.3 లక్షల 96 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీకంటే ముందు లక్ష్యసేన్ డచ్ ఓపెన్, బెల్జియం ఓపెన్ టైటిల్స్ సాధించాడు.

పారిస్ ఓపెన్ టోర్ని చాంపియన్‌గా జొకోవిచ్

పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నవంబర్ 3న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. చాంపియన్ జొకోవిచ్‌కు 9,95,720 యూరోల (రూ. 7 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ షపోవలోవ్‌కు 5,03,730 యూరోల (రూ. 3 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

డబ్ల్యూటీఏ టోర్ని విజేతగా యాష్లే బార్టీ

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. చైనాలోని షెన్‌జెన్‌లో నవంబర్ 3న జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో యాష్లే బార్టీ 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. విజేతగా నిలిచిన యాష్లే బార్టీకి 44 లక్షల 20 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 17 లక్షలు).... రన్నరప్ స్వితోలినాకు 24 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతకు ఇంత భారీ మొత్తం ప్రైజ్‌మనీ ఇవ్వడం ఇదే తొలిసారి.

బాబోస్-మ్లాడెనోవిచ్ జంటకు డబుల్స్ టైటిల్

డబ్ల్యూటీఏ టోర్నీ డబుల్స్ విభాగంలో తిమియా బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జంట 6-1, 6-3తో సు వె సెయి (చైనీస్ తైపీ)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచినందుకు తిమియా-క్రిస్టినా జంటకు 10 లక్షల డాలర్ల (రూ. 7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది.

దేవధర్ ట్రోఫీ విజేత భారత్ బి జట్టు

దేశవాళీ వన్డే టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీలో భారత్ బి జట్టు విజేతగా నిలిచింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో నవంబర్ 4న జరిగిన తుదిపోరులో భారత్ బి జట్టు 51 పరుగుల తేడాతో భారత్ సిపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బిజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 283 పరుగులు చేసింది. భారత్ సి 50 ఓవర్లలో 9 వికెట్లకు 232 పరుగులే చేయగల్గింది. ఈ టోర్నిలో భారత్ బి జట్టు కెప్టెన్‌గా పార్థివ్ పటేల్, భారత్ సి జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించారు. దీంతో దేవ్‌ధర్ ట్రోఫీ ఫైనల్లో జట్టుకు సారథ్యం వహించిన అతి పిన్న వయస్కుడిగా శుభ్‌మన్ గిల్ రికార్డు నెలకొల్పాడు.

తటస్థ వేదికపై భారత్, పాక్ డేవిస్ కప్ మ్యాచ్

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పాక్‌లో జరగాల్సిన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోరు తటస్థ వేదికకు మారింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇస్లామాబాద్ నుంచి డేవిస్ మ్యాచ్‌లను తరలించింది. భద్రతాపరమైన సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీఎఫ్ వెల్లడించింది. తటస్థ వేదికపై 2019, నవంబర్ 29, 30వ తేదీల్లో భారత్, పాక్ మధ్య డేవిస్ కప్ పోరు జరుగుతుందని నవంబర్ 4న ప్రకటించింది.

నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం నుంచి ఈవెంట్‌ను తరలిస్తే తటస్థ వేదికను ఎంపిక చేసే హక్కు ఆ దేశానికే కల్పిస్తారు. మరో ఐదు రోజుల్లో ఏ దేశంలో నిర్వహించేది పాకిస్తాన్ వెల్లడించాల్సి వుంటుంది. దీన్ని డేవిస్ కప్ కమిటీ ఆమోదిస్తుంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా రోహిత్ రాజ్‌పాల్ వ్యవహరిస్తాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది.

యూఎస్ గ్రాండ్‌ప్రి రేసు విజేతగా బొటాస్

యునెటైడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రి రేసు విజేతగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ నిలిచాడు. అమెరికాలోని ఆస్టిన్‌లో నవంబర్ 4న జరిగిన 56 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ గంటా 33 నిమిషాల 55.653 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. 21 రేసుల ప్రస్తుత సీజన్‌లో 19 రేసులు ముగిశాక హామిల్టన్ 381 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో మరో రెండు రేసులు (బ్రెజిల్, అబుదాబి గ్రాండ్‌ప్రి) మిగిలి ఉన్నాయి.

ఆసియా షూటింగ్‌లో మను భాకర్‌కు స్వర్ణం

ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ మను భాకర్‌కు స్వర్ణ పతకం లభించింది. ఖతర్ రాజధాని దోహాలో నవంబర్ 5న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం ఫెనల్లో హరియణాకు చెందిన 17 ఏళ్ల మను 244.3 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. కియాన్ వాంగ్ (చైనా-242.8 పాయింట్లు) రజతం నెగ్గగా... రాన్‌జిన్ జియాంగ్ (చైనా-220.2 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది.

మరోవైపు వివాన్ కపూర్, మనీషా కీర్‌లతో కూడిన భారత జట్టు జూనియర్ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇలవేనిల్ వలారివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలాలతో కూడిన భారత బృందం 1883.2 పాయింట్లతో రజతం సాధించింది. మను భాకర్, యశస్విని (578), అన్ను రాజ్ సింగ్ (569)లతో కూడిన భారత బృందానికి టీమ్ విభాగంలో కాంస్యం లభించింది. అలాగే పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్ కాంస్య పతకం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాడు.

2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించిన భారత షూటర్లు

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) : అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) : దివ్యాంశ్ సింగ్ పన్వర్, దీపక్ కుమార్

పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (1) : సంజీవ్ రాజ్‌పుత్

మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ (1) : రాహీ సర్నోబత్

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) : మను భాకర్, యశస్విని సింగ్

ఐదుగురు వెయిట్‌లిఫ్టర్లపై నాలుగేళ్ల నిషేధం

డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు ఐదుగురు భారత వెయిట్‌లిఫర్లపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ ఐదుగురిలో కామన్వెల్త్ గేమ్స్(2010) మాజీ చాంపియన్ కత్తుల రవికుమార్, జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. ఒడిశాకు చెందిన రవికుమార్ ఒస్టారిన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు డోప్ పరీక్షల్లో తేలింది.

ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. నాడా భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని చెప్పారు.కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది.

నవంబర్ 2019 వ్యక్తులు

కార్మికోద్యమ నేత గురుదాస్ కన్నుమూత

భారత కార్మికోద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని స్వగృహంలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. యాంగ్రీ యంగ్ మాన్గా పేరున్న గురుదాస్ దాస్‌గుప్తా 1936 నవంబర్ 3న అవిభాజ్య బెంగాల్‌లోని బరిషాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో జన్మించారు. విభజన అనంతరం ఆయన కుటుంబం పశ్చిమబెంగాల్‌కి మారింది.

50వ దశకం చివరల్లో వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన గురుదాస్ విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవిభాజ్య బెంగాల్ విద్యార్థి ఫెడరేషన్‌కి అధ్యక్షుడిగానూ, కార్యదర్శిగా పనిచేశారు. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలికతో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించాక సీపీఐలో ఉండిపోయారు. 70వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాలరీత్యా కార్మికరంగ బాధ్యతలు చేపట్టారు. 2001లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి గురుదాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. కార్మికవర్గ సమస్యల పరిష్కారానికై జీవితమంతా పోరాడి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

ఇస్లామిక్ స్టేట్ కొత్త చీఫ్‌గా అబూ అల్ హష్మీ

ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. తమ కొత్త నాయకుడు అబూ ఇబ్రహీం అల్ హష్మీ అని ఐఎస్ అక్టోబర్ 31న ఒక ఆడియో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల సిరియాలో అమెరికా దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. అల్ బాగ్దాదీతోపాటు అతని సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి అయిన హసన్ అల్ ముజాహిర్ మరణించారని ఐఎస్ తన ఆడియో సందేశంలో పేర్కొంది.

ఐపీఎస్ అధికారి ఆనందరాం కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసును ఛేదించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీనివాస ఆనందరాం (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1950లో సివిల్ సర్వీస్‌లో చేరిన ఆనందరాం 1978 -81 వరకు విశాఖ షిప్‌యార్డు సీఎండీగా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1982-83లో ఉమ్మడి ఏపీ డీజీపీగా సేవలందించారు.

ఆనందరాం 1984లో సీఐఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్కు నాయకత్వం వహించారు. 1975లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్న ఆయనను 1987లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. 994లో అసాసినేషన్ ఆఫ్ ప్రైమినిస్టర్ పుస్తకాన్ని ఆనందరాం రచించారు.

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత

ప్రముఖ నటి గీతాంజలి (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో సీతారామ కల్యాణంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించింది. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన గీతాంజలి వివాహం ప్రముఖ నటుడు రామకృష్ణతో జరిగింది. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్టపాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాల్లో గీతాంజలి నటించి మెప్పించారు.

ఏపీ జాతీయ మీడియా సలహాదారుగా అమర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ నవంబర్ 3న ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ జనరల్‌గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రధాన భూ పరిపాలన కమిషనర్‌గా(సీసీఎల్‌ఏ) పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు నవంబర్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 బ్యాచ్‌కి చెందిన ఎల్వీ సుబ్రమణ్యం 2019, ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020 ఏప్రిల్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

ప్రపంచ ప్రభావిత రచయితల్లో భారతీయులు

ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మంది జాబితాలో ప్రముఖ భారతీయ రచయితలు ఆర్‌కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్, వీఎస్ నైపాల్‌లకు చోటు లభించింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే రాబిన్సన్ క్రూసో ప్రచురితమై 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీబీసీ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. లండన్‌లో నవంబర్ 7న మొదలైన బీబీసీ సాహితీ ఉత్సవంలో భాగంగా ఈ జాబితాను ప్రకటించారు.

మొదటి 100 మంది జాబితాలో అరుంధతి రాయ్ రాసిన ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్‌‌సపుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్‌కే నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్‌‌స కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్‌లో, సల్మాన్ రష్దీ రాసిన ది మూర్స్ లాస్ట్ సై రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ఎ స్యూటబుల్ బోయ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్‌షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది.

ఎన్‌టీపీసీ ప్రాంతీయ డెరైక్టర్‌గా కులకర్ణి

ప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ ఎన్‌టీపీసీ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా డాక్టర్ ప్రమోద్ ప్రభాకర్ కులకర్ణి నవంబర్ 6న బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు ఆయన ఎన్‌టీపీసీ రామగుండం, తెలంగాణ ప్రాజెక్టు చీఫ్‌గా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగనున్నారు. ఇంతకుముందు ఎన్‌టీపీసీ, ఐపీజీసీఎల్, హెచ్‌పీజీసీఎల్‌ల జాయింట్ వెంచర్... ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓగా కులకర్ణి పనిచేశారు. విద్యుత్తు వర్తకం, దేశీయ విద్యుత్తు విపణిపై దాని ప్రభావం అనే అంశంపై పీహెచ్‌డీ చేసిన ఆయన ఎన్‌టీపీసీలో 1982లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేశారు.