%E0%B0%AE%E0%B1%87%202020%20%E0%B0%95%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%85%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C

మే 2020 కరెంట్‌ అఫైర్స్‌

మే 2020 అంతర్జాతీయం

అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో మోదీ
భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో మే 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కరోనావైరస్ బాధితులు, ఆ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని దాదాపు అన్ని బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లుంబిని వనం(నేపాల్), మహాబోధి ఆలయం(బోధి గయ, బిహార్), ముల్గంధ కుటి విహార(సారనాథ్, ఉత్తరప్రదేశ్), పరినిర్వాణ స్థూప(కుషినగర్, ఉత్తరప్రదేశ్), అనురాధపుర స్థూప(శ్రీలంక) తదితర పవిత్ర బౌద్ధ ప్రదేశాల్లో జరిగిన ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. సాయం కోరిన ప్రతీ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ ప్రయత్నించిందని తెలిపారు. ‘బుద్ధ అనేది ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక పవిత్ర భావన. స్థల, కాల పరిస్థితులు మారినా ఆయన బోధనలు మనలో ప్రవహిస్తూనే ఉంటాయి’అని కొనియాడారు.

ఫ్రాన్స్ భాగస్వామ్యంతోనే వూహాన్ ల్యాబ్ నిర్మాణం
వూహాన్‌లోని పీ4 వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫ్రాన్స్ భాగస్వామ్యంతోనే నిర్మించామని సిబ్బంది మొత్తం అక్కడే శిక్షణ పొందారని మే 7న చైనా వెల్లడించింది. ల్యాబ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని, నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలిపింది. పెర్ల్ హార్బర్ దాడి కంటే కరోనా వైరస్ దాడి చాలా పెద్దదని ట్రంప్ చెబుతున్నారని, అయితే అమెరికా శత్రువు కరోనా వైరస్ అవుతుంది గానీ చైనా కాదని పేర్కొంది. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థను వ్యతిరేకిస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని, వైరస్ పుట్టుకపై పారదర్శకంగానే ఆ సంస్థకు సహకారం అందిస్తున్నామని వివరించింది.
వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్
కరోనా వైరస్ వూహాన్‌లోని పరిశోధనశాల నుంచే విడుదలైందని తమవద్ద ఆధారాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. సాక్ష్యాలను తాను స్వయంగా చూశానని ‘ఫాక్స్ న్యూస్’తో చెప్పారు.


సౌదీ అరేబియాలో పన్నులు మూడురెట్లు పెంపు
కరోనా మహమ్మారి ప్రభావం, చమురు ధరలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిత్యావసర వస్తువులపై పన్నులను ప్రభుత్వం మూడురెట్లు పెంచింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న పన్ను రేట్లను 2020, జూలై నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం మే 11న ప్రకటించింది. పౌరులకు ఇస్తున్న జీవన వ్యయ భత్యాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పలు ప్రాజెక్టులను వాయిదా వేయడంతోపాటు ప్రధాన ప్రాజెక్టులపై వ్యయాన్ని 2600 కోట్ల డాలర్ల మేర తగ్గించినట్లు పేర్కొంది. తాజా నిర్ణయం ద్వారా రూ.1.97 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని సౌదీ సర్కారు భావిస్తోంది.

కొరియాల సరిహద్దుల్లో కాల్పులు
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత రాజేసే కీలక పరిణామం మే 3న చోటుచేసుకుంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉ.కొరియా సైనికులు తమ సరిహద్దు లోపలి గార్డు పోస్టుపైకి రెండు విడతలుగా తుపాకీ కాల్పులు జరపగా, తాము 20 రౌండ్ల వరకు ‘హెచ్చరిక’కాల్పులు జరిపినట్లు దక్షిణకొరియా బలగాల సంయుక్త అధిపతి వెల్లడించారు. ఈ కాల్పుల్లో తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. తమ బలగాలు ఉ.కొరియా సరిహద్దు లోపలి నిర్మానుష్య ప్రాంతంపైకి కాల్పులు జరిపినందున ఆ వైపున కూడా నష్టం వాటిల్లేందుకు అవకాశం లేదన్నారు.
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన సంచోన్‌లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మే1న జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు ఆయన సోదరి జాంగ్ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.

నామ్ దేశాల నేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో మే 4న ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. అలీనోద్యమం దశాబ్దాల పాటు నైతిక భావనలకు గొంతుకగా నిలిచిందన్నారు. కరోనాపై యుద్ధాన్ని భారత్ ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా మలిచిందన్నారు.

12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో టీకా తయారీకి జరుగుతున్నప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆండ్రూ పోలార్డ్ తెలిపారు. వీటిల్లో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీల్లో కనీసం పన్నెండు టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘శాస్త్రవేత్తల బృందాలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు పోటీపడుతున్నాం. ఈ క్రమంలో మరింత మంది ప్రయోగాలు చేయడం అవసరం కూడా’’అని పేర్కొన్నారు.
ఏడాది చివరికల్లా టీకా
కోవిడ్-19 టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే 4న ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

నిమిషానికి 5వేల ప్రకటనలు తొలగింపు
నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 2019లో మొత్తం 270 కోట్ల తప్పుడు ప్రకటనలను (నిమిషానికి 5,000 పైచిలుకు) తొలగించడం లేదా బ్లాక్ చేసినట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. అలాగే దాదాపు 10 లక్షల ప్రకటనకర్తల అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. యూజర్లు.. తప్పుదోవ పట్టించే ప్రకటనల వలలో పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ మే 4న తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో ఫేస్ మాస్క్‌లు వంటి వాటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వీటికి సంబంధించే ఎక్కువగా మోసపూరిత ప్రకటనలు ఉన్నాయని గుర్తించినట్లు వివరించింది.


కోవిడ్‌పై పోరులో ఇజ్రాయెల్ ముందంజ
కరోనా వైరస్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీబాడీ తయారీలో విజయం సాధించారు. ఈ అంశంపై పేటెంట్లు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టామని, త్వరలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఇజ్రాఝెల్ రక్షణ శాఖ మంత్రి నఫ్టాలీ బెన్నెట్ మే 5న తెలిపారు. ఇజ్రాఝెల్ ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోవిడ్ టీకా అభివృద్ధి బాధ్యతలు అప్పగించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు సమాచారం.
యూరప్ శాస్త్రవేత్తలు కూడా..
కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని యూరప్ శాస్త్రవేత్తలూ గుర్తించారు. 47డీ11 అని పిలుస్తున్న ఈ యాంటీబాడీ వైరస్ కొమ్మును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. 2003 నాటి సార్స్ వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీల్లో ఒకటైన 47డీ11 తాజా వైరస్‌ను నిర్వీర్యం చేయగలదని వీరు గుర్తించారు. ఇప్పటివరకూ వైరస్ సోకని వ్యక్తులకు ఈ యాంటీబాడీ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
టీకా తయారీలో ఇటలీ పురోగతి
కరోనా వైరస్ టీకా తయారీలో ఇటలీ గణనీయ ప్రగతి సాధించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసినట్లు ఇటలీ ప్రకటించింది. రోమ్‌లోని స్పాల్లంజనీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా తయారైన యాంటీబాడీలు మానవ కణాలపై ప్రభావవంతంగా పనిచేసినట్లు ‘అరబ్ న్యూస్’ తెలిపింది.

అత్యధికంగా భారత్‌లోనే నిరాశ్రయులు: యూనిసెఫ్
2019 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో సుమారు 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) వెల్లడించింది. ఈ మేరకు ‘లాస్ట్ ఎట్ హోమ్’ పేరుతో మే 5న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019లో భారత్ తర్వాత ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో అత్యధికంగా నిరాశ్రయులయ్యారు. 2019లో 50,37,000 మంది భారతీయులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. వీరిలో వీరిలో 50,18,000 మంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా, 19 వేల మంది ఘర్షణలు, హింస కారణంగా నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వివరించింది. మరోవైపు 2019లో ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు. వీరిలో 1.2 కోట్ల మంది చిన్నారులే ఉన్నారు.
2019లో నిరాశ్రయులైన వారు

దేశం

నిరాశ్రయుల సంఖ్య

భారత్

50,37,000

ఫిలిప్పీన్స్

42,70,000

బంగ్లాదేశ్

40,80,000

చైనా

40,03,000

మే 2020 జాతీయం

ఔషధాల వినియోగంపై సంజీవని యాప్ ఆవిష్కరణ
కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద ఔషధం అశ్వగంధ చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అశ్వగంధను కరోనా సోకకుండా నిరోధించగల ఔషధంగా వైద్య సిబ్బందికి, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఇతరులకు హైడ్రో క్లోరోక్విన్ స్థానంలో వినియోగించవచ్ఛా? అనే విషయంపై నియంత్రిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ను సీఎస్‌ఐఆర్, ఐసీఎంఆర్‌ల సహకారంతో ఆయుష్, ఆరోగ్య, శాస్త్ర,సాంకేతిక శాఖలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మే 7న వెల్లడించారు. అనంతరం కోవిడ్‌పై ఆయుష్ ఔషధాల ప్రభావం, ఆయా ఔషధాల వినియోగం తదితర సమాచారం తెలిపే ‘సంజీవని’ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు.
సాధారణ కోవిడ్ రోగులకు..
ఆయుర్వేద ఔషధాలు యష్టిమధు, గదుచి, పిప్పలి, ఆయుష్ 64ల సమ్మేళనాన్ని సాధారణ కోవిడ్ రోగులకు ఇవ్వడంపైనా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ తెలిపారు. కరోనా తీవ్రంగా ఉండేవారిపై ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియో ఔషధాల ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

భారతీయుల తరలింపునకు వందే భారత్ మిషన్
లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడతగా రెండు విమానాల్లో యూఏఈ నుంచి 363 మంది భారతీయులు మే 7న కేరళకు చేరుకున్నారు. అబుదాబి నుంచి నలుగురు శిశువులు, 177 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోచి విమానాశ్రయానికి చేరుకుంది. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సముద్ర సేతు
లాక్‌డౌన్ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్ సముద్ర సేతు కూడా ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ద్వారా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని జలమార్గ ద్వారా భారత్‌కు తిరిగి తీసుకువస్తారు. ఈ ఆపరేషన్ లో భాగంగా భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ జలాశ్వ మే 7న మాల్దీవులులోని మాలే పోర్టుకు చేరుకుంది. జలాశ్వతో పాటు ఐఎన్‌ఎస్ మగర్‌తో కలిసి మొదటి దశలో భాగంగా 1000 మంది భారత పౌరులను స్వదేశానికి తరలించనున్నారు.


దక్షిణాది రాష్ట్రాల మద్యం వాటా 45 శాతం
ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనే దాదాపు 50 శాతం మద్యం వినియోగిస్తున్నారనీ, పన్నుల ద్వారా ఈ రాష్ట్రాలకు 10 నుంచి 15 శాతం వరకు ఆదాయం వస్తున్నట్టు క్రిజిల్ రిపోర్టు వెల్లడించింది. యావత్ దేశం మద్యం వినియోగంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటా 45 శాతంగా ఉన్నట్టు తెలిపింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 15 శాతం ఆదాయంతో అగ్రభాగాన ఉన్నాయి... కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లు చెరి 11 శాతం, తెలంగాణ 10 శాతం ఆదాయం పొందుతున్నాయని పేర్కొంది. మద్యం ద్వారా వస్తోన్న ఆదాయంలో 12 శాతంతో ఢిల్లీ దేశంలో మూడోస్థానంలో ఉంది. వినియోగంలో మాత్రం జాతీయ స్థాయిలో 4 శాతంగా ఉంది.
తమిళనాడులోనే 13 శాతం..
దేశంలో 13 శాతం మద్యం వినియోగం ఒక్క తమిళనాడులోనే ఉండగా, 12 శాతంతో కర్ణాటక, తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (7 శాతం), తెలంగాణ (6 శాతం), కేరళ (5 శాతం)ఉన్నాయి. 3.3 కోట్ల జనాభా ఉన్న కేరళ మద్యం విక్రయాలపై ఎక్కువ పన్నులతో అత్యధిక ఆదాయాన్ని పొందుతోంది.
12 రాష్ట్రాలు 75 శాతం..
దేశవ్యాప్తంగా ఐదు దక్షిణాది రాష్ట్రాలతో కలిపి, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సహా 12 రాష్ట్రాలు 75 శాతం మద్యాన్ని వినియోగిస్తున్నాయి. ఈ 12 రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసులూ, మరణాలూ 85 శాతానికి పైగా ఉండడం గమనార్హం.
కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ పరిశోధన
ఇండియన కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో కరోనా వ్యాప్తిని కనుగొనేందుకు పరిశోధన చేయనుంది. దీనిలో భాగంగా దేశంలోని 75 జిల్లాలను ఎంచుకొని అందులో కరోనా సోకినా ఎటువంటి లక్షణాలను చూపని వారిపై పరిశోధనలు చేయనుంది. దేశంలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ స్థాయిలో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ పరిశోధనలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల నుంచి జిల్లాలను ఎంచుకొని పరీక్షించనున్నారు. అందులో కరోనా సోకిన వారికి వారి శరీరంలోని యాంటీబాడీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోనున్నారని ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు. ఈ పరిశోధనను త్వరలో ప్రారంభించనున్నారు. అధిక జనాభా, ఎక్కువగా రాకపోకలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోనున్నారు. కరోనా వచ్చిన వారిలో 80 శాతం మంది లక్షణాలను చూపకపోతున్న సంగతి తెలిసిందే.

ధార్‌చులా-లిపులేఖ్ రహదారి ప్రారంభం
ఉత్తరాఖండ్‌లోని ధార్‌చులా-లిపులేఖ్ పాస్‌లను కలుపుతూ 80 కి.మీ. పొడవున, సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో బార్డర్ రోడ్‌‌స ఆర్గనైజేషన్ నిర్మించిన రహదారి ప్రారంభమైంది. ఈ మార్గాన్ని మే 8న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. దీంతో ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి మార్గం ద్వారా కై లాష్ మానస సరోవర్ వెళ్లే వారు ఇక నుంచి 90 కిలో మీటర్ల పర్వతారోహణ ప్రయాణం తగ్గనుంది. రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో ఛీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే పాల్గొన్నారు. ఈ మార్గంతో 90కిలో మీటర్ల మేర పర్వతారోహణను నివారించడంతోపాటు వాహనాల్లో చైనా సరిహద్దుల వరకు వెళ్లే అవకాశముంటుందని బీఆర్వో ఉన్నతాధికాలు వెల్లడించారు.
కై లాష్ మానస సరోవర్ టిబెట్‌లో ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు రెండు మార్గాల ద్వారా (సిక్కింలోని నాథులా పాస్ మార్గం, ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మార్గం) ఈ యాత్రను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా కై లాష్ మానస సరోవర్ యాత్రలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది యాత్రికులు వెళుతుంటారు.

కోవిడ్ కవచ్ ఎలిసా పేరుతో దేశీయంగా మొదటి కిట్
పుణేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దేశీయంగా మొదటి కోవిడ్-19 యాంటీబాడీ టెస్ట్‌కిట్‌ను రూపొందించిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మే 10న తెలిపారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో రూపొందించిన దీనికి ‘కోవిడ్ కవచ్ ఎలిసా’ అని పేరు పెట్టారు. ఇది కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశం కోవి డ్-19పై పోరులో విజయం సాధించబోతోందని మంత్రి పేర్కొన్నారు.
కొత్త కేసులు 3,277
దేశంలో 24 గంటల్లో కరోనా మహమ్మారికి మరో 128 మంది బలికాగా, 3,277 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 62,939కు, మృతుల సంఖ్య 2,109కు చేరిందని మే 10న కేంద్రం తెలిపింది. 19,357 మంది కోలుకున్నారనీ, రికవరీ రేటు 30.75 శాతంగా ఉందని పేర్కొంది.

వెంటిలేటర్ల కొనుగోలుకు రూ. 2 వేల కోట్లు
‘పీఎం కేర్స్’ నిధుల్లో నుంచి రూ. 2 వేల కోట్లను వెంటిలేటర్ల కొనుగోలుకు, వెయి్య కోట్ల రూపాయలను వలస కార్మికుల సంక్షేమం కొరకూ కేటాయిస్తూ పీఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ మే 13న ప్రకటన విడుదల చేసింది. రూ. 100 కోట్లను కరోనా వైరస్‌కు టీకా కనుగొనే ప్రయత్నాలకు సాయంగా అందిస్తామని పేర్కొంది. కరోనాపై పోరు కోసం విరాళాలు కోరుతూ.. ప్రధాని నేతత్వంలో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు సభ్యులుగా మార్చి 28న ఈ ట్రస్ట్ ఏర్పడిన విషయం తెలిసిందే.
కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువ!
ప్రజలు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉన్నట్లు స్వస్తి అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర కర్ణాటక జిల్లాలు, మహారాష్ట్ర, తమిళనాడులోని తూర్పు ప్రాంతపు జిల్లాల్లో వైరస్ ప్రమాదం మధ్యస్తంగా, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లోని అత్యధిక జిల్లాల్లో ఎక్కువగా ఉంది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వైరస్ ప్రమాదం సాపేక్షంగా తక్కువని ఈ అధ్యయనం చెబుతోంది. ఏ ప్రాంతంలో పరిస్థితి తీవ్రం కానుంది? అన్న అంశాలను నిర్ధారించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడనుంది.

తాత్కాలిక ప్రాతిపదికన సైనికుల నియామకం
ఆసక్తి ఉన్న యువకులు, ఇతర యువ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన సైనికులుగా చేర్చుకునే సంచలన ప్రతిపాదనపై ఆర్మీ కసరత్తు చేస్తోంది. యుద్ధ పోరాట దళాలు సహా పలు విభాగాల్లో ఆఫీసర్, ఇతర హోదాల్లో మూడేళ్ల కాలపరిమితితో వారిని చేర్చుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. యువకులకు సైనిక జీవితాన్ని పరిచయం చేయడంతో పాటు సైన్యాన్ని ప్రజలకు దగ్గర చేసే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను రూపొందించారు.
‘ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. రెగ్యులర్ సెలక్షన్‌లాగానే ఉంటుంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 100 మంది అధికారులు, వెయి్యమంది సైనిక సిబ్బందిని ఎంపిక చేసే అవకాశముంది. అయితే, ముందుగా ఈ ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది’ అని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ వెల్లడించారు. ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ లేదా ‘త్రీ ఈయర్ షార్ట్ సర్వీస్’ రిక్రూట్‌మెంట్ కార్యక్రమంలో ఏ వయసు వారిని పరిగణనలోకి తీసుకోవాలి? ఫిట్‌నెస్ స్థాయిలు ఎలా ఉండాలి? తదితర కీలక అంశాలపై కసరత్తు సాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మేఘా చమురు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి
నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గుజరాత్‌లో తలపెట్టిన చమురు, సహజ వాయువు వెలికితీత, గనుల అభివృద్ధి, ఉత్పత్తి ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. పటాన్, మెహసానా జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ఉంది. కాగా, గుజరాత్, అస్సాంలో కంపెనీ రెండు మెగా ఆఫ్‌షోర్ ఆయిల్ ఫీల్‌‌డస్‌ను 2018లో దక్కించుకుంది.
కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనుసరించతగిన వ్యూహాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 30న సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పలు కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

మే 17దాకా లాక్‌డౌన్ కొనసాగింపు
ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు కొనసాగించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మూడో దశ లాక్‌డౌన్ పరిమిత స్థాయిలో, పలు మినహాయింపులతో ఉంటుందని మే 1న ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాలపాటు (17 దాకా) దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై, మెట్రో, విమాన, రైల్వే సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు
కరోనా వైరస్ వ్యాప్తి ఆధారంగా దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా పేర్కొంటూ మే 1న కేంద్ర ఆరోగ్య శాఖ జాబితా విడుదల చేసింది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న 130 జిల్లాలను రెడ్ జోన్‌లో, వైరస్ తీవ్రత కొద్దిగా ఉన్న 284 జిల్లాలను ఆరెంజ్ జోన్‌లో, కేసులేవీ నమోదు కాని 319 జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చింది. మే 3 తరువాత వారం పాటు ఈ జాబితా అమల్లో ఉంటుంది. తదనుగుణంగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

కరోనా యోధులకు త్రివిధ దళాల సంఘీభావం
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు మే 3న ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి. ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యుద్ధ విమానాలను గాల్లోకి పంపడంతోపాటు(ఫ్లై-పాస్‌‌టస్) ఆసుపత్రులపై పూల జల్లు కురిపిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్(సీడీఎస్) బిపిన్ రావత్ మే 1న వెల్లడించారు. ఆయన మే 1న త్రివిధ దళాల అధిపతులు ఎం.ఎం.నరవణే, కరంబీర్‌సింగ్, ఆర్.కె.ఎస్.బదౌరియాతో కలిసి మీడియాతో మాట్లాడారు.దేశ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే ఆయన తొలి మీడియా సమావేశం.

పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు
పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరికలకు కొత్త వాటిని చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మే 4న ఆదేశాలు జారీ చేసింది. 2020, సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత తయారైన, దిగుమతి చేసుకున్న, ప్యాక్ అయిన పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై మొదటి సెట్ హెచ్చరికలను, రెండో సెట్ హెచ్చరికలను 2021, సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ముద్రించాలి. వీటి తయారీ, సరఫరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించే వారు ఈ హెచ్చరికలను ప్యాకేజీలపై ముద్రించాలంటూ సవరించిన ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలను ప్రభుత్వం నోటిఫికేషన్‌లో వివరించింది. వీటిని అతిక్రమించిన వారికి చట్ట ప్రకారం జైలుశిక్ష, జరిమానా ఉంటాయి.
ముద్రించాల్సిన హెచ్చరికలు: ‘పొగాకు వాడకంతో దేశంలో ఏటా 12 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో 50 శాతం పొగాకు వల్లే సంభవిస్తున్నాయి. నోటి క్యాన్సర్లలో 90 శాతం పొగాకుతో సంబంధం ఉన్నవే’. ఈ హెచ్చరికలతో కూడిన రెండు చిత్రాలను 12 నెలలకు ఒకటి చొప్పున అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపైన ముద్రించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అన్ని వీసాలపై తాత్కలిక నిషేధం
అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యేవరకు విదేశీయులకు ఇచ్చిన అన్ని వీసాలపై భారత ప్రభుత్వం మే 5న తాత్కలిక నిషేధం విధించింది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల వీసాల గడువును మాత్రం ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పొడిగించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలను భారత ప్రభుత్వం అనుమతించిన తరువాత నెల రోజుల పాటు వారి వీసాలు చెల్లుబాటులో ఉంటాయని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ‘దౌత్య, అధికారిక, ఐరాస సంస్థలకు సంబంధించిన వీసాలు మినహాయించి విదేశీయులకు జారీ చేసిన అన్ని వీసాలు భారత ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసేంతవరకు చెల్లుబాటు కావు’అని ప్రకటించింది. ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారుల మల్టిపుల్ ఎంట్రీ వీసాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగినంత కాలం చెల్లుబాటు కావు. ఇప్పటికే భారత్‌లో ఉన్న ఓసీఐ కార్డుదారులు వారు కోరుకున్నంతకాలం ఇక్కడ ఉండొచ్చని తెలిపింది.
విదేశాల నుంచి భారతీయుల తరలింపు
అమెరికా, బ్రిటన్, యూఏఈ సహా 12 దేశాల్లో చిక్కుకుపోయిన వారిలో తొలి విడతగా.. సుమారు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా మే 7 నుంచి 13 వరకు 64 ప్రత్యేక విమానాలను నడపనుంది. ప్రై వేటు విమానయాన సంస్థలను ఆ తరువాత అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి మే 5న వెల్లడించారు. దశలవారీగా సుమారు 2 లక్షల మందిని భారత్‌కు తీసుకురానున్నామన్నారు.

టీకా అభివృద్ధిపై ప్రధాని మోదీ సమీక్ష
దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ పరిశోధన, పరీక్షల విషయంలో జరుగుతున్న పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 5న సమీక్ష జరిపారు. విద్యావేత్తలు, ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థల నిపుణులతో వ్యాక్సిన్ అభివద్దిపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘సంక్షోభ సమయాల్లో సుసాధ్యమైన విషయాలే రోజువారీ జీవనంలోనూ భాగంగా మారాలి’అని ఆయన అన్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రామిక్ స్పెషల్ రైళ్ళకు మార్గదర్శకాలు
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళను కేంద్రం నడుపుతోంది. శ్రామిక్ స్పెషల్ రైళ్ళలో ప్రయాణికుల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలని, ఇబ్బందులు, గొడవలు లాంటి సమస్యలు ఉత్పన్నం అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జోనల్ రైల్వేలకు భారతీయ రైల్వే శాఖ మే 5న మార్గదర్శకాలు విడుదల చేసింది.
సుప్రీంకోర్టులో రెంట్ పిటిషన్ తిరస్కరణ
ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను లాయర్ పవన్ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు.


సర్ఫేసీ చట్టం పరిధిలోకి సహకార బ్యాంకులు
సర్ఫేసీ చట్టం (సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్టక్ష్రన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ యాక్ట్ 2002) పరిధిలోకి సహకార బ్యాంకులూ వస్తాయని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మే 5న కీలక తీర్పును ఇచ్చింది. బడా రుణ బకాయిల వసూళ్ల ప్రక్రియకు బ్యాంకింగ్ సర్ఫేసీ చట్టాన్ని వినియోగిస్తుంది. ‘‘సర్ఫేసీ చట్టం సెక్షన్ 2(1)(సీ)ని అనుసరించి సహకార బ్యాంకులు కూడా ‘‘బ్యాంకులే’’. ఈ చట్టంలోని 13వ సెక్షన్ కింద వాణిజ్య బ్యాంకులు చేపట్టే రుణ రికవరీ ప్రక్రియ సహకార బ్యాంకులకూ వర్తిస్తుంది’’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్, ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన అత్యున్నత స్థాయి ధర్మాసనం స్పష్టం చేసింది.
పార్లమెంటుకు అధికారం..
సహకార బ్యాంకులను సర్ఫేసీ యాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చే అధికారం పార్లమెంటుకు ఉంటుందని కోర్టు ఉద్ఘాటించింది. 1965, బ్యాంకింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ సహకార బ్యాంకులకు వర్తిస్తుందని పేర్కొంటూ రాష్ట్రాల నిర్దిష్ట చట్టాల పరిధిలోనూ ఇవి పనిచేస్తాయి కాబట్టి, వీటిపై ద్వంద్వ నియంత్రణ ఉంటుందని తెలిపింది.
ప్లాస్మా ట్రయల్స్‌పై 21 సంస్థలకు అనుమతి
కోవిడ్ నుంచి కాపాడేందుకు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్‌కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) దేశంలోని 21 సంస్థలకు అనుమతినిచ్చింది. థెరపీ ద్వారా కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని యాంటీబాడీస్‌ని సేకరించి, వాటిని కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల కోవిడ్‌ని ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు 111 సంస్థలు ఆసక్తి చూపగా, 21 సంస్థలకే అనుమతి లభించింది. ఐసీఎంఆర్ అనుమతి పొందిన వాటిలో తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ ఉంది.
ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) మే 6న నోటి ఫికేషన్ జారీ చేశారు. ఈ తరహా శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా, భారత్‌లోనే విసృతంగా అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.


పీఎం కేర్స్ కు సాయుధ దళాల భారీ సాయం
పదిహేను లక్షల మంది సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగస్తులు, అధికారులు రానున్న 11 నెలల పాటు ప్రతినెలా ఒకరోజు వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి(పీఎం కేర్స్)కి స్వచ్ఛందంగా ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రూ. 5,500 కోట్లు ప్రధాని సహాయనిధికి జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పీఎం కేర్స్‌కి సిబ్బంది వేతనాలనుంచి ఇచ్చే విరాళం మే 2020నుంచి ప్రారంభమై మార్చి 2021 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

పటిష్ఠంగా వందే భారత్ మిషన్’ అమలు
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఉద్దేశించిన ‘వందే భారత్ మిషన్’ అమలుపై విదేశాంగ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా మే 6న వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన్య కార్యదర్శులతో(సీఎస్‌లు) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తయారీ, ఎగుమతి కేంద్రంగా భారత్
కీలకమైన రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత్‌ను అంతర్జాతీయ తయారీ, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు ప్యాకేజీ రూపకల్పన జరుగుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. ‘కరోనా వైరస్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు’ అనే అంశంపై ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మొబిలిటీ, జీనోమిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, ఫిన్‌టెక్, తయారీ అన్నవి ప్రాధాన్య క్రమంలో వేగంగా విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసే రంగాలుగా పేర్కొన్నారు.
 
మే 2020 రాష్ట్రీయం
 
తెలంగాణలో రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల
రూ. 25 వేల లోపున్న రైతు రుణాలను తెలంగాణ ఆర్థిక శాఖ ఏకమొత్తంగా మాఫీ చేస్తూ రూ.1,200 కోట్లు విడుదల చేసింది. 6.10 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 7న అరణ్యభవన్‌లో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి వెనువెంటనే రుణ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రూ.25 వేల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణచెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.
రైతుబంధుకు రూ.7వేల కోట్లు
2020 ఏడాది వానాకాలం పంటకు రైతుబంధు సాయంపైనా మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్‌లో వానాకాల పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు.

విశాఖ ఘటన మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ సంఘటన దురదష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన మే 7న పరామర్శించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ ఘటన కారణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థికసాయం అందచేస్తాం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు అందజేస్తాం. జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటాం. రెండు మూడు రోజులు వైద్యం అవసరమైన వారికి రూ.లక్ష, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం అందిస్తాం. ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాం అని ప్రకటించారు.
విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7న వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై ంది. స్థానికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. లీకై న స్టైరీన్ మోనోమర్ గ్యాస్ కారణంగా అందరికీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విషవాయువు పీల్చి మే 7నాటికి 10 మంది మతి చెందగా... 348 మంతి ఆస్పత్రి పాలయ్యారు.
నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం
తమిళనాడులోని ప్రఖ్యాత నైవేలీ లిగ్నైట్ కొర్పొరేషన్(ఎన్‌ఎల్‌సీ) ప్లాంటులో భారీ ప్రమాదం సంభవించింది. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్‌లో మే 7న ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో విష వాయువు లీకేజీ
లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉన్న కాగితం తయారీ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే క్రమంలో విషవాయువు లీక్ అయి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా టెట్లా గ్రామానికి సమీపంలోని శక్తి పేపర్ మిల్‌లో ఈ ఘటన జరిగింది.
గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై విచారణకు హైపవర్ కమిటీ
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫార్సులు చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మే 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి.
నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వం...
అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు.

కరోనా కట్టడికి తెలంగాణకు నాస్కామ్ సహకారం
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నాలజీ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసినట్టు మే 11న తెలిపింది. సాంకేతిక నిపుణుల సూచనలను ఆధారంగా చేసుకుని లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేయండతోపాటు కోవిడ్-19ను పటిష్టంగా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిజ్ఞానం దోహదం చేయనుంది. ప్లాట్‌ఫాంలో భాగంగా కోవిడ్-19 ఇండియా వల్నరేబిలిటీ మ్యాప్‌ను రూపొందించారు. ఇది ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సమాచారాన్ని రియల్ టైంలో అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ టాస్క్‌ఫోర్స్ భాగస్వామ్యం కుదుర్చుకుందని, సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కోవిడ్ ప్లాట్‌ఫాంను రూపొందించినందుకు ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

శ్రీశెలం జలాలపై కొత్త ప్రాజెక్టు చట్టానికి వ్యతిరేకం
శ్రీశెలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని మే 11న ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, జీఓ కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
కరోనా, లాక్‌డౌన్‌లతో దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సాయం అందించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. తమ రాష్ట్రాల్లో జోన్‌లను నిర్ధారించే అధికారం తమకే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై మే 11న ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలను తెల్సుకున్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు.

మైక్రోమాక్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ
కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే మెకానికల్ వెంటిలేటర్ల తయారీ కోసం భగవతి ప్రొడక్‌‌టస్ లిమిటెడ్ (మైక్రోమాక్స్)తో తెలంగాణ ప్రభుత్వం మే 12న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ’ఈ సిటీ’లోని తమ యూనిట్లో మెకానికల్ వెంటిలేటర్లను మైక్రోమాక్స్ తయారు చేయనుంది. తక్కువ ధరలో తయారయ్యే ఈ మెకానికల్ వెంటిలేటర్‌ను హైదరాబాద్‌కు చెందిన పలు హార్డ్‌వేర్ స్టార్టప్‌లు, వాణిజ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దీన్ని రూపొందించిన క్వాల్కామ్, హనీవెల్, స్పెక్టోక్రెమ్ ఇన్‌స్టుమ్రెంట్స్, ఎన్ టెస్లా, ఆల్తాన్, త్రిశూల, కన్వెర్షన్ వంటి సంస్థలు వైద్య నిపుణులకు ఉపకరించే మరిన్ని ఫీచర్లను మెకానికల్ వెంటిలేటర్లలో చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మైక్రో మాక్స్‌తో ఒప్పందం ద్వారా అతి తక్కువ సమయంలో అత్యుత్తమ వెంటిలేటర్ల తయారీకి అవకాశం ఏర్పడిందని టీ వర్‌‌కస్ సీఈవో సుజయ్ కారంపురి తెలిపారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
శ్రీశెలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వినియోగిస్తూ పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 పూర్తిగా అక్రమమని తెలంగాణ ప్రభుత్వం కష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సహా ఎలాంటి ముందడుగు వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మే 12న నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.

విద్యుత్ చట్టం సవరణల బిల్లు ప్రకటన
విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. అలాగే విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లెసైన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది. దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడాలని మరో నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన సంస్కరణల అమలు కోసం కేంద్ర విద్యుత్ చట్టం- 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై జూన్ 5లోగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.

కరోనా ల్యాబ్ నుంచే వచ్చింది: కేంద్ర మంత్రి గడ్కరీ
కరోనా వైరస్ పుట్టకకు సంబంధించి కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మే 13న కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సహాజ సిద్దమైన వైరస్ కాదని.. అది ల్యాబ్ నుంచి పుట్టకొచ్చిందని వ్యాఖ్యానించారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తేనే కరోనా భయాన్ని అంతం చేసి, సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.


సుప్రీంకోర్టులో ఏకసభ్య ధర్మాసనాలు
సుప్రీంకోర్టులో తొలిసారి మూడు ఏకసభ్య ధర్మాసనాలు ఒకేరోజు 20 చొప్పున కేసులను విచారించి తీర్పులిచ్చాయి. మే 13న జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ రవింద్ర భట్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లు వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణలు జరిపారు. ఒక్కొక్కరు సుమారు 20 ట్రాన్స్ ఫర్ పిటిషన్ల(కేసుల విచారణను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు మార్చాలనే వినతి)ను విచారించి, తదనుగుణంగా ఉత్తర్వులిచ్చారు. కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు 2020, సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు రూల్స్ బుక్‌లోని పలు నిబంధనలను మార్చింది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సంబంధించిన ముందస్తు బెయిల్ కేసులను ఏకసభ్య ధర్మాసనాలు విచారించవచ్చని పేర్కొంది.

ఏపీ లోకాయుక్తకు ప్రధాన న్యాయమూర్తితో సమాన హోదా
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమాన హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ఉత్తర్వులు జారీ చేసింది. ‘జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పూర్తి స్థాయి అధికారిగా వ్యవహరిస్తారు. ఆయనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమాన హోదా ఉంటుంది’’ అని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ
కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కేంద్రం ఆదుకుంటే తప్ప పరిశ్రమలు తిరిగి పుంజుకునే అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ తయారీ రంగం ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు గణనీయమైన భాగస్వామ్యం ఉందని, రాష్ట్రంలో పరిశ్రమల రంగం నిలదొక్కుకోవడానికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ఏప్రిల్ 30న ఆయన లేఖ రాశారు. ఏ రంగాల్లో సహకారం కోరుతున్నది లేఖలో వివరించారు.
దారిద్య్రంలోకి పది కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల్లో దాదాపు పది కోట్ల మంది ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రక్షిత మంచినీరు, సరైన మురికి పారుదల వ్యవస్థ లేకుండా అనారోగ్యానికి గురవుతున్న వారి పరిస్థితి మరింత దుర్భరం అవుతుందని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ డెరైక్టర్ సమేహ్ వాహ్‌బా తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల మురికి వాడల నుంచి వచ్చే పన్ను వసూళ్లు కూడా 15 నుంచి 25 శాతానికి పడి పోతాయి కనుక ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం పట్టణ కార్పొరేషన్లకు ఉండే అవకాశం కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


విశాఖ ఎల్‌జీ పాలిమర్స్లో భారీ ప్రమాదం
విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో మే 7న భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి పీవీసీ గ్యాస్ లేక స్టెరిన్ గ్యాస్ లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటి వరకు 9మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
లీకై న గ్యాస్ చాలా ప్రమాదకరం
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీనుంచి లీకై న గ్యాస్‌ను పీవీసీ గ్యాస్ లేక స్టైరీన్ మోనోమర్ అంటారు. సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, డిస్పోసబుల్ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్..ఇలా పలు ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. స్టెరిన్ గ్యాస్‌కు రంగు వుండదు. తీయటి వాసన వుంటుంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు దాని ప్రభావం వుంటుంది. లీకై న క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వెంటనే బాధితుడికి చికిత్స అందకపోతే ప్రాణాలను కూడా పోతాయి. గ్యాస్‌ను పీల్చగానే క్షణాల్లో చర్మంపై దద్దుర్లు పుడతాయి. కంటిచూపుపై ప్రభావం చూపిస్తుంది. తలనొప్పి, కడుపులో వికారానికి దారి తీస్తుంది. శ్వాస పీల్చుకోవడం కష్టమై.. బాధితుడు ఉక్కిరిబిక్కిరై పోతాడు. స్టెరిన్ గ్యాస్ పశు పక్ష్యాదులపై సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గ్యాస్ లీకై న ప్రాంతంలో చెట్లు కూడా నల్లగా మారిపోతాయని నిపుణులు పేర్కొన్నారు.


రాయలసీమ కరువు నివారణ ప్రణాళికకు అనుమతి
కష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లోనే ప్రవాహాన్ని ఒడిసి పట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా సామర్థ్యం పెంపు పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మే 5న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు వివిధ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు ఉన్నాయి. వీటిని అయిదు విడివిడి ప్రాజెక్టు పనులుగా చేపట్టనున్నారు.

మే 2020 ఎకానమీ
 
విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌తో రిలయన్స్ జియో జట్టు
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌తో జట్టు కట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ. 11,367 కోట్లు. దీంతో మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించినట్లయింది. ఈ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఇప్పటికే రూ. 43,574 కోట్లతో 9.99 శాతం, మరో టెక్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సిల్వర్ లేక్ రూ. 5,666 కోట్లతో 1.15 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది.

మూడు డీల్స్‌లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్

: రూ. 60,596 కోట్లు

ఫేస్‌బుక్ పెట్టుబడి (9.99 శాతం వాటా)

: రూ. 43,574 కోట్లు

విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ (2.32 శాతంవాటా)

: రూ. 11,367కోట్లు

సిల్వర్ లేక్ పెట్టుబడి (1.15 శాతం వాటా)

: రూ. 5,666 కోట్లు

జియో ఎంటర్‌ప్రైజ్ విలువ

: రూ. 5.16 లక్షల కోట్లు


విస్టా సహ వ్యవస్థాపకుడు మనోడే..
అమెరికాకు చెందిన ప్రై వేట్ ఈక్విటీ దిగ్గజం విస్టా ప్రధానంగా సాఫ్ట్‌వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దాదాపు 57 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం విస్టా పోర్ట్‌ఫోలియోలో భారత కంపెనీల్లో సుమారు 13,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్‌కి భారతీయ మూలాలు ఉన్నాయి. ముకేశ్ అంబానీలాగే ఆయన తండ్రి కూడా గుజరాత్‌కు చెందినవారు.

కరోనాతో కేంద్రం ప్రభుత్వంపై మరింత రుణ భారం
కేంద్ర ప్రభుత్వ రుణాలపైనా కోవిడ్-19 భారం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మధ్య తన స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్ర ప్రభుత్వం మే 8న గణనీయంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. నిజానికి తొలి అంచనా రూ.7.8 లక్షల కోట్లు. అంటే రుణ సమీకరణ అంచనా 4.2 లక్షల కోట్లు పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావం నేపథ్యంలో తగ్గుతుందని భావిస్తున్న తన ఆదాయాన్ని పూడ్చుకునే క్రమంలో రుణ సమీకరణ అంచనాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. వారం వారీ రుణ సమీకరణ లక్ష్యాన్ని కూడా రూ.21,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లక్ష్యాన్ని (ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం)కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది. తన ఆదాయం-వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మార్కెట్ రుణాలను ఒక సాధనంగా ఎంచుకునే సంగతి తెలిసిందే. 2019-20లో మార్కెట్ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లుగా ఉంది.

ఆత్మ నిర్భర్ పేరుతో 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ
కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని మే 12న ప్రధాని మోదీ ప్రకటించారు. వైరస్ కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఈ ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు.
జీడీపీలో దాదాపు 10 శాతం..
భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10 శాతం అని ప్రధాని వెల్లడించారు. ఆర్బీఐ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది రూ. 20 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా (చట్టం).. వీటిపై ప్రధానంగా ఈ ప్యాకేజీలో దష్టి పెడతామన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజ్ పూర్తి వివరాలను రానున్న రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడిస్తారని చెప్పారు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అనుకోకుండానే స్వయం సమద్ధి దిశగా ముందడుగు వేశామన్నారు.
మూడో సారి ప్రసంగం..
దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మే 12న దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మారిన పరిస్థితులను, కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి టీవీ మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించడం ఇది మూడో సారి.

భారత్‌కు ఎన్‌డీబీ నుంచి బిలియన్ డాలర్ల రుణం
కరోనాపై పోరులో భారత్‌కు ఆర్థికంగా బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) అండగా నిలిచింది. ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రొగ్రామ్ ద్వారా భారత్‌కు 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ.7,500 కోట్లు)రుణ సహాయం అందించినట్లు ఎన్‌డీబీ మే 13న వెల్లడించింది. వైరస్ విజంభణ వల్ల కలిగిన సామాజిక, ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఈ రుణం దోహదపడనుంది. కరోనా కారణంగా బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు ఆర్థికంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు ఆర్థిక సహాయం అందించాలని ఎన్‌డీబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత్‌కు తక్షణ సహాయంగా బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు 2020, ఏప్రిల్ 30న ఎన్‌డీబీ డెరైక్టర్లు అంగీకరించారు.
బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అయిన ఎన్‌డీబీని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి. అభివద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థిరమైన అభివద్ధి ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించడం వంటి లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది.

భారత్‌కు అమెరికా 3.6 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం
కోవిడ్ మహమ్మారిపై భారత్ చేస్తోన్న పోరాటానికి 3.6 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేసేందుకు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అంగీకరించింది. తొలి విడత నిధులను కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్(ఐపీసీ) కేంద్రాలను అభివృద్ధిపరచడం కోసం, కోవిడ్ కేసులను గుర్తించేందుకు, ఆసుపత్రి నెట్‌వర్క్‌ని మెరుగుపరిచేందుకు, పర్యవేక్షణ, నిఘా వ్యవస్థల ద్వారా స్థానిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.
చైనాపై అమెరికా ఆంక్షల బిల్లు
కోవిడ్ విచారణకు సంబంధించి చైనాపై ఆంక్షలకు అమెరికా సంసిద్ధమౌతోంది. చైనాలో ప్రబలిన కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని వివరాలను ప్రపంచానికి తెలపాలనీ, లేని పక్షంలో చైనాపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కి అధికారాన్నిచ్చే బిల్లుని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. సెనేటర్ లిండ్ సే గ్రాహం సహా ఎనిమిది మంది సెనేటర్లు రూపొందించిన బిల్లును కాంగ్రెస్ ఎగువసభలో ప్రవేశపెట్టారు.

ఎంఎస్‌ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు
కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ(స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం)కి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 13న వెల్లడించారు.
ఎంఎస్‌ఎంఈలకు రూ. 3 లక్షల కోట్లు
చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది.
ఫండ్ ఆఫ్ ఫండ్స్...
ఎంఎస్‌ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది.
వద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది.
ఎన్‌బీఎఫ్‌సీలకు మొత్తంగా రూ. 75,000 కోట్లు
తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గహ రుణాల సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్‌ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్‌ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది.
టీడీఎస్ రేటు 25 శాతం మేర తగ్గింపు
వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.
మంత్రి తెలిపిన ఇతర వివరాలు..

  • డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి.
  • భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్‌ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్‌ఎంఈల నిర్వచనం సవరణ. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.
  • దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది.
  • పీఎఫ్ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు అంటే 2020, ఆగస్టు దాకా కొనసాగింపు.
  • చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి.
  • దాతృత్వ సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్‌షిప్ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్‌‌సను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనుంది.

జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్టర్‌గా సిల్వర్ లేక్
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ బాటలో సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ సంస్థ.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.15 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం రూ. 5,655.75 కోట్లు వెచ్చిస్తోంది. ‘ తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.90 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రై జ్ విలువ రూ. 5.15 లక్షల కోట్లుగాను ఉంటుంది‘ అని జియో ప్లాట్‌ఫామ్స్ మే 4న తెలిపింది. టెలికం కార్యకలాపాలు సహా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి జియో ప్లాట్‌ఫామ్స్ కింద రిలయన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సిల్వర్ లేక్ కథ ఇదీ..
భారీ టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడంలో సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని నిర్వహణలోని ఆస్తులు, పెట్టుబడుల పరిమాణం 40 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, ఆల్ఫాబెట్‌లో భాగమైన వెరిలీ.. వేమో విభాగాల్లో, డెల్ టెక్నాలజీస్, ట్విటర్ తదితర గ్లోబల్ దిగ్గజ సంస్థల్లో ఇది ఇన్వెస్ట్ చేసింది. భారత్‌లో సిల్వర్‌లేక్ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం.


స్టవ్ క్రాఫ్ట్ ఐపీఓకు సెబీ ఆమోదం
పిజియన్, గిల్మా బ్రాండ్ల కింద కిచెన్ అప్లఝెన్సెస్ తయారు చేసి విక్రయించే స్టవ్ క్రాఫ్ట్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.145 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు 71.6 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోనుంది.

27.11 శాతంగా నిరుద్యోగ రేటు: సీఎంఐఈ
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరుద్యోగ రేటు మే 3వ తేదీతో ముగిసిన వారంలో 27.11 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) అనే సంస్థ మే 5న వెల్లడించింది. మార్చిలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చకముందు నిరుద్యోగ రేటు 7 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. నిరుద్యోగ రేటు పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని, కరోనా కారణంగా రెడ్ జోన్లు పట్టణాల్లో ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 29.22 శాతంగాను, గ్రామీణ ప్రాంతాల్లో 26.69 శాతంగాను ఉన్నట్టు తెలిపింది.
అత్యధికంగా పుదుచ్చేరిలో..
సీఎంఐఈ డేటా ప్రకారం.. నెలవారీ నిరుద్యోగ రేటు మార్చిలో 8.74 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 23.52 శాతంకి పెరిగిపోయింది. పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8 శాతం, తమిళనాడులో 49.8 శాతం, జార్ఖండ్‌లో 47.1 శాతం, బిహార్‌లో 46.6 శాతం, మహారాష్ట్రలో 20.9 శాతం, హరియాణాలో 43.2 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 21.5 శాతం, కర్ణాటకలో 29.8 శాతంగా ఉన్నట్టు గణాంకాలను వెల్లడించింది.

మే 2020 ద్వైపాక్షిక సంబంధాలు
 
పీవోకే ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లలో మే 5 తేదీ నుంచి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వాతావరణ సూచనలు జారీ చేయడం ప్రారంభించింది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌లోని ప్రాంతీయ వాతావరణ విభాగం (ఆర్‌ఎండీ) హెడ్ కుల్‌దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎండీ డెరైక్టర్ జనరల్ ఎమ్.మహపాత్ర స్పష్టం చేస్తూ, ఆ ప్రాంతాలను జమ్మూకశ్మీర్ సబ్ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఆదేశాలను తోసిపుచ్చిన భారత ప్రభుత్వం.. అవి తమభూభాగాలే అని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని స్పష్టం చేసింది.

ఇండో-చైనా సరిహద్దులో ఉద్రిక్తత
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు మే 10న వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ సిద్ధం : ఆర్మీ చీఫ్
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్-ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు.

లిపూలేఖ్ రహదారిపై నేపాల్ అభ్యంతరం
లిపూలేఖ్ ప్రాంతంలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... తమ దేశంలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వట్రాకు మే 11న నోటీసులు జారీ చేసింది. లిపూలేఖ్ తమ ఆధీనంలోని ప్రాంతమని పేర్కొంది. కాగా భారత్- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్ ప్రభుత్వం సదరు ప్రాంతం తమ భూభాగానికి చెందినదే అని భారత్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పందించిన భారత్.. ‘‘లిపూలేఖ్ పూర్తిగా భారత అంతర్భాగం’’అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఈ విషయంపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లిపూలేఖ్ గురించి భారత్‌తో పాటు చైనాతో కూడా చర్చించాల్సి ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి తెలిపారు.

సరిహద్దుల్లో చైనా మిలటరీ హెలికాప్టర్లు

భారత్, చైనాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ ప్రాంతంలో చైనాకు చెందిన మిలటరీ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం, సరిహద్దులు గుర్తించని ప్రాంతాలకు అతి దగ్గరగా ఎగరడం ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో భారత సుఖోయ్-30 రకం విమానాలు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఇటీవలే పాంగాంగ్ సరస్సు వద్ద భారత్, చైనా దేశాలకు చెందిన సుమారు 250 మంది సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.

రక్తసిక్తమైన అఫ్గాన్

అఫ్గానిస్తాన్‌లో మే 12న కాబూల్ సహా మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 36 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని దస్తీబర్చీలో ఓ ప్రసూతి ఆస్పత్రిలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు.

వూహాన్‌లో అందరికీ పరీక్షలు

చైనాలోని వూహాన్‌లో నెల రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనానిర్ధారణ పరీక్షలు చేయనుంది. 1.1కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది.

అమెరికాలో రోగులకు భారత్ మందులు
అమెరికాలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు భారత్ పంపించిన యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ను ఇస్తున్నట్టుగా మెడికల్ పబ్లికేషన్ ఎండెడ్‌‌జ మే 2న వెల్లడించింది. అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటైన కనెక్టికట్‌లో క్లోరోక్విన్ ఔషధాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కరోనాపై పోరాటంలో క్లోరోక్విన్ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో మరణాలు లక్షలోపు ఉండవచ్చునని ట్రంప్ అంచనా వేశారు.

రెమిడెస్‌విర్‌కు ఎఫ్‌డీఏ అనుమతి
వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను నియంత్రించడానికి వాడే రెమిడెస్‌విర్ ఔషధాన్ని అత్యవసర సమయాల్లో కోవిడ్ రోగులకు ఇవ్వడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌ను కూడా నియంత్రించడానికి ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.

ఆ అధికారం పాకిస్తాన్‌కు లేదు : భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం మండిపడింది. భారత్‌లో భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని పాక్‌కు స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని, దానిపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ సుప్రీం కోర్టుకు లేవని ఆ దేశ దౌత్యవేత్తకు మే 4న తేల్చిచెప్పింది.
గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా పాక్ ప్రభుత్వం 2018లో ఓ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని సమర్థిస్తూ పాక్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అధికారికంగా పాక్ దౌత్యవేత్తలకు తన నిరసన తెలిపింది. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఇదివరకు ఎన్నికలు ఉండేవి కావు. దాన్ని చట్టబద్ధంగా చేజిక్కించుకోడానికి పాక్ కుటిలబుద్ధితో 2018లో ఓ చట్టం తీసుకురాగా అక్కడి సుప్రీంకోర్టు దానిపై రబ్బరు స్టాంపు వేసింది.
 
మే 2020 సైన్స్ & టెక్నాలజీ
 
కరోనా గబ్బిలంపై దాడి చేయదు: యూఎస్‌ఏఎస్‌కే
మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్, గబ్బిలాలను ఏమీ చేయలేకపోవడంపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచ్వెన్(యూఎస్‌ఏఎస్‌కే), ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు చేసింది. పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విక్రమ్ మిశ్రా వివరించిన ప్రకారం కరోనా వైరస్ గబ్బిలం కణజాలంపై దాడి చేయదు. వాటి రోగ నిరోధక వ్యవస్థకు నష్టం చేయదు. గబ్బిలంలోని కణజాలాలతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంటుంది. గబ్బిలాల్లోని అసాధారణ రోగ నిరోధక శక్తి వైరస్ అలా బంధం ఏర్పర్చుకోవడానికి ఒక కారణం. మెర్స్ వైరస్‌పై పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
కరోనా వైరస్‌కు సంబంధించిన దాదాపు 53 జన్యుక్రమాలను భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి సిద్ధం చేసింది. వీటిని ‘గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ప్లూయెంజా డేటా’ అనే అంతర్జాతీయ జీనోమ్ డేటాబేస్‌కు సమర్పించింది. ఈ వైరస్ గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, సమర్థ టీకా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

యాంటీబాడీల తయారీకి భారత్ బయోటెక్ సిద్ధం
కోవిడ్-19 కారక వైరస్ నియంత్రణకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్‌తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. న్యూమిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కోవిడ్-19 రోగుల నుంచి సేకరించిన యాంటీబాడీలను వద్ధి చేస్తారు. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సెన్సైస్, ఇండోర్‌లోని ఐఐటీతోపాటు గురుగావ్‌లోని ప్రెడోమిక్స్ టెక్నాలజీస్‌లు కూడా ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయం అందిస్తాయి. ఇప్పటికే వైరస్ బారిన పడ్డవారికి చికిత్స కల్పించేందుకు యాంటీబాడీలు ఉపయోగపడతాయని, భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కష్ణ ఎల్లా తెలిపారు.

టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు
కోవిడ్‌కు దేశీయంగానే టీకా రూపొందించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్)తో జట్టు కట్టింది. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ), పుణే పరిశోధనశాలలో వేరు చేయబడిన కరోనా వైరస్‌ను ఉపయోగించి ఈ వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్‌ఐవీ నుంచి హైదరాబాద్‌లోని బీబీఐఎల్‌కు ఈ వైరస్‌ను తరలించాం. టీకా తయారీ, అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేపట్టడం, విశ్లేషించడంలో బీబీఐఎల్-ఎన్‌ఐవీ పరస్పరం సహకరించుకుంటాయి’ అని ఐసీఎంఆర్ తెలిపింది.
సరికొత్త అల్టావ్రయొలెట్ శానిటైజర్
అల్టావ్రయొలెట్ సిస్టంను ఉపయోగించుకొని ఎలక్టాన్రిక్ ఉపకరణాలను, కాగితాన్ని శానిటైజ్ చేసే ఈ పరికరాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీఓ విభాగం నిపుణులు తయారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అల్టావ్రయొలెట్ శానిటైజర్‌గా పిలిచే ఈ పరికరం లోపల మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, కరెన్సీ నోట్లు, చెక్కులు, చలాన్లు, పాసుబుక్కులు ఉంచవచ్చు. అందులోని ప్రత్యేక పరికరం 360 డిగ్రీల్లో యూవీ కిరణాలు ప్రసరింపజేస్తుంది. దీంతో వాటిపై ఉన్న వైరస్ నాశనమవుతుంది. శానిటైజేషన్ పూర్తవ్వగానే ఆటోమేటిగ్గా స్లీప్ మోడ్‌లోకెళుతుంది.

భూమిపై తొలిసారిగా సూపర్ క్రిటికల్ సీవో2 గుర్తింపు
భూమిపై తొలిసారిగా సహజసిద్ధమైన ‘సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆకై ్సడ్’(co2)ను చైనాకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో 1400 మీటర్ల లోతులో రామన్ డిటెక్షన్ ఇన్‌స్టుమ్రెంట్‌తో ఈ సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆకై ్సడ్ ను కనుగొన్నారు. డ్రై క్లీనింగ్, పెట్రోలియం సాల్వెంట్లలో సూపర్ క్రిటికల్ సీవో2ను ఉపయోగిస్తారు. అయితే దీనిని ఇప్పటివరకు సహజసిద్ధ రూపంలో గుర్తించలేదు. జీవం ఆవిర్భావానికి అవసరమైన అమినో ఆమ్లాలు, సేంద్రియ పదార్థాల పరిరక్షణలో సూపర్ క్రిటికల్ కార్బన్ ఆకై ్సడ్ కీలక పాత్ర పోషించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మూడో దశకు కరోనా ఔషధ పరీక్షలు
కరోనా వైరస్ నియంత్రణ ఔషధ తయారీలో గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ కీలకదశకు చేరుకుంది. కరోనా యాంటివైరల్ ట్యాబ్లెట్ ఫావిపిరావిర్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులను పొందింది. దీంతో దేశంలో ఫేజ్-3 అనుమతులు పొందిన తొలి కంపెనీగా గ్లెన్‌మార్క్ నిలిచింది. క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 10 ప్రముఖ ప్రభుత్వ, ప్రై వేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంది. జూలై- ఆగస్టు నెలలో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వస్తాయని కంపెనీ తెలిపింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ 150 మంది కరోనా రోగుల మీద 1:1 నిష్పత్తిలో పరిశోధన ఉంటుంది. చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు, అధ్యయన వ్యవధి గరిష్టంగా 28 రోజులు ఉంటుంది. జపాన్‌కు చెందిన ఫ్యూజిఫిల్మ్ కార్పొరేషన్ అనుబంధ ఫార్మా కంపెనీ ఫ్యూజిఫిల్మ్ తొయోమా కెమికల్ కో లిమిటెడ్ అభివృద్ధి చేసిన అవిగాన్ మందుకు జనరిక్ వర్షనే ఈ ఫావిపిరావిర్ ట్యాబ్లెట్.


తొలి అంతరిక్ష హెలికాప్టర్ ఇంజెన్యూటీ
అరుణగ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్‌కు భారత సంతతికి చెందిన పదిహేడేళ్ళ బాలిక వనీజా రూపానీ సూచించిన పేరు ఇంజెన్యూటీను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సెలక్ట్‌చేసింది. ఈ హెలికాప్టర్ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ఏప్రిల్ 30న ట్వీట్ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను 2020, జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. అరుణగ్రహంపైకి పంపించేందుకు రూపొందించిన హెలికాఫ్టర్‌కు పేరును సూచించాల్సిందిగా నాసా ‘‘నేమ్ ది రోవర్’’ పేరిట పోటీని నిర్వహించగా.. 28వేల ఎంట్రీలు వచ్చాయి. అందులో వనీజా రూపానీ సూచించిన పేరు ఎంపికై ంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రంపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్ రూపానీ చెప్పారు.

ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్ పొర
హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్‌ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది.

ఎవరెస్ట్ పర్వతంపైనా 5జీ సిగ్నల్
ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సిగ్నల్ లభించనుంది. టిబెట్ చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుందని చైనా తెలిపింది. ప్రస్తుతం 5,800 మీటర్ల వరకు బేస్ క్యాంప్ లు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్ స్టేషన్ లో పనులు ప్రారంభం కావడంతో శిఖరంపై వరకు 5జీ అందుబాటులోకి వచ్చింది.
చైనాకు పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీగా డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్ దాటికి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై విమర్శల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత తీవ్రతరం చేశారు. చైనాకు పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీగా డబ్ల్యూహెచ్‌వో వ్యవహరిస్తోందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలన్నారు. మే 1న వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకుండా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణభూతమైన డబ్ల్యూహెచ్‌ఒని క్షమించకూడదని అన్నారు. అమెరికా ఏడాదికి 50 కోట్ల డాలర్లు ఇస్తే, చైనా వారికి 3.8 కోట్ల డాలర్ల నిధులు ఇస్తోందని అయినప్పటికీ ఆ సంస్థ చైనాకు పీఆర్‌గా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే అమెరికా డబ్ల్యూహెచ్‌వోకి నిధులు నిలిపివేసింది.
చైనాలో జరుగుతున్న పరిశోధనలు
కరోనా వైరస్ ఎలా బయటపడిందన్న అంశంపై చైనాలో కూడా విస్తతంగా పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. చైనా వెట్ మార్కెట్ నుంచే వచ్చిన ఈ వైరస్ ఎలా మనుషులకు సంక్రమించిందో జరుగుతున్న పరిశోధనల్లో భాగస్వామ్యం కావడానికి చైనా ప్రభుత్వం తమను ఆహ్వానిస్తుందని ఆశించినట్టు డబ్ల్యూహెచ్‌వో అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:

భారత్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ
పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల్లో ఒకటైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉనికి భారత్‌లో బయటపడింది. భోపాల్‌లోని ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) సంస్థ అసోం పందుల్లో ఈ ఆఫ్రికా స్వైన్ ప్లూ వైరస్‌ని గుర్తించింది. అసోంలో ఈ వ్యాధి బారిన పడి ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో దాదాపు 2,500 వరాహాలు మృత్యువాతపడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకుగాను పందులను సామూహికంగా చంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ.. తాము ఆ పని చేయబోమని పేర్కొంది. ప్రత్యామ్నాయ విధానాల్లో వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మానవులపై ప్రభావం చూపదని.. వ్యాధి ఉనికి లేని ప్రాంతాల్లో పంది మాంసాన్ని తినొచ్చునని స్పష్టం చేసింది.
ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అంటే : ఇదో రకమైన జ్వరం తెప్పించే వైరస్. ఇది మనుషులకు సోకదు. ఇప్పటివరకు మనుషులకు వచ్చే స్వైన్ ఫ్లూ... అసోంలో రాలేదు. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ పందులకు వచ్చిందంటే... పంది చచ్చేదాకా వదలదు. వారం లోపే చంపేస్తుంది. ఆఫ్రికా సహారా ఎడారిలో ఈ వైరస్ తరచూ పందులకు వస్తూనే ఉంటోంది. యూరప్ నుంచి ఆఫ్రికాకు తొలిసారిగా వచ్చిన వారు... తమతో పందుల్ని తెచ్చుకున్నారు. వాటి ద్వారా ఇది ఆఫ్రికాకు పాకిందని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ వైరస్ యూరప్ కంటే ఆఫ్రికాలోనే ఎక్కువగా వస్తోంది.

అంతరిక్షంలోకి చైనా లాంగ్ మార్చ్ రాకెట్
మానవసహిత అంతరిక్ష యాత్రలో భాగంగా రూపొందించిన ‘లాంగ్ మార్చ్-5బీ’ రాకెట్‌ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి మే 5న ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. భూకక్ష్యలోకి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. భూకక్ష్యలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్నది చైనా లక్ష్యం. ఎల్‌ఎం5 సిరీస్‌లో నాలుగవ వేరియంట్ అయిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సుమారు 53.7 మీటర్ల పొడువు ఉంది. మొత్తం 10 మెయిన్ ఇంజిన్లు కలిగి ఉంది.

కరోనా నిర్ధారణకు ఇమ్యూన్ రేస్ పేరుతో అధ్యయనం
కోవిడ్-19 నిర్ధారణకు మరింత మెరుగైన పరీక్ష విధానానికి మైక్రోసాఫ్ట్, అడాప్టివ్ బయోటెక్నాలజీస్ సంస్థలు ‘ఇమ్యూన్ రేస్’ పేరిట అధ్యయనాన్ని ప్రారంభించాయి. ఈ అధ్యయనం ద్వారా మనుషుల్లో కరోనా వైరస్ ఎలా స్పందిస్తుందనేది కచ్చితంగా తేల్చనున్నారు. అమెరికాలోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో 18-89 ఏళ్ల వయసున్న వెయి్య మందిని ఎంపిక చేసి ఈ ‘వర్చువల్ క్లినికల్’ అధ్యయనాన్ని చేపట్టనున్నారు.
రెండు రకాల పరీక్షలు
ప్రస్తుతం కరోనా వైరస్ నిర్ధారణకు రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. పీసీఆర్ పరీక్షలో సంబంధిత వ్యక్తుల గొంతు, ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. అలాగే యాంటీబాడీలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేస్తున్నారు. అయితే... ఈ రెండు విధానాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మూడో పరీక్ష విధానం అవసరమని అడాప్టివ్, మైక్రోసాఫ్ట్‌లు భావించి అధ్యయనం చేస్తున్నాయి.ఈ అధ్యయనంలో పాల్గొనే వారి నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరిస్తారు. రక్తంలో ‘టీ సెల్స్’గా పిలిచే ప్రత్యేక కణాల ఉనికిని పరీక్షిస్తారు.

మే 2020 అవార్డ్స్
 
రాస్‌ టేలర్‌కు రిచర్డ్‌ హ్యాడ్లీ పురస్కారం
న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డు లభించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్‌ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఫలితంగా మూడోసారి రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డును టేలర్‌ గెలుచుకున్నాడు. వరుస రెండు వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్‌ ఫైనల్‌కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్‌.. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్‌ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మ‌రోవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్‌ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.
2006లో కివీస్‌ తరఫున అరంగేట్రం చేసిన టేలర్‌.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు. ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2020, ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్‌. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస​ తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్‌ వెటోరి(112), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(111), బ్రెండన్‌ మెకల్లమ్‌(101)లు టేలర్‌ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్‌ ఆటగాళ్లు.

రామాయణ్ సీరియల్ మరో రికార్డు
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులను ఆనందింపజేయడానికి 1980, 90లలో అమితంగా ఆకట్టుకున్న రామాయణ్, మహాభారత్, శ్రీ కష్ణ వంటి సీరియళ్లను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తుంది. పునఃప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్ సీరియల్ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్‌ను ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్ నిలిచింది. ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విటర్‌లో ఏప్రిల్ 30న అధికారికంగా వెల్లడించింది.
1987లో దూరదర్శన్‌లో మొదటిసారిగా ప్రసారమైన రామాయణ్ సీరియల్‌ను రామానంద సాగర్ దర్శకత్వం వహించారు. సీరియల్‌లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్ తదితరులు నటించారు.

ముగ్గురు భారత జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
ముగ్గురు భారత ఫొటోజర్నలిస్టులను జర్నలిజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం వరించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్నీ ఆనంద్ ఫీచర్ ఫోటోల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో జమ్మూకశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్ని తమ చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకుగానూ వారికి ఈ పురస్కారం దక్కింది. ఈ ముగ్గురు జర్నలిస్టులు ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’లో పనిచేస్తున్నారు. పరిశోధనాత్మక కథనాలు, అంతర్జాతీయ వార్తల విభాగంలో అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులకు పురస్కారం వరించగా.. ఎడిటోరియల్ రైటింగ్‌లో హెరాల్డ్ ప్రెస్‌కు అవార్డు లభించింది.

మే 2020 స్పోర్ట్స్

ప్రపంచ చాంపియన్‌షిప్ తేదీల్లో మార్పు
2021, ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతుందని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మే 1న తెలిపింది. 2020, జూలై-ఆగస్టులలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం జూలై-ఆగస్టుకు వాయిదా పడటంతో బీడబ్ల్యూఎఫ్ తమ మెగా టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు చేసింది.

కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా
2020 ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో... ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2021 ఏడాది జరగాల్సిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌ను 2023కు వాయిదా వేశారు. 2021 టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2021 ఆగస్టు 1 నుంచి 7 వరకు జరగాల్సింది. అయితే టోక్యో ఒలింపిక్స్ దృష్ట్యా కామన్వెల్త్ యూత్ గేమ్స్‌ను రెండేళ్లపాటు వాయిదా వేస్తున్నామని కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ బోర్డు మే 1న ప్రకటించింది.


భారత అథ్లెట్ సందీప్ కుమారిపై నాలుగేళ్ల నిషేధం
డోపింగ్‌లో విఫలమైన భారత డిస్కస్ త్రోయర్ సందీప్ కుమారిపై నాలుగేళ్ల నిషేధం విధించారు. 2018 జూన్‌లో నిర్వహించిన ఇంటర్‌స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సందర్భంగా కుమారి నుంచి సేకరించిన రక్త నమూనాలో నిషిద్ధ ఉతే్ర్పరకం మెటనోలోన్ ఉండడంతో ఆమెపై వేటు వేస్తూ అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) మే 2న నిర్ణయం తీసుకుంది. గువాహటిలో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో కుమారి స్వర్ణ పతకం సాధించింది.

అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్
రీషెడ్యూల్ ప్రకారం 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పష్టం చేశారు. మే 2న ఆన్‌లైన్‌లో నిర్వహించిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ అమల్లోకి వచ్చాకే విశ్వ క్రీడలు నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలతో నెలకొన్న సందిగ్ధతను ఆయన సమావేశంలో దూరం చేశారు.

2022కు వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ వాయిదా
2021 ఏడాది జరగాల్సిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌ను 2022కు వాయిదా వేసినట్లు అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫినా) ప్రకటించింది. జపాన్‌పాన్‌లోని ఫుకౌకాలో 2022, మే 13-29 తేదీల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను 2021, జూలైకి రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జూలైలో జరగాల్సిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌నకు ఒలింపిక్స్ అడ్డంకిగా మారడంతో ఈ పోటీలను తర్వాతి ఏడాదికి వాయిదా వేశారు.
:

ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర పదవీకాలం పొడిగింపు
ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని 2021 ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ మే 6న ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది’ అని క్లబ్ పేర్కొంది. 2019, అక్టోబర్ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్... ఈ పీఠాన్ని అధిష్టించిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా ఘనత సాధించాడు.

మే 2020 వ్యక్తులు

రష్యా ప్రధాని మిషుస్టిన్‌కు కరోనా వైరస్
రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని ఏప్రిల్ 30న ప్రకటించారు. కీలక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చానని వెల్లడించారు. రష్యాలో సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను ప్రధానమంత్రి తీసుకుంటూ అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటారు. మిషుస్తిన్ 2020, ఏడాది జనవరిలోనే రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు రష్యాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా 1073 మంది మృత్యువాతపడ్డారు. ఏప్రిల్ 1న మూడు వేలుగా ఉన్న కేసుల సంఖ్య మే1 నాటికి లక్ష చేరడం ఆందోళన కలిగిస్తోంది.

భారత ఫుట్‌బాల్ దిగ్గజం గోస్వామి ఇక లేరు
భారత విఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు చునీ గోస్వామి కన్నుమూశారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల మాజీ సారథి కోల్‌కతాలో ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. బెంగాల్ ప్రెసిడెన్సీలోని కిశోర్‌గంజ్(ప్రస్తుతం బంగ్లాదేశ్)లో 1938, జనవరి 15న గోస్వామి జన్మించాడు. గోస్వామి సారథ్యంలోని జాతీయ ఫుట్‌బాల్ జట్టు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 1964 ఆసియా కప్‌లో రజతం గెలిచింది. 1956 నుంచి 1964 మధ్య కాలంలో 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్ చేసిన గోస్వామి 1960 రోమ్ ఒలింపిక్స్‌లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించాడు. 1962లో అతను ఆసియా ఉత్తమ స్టైక్రర్ అవార్డు అందుకున్నాడు. భారత ప్రభుత్వం ఆయన్ను అర్జున అవార్డు (1963), పద్మశ్రీ (1983) పురస్కారాలతో గౌరవించింది. 1968లో ఆటకు వీడ్కోలు పలికేంత వరకూ అతను కేవలం మోహన్ బగాన్ క్లబ్ తరపున మాత్రమే ఆడాడు.
గోస్వామి మేటి ఫుట్‌బాలరే కాదు... క్రికెటర్ కూడా! బెంగాల్ తరపున 1962 నుంచి 1973 మధ్యలో 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడాడు. 1971-72 సీజన్‌లో చునీ బెంగాల్ రంజీ జట్టుకు సారథ్యం వహించగా... జట్టు ఫైనల్లోకి చేరింది. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో తృప్తిపడింది.

ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్‌గా జాక్వెలీన్ హ్యూగ్స్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) కొత్త డెరైక్టర్ జనరల్‌గా డాక్టర్ జాక్వెలిన్ డీ అరోస్ హ్యూగ్స్ ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన హ్యూగ్‌‌స మైక్రో బయాలజీ, వైరాలజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1990లలో కోకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్‌లో కొంతకాలం పనిచేశారు.
తైవాన్‌లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్‌గా పనిచేసిన హ్యూగ్‌‌స, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ అదే హోదాలో పనిచేశారు. తాజాగా రైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్రిశాట్‌కు మారారు. ప్రయాణాలపై నిషేధమున్న నేపథ్యంలో హ్యూగ్‌‌స ఫిలిప్పీన్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్రిశాట్ బాధ్యతలు చేపట్టడమే కాకుండా.. తన ప్రాథమ్యాల గురించి వివరించారు. కరోనా విషయంలో ఇక్రిశాట్ ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం అందించాలని హ్యూగ్‌‌స స్పష్టంచేశారు.

పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్‌కు కరోనా
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ కై జర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏప్రిల్ 30న నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కరోనా భయం వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన అసద్.. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ కలవడం దీనికి కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్‌లో 16,353 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ మే 1న బాధ్యతలను స్వీకరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్ బజాజ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.
హెచ్‌ఎంఎస్‌ఐ చీఫ్‌గా అత్సుషి ఒగాటా
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రెసిడెంట్, సీఈవో, ఎండీగా అత్సుషి ఒగాటాను మాతృ సంస్థ హోండా మోటార్ కంపెనీ నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మినోరు కటు తిరిగి హోండా మోటార్ కంపెనీలో ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ పదవి చేపట్టనున్నారు.

ఏపీ హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మే 1న ఆమోదముద్ర వేస్తూ నియామక ఉత్తర్వులిచ్చారు. దీంతో వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మే 2న ప్రమాణం చేయించారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది.

మిధాని నూతన సీఎండీగా సంజయ్ కుమార్ ఝా
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతూ నిగమ్ (మిధాని) నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా డాక్టర్ సంజయ్ కుమార్ ఝా మే 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మిధానిలోనే ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగపు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లోహశాస్త్ర ఇంజనీరింగ్‌లో బీఎస్సీ (1988) తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో చేరిన అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్న న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో చేరారు. అణు ఇంధనాల తయారీ విషయంలో పలు సాంకేతిక సృజనలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు అవసరమైన కీలక విడి భాగాలను కూడా తయారు చేశారు. న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో అందించిన సేవలకు పలు అవార్డులు పొందారు. 2006లో కేంద్ర అణు శక్తి విభాగం సంజయ్ కుమార్‌ను ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డుతో సత్కరించింది. ఇదే విభాగం నుంచి ఐదుసార్లు గ్రూపు అవార్డులు కూడా పొందిన ఆయన 2016లో మిధానిలో చేరారు.


కరోనాతో లోక్‌పాల్ సభ్యుడు త్రిపాఠీ కన్నుమూత
లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో మే 2న కన్నుమూశారని అధికారులు తెలిపారు. 1957 నవంబర్ 12న జన్మించిన త్రిపాఠి.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనమిక్స్ చదివారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1981లో పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. బిహార్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా పని చేసిన ఏకే త్రిపాఠి.. పాట్నా హైకోర్ట్ అడిషనల్ జడ్జిగానూ సేవలు అందించారు. 2018లో జులైలో ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అవినీతి వ్యతిరేక స్వతంత్ర సంస్థ అయిన ‘లోక్‌పాల్’లోని నలుగురు జ్యుడీషియల్ సభ్యుల్లో ఒకరిగా.. 2019 మార్చి 23న నియమితులయ్యారు.

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మే 2న జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.

ప్రముఖ కన్నడ సాహితీవేత్త నిస్సార్ కన్నుమూత
ప్రముఖ కన్నడ సాహితీవేత్త, నిత్యోత్సవ కవిగా పేరొందిన కె.ఎస్ నిస్సార్ అహ్మద్ (84) కన్నుమూశారు. వయోభారంతోపాటు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నివాసంలో మే 3న తుదిశ్వాస విడిచారు. అధ్యాపకుడిగా వత్తిని ఆరంభించిన నిస్సార్ 1978లో ‘నిత్యోత్సవ’ పేరిట తొలి పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. సాహిత్యం ద్వారా పలు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. కర్ణాటక సాహిత్య అకాడమీ, కెంపేగౌడ పురస్కారం, రాజ్యోత్సవ పురస్కారం, అరసు వంటి పురస్కారాలు పొందారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన నిసార్ అహ్మద్ 73వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా వ్యవహరించారు.

సైయంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఫెలిస్
టెక్నాలజీ సర్వీసెస్, సొల్యూషన్స్ కంపెనీ సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ జనరల్ కౌన్సిల్‌గా ఫెలిస్ గ్రే కెంప్ నియమితులయ్యారు. కార్పొరేట్ లావాదేవీల్లో ఆమె వ్యూహాత్మక మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ కమర్షియల్ లా విభాగంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఫెలిస్ ఇప్పటి వరకు ఆమె స్థాపించిన యూనికార్‌న్స్ ఎల్‌ఎల్‌సీ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా పనిచేశారు.

హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ హతం
ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే మే6న హతమయ్యాడు. కశ్మీర్లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మే 5 నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు.
మొదట్లో లెక్కల టీచర్‌గా..
మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు.


సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ గుప్తా పదవీ విరమణ
మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ దీపక్ గుప్తా మే 6న పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ దీపక్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్ భార్యతో శంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి. పదవీ విరమణ సందర్భంగా జస్టిస్ గుప్తా మాట్లాడుతూ.. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు.


పాకిస్తాన్ వాయుసేనలో తొలి హిందూ పైలట్
దాయాది దేశం పాకిస్తాన్ వాయుసేన (పీఏఎఫ్)లో తొలిసారి ఒక హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ ఆఫీసర్‌గా నియమితులయ్యాడు. సింధ్ ప్రావిన్స్ లోని థార్పార్కర్ జిల్లాకి చెందిన రాహుల్ దేవ్ అనే యువకుడిని డ్యూటీ పైలట్ ఆఫీసర్‌గా నియమించినట్లు పీఏఎఫ్ తెలిపింది. వెనకబడిన ప్రాంతమైన ఈ జిల్లాలో హిందువులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. పాక్ సైన్యం, పౌర సేవల రంగాల్లో ఇప్పటికే మైనారిటీ వర్గాలకు చెందినవారు పలువురు ఉద్యోగులుగా ఉన్నారు. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా పీఏఎఫ్‌లో ఓ హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా నియమితులయ్యారని పాక్ అధికారిక రేడియో మే 6న ప్రకటించింది.