డిసెంబర్ 2019 కరెంట్‌ అఫైర్స్‌

డిసెంబర్ 2019 కరెంట్‌ అఫైర్స్‌

డిసెంబర్ 2019 అంతర్జాతీయం

అఫ్గానిస్తాన్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన

థ్యాంక్స్ గివింగ్ రోజును పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 28న అఫ్గానిస్థాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. అఫ్గాన్‌లోని బగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ... తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. మేం వారితో సమావేశమవుతున్నాం. కాల్పులను విరమించాలని చెబుతున్నాం. గతంలో అందుకు వారు అంగీకరించలేదు. ఇప్పుడు మాత్రం సరేనంటున్నారు. కాబట్టి సానుకూల ఫలితం ఉంటుందనుకుంటున్నా అని చెప్పారు. అఫ్గాన్‌లో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో అమెరికా సైనికుడు ఒకరు మృత్యువాతపడటంతో తాలిబన్లతో శాంతి చర్చలను రద్దు చేస్తున్నట్లు 2019, సెప్టెంబరు 8న ట్రంప్ ప్రకటించారు.

అఫ్గాన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో ట్రంప్ భేటీ అయ్యారు.

ప్రస్తుత దశాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు : ఐరాస

చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుత దశాబ్దం(2010-2019)లోనే నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు డిసెంబర్ 3న జరిగిన ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వాతావరణ మార్పులు మానవాళి సామర్థ్యాన్ని ఏవిధంగా అధిగమిస్తున్నాయో తెలిపింది.

2019లో అత్యధిక ఉష్ణోగ్రతలు

పారిశ్రామికీకరణ ముందు సమయం (1850-1900) లోని సగటు ఉష్ణోగ్రత కంటే 2019 ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) వెల్లడించింది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2019 మొదటి 3 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది. గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని వివరించింది.

సూడాన్ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం

సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సీలా సిరామిక్ పరిశ్రమలో డిసెంబర్ 3న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిరామిక్ పరిశ్రమలోని ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా, వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. 130 మందికి పైగా గాయపడ్డారు. ఆ పరిశ్రమలో మొత్తం 68 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు ఢిల్లీలోని అధికారులకు డిసెంబర్ 4న సమాచారం అందించారు.

డిసెంబర్ 2019 జాతీయం

చిట్‌ఫండ్స్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన చిట్‌ఫండ్స్(సవరణ) బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నవంబర్ 28న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించగా, లోక్‌సభ నవంబర్ 20నే అంగీకారం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. చిట్ అమౌంట్‌ను ఇకపై గ్రాస్ చిట్ అమౌంట్ అని, డివిడెండ్‌ను షేర్ ఆఫ్ డిస్కౌంట్ అని, ప్రైజ్ అమౌంట్‌ను నెట్ చిట్‌ఫండ్ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్‌లకు మరింత గౌరవం కల్పించడం కోసం సౌభ్రాతృత్వ నిధి (ఫ్రెటర్నిటీ ఫండ్) చక్రీయ పొదుపు (రొటేటింగ్ సేవింగ్‌‌స), రుణ సంస్థ (క్రెడిట్ ఇన్‌స్టిట్యూట్) అన్న పదాలు చేర్చినట్లు తెలిపారు. చిట్ పాడే వారికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా కలిగించనున్నట్టు చెప్పారు. చిట్ కంపెనీ యజమాని స్కీములకు అనుగుణంగా నిర్ణీత మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంచాల్సి ఉంటుందన్నారు.

500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది. వాట్సాప్ వీడియో కాలింగ్‌లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం.

రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఆమోదం

కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ నవంబర్ 27న ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... మెరుగైన సేవలు అందించడమే విలీనం ఉద్దేశమని చెప్పారు. ఈ విలీనం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చేదీ ఇంకా ప్రకటించలేదు.
కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలకు వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతాన్ని దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అని వ్యవహరిస్తారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గనుంది.

భోపాల్, జోధ్‌పూర్‌లు మహిళలకు సురక్షితం కాదు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరాలు తమకు సురక్షితం కాదని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో జనావాసం తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు ఇవి సుదూరంగా ఉండటం, మద్యం, డ్రగ్స్ వంటి కారణాల వల్ల తమకు రక్షణ కరువైనట్లు మహిళలు భావిస్తున్నారు. భోపాల్, గ్వాలియర్, జోధ్‌పూర్ నగరాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్‌లు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

అయోధ్య భూవివాదంపై రివ్యూ పిటిషన్

అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ డిసెంబర్ 2న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

భారతీయ రైల్వే పనితీరు అధ్వానం : కాగ్

రైల్వే శాఖ పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. 2017-18 సంవత్సరంలో రైల్వేల నిర్వహణ నిష్పత్తి 98.44 శాతం ఉందని కాగ్ పేర్కొంది. అంటే రూ.100 రాబట్టుకునేందుకు రూ.98.44 రెల్వే ఖర్చు పెట్టిందని వెల్లడించింది. గత పదేళ్లలో ఎన్నడూ పరిస్థితి ఇంత అధ్వానంగా లేదని కాగ్ తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను డిసెంబర్ 2న పార్లమెంట్‌కు కాగ్ అందజేసింది. 2017-18 సంవత్సరంలో రూ.1,665.61కోట్ల లాభంలో ఉండాల్సిన రైల్వేశాఖ రూ.5,676.29కోట్ల నష్టాల్లో ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు, ఆదాయం మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉందనేది ఈ నిర్వహణ నిష్పత్తి( ఆపరేటింగ్ రేషియో) ద్వారా తెలుస్తుంది.

కేంద్రం, రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు డిసెంబర్ 2న నోటీసులు జారీ చేసింది. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

భారత జలాల్లో చైనా నౌక : నేవీ చీఫ్

భారత సముద్ర జలాల మీద తిరుగుతున్న చైనా నౌకను తిప్పిపంపినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ తెలిపారు. చైనాకు చెందిన షియాన్ 1 నౌక భారత ఆధీనంలోని అండమాన్ సముద్ర జలాలపై పరిశోధనలు చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. పరిశోధనలకు సంబంధించిన వివరాలను తమకు అందించలేదని, తమ అనుమతి లేకుండానే నిషేధిత ప్రాంతంలో ప్రవేశించినట్లు పేర్కొన్నారు. దాదాపు 7 నుంచి 8 చైనా నౌకలు ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించారు. సముద్రజలాలపై చైనాకు చెక్ పెట్టేందుకు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కలసి పనిచేసేందుకు భారత్ కృషిచేస్తోంది.

జూన్ నుంచి ఒకే దేశం-ఒకే రేషన్ అమలు
వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్పథకం 2020, జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం(ఎఫ్‌పీఎస్) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు.
వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ విషయమై కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ డిసెంబర్ 3న మాట్లాడుతూ... బయోమెట్రిక్ లేదా ఆధార్ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుందిఅని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టాండర్డ్పై కృషి చేస్తోందని చెప్పారు.

ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ డిసెంబర్ 3న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్ సభ నవంబర్ 27నే ఆమోదించింది. ఎస్పీజీ(సవరణ) బిల్లు-2019 ప్రకారం... ఇకపై దేశ ప్రధాని, అధికార నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ రక్షణ వ్యవస్థ సేవలు అందుతాయి. బిల్లుపై జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఐదేళ్లపాటు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు అని వివరించారు.
మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ నవంబర్ 27న ఈ బిల్లును ఆమోదించింది.

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఢిల్లీలో డిసెంబర్ 3న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. దివ్యాంగులకు సమాజంలో తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య ఆకాంక్షించారు. వారిపై సానుభూతి చూపడానికి బదులు పోత్సహించాలని, వారిలోని శక్తిని వెలికి తీయాలని కోరారు. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపికైన దివ్యాంగులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.
పురస్కారాలు-వివరాలు

 • రోల్ మోడల్ విభాగంలో నారా నాగేశ్వరరావు (సరూర్‌నగర్, రంగారెడ్డి), ఉత్తమ ఉద్యోగి విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్రవేత్త డా.ఐవీ శ్రీనివాసరెడ్డి అవార్డు అందుకున్నారు.
 • ఇటీవల పలు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల కోసం బ్రెయిలీ బ్యాలెట్ పేపర్లను రూపొందించిన బేగంపేటలోని దేవ్నర్ ప్రిటింగ్ హౌస్ ఫర్ ద బ్లైండ్ సంస్థకు ఉత్తమ బ్రెయిలీ ప్రెస్ విభాగంలో అవార్డు లభించింది.
 • ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడకు చెందిన ఉమ ఎడ్యుకేషనల్, టెక్నికల్ సోసైటీకి ఉత్తమ సంస్థగా అవార్డు దక్కింది.


పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు డిసెంబర్ 4న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి.

చట్టసభల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారు.

కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని..

 • వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు.
 • కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
 • ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 2019 ఎకానమీ

10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌కు రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ నవంబర్ 28న మరో రికార్డ్ ఘనత సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.10,01,555 కోట్లను తాకింది. దీంతో ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ జర్నీ ఇలా...

తేదీ

షేర్ ధర (రూ. లలో)

మార్కెట్ క్యాప్ (రూ.కోట్లలో)

2/08/2005

94

1,03,321

16/04/2007

364

2,03,138

19/09/2007

543

3,02,935

29/10/2007

707

4,11,078

21/07/2017

793

5,15,400

01/11/2017

953

6,03,207

19/07/2018

1,105

7,00,089

23/08/2018

1,270

8,04,533

24/10/2019

1,437

9,10,587

28/11/2019

1,580

10,01,555

పసిడి కళాకృతులకు హాల్‌మార్క్ : కేంద్రం

దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ నవంబర్ 29న ప్రకటించారు. ఇందుకు సంబంధించి 2020, జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
2000 ఏప్రిల్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్‌మార్కింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి.

4.5 శాతంగా దేశ వృద్ధి రేటు : ఎన్‌ఎస్‌ఓ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా నమోదయి్యంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) నవంబర్ 29న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది.

కట్టుతప్పిన ద్రవ్యలోటు...

ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నవంబర్ 29న ఈ గణాంకాలను విడుదల చేసింది.

వియత్నాంకు వేగవంతమైన వృద్ధి హోదా

ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి వేగవంతమైన వృద్ధి హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయి్యంది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం.

భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే : క్రిసిల్

భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్‌‌స ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు డిసెంబర్ 2న ప్రకటించింది. దేశంలో ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్-మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్‌బీ

అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ- డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను దెబ్బతీసిందని పేర్కొంది.

భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు కేబినెట్ ఆమోదం

దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి డిసెంబర్ 4న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. ఈటీఎఫ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది అని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
భారత్- 22 ఈటీఎఫ్ మాదిరిగా భారత్ బాండ్ ఈటీఎఫ్నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.

డిసెంబర్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు

శ్రీలంకకు 3,230 కోట్ల రుణ సాయం : మోదీ

శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,229 కోట్ల) సులభతర రుణం సాయం (లైన్ ఆఫ్ క్రెడిట్) చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో తీవ్రవాద నిర్మూలనకు 50 మిలియన్ డాలర్లు (రూ.358 కోట్లు) కేటాయించారు. శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో నవంబర్ 29న ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా మోదీ ఈ రుణాన్ని ప్రకటించారు.
మోదీ, గోతబయ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు వెల్లడించారు. గోతబయ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. శ్రీలంక చెరలో ఉన్న భారత జాలర్లందరినీ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారత్-జపాన్ రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం

భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో నవంబర్ 30న భారత్-జపాన్ రక్షణ, విదేశాంగ శాఖల(2+2) మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జపాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగి, రక్షణ మంత్రి టారో కొనో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) సహా అంతర్జాతీయ విభాగాలకు ఇచ్చిన హామీలను పాకిస్తాన్ అమలు చేయాలని భారత్, జపాన్ ఆ దేశాన్ని కోరాయి.

మోదీతో సమావేశం

2+2 సమావేశం అనంతరం జపాన్ మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు జపాన్, భారత సంబంధాలు కీలకమైనవని ఈ సందర్భంగా మోదీ అన్నారు. 2020, జనవరిలో ఇండో-జపాన్ వార్షిక సదస్సుకు ప్రధాని షింజో ఆబేను ఆహ్వానించనున్నట్లు మోదీ తెలిపారు.

ఢిల్లీలో భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో డిసెంబర్ 3న భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటూ స్వీడన్‌కు చెందిన కంపెనీలను మంత్రి ఆహ్వానించారు.
కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ 2019, సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గడిచిన 28 ఏళ్లలో పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ.

డిసెంబర్ 2019 సైన్స్ & టెక్నాలజీ

సూర్యుని కంటే 70 రెట్లు పెద్దదైన బ్లాక్‌హోల్

సూర్యుని కంటే దాదాపు 70 రెట్లు పెద్దదైన బ్లాక్‌హోల్(కృష్ణబిలం)ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన నేషనల్ ఆస్ట్రోన్రామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ చైనా(ఎన్‌ఏఓసీ) శాస్త్రవేత్త, ప్రొఫెసర్ లియూ జీఫెంగ్ నేతృత్వంలోని బృందం ఈ బ్లాక్‌హోల్‌ను గుర్తించింది. మన పాలపుంతలోనే కనిపించిన ఈ భారీ బ్లాక్‌హోల్ భూమి నుంచి 15వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ బ్లాక్‌హోల్‌కు ఎల్‌బీ-1 అని నామకరణం చేశారు. ఈ సరికొత్త బ్లాక్‌హోల్‌ను మరింతగా అధ్యయనం చేయడం ద్వారా భూమి పుట్టుక, జీవ పరిణామ క్రమం గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎల్‌బీ-1 సంబంధించిన పరిశోధన వివరాలు జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి.

డిసెంబర్ 11న పీఎస్‌ఎల్‌వీ-సీ48 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2019, డిసెంబర్ 11న పీఎస్‌ఎల్‌వీ-సీ48 ప్రయోగం చేపట్టనుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ48 ద్వారా రీశాట్-2బీఆర్1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ నవంబర్ 27న తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు షార్ నుంచి 74 ప్రయోగాలు చేశారు. అలాగే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు విజయవంతం అయ్యింది.

డిసెంబర్ 2019 అవార్డ్స్

మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్ పురస్కారం

సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ ప్రముఖ మలయాళీ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రిని వరించింది. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా నవంబర్ 29న ప్రకటించారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు.

ది సెలైంట్ వాయిస్ చిత్రానికి జాతీయ అవార్డు

ప్రతి చెరువుకు ఓ స్వరం ఉందనే సందేశాన్నిస్తూ చెరువుల పరిరక్షణపై అవగాహనతో తెరకెక్కిన ది సెలైంట్ వాయిస్అనే లఘు చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ సునీల్ సత్యవోలు దర్శకుడిగా, అన్షుల్ సిన్హా నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. సీఎంఎస్ ఫిలిం ఫెస్టివల్‌లో ది సెలైంట్ వాయిస్‌కు రెండో స్థానం దక్కింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ చేతుల మీదుగా సునీల్, అన్షుల్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణపై సమాజంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

జయేశ్ రంజన్‌కు ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు

స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో చేసిన కృషికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని స్వీడన్ రాయబార కార్యాలయంలో స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్, రాణి సిల్వియా డిసెంబర్ 4న జయేశ్ రంజన్‌కు ఈ అవార్డును అందజేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అవార్డును స్వీడన్ దేశ ప్రయోజనాలకు తోడ్పడే వారికి అందజేస్తారు.

డిసెంబర్ 2019 స్పోర్ట్స్

ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపికకు పసిడి పతకం

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల రికర్వ్‌లో భారత స్టార్ ఆర్చర్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ దీపిక కుమారి బంగారు పతకం సాధించింది. మరో అమ్మాయి అంకిత భగత్ రజతం చేజిక్కించుకుంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఇద్దరి మధ్య నవంబర్ 28న జరిగిన రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6-0తో ఆరో సీడ్ అంకితను ఓడించింది. దీంతో భారత్‌కు రెండో ఒలింపిక్స్ కోటా బెర్తు ఖాయమైంది.
మహిళల కంటే ముందుగా పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్ ఒలింపిక్స్ కోటా బెర్తు సాధించారు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా వీరు టోక్యోకు అర్హత పొందారు.

కఠ్మాండూలో దక్షిణాసియా క్రీడలు ప్రారంభం

నేపాల్ రాజధాని కఠ్మాండూలో 13వ దక్షిణాసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. నేపాల్ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి డిసెంబర్ 1న ఈ క్రీడలను ప్రారంభించారు. 10 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు దేశాల నుంచి 2,715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీడాంశాల్లో 1119 పతకాల కోసం క్రీడాకారులు పోటీపడతారు. భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో బరిలో ఉన్నారు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 308 పతకాలు సాధించింది.

పతాకధారిగా తేజిందర్

దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా షాట్‌పుట్ క్రీడాకారుడు తేజిందర్ సింగ్ పాల్ తూర్ వ్యవహరించనున్నాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 25 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకం సాధించాడు.

సయ్యద్ మోదీ ఓపెన్ టోర్ని రన్నరప్‌గా సౌరభ్

సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ సౌరభ్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డిసెంబర్ 1న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్(మధ్యప్రదేశ్) 15-21, 17-21తో ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. విజేత వాంగ్ జు వెకి 11,250 డాలర్లు (రూ. 8 లక్షలు), రన్నరప్ సౌరభ్ వర్మకు 5,700 డాలర్లు (రూ. 4 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2019 ఏడాది సౌరభ్ హైదరాబాద్ ఓపెన్, వియత్నాం ఓపెన్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు.
వాంగ్ జు వె నెగ్గడంతో... 2014 తర్వాత సయ్యద్ మోదీ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విదేశీ ఆటగాడికి టైటిల్ లభించినట్లయింది. 2014లో జుయ్ సాంగ్ (చైనా) విజేతగా నిలువగా... 2015లో పారుపల్లి కశ్యప్ (భారత్), 2016లో కిడాంబి శ్రీకాంత్ (భారత్), 2017, 2018లలో సమీర్ వర్మ (భారత్) చాంపియన్స్ గా నిలిచారు.

అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్

ఫార్ములావన్ సీజన్‌లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. డిసెంబర్ 1న జరిగిన ఈ రేసులో 34 ఏళ్ల హామిల్టన్ 55 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో హామిల్టన్ ఈ సీజన్‌లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లయింది. సీజన్‌లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్-326 పాయింట్లు) రెండో స్థానంలో ... వెర్‌స్టాపెన్ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.

 • 2019 ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్ సాధించగలిగారు. హామిల్టన్ 11 టైటిల్స్ నెగ్గాడు. బొటాస్ 4 టైటిల్స్, వెర్‌స్టాపెన్ 3 టైటిల్స్, లెక్‌లెర్క్ 2 టైటిల్స్, వెటెల్ ఒక టైటిల్ గెలిచారు.
 • ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్ సాధించాయి.

ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ విజేతగా కర్ణాటక

సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక సొంతం చేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌లో డిసెంబర్ 1న జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు ఒక పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. ముందుగా కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఈ టోర్నిలో కర్ణాటక జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు.

పాక్‌తో డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత్ విజయం

కజకిస్తాన్‌లోని నూర్ సుల్తాన్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో జరిగిన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ మ్యాచ్‌లో భారత్ 4-0తో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. దీంతో 2020, ఏడాది జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు భారత్ అర్హత సాధించింది. 2020, మార్చి 6,7 తేదీల్లో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో... గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన క్రొయేషియా జట్టుతో భారత్ తలపడనుంది.

లియాండర్ పేస్ రికార్డు

1990లో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన 46 ఏళ్ల లియాండర్ పేస్ తాజాగా జరిగిన భారత్, పాక్ డేవిస్ కప్ టోర్నిలో తన డబుల్స్ విజయాల సంఖ్యను 44కు పెంచుకున్నాడు. డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా లియాండర్ పేస్ (43 విజయాలు) 2018 ఏడాది ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. నికోలా పెట్రాన్‌గెలి (ఇటలీ-42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్ అధిగమించాడు. తాజా తన రికార్డును తానే సవరించాడు. డేవిస్‌కప్‌లో పేస్ మొత్తం 92 మ్యాచ్‌లు గెలిచాడు. ఇందులో 44 డబుల్స్, 48 సింగిల్స్ ఉన్నాయి.

ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో దివ్యా రెడ్డికి స్వర్ణం

21వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది. మలేసియాలోని సారావక్ రాష్ట్రం కుచింగ్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా-2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్-2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు.

లియోనెల్ మెస్సీకి గోల్డెన్ బాల్ పురస్కారం

అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీని బ్యాలన్ డి ఓర్ (గోల్డెన్ బాల్) అవార్డు-2019 వరించింది. ప్రతి యేటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ఫిఫా అందించే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మెస్సీ ఆరోసారి గెల్చుకోవడం ద్వారాకొత్త చరిత్ర సృష్టించాడు. గతేడాది వరకు ఐదుసార్లు చొప్పున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), మెస్సీ ఈ అవార్డు సాధించి సమఉజ్జీగా నిలిచారు. తాజా పురస్కారంతో రొనాల్డోను వెనక్కి నెట్టి మెస్సీ అత్యధికసార్లు ఈ అవార్డు గెల్చుకున్న ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో మెస్సీ 2009, 2010, 2011, 2012, 2015లలో ఈ అవార్డు గెల్చుకున్నాడు. 2019 సీజన్‌లో మెస్సీ 54 మ్యాచ్‌ల్లో 46 గోల్స్ సాధించాడు.

మహిళల విభాగంలో రాపినోయ్

మహిళల విభాగంలో అమెరికాకు చెందిన మెగాన్ రాపినోయ్ బ్యాలన్ డి ఓర్ అవార్డును గెల్చుకుంది. 2019 ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌ను అమెరికా గెలవడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ సాధించే వారికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డును, ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును మెగాన్ గెల్చుకోవడం విశేషం.

న్యూజిలాండ్‌కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) న్యూజిలాండ్ క్రికెట్‌ను జట్టును క్రిస్టోఫర్ మార్టిన్-జెన్‌కిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపిక చేసింది. కెనడాలోని హామిల్టన్ నగరంలో డిసెంబర్ 3న జరిగిన కార్యక్రమంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌లు ఉమ్మడిగా స్పిరిట్ అవార్డును కివీస్ జట్టుకు అందజేశారు.
వన్డే ప్రపంచకప్-2019లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. సూపర్ ఓవర్దాకా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో సమఉజ్జీగా నిలిచిన న్యూజిలాండ్... బౌండరీల లెక్కల్లో వెనుకబడి ఓడింది. అయితే ఆ టోర్నీలో కేన్ విలియమ్సన్ సేన చూపిన హుందాతనం అందరి మనసుల్ని గెలుచుకుంది. ఫైనల్లో క్షణానికోసారి పైచేయి మారుతున్నా... స్టోక్స్ (ఇంగ్లండ్) బ్యాట్‌ను తాకుతూ ఓవర్ త్రో బౌండరీ వెళ్లినా... అంపైర్ అదనపు పరుగు ఇచ్చినా... కివీస్ ఆటగాళ్లు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ న్యూజిలాండ్ జట్టును స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపిక చేసింది.

డిసెంబర్ 2019 వ్యక్తులు

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 9వ స్థానం

ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితా-2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ముకేశ్ సంపద విలువ 60 బిలియన్ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్ పేర్కొంది. 2018లో 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్-10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిలిచారు.

ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ రాజీనామా

ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్తి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు నవంబర్ 29న ప్రకటించారు. తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పిస్తానని, దాంతో పార్లమెంటు ఇతర అవకాశాలను పరిశీలించుకుంటుందని చెప్పారు. ఇరాక్ ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ చట్టసభ సభ్యులకు అత్యున్నత షియా మతగురువు పిలుపునివ్వటంతో రెండు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లలో 400 మంది మృతి చెందగా, 15 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని అదెల్ రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం

మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్ ఆఘాడి(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్) తరఫున శివసేన చీఫ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ గ్రౌండ్‌లో నవంబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్‌బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్‌లతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించారు.
మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండానే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఉద్ధవ్ ఠాక్రే గురించి...

 • బాల్ ఠాక్రే, మీనా ఠాక్రే దంపతులకు ముంబైలో 1960, జూలై 27న ఉద్దవ్ ఠాక్రే జన్మించారు.
 • ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీని స్థాపించారు.
 • 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక సామ్నా పత్రికను వెనకుండి నడిపించారు.
 • 1990లో ములుంద్‌లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
 • 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు.
 • 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు.
 • 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను గెలుచుకుంది.
 • 2019 ఎన్నికల్లో 288 సీట్లకు శివసేన 56 స్థానల్లో విజయం సాధించింది.

నాడు-నేడు పర్యవేక్షణాధికారిగా పీటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులకు పర్యవేక్షణాధికారిగా రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ (రిటైర్డ్) అధికారి ఎఫ్‌సీఎస్ పీటర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని డిసెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు శాఖల్లో చేపట్టే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను పీటర్ పర్యవేక్షిస్తారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు-నేడు ద్వారా సకాలంలో పనులు జరుగుతున్నాయా లేదా, నిర్మాణాల తీరు, మౌలిక వసతుల కల్పన, టెండర్ల వ్యవహారం తదితర అంశాలను ఆయన పరశీలించనున్నారు.

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నానా పటోలె

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్ కఠోర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సె పాటిల్ డిసెంబర్ 1న ప్రకటించారు. రైతు నాయకుడిగా విశిష్టమైన సేవలు అందించిన పటోలె 56 ఏళ్ల పటోలే కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2017లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని సకోలీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

విశ్వాస పరీక్షలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజయం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 30న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి(మహా వికాస్ ఆఘాడి) ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

అసెంబ్లీలో బలాబలాలు..

మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది.

నేవీలో మొదటి మహిళా పైలట్‌గా శివాంగీ

భారత నావికాదళానికి చెందిన సబ్-లెఫ్టినెంట్ శివాంగీ నావికా దళ పైలట్ అయిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. కేరళలోని కొచ్చిలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె డిసెంబర్ 2న పైలట్‌గా విధుల్లో చేరారు. శివాంగీతో పాటు 7వ డోర్నియర్ కన్వర్జన్ కోర్సుకు చెందిన మరో ఇద్దరు అధికారులు కూడా డోర్నియర్ పైలట్లుగా క్వాలిఫై అయినట్లు రక్షణ శాఖ ప్రతినిధులు తెలిపారు. దీనిపై శివాంగీ స్పందిస్తూ తొలి మహిళా పైలట్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని, ఇదో కొత్త అనుభూతి అని పేర్కొన్నారు. దీనికోసమే ఎంతోకాలంగా ఎదురు చూసినట్లు తెలిపారు.

రోజర్ ఫెడరర్ గౌరవార్థం వెండి నాణేలు

ప్రపంచ టెన్నిస్ వేదికలపై విశేష ప్రతిభ కనబరుస్తున్న తమ విఖ్యాత ఆటగాడు రోజర్ ఫెడరర్ గౌరవార్థం వెండి నాణేలు విడుదల చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్ కరెన్సీలో 20 ఫ్రాంక్ విలువైన నాణేలపై ఫెడరర్ తన ట్రేడ్‌మార్క్ షాట్ అయిన బ్యాక్‌హ్యాండ్‌తో కనిపిస్తాడు. 2020, జనవరి 23న ఈ నాణేలను లాంఛనంగా జారీ చేస్తామని స్విస్ మింట్ తెలిపింది. ఇప్పటిైకైతే మొత్తం 55 వేల నాణేలను ముద్రించినట్లు పేర్కొంది. జీవించివున్న వ్యక్తి ముఖచిత్రంతో ఇలా నాణేలను విడుదల చేయడం స్విట్జర్లాండ్ చరిత్రలో ఇదే తొలిసారి.

అల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్

టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ డిసెంబర్ 4న లేఖ రాశారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ-వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని లేఖలో పేర్కొన్నారు.

అల్ఫాబెట్(గూగుల్) ప్రస్తుత మార్కెట్ విలువ : 89,300 కోట్ల డాలర్లు
ఆదాయం(2018) : 13,682 కోట్ల డాలర్లు
నికర లాభం 3,074 కోట్ల డాలర్లు
సుందర్ పిచాయ్ 2018 సంపాదన (షేర్ల విలువతో కలిపి) : 47 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు)
మదురై టు సిలికాన్ వ్యాలీ...
తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్‌చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు.

డిసెంబర్ 2019 రాష్ట్రీయం

5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ -2019 ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2019 ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 28న న ప్రారంభించారు. అభివృద్ధిలో శాస్త్ర విజ్ఞానం అంశంగా జరుగుతున్న ఈ కాంగ్రెస్‌లో గవర్నర్ మాట్లాడుతూ... సైన్స్ తోనే సమాజంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పర్యావరణ అసమానతలు భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్నాయని, ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్య తీవ్రతే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కలు విస్తారంగా నాటుతూ అడవుల భూభాగం 33 శాతం కంటే పెరగడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు.

నవరత్నాల అమలుకు ప్రత్యేక కమిటీలు

ప్రతిష్టాత్మక నవరత్నాల పథకాలను అర్హులైన వారికి మరింత సమర్థంగా అందించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర స్థాయి కమిటీ

రాష్ట్రస్థాయి కమిటీలో 27 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షునిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్, సభ్య కన్వీనర్‌గా ప్రణాళికా శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉంటారు.

జిల్లా స్థాయి కమిటీ

జిల్లా స్థాయి కమిటీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా మంత్రులు, నవరత్నాలకు సంబంధించిన శాఖల జిల్లాల అధికారులు ఉంటారు. ఈ కమిటీకి సభ్య కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు.

విశాఖ వేదికగా మిలాన్-2020 విన్యాసాలు

నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది. విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్-2020 విన్యాసాలు నిర్వహించనున్నారు. మిలాన్-2020లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్‌లకు చెందిన 41 దేశాలకు ఆహ్వానాలు పంపింది. వివిధ దేశాల మధ్య స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు.

1995లో తొలిసారి జరిగిన మిలాన్ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లు నిర్వహించడం వల్ల మిలాన్ విన్యాసాలు జరగలేదు.

తెలంగాణ ప్రభుత్వంతో స్కైవర్త్ కంపెనీ ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నవంబర్ 29న హైదరాబాద్‌లో భేటీ అయింది. తాజా ఒప్పందం ప్రకారం... స్కెవర్త్ కంపెనీ మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్... ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది.

న్యాయాధికారుల సదస్సులో జస్టిస్ జేకే మహేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి పాల్గొన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 1న ఈ సదస్సులో జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు న్యాయ ఆలయాలు అయ్యాయన్నారు. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు.

హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం

అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్‌లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు.

విశాఖలో ఉబెర్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం

అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్.. విశాఖపట్నంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను డిసెంబర్ 2న ప్రారంభించింది. రూ. 5.73 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా 2020 ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ఉబెర్ ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది.

ప్రపంచంలో 12వ సెంటర్

ఉబెర్ సంస్థ భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది.

భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక : కేంద్ర టెలికం మంత్రి

ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. డేటా రేట్లకు సంబంధించిన చార్టును డిసెంబర్ 2న మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చార్టు ప్రకారం... ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది.

డేటా రేట్ల విషయమై మంత్రి స్పందిస్తూ... ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది అని పేర్కొన్నారు. దేశీ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50 శాతం దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్ ప్రారంభం

చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు డిసెంబర్ 2న ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి మాట్లాడుతూ... ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ ఇంటెల్ కేంద్రం పాలు పంచుకుంటుందని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభమైంది. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన డేగల సత్యలీలకు సీఎం తొలి చెక్కు అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమెకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది.
ఆరోగ్య ఆసరా ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామన్నారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు.

జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు

ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తామని వెల్లడించారు. తొలిదశలో పెలైట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని సీఎం తెలిపారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు

 • విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం.
 • 2020, ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం.
 • డయాలసిస్ రోగులకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా 2020, జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం.
 • ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి 2020, జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం.

వైఎస్సార్ లా నేస్తం పథకం ప్రారంభం

వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు ఆర్థిక సాయం చేసేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 3న రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. వైఎస్సార్ లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ చెల్లించేందుకు రూ.5.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

వైఎస్సార్ లా నేస్తం పథకానికి అర్హులు

 • జీవో జారీ చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసున్న, బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదైన జూనియర్ న్యాయవాదులు
 • 2016, ఆ తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు

మహిళల రక్షణకు బీ సేఫ్ యాప్ ఆవిష్కరణ

ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న విజయవాడలో ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు సందర్భంగా మహిళలు, యువత రక్షణ కోసం ఉద్దేశించిన బీ సేఫ్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ... అత్యవసర ఫోన్ నంబర్లు 100, 181, 112, వాట్సాప్ నంబరు 9121211100పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళామిత్ర, సైబర్‌మిత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.

దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా డిసెంబర్ 4న తెలంగాణ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా దిశకేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది.
నోట్ : శంషాబాద్‌లో నవంబర్ 27న అత్యాచారం, దారుణ హత్యకు గురైన బాధితురాలి పేరును జస్టిస్ ఫర్ దిశగా పిలవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ డిసెంబర్ 1న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రెండోసారి ఫాస్ట్‌ట్రాక్..

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది.

మహిళల భద్రతకు అభయ్ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అభయ్ పేరుతో వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ డిసెంబర్ 4న ఒంగోలులో ప్రారంభించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు జిల్లాలో ఎనిమిది వాహనాలు (నాలుగు చక్రాలు) మహిళల రక్షణకు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు వాహనాలను నమ్మలేని పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో డయల్-100కు ఫోన్ చేసి మహిళలు అభయ్ వాహనాల సేవలను వినియోగించుకోవచ్చు. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు. జిల్లా వ్యాప్తంగా అత్యవసరంగా సేవలందించేందుకు 70 ద్విచక్ర వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వరుస దుర్ఘటనల నేపథ్యంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

లూథియానాలోనూ...
పంజాబ్‌లోని లూథియానా పోలీసులు కూడా రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, యువతుల కోసం డిసెంబర్ 1 నుంచి నుంచి కొత్త సర్వీసు ప్రారంభించారు.

విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు

విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు డిసెంబర్ 4న జరిగాయి. ఈ వేడుకల్లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కె డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ ముఖ్య అతిథి సీఎం జగన్‌కు స్మృతి చిహ్నాన్ని అందించారు. వేడకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.

నేవీ డే కథ...

బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4 పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.