������������������������ 2020 ��������������������� ������������������������

ఫిబ్రవరి 2020 కరెంట్‌ అఫైర్స్‌

చైనాతో రష్యా సరిహద్దు మూసివేత


చైనాతో ఉన్న రష్యా సరిహద్దును తాత్కాలికంగామూసివేస్తున్నట్లు రష్యా జనవరి 30న ప్రకటించింది. చైనాలో విస్తరిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ వెల్లడించారు. అలాగే చైనీయులకు ఎలక్టాన్రిక్ వీసాల జారీని కూడా నిలిపివేస్తామని పేర్కొన్నారు. తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాము అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. తమ దేశ పౌరులు చైనా పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, చైనాలో వున్న రష్యా పౌరులు అక్కడి తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది.

గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన


ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో... జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు.


హెల్త్ ఎమర్జెన్సీ


ఒక దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనకరంగా మారిన ఆసాధారణ పరిస్థితిలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2005లో తీసుకొచ్చిన ఆంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అన్ని దేశాలు హెల్త్ ఎమర్జెన్సీపై ఖచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి. ఇప్పటి వరకు ఆరు సార్లు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన బ్రెగ్జిట్


యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందం 2020, జనవరి 31 అర్ధరాత్రి 11 గంటల నుంచి(బ్రిటన్ కాలమానం ప్రకారం) అమల్లోకి వచ్చింది. దీంతో ఈయూ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య 28 నుంచి 27కి తగ్గింది. బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహంనినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, బ్రెగ్జిట్‌తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి 2020, డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది.
బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో..చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణంఅని పేర్కొన్నారు. ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చిందన్నారు.

అమెరికా అధ్యక్షుడిపై వీగిన అభిశంసన తీర్మానం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్‌లో వీగిపోయింది. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలతో ట్రంప్‌పై 2019, డిసెంబర్‌లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52-48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53-47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం. సెనేట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు, డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి.

అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు


ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాటయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్‌‌స, గ్రీస్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా చేరాయి. మత స్వాతంత్యాన్న్రి గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమిలోని సభ్య దేశాలు ప్రతినబూనాయి.

ఫిబ్రవరి 2020 జాతీయం

భారత్‌లో తొలి కరోనా కేసు నమోదు


ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జనవరి 30న భారత ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే. మరోవైపు చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

170 మంది మృతి


చైనాలో కరోనా వైరస్ బారినపడి జనవరి 30నాటికి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది.

ప్రతి పది మందిలో ఒకరికి కేన్సర్ : డబ్ల్యూహెచ్‌వో

భారతదేశంలో 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవిత కాలంలో ప్రాణాంతక కేన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేన్సర్ బారిన పడిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని తెలిపింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్‌సీ) సంస్థలు ఫిబ్రవరి 4న రెండు నివేదికలు విడుదల చేశాయి. కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఎజెండా రూపొందించడంతో పాటు కేన్సర్‌పై పరిశోధన, నివారణలపై ఈ నివేదికలు ప్రధాన దృష్టి సారించాయి. సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో రాబోయే 20 ఏళ్లలో మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాల రేటు 60 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

వరల్డ్ కేన్సర్ డే 2020 థీమ్ : ఐ యామ్ అండ్ ఐ విల్

త్వరలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఏర్పాటు

భారత గగనతలంలో జరిగే వైమానిక దళ ఆపరేషన్లు అన్నింటినీ పర్యవేక్షించేలాఎయిర్ డిఫెన్స్ కమాండ్ను త్వరలో ఏర్పాటు చేస్తామని భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగే నేవీ ఆపరేషన్ల కోసం ద్వీపకల్ప కమాండ్‌ను, సైనికులకు వసతి, ఆయుధాలు సమకూర్చడం వంటి అవసరాలు తీరుస్తూనే, వారి సేవల్ని వినియోగించుకునేలా లాజిస్టిక్ కమాండ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
సాయుధ బలగాలన్నీ సంఘటితం కావడానికి, సమన్వయంతో పనిచేయడానికి ఎయిర్ డిఫెన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేస్తామని జనరల్ రావత్ పేర్కొన్నారు. వైమానిక దళానికి చెందిన విభాగాలన్నీ ఒకే కమాండ్ కిందకి వస్తే ఎదురయ్యే సమస్యల్ని నియంత్రించడం సులభం అవుతుందని అన్నారు. సిబ్బంది పని విభజన సక్రమంగా జరిగేలా లాజిస్టిక్స్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకుశ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలనిఅయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు 2020, ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మందిర విషయమై మోదీ మాట్లాడుతూ... రామ మందిర అభివృద్ధి కోసం ఒక విసృ్తత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగాసబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు.
15 మంది ట్రస్టీలు
రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు
మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.

 

లక్నోలో 11వ డిఫెక్స్‌పో ప్రారంభం


రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్11వ డిఫెక్స్‌పో ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిఫెక్స్‌పోను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. ఏ దేశాన్నో లక్ష్యంగా చేసుకుని భారత్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతలను కాపాడే విషయంలో భారత్ నమ్మదగిన భాగస్వామి అన్నారు.
భారత్ రెండేళ్లకు ఒకసారి ఈడిఫెక్స్‌పోను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే 11వ డిఫెక్స్‌పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్‌మెంట్ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.

సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక

సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019పై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయడుకి అందజేశారు. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమై తాజా నివేదికను రూపొందించింది. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ బిల్లులో పలు మార్పులను సూచించింది.


సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సూచనలు

 • సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చు.
 • 35-45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చు.
 • సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధన సడలింపు.
 • అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలి.
 • బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుంది.
 • భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలి.

ఆటో ఎక్స్ పో 2020 మోటార్ షో ప్రారంభం
ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఆటో ఎక్స్‌పో 2020 మోటార్ షో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5న లాంఛనంగా ప్రారంభమైంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐతో పాటు ఏసీఎంఏ, సియామ్ కలిసి నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 15 పైగా స్టార్టప్ సంస్థలు, టెలికం, విద్యుత్ వాహనాల సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు 60 దాకా ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను కంపెనీలు ఈ 15వ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నాయి.

మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 5న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్ వద్ద ఈ భారీ పోర్టు నిర్మాణం చేపడతారు. ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మోడల్‌లో) అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు

 • ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ద్వారా భారత్-శ్రీలంకల మధ్య విమాన సర్వీసులు నడపడానికి ఆమోదం.
 • సూరత్, భోపాల్, భాగల్పుర్, అగర్తల, రాయచూర్ ట్రిపుల్ ఐటీ (పీపీపీ)లకు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదా కల్పించాలని నిర్ణయం.
 • పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణకు ఆమోదం.

 

అయోధ్య మందిరానికి కేంద్ర ప్రభుత్వ విరాళం రూపాయి


ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగాశ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేసింది. ప్రభుత్వం తరపున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము ఫిబ్రవరి 6న ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కై లాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.


ఏప్రిల్‌లో మందిర నిర్మాణం


అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 2020 రాష్ట్రీయం

సమత హత్యోదంతంలో దోషులకు మరణ శిక్ష


తెలంగాణలో సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దూమ్‌లను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష విధించింది. అలాగే ముగ్గురికి కలిపి రూ.26 వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2019, నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయమూర్తి విచారణ జరిపారు. డిసెంబర్ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న ప్రత్యే కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని జనవరి 30న తుది తీర్పు వెలువరించారు.

కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్ ప్రారంభం


రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 2న సందర్శించారు. కాన్హా శాంతివనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్‌ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ, రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పటేల్ (దాజీ) పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని కాన్హా శాంతివనంలో నిర్మించారు. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు.


ఏపీలో గడప వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభం

గ్రామ, వార్డు వలంటీరే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినగడప వద్దకే పెన్షన్ కార్యక్రమం 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. ఒక్క పూటలో 42,81291 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోను, బయోమెట్రిక్ డివైస్‌ను వెంట తీసుకెళ్లిన వలంటీర్లు.. లబ్ధిదారునితో వేలి ముద్రలు తీసుకొని పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,16,874 మంది వలంటీర్లు తొలి రోజే 80 శాతం పైగా లబ్ధిదారులకు రూ.1,019 కోట్లు పంపిణీ చేశారు.


దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునికనాలుగో తరం రోబోను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫిబ్రవరి 1న తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, సన్‌షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు.

నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు


తెలంగాణలోని నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ (స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు.డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది అని మంత్రి వివరించారు.


హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్ సెంటర్ ఏర్పాటు
ఐర్లాండ్‌కు చెందిన డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్.. ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ప్రస్తుతం 200 మంది ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,500 స్థాయికి తీసుకు వెళ్లనున్నట్టు కంపెనీ తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ఫిబ్రవరి 4న ప్రారంభించారు.
యాక్సెంచర్ హబ్ కూడా...
ప్రొఫెషనల్, కన్సల్టింగ్ సర్వీసుల్లో ఉన్న అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. భాగ్యనగరి సెంటర్‌లో 2,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రంలో డిజిటల్ ఎకానమీకి అవసరమైన ఉత్పత్తులు, సేవలను యాక్సెంచర్‌తో కలిసి క్లయింట్లు ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంస్థ తొలి నానో ల్యాబ్ ఒక్కడ కొలువుదీరింది. సంస్థకు ఇప్పటికే ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది.


ప్రత్యేక హోదాపై ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 4న లేఖ రాశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి 2020-21 బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్నారు.
రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ లోక్‌సభకు ఫిబ్రవరి 4న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


విజయవాడలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఫిబ్రవరి 5న ది హిందూ గ్రూపుఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని అన్నారు. రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్ మీడియం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును తెచ్చేందుకు నాడు- నేడు, పౌష్టికాహారం, అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ అభివృద్ధి
రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రకాశం జిల్లా దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పో-2020 సదస్సులో భాగంగా ఇండియా-ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఈ మేరకు వెల్లడించారు.

విజయవాడలో డబ్ల్యూహెచ్‌ఈఎఫ్ సదస్సు
వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు పది దేశాలకుపైగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్‌ఈఎఫ్-2020 సదస్సు చైర్మన్ ఎస్.ఎన్. కుమార్ బుద్ధవరపు ఫిబ్రవరి 5న తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని,కలసి అభివృద్ధి చెందుదాం- కలసి పంచుకుందాం అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సకు కేంద్రమంత్రులు వి.మురళీధరన్, జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.


మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 5న ఘనంగా ఫ్రారంభమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి ఫిబ్రవరి 6న చేరుస్తారు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతరను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్తులు వస్తారు.


ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం అందించేందుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డెరైక్టర్ జనరల్-ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ యీ-ఎన్-పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు.

నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల


2020-2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న విడుదల చేశారు. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ రుణాలు 1,34,402 కోట్లు
2020-21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి.
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం తొలగించాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని విదేశీ వర్తక డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ చేశారు.

ఫిబ్రవరి 2020 ఎకానమీ

బంగారం డిమాండ్ 9 శాతం తగ్గింది : డబ్ల్యూజీసీ


ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్ తగ్గడానికి దారితీసిందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 30న ఒక నివేదికను విడుదల చేసింది.

డబ్ల్యూజీసీ నివేదికలోని ప్రధానాంశాలు..

 • 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు. 2019లో 690 టన్నులుగా ఉంది.
 • విలువ పరంగా మాత్రం భారత్ పసిడి డిమాండ్ రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరిగింది.
 • దేశ పసిడి డిమాండ్‌లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంది.
 • చైనా తర్వాత పసిడి డిమాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 2020లో ఈ మెటల్ డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా. ప్రభుత్వం తీసుకునే పలు చర్యలతో ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండడం దీనికి కారణం.


అమల్లోకి రూ. 5 లక్షల డిపాజిట్ బీమా
బ్యాంకు డిపాజిట్లకు పెంచిన బీమా కవరేజీ ఫిబ్రవరి 4 నుంచే అమల్లోకి తెచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు 2020-21 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐలో భాగమైన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఈసీజీసీ) ఈ కవరేజీ ఇస్తుంది.
బీమా కవరేజీ పెంపుకు డీఎఫ్‌ఎస్ ఆమోదం
డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) ఆమోదం తెలిపింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దీన్ని సవరించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 4న తెలిపారు. ప్రతి రూ. 100 డిపాజిట్‌పై బ్యాంకులు ఇకపై 12 పైసల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు శక్తికాంతదాస్ ప్రకటించారు.
వృద్ధి రేటు 5 శాతం
2019-20లో దేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2020-21లో 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020-21 తొలి ఆరు నెలల్లో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5-6 శాతానికి తగ్గించింది.
సీఆర్‌ఆర్ నిబంధనల సడలింపు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్‌ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది 2020 ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం-ముఖ్యాంశాలు

 • వడ్డీ రేట్ల యథాతథ స్థితికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.
 • దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి.
 • ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్‌బీఐ పేర్కొంది.
 • తదుపరి ఆర్‌బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది.


ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
కొత్త, పాత విధానాల్లో ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదాయ పన్ను శాఖ ఫిబ్రవరి 6న ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్ మొదలైన వివరాలన్నీ ఇందులో పొందుపరిస్తే.. పాత, కొత్త విధానాల్లో పన్ను భారాలను తెలుసుకోవచ్చు.
బడ్జెట్‌లో
కొన్ని మినహాయింపులను వదులుకున్న పక్షంలో తక్కువ పన్ను భారం వర్తించేలా 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విధానంలో ఆదాయాన్ని బట్టి 5, 10, 30 శాతాల్లో పన్నులు ఉంటున్నాయి. ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది.

ఫిబ్రవరి 2020 ద్వైపాక్షిక సంబంధాలు

చైనా ప్రయాణికులకు భారత్ ఇ-వీసా రద్దు
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ-వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని(కరోనా వైరస్ వ్యాప్తి) దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 2న ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.
చైనాలో బర్డ్ ఫ్లూ భయం
కరోనా వైరస్‌తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్ ప్రావిన్స్ కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్ ప్రావిన్స్ లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు.

ఫిబ్రవరి 2020 సైన్స్ & టెక్నాలజీ

 

సూర్యుడి ఉపరితల ఛాయచిత్రాలు విడుదల

అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఏర్పాటైన సరికొత్తద ఐనోయీ సోలార్ టెలిస్కోపుతో తీసిన సూర్యుడి ఉపరితలం ఛాయాచిత్రాలను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ జనవరి 30న విడుదల చేసింది. సూర్యుడికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అన్ని చిత్రాల్లోకెల్లా ఇవే అత్యంత స్పష్టమైనవి. సూర్యుడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఐనోయీ టెలిస్కోపు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. ఈ విషయమై సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కోర్డోవా మాట్లాడుతూ.. సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీరుతెన్నులను ఐనోయీ టెలిస్కోపు వివరణాత్మకంగా తెలుసుకోగలదని, భవిష్యత్తులో సౌర తుపానులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు.

సౌర తుపానులు


సూర్యుడిపై ఏర్పడే సౌర తుపానులు భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. జీపీఎస్ వంటి వ్యవస్థలను నాశనం చేసేందుకు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలను దెబ్బతీసేందుకు సౌర తుపానులు కారణమవుతాయని కోర్డోవా పేర్కొన్నారు. ప్రస్తుతం సౌర తుపానులు ఏర్పడేందుకు 48 నిమిషాల ముందు మాత్రమే మనకు తెలుస్తోంది. కొత్త టెలిస్కోపు సాయంతో 48 గంటల ముందుగానే తెలుసుకోవచ్చు.

తొలిసారి అంటార్కిటిక్ త్వైట్స్ చిత్రాలు
సముద్రాల నీటి మట్టం పెరగడానికి ముఖ్యకారణమైన అంటార్కిటిక్ ఖండంలోని త్వైట్స్ అనే మంచు కొండకు సంబంధించిన చిత్రాలను శాస్త్రవేత్తలు తొలిసారి చిత్రీకరించారు. అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రోబోటిక్ సబ్‌మెరైన్ సాయంతో చిత్రాలను తీశారు. వీటి సాయంతో త్వైట్స్ కదలికలను క్షుణ్నంగా పరిశీలించే అవకాశం లభించనుంది. త్వైట్స్ కారణంగా భూమిపై సముద్రాల నీటి మట్టం 4 శాతం మేర పెరుగుతుంది. దీని కదలికల్లో చోటుచేసుకునే చిన్న పరిణామాల వల్ల కూడా సముద్ర నీటి మట్టాలు 25 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉంది. గత 30 ఏళ్లలో త్వైట్స్ నుంచి సముద్రాల్లోకి ప్రవహించే మంచు శాతం రెట్టింపైనట్టు పరిశోధకులు వెల్లడించారు.

ఫిబ్రవరి 2020 అవార్డ్స్

ఏపీఎస్ ఆర్టీసీకి ఏఎస్‌ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) సంస్థ అందించే ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి ప్రథమ స్థానం దక్కింది.ఐటీ ఇన్ డిజిటలైజేషన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం ఆర్టీసీని వరించింది. ఈ పోటీల్లో దేశంలోని 64 రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొనగా, ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డు లభించింది. ఢిల్లీలో జనవరి 31న జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయమంత్రి విజయ్‌కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్నారు.

ఫిబ్రవరి 2020 స్పోర్ట్స్

యాంఫీ ప్రచార కర్తలుగా సచిన్, ధోని
భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిలు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌‌స ఇన్ ఇండియా(యాంఫీ) ప్రచార కర్తలుగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు జనవరి 30న యాంఫీ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. సచిన్, ధోనిలుమ్యూచువల్ ఫండ్‌‌స సహి హై క్యాంపైన్‌కు ప్రచారం చేయనున్నారు. ఈ పరిశ్రమలోని ప్రొడక్ట్‌ల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగనుంది. ఈ విషయమై భారత్ రత్న అవార్డు గ్రహీత సచిన్ మాట్లాడుతూ..క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహం అనేవి విజయానికి మూలస్తంభాలుగా భావిస్తున్నాను. అది ఏ క్రీడైనా, వ్యక్తిగత పెట్టుబడి అయినా సరే అని వ్యాఖ్యానించారు.

వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా రాణి రాంపాల్
ప్రపంచ క్రీడల సమాఖ్యవరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్-2019గా భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఎంపికైంది. ఈ అవార్డు విజేత కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను భాగం చేస్తూ పోలింగ్ నిర్వహించారు. ఇందులో రాణికి మొత్తం 1,99,477 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన ఉక్రెయిన్ కరాటే క్రీడాకారిణి స్టానిస్లావ్ హొరునాకు 92 వేల ఓట్లు వచ్చాయి.
2019 ఏడాది భారత జట్టు ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ గెలవగా రాణిప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికైంది. ఆమె నాయకత్వంలోనే భారత జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వపద్మశ్రీ అవార్డుకు రాణి ఎంపికైన విషయం తెలిసిందే.


ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత కెనిన్
అమెరికా యువతార సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 1న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 4-6, 6-2, 6-2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. దీంతో కెనిన్ తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది. విజేత కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తాజా విజయంతో సెరెనా (2002లో) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణిగా కెనిన్ గుర్తింపు పొందింది. 2008 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.


జొకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్
సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగం టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ రాడ్‌లేవర్ ఎరీనాలో ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎనిమిదోది. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019లలో చాంపియన్‌గా నిలిచాడు. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ థీమ్‌కు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.


గోల్డెన్ గర్ల్ బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు
స్వీడన్‌లోని బోరస్‌లో 2020, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ప్రాచీకి బెస్ట్ బాక్సర్ అవార్డు
జూనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు)బెస్ట్ బాక్సర్ అవార్డును కై వసం చేసుకుంది. ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోయ్‌బి చాను వాంజమ్ (54 కేజీలు), లశు యాదవ్ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్ విభాగంలో ముస్కాన్ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. జూనియర్ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్‌మింగ్ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది.

అమెరికా టెన్నిస్ స్టార్ స్పియర్స్‌పై ఐటీఎఫ్ నిషేధం
డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 22 నెలలపాటు నిషేధం విధించింది. 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్ వాడినట్లు తేలింది. డోపింగ్ ఫలితాలు వచ్చిన తేదీ 2019 నవంబర్ 7 నుంచి నిషేధం అమలవుతుందని 2021, ఏడాది సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్ ఫిబ్రవరి 6న తెలిపింది.
21 డబుల్స్ టైటిల్స్..
స్పియర్స్ తన కెరీర్‌లో 21 డబుల్స్ టైటిల్స్ గెలిచింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొలంబియా ప్లేయర్ యువాన్ సెబాస్టియన్ కబాల్‌తో జతగా స్పియర్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. 2013, 2014 యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల ఫైనల్స్‌లో స్పియర్స్ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీ సాధించింది.

జనవరి 2020 వ్యక్తులు

ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అరవింద్ కృష్ణ
అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్ కృష్ణ నియమితులయ్యారు. 200 బిలియన్ డాలర్ల సంస్థ డెరైక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. 2020, ఏప్రిల్ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుందని జనవరి 31న కంపెనీ వెల్లడించింది. అరవింద్‌తో పాటు రెడ్ హ్యాట్ సీఈవో, ఐబీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జేమ్స్ వైట్‌హస్ట్.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 1990లో ఐబీఎంలో చేరిన అరవింద్ అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్) స్థాయికి చేరారు.
అరవింద్ ప్రస్థానం ఇలా...
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో పీహెచ్‌డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ-రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్‌వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు.

హెచ్‌ఏఎల్ సీఈఓగా అమితాబ్ భట్
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)గా అమితాబ్ భట్ ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు సంస్థకు చెందిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్) ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్‌గా అమితాబ్ సేవలందించారురక్షణ రంగానికి కామోవ్ కేఏ- 226టీ హెలికాప్టర్లను అందించడం కోసం కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండో రష్యన్ హెలికాప్టర్స్ లిమిటెడ్‌కు ఈయన డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. సంస్థతో 32 ఏళ్ల అనుబంధం ఉన్న అమితాబ్ హాయంలోనే ఓఎన్‌జీసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ప్రభుత్వానికి హెలికాప్టర్లను అందించడంతో పాటు నేపాల్, మారిషస్ వంటి దేశాలకు ఎగుమతులు జరిగినట్లు హెచ్‌ఏఎల్ వెల్లడించింది.

జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెరైక్టర్‌గా శ్రీధర్
భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ (జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-జీఎస్‌ఐ) డెరైక్టర్ జనరల్‌గా ఎం.శ్రీధర్ ఫిబ్రవరి 3న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను చేపట్టడానికి ముందు జీఎస్‌ఐ దక్షిణ ప్రాంతం అదనపు డెరైక్టర్ జనరల్‌గా శ్రీధర్ సేవలందించారు. 1986లో జీఎస్‌ఐలో చేరిన ఆయన హిమాలయాలు మొదలుకొని దక్షిణ భారత ద్వీపకల్పం వరకు భూవైజ్ఞానిక రంగంలో విసృ్తతంగా కార్యకలాపాలు నిర్వహించారు. జీఎస్‌ఐకి చెందిన వివిధ జాతీయ ప్రాజెక్టులను నిర్వహించడంలో టెక్నోఅడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారు. వజ్రాల అన్వేషణ రంగంలో ఆయన అసాధారణ తోడ్పాటు అందించినందుకు కేంద్రం నేషనల్ జియో సైన్స్ అవార్డును శ్రీధర్‌కు ప్రదానం చేసింది.
జీఎస్‌ఐ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ మాట్లాడుతూ... ఖనిజాల అన్వేషణలో మెరుగైన ఫలితాల సాధన, క్షేత్రస్థాయి కార్యకలాపాల పెంపు, ప్రయోగశాలలకు పునరుత్తేజాన్ని ఇవ్వడం వంటి వాటితోపాటు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌డీ) కార్యకలాపాలకు ప్రాధాన్యాన్ని ఇస్తామని తెలిపారు.

అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రూ.743 కోట్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.
నలుగురు క్రికెటర్లు..
2019 ఏడాదికి సంబంధించి రూపొందించినఅత్యధిక బ్రాండ్ విలువ గల భారత ప్రముఖుల జాబితాలో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోని (రూ.293 కోట్లు) 9వ స్థానంలో, సచిన్ టెండూల్కర్(రూ. 153 కోట్లు) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నారు.


భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్‌గా సర్ ఫిలిప్
భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ (రాయబారి)గా సర్ ఫిలిప్ బార్టన్ ఫిబ్రవరి 6న నియమితులయ్యారు. ప్రస్తుత రాయబారి సర్ డొమినిక్ అస్కిత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బార్టన్ ప్రస్తుతం విదేశీ, కామన్‌వెల్త్ కార్యాలయంలో కాన్సులర్-సెక్యూరిటీ విభాగం డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1994లో ఢిల్లీలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు.