%3Cb%3E%20%E0%B0%9C%E0%B1%82%E0%B0%B2%E0%B1%88%20%E0%B0%95%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%85%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%202020%20%3C/b%3E

జూలై కరెంట్‌ అఫైర్స్‌ 2020

జూలై 2020 అంతర్జాతీయం

మయన్మార్‌లో జేడ్ గనిలో ఘోర ప్రమాదం

మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రం హపకంట్ సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి (జేడ్) గనిలో జూలై 2న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. జేడ్ గని నుంచి భారీ యంత్రాలతో తవ్వి తీసిన మట్టిని ఆ పక్కనే పోస్తుంటారు. కార్మికులు అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల నివాసాలపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. 2015లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. అక్రమంగా జరిగే జేడ్ గనుల తవ్వకాలతో మాజీ సైనిక పాలకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

మారణహోమానికి చైనానే కారణం: ట్రంప్
కరోనా వైరస్ వ్యాప్తికి, ప్రపంచవ్యాప్తంగా అది సృష్టించిన మారణహోమానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. కరోనా కల్లోలానికి పూర్తి బాధ్యత ఆ వైరస్ ముప్పును దాచిపెట్టిన డ్రాగన్ దేశానిదేనన్నారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జూలై 4న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 2020 ఏడాది చివరిలోగా అమెరికాలో కోవిడ్-19కు ఔషధం, కరోనా వైరస్‌కు టీకా అమెరికాలోనే కనుగొంటామని ట్రంప్ పేర్కొన్నారు. 1776 జులై 4న గ్రేట్ బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది.


కువైట్‌లో విదేశీయుల కోటా బిల్లుకు ఆమోదం
దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఎడారి దేశం కువైట్ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. విదేశీయుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకోవాలన్న కువైట్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఈ ముసాయిదాదాను ఆమోదించింది. కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించింది. దీంతో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా ఆ దేశం వదిలి రావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
15 శాతానికి...
ముసాయిదా బిల్లు ప్రకారం కువైట్ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్ జనాభా దాదాపు 43 లక్షలు కాగా ఇందులో కువైటీలు 13 లక్షల మంది ఉన్నారు. భారతీయుల సంఖ్య 14.5 లక్షల వరకూ ఉంది.
 
విదేశీయులపై వ్యతిరేకత..

ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది. కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ జూన్ నెలలో విదేశీయుల సంఖ్యను ప్రస్తుతమున్న 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిద్దామని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి.

కువైట్ జనాభాలో ఎవరెంతమంది?
 
కువైటీలు

30.36 శాతం

ఇతర అరబ్ దేశాల వారు

27.29 శాతం

ఆసియావాసులు

40.42 శాతం

ఆఫ్రికావాసులు

1.02 శాతం

యూరప్‌వాసులు

0.39 శాతం

ఇతరులు

0.52 శాతం


పాకిస్తాన్‌కు చైనా సాయుధ డ్రోన్లు
పాకిస్తాన్‌కు చైనా నాలుగు సాయుధ డ్రోన్లను సరఫరా చేయనుంది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, గ్వాదర్ నౌకాశ్రయం వద్ద ఉన్న చైనా నేవీ బేస్‌ల రక్షణ కోసమే వాటిని పాకిస్తాన్ అందజేస్తున్నామని చైనా వెల్లడించింది. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ)కు బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్ అత్యంత కీలకం. మొదట రెండు డ్రోన్ వ్యవస్థలను(ఒక్కో వ్యవస్థలో రెండు డ్రోన్లు, ఒక గ్రౌండ్ స్టేషన్ ఉంటాయి) పాక్‌కు చైనా అందించనుందని, ఆ తరువాత రెండు దేశాలు కలిసి 48 జీజే- 2 డ్రోన్లను తయారు చేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా ఇప్పటికే నిఘా విధులతో పాటు దాడులు చేయగల వింగ్ లూంగ్ 2 డ్రోన్లను ఆసియాలోని పలు దేశాలకు విక్రయిస్తోంది.


గ్లోబల్ వీక్-2020
భారత్‌లో వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవకాశాలే ప్రధానాంశంగా జూలై 9వ తేదీ నుంచి జరిగే ప్రపంచ వేదిక ఇండియా గ్లోబల్ వీక్-2020లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. కోవిడ్-19 అనంతర ప్రపంచంలో భారత్‌లో పెట్టుబడులకు, ఉత్పత్తి రంగంలో గల అపార అవకాశాలను ఆయన వివరించనున్నారని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇండియా ఇన్‌కై ్లన్ గ్రూప్ చైర్మన్, సీఈవో మనోజ్ లాడ్వా వెల్లడించారు. లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ మీడియా సంస్థ మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనుంది.

జూలై 2020 జాతీయం

 

33 యుద్ధ విమానాల కొనుగోలుకు అనుమతి

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు భారత రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జూలై 2న జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
డీఏసీ నిర్ణయాల ప్రకారం...

  • రష్యా నుంచి 21 మిగ్-29 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నారు.
  • హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి 12 సుఖోయ్-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోనున్నారు.
  • 248 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ సైతం కొనుగోలు చేయనున్నారు.
  • ప్రస్తుతం ఉన్న 59 మిగ్-29 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేసేందుకు డీఏసీ అనుమతి ఇచ్చింది.
  • 21 మిగ్-29 ఫైటర్ జెట్ల కొనుగోలుకు, 59 మిగ్-29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల అప్‌గ్రెడేషన్‌కు రూ.7,418 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
  • హెచ్‌ఏఎల్ నుంచి 12 సూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోవడానికి రూ.10,730 కోట్లు అవసరం.
  • నావికా దళం, వైమానిక దళానికి అవసరమైన లాంగ్‌రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ సిస్టమ్స్, అస్త్రా క్షిపణుల కొనుగోలుకు రూ.20,400 కోట్లకు పైగానే ఖర్చు చేస్తారు.

మిగ్-29 ప్రత్యేకతలు..

  • గాల్లో నుంచి శత్రువులపై నిప్పుల వర్షం కురిపించే మిగ్-29 జెట్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 1970వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్‌లో మికోయాన్ డిజైన్ బ్యూరో అనే కంపెనీ తయారు చేసింది.
  • ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి 1982లో తొలిసారిగా సోవియట్ ఎయిర్‌ఫోర్సులో చేరాయి.
  • అమెరికాకు చెందిన ఈగల్, ఫాల్కన్ ఫైటర్ జెట్లకు పోటీగా వీటిని తీసుకొచ్చారు.
  • ప్రపంచంలో 30కిపైగా దేశాలు మిగ్-29 జెట్లను కలిగి ఉన్నాయి. ఇవి వివిధ విధులు నిర్వర్తించే మల్టీరోల్ ఫైటర్లుగా పేరుగాంచాయి.
  • ప్రధానంగా నింగి నుంచి నేలపై ఉన్న శత్రువులను దెబ్బతీయడానికి ఈ జెట్లను ఉపయోగిస్తారు.

సుఖోయ్ విశేషాలు..

  • రష్యాకు చెందిన సుఖోయ్ కార్పొరేషన్ సూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసింది. ఇవి మల్టీరోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
  • 2002లో భారత వైమానిక దళం ఇలాంటి కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను రష్యా నుంచి కొనుగోలు చేసింది.
  • భారత వైమానిక దళం వద్ద 2020 జనవరి నాటికి దాదాపు 260 సూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.
  • లాంగ్ రేంజ్.. అంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇవి సులువుగా ఛేదించగలవు.


మధ్యప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణ
శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. తాజాగా 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మంత్రుల సంఖ్య 34కు చేరుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాజ్‌భవన్‌లో జూలై 2న వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 20 మంది కేబినెట్ స్థాయి మంత్రులు కాగా, 8 మంది సహాయక మంత్రులు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చౌహాన్, కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరయ్యారు. 2020, మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 22 మంది జ్యోతిరాదిత్య అనుచర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.
పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు ఆమోదం
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పీవీ స్మారకంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేసేందకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. త్వరలోనే పోస్టల్ శాఖ ద్వారా ఈ స్టాంప్ విడుదల కానుందని ఆయన పేర్కొన్నారు. పీవీ స్మారకార్థం ప్రత్యేక తపాలా బిళ్లవిడుదల చేస్తుండటంపై టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు హర్షం వ్యక్తంచేశారు.
పీవీ మ్యూజియం ప్రారంభం
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు మ్యూజియాన్ని వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జూన్ 28న ప్రారంభించారు. సురభి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలల ప్రాంగణంలో ఈ మ్యూజియం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సురభి విద్యాసంస్థల చీఫ్, పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి, పీవీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

పురాతన కట్టడాల సందర్శనకు అనుమతి
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్‌మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, సూర్య దేవాలయం వంటి పురాతన, చారిత్రక కట్టడాలను పర్యాటకులు, భక్తులు జూలై 6వ తేదీ నుంచి సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పురావస్తు పరిశోధన శాఖ(ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలోని 3,691 కట్టడాలు, ప్రదేశాల్లో 2020, మార్చి 17 నుంచి సందర్శకులకు అనుమతి నిలిపివేసిన సంగతి తెలిసిందే. అన్‌లాక్-1లో భాగంగా వీటిలో 820 మతపరమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను పునఃప్రారంభించారు. అన్‌లాక్-2 అమల్లోకి రావడంతో మిగిలిన వాటిని జూలై 6 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.

గ్లో అండ్ లవ్లీగా ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు
ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ పేరును గ్లో అండ్ లవ్లీగా మార్చినట్టు హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) జూలై 2న ప్రకటించింది. పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్ హ్యాండ్‌సమ్‌గా పిలవనున్నట్టు తెలిపింది. అందానికి సంబంధించి సంపూర్ణ అర్థాన్నిచ్చే దృష్టితో ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్‌యూఎల్ 2020, జూన్ 25న ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికాకు చెందిన ఎఫ్‌ఎంసీజీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా, ఫ్రెంచ్ కంపెనీ ఎల్‌ఓరియల్ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వెటైనింగ్ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది.

స్వచ్ఛ సర్వేక్షణ్ ఆరో వార్షిక సర్వే ప్రారంభం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఆరో వార్షిక సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ జూలై 3న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ద్వారా ఏటా పరిశుభ్రంగా ఉండే నగరాలకు ర్యాంకులు ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్రాలకూ ర్యాంకులు ఇవ్వనున్నట్టు మంత్రి హర్‌దీప్ ప్రకటించారు. మురికి నీటి నిర్వహణ, నగరాల పరిశుభ్రత కోసం కేటాయించిన నిధులు, వాటి వినియోగం, స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం వంటి అంశాల ఆధారంగా ర్యాంకులను ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఆరు ప్రమాణాల ఆధారంగా...
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ఆరు ప్రమాణాలకనుగుణంగా నిర్ణయిస్తారు. తడిచెత్త, పొడి చెత్తను వేరు చేయడం, తడి వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం, తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్, రీ సైక్లింగ్, నిర్మాణ రంగంలో వ్యర్థాల ప్రాసెసింగ్, పూడ్చి పెట్టే వ్యర్థాల శాతం, పారిశుద్ధ కార్యక్రమాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తారు.
కొత్తగా ప్రేరక్ దార్ అవార్డు...
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ద్వారా 2020 ఏడాది కొత్తగా ప్రేరక్ దార్ సమ్మాన్ అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డుల్లో అయిదు సబ్ కేటగిరీలు ఉంటాయి. అవి దివ్య (ప్లాటినమ్), అనుపమ్ (గోల్డ్), ఉజ్వల్ (సిల్వర్), ఉదిత్ (బ్రాంజ్), అరోచి (యాస్పరింగ్) అవార్డులను ఇస్తారు. ప్రతీ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనిపించే మూడు నగరాలను ఎంపిక చేస్తారు.

లద్దాఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో జూలై 3న ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా నిములో ఉన్న ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అసువులు బాసిన అమర జవాన్లకు మరోసారి నివాళులర్పించారు. అలాగే గల్వాన్ ఘర్షణల్లో గాయపడి, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. ఆకస్మిక పర్యటనలో ప్రధానితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పాల్గొన్నారు.
ఉన్నతాధికారులతో సమీక్ష...
నిము 11 వేల అడుగుల ఎత్తున సింధు నది ఒడ్డున ఉన్న కఠిన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్. దీని చుట్టూ జన్‌స్కర్ పర్వతాలున్నాయి. అక్కడ భారత జవాన్లతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. వాస్తవాధీన రేఖ స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు

  • విస్తరణ వాదానికి కాలం చెల్లింది. ఇది ప్రగతి వాద యుగమని అర్థం చేసుకోవాలి.
  • విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోంది. సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరం.
  • సరిహద్దుల్లోని వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకుంటోంది.
  • పిరికివారు, బలహీనులు శాంతిని సాధించలేరు. శాంతి నెలకొనేందుకు ముందుగా ధైర్యసాహసాలు అత్యంతావశ్యకం
  • భారత సాయుధ దళాల శక్తి, సామర్థ్యాలను ప్రపంచం గమనించింది.
  • దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్న భరోసా నాకే కాదు.. దేశ ప్రజలందరిలోనూ ఉంది. మీరంతా మాకు గర్వకారణం.


ఉద్రిక్తతలు పెంచే పనులొద్దు: చైనా
లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ స్పందిస్తూ... రెండు దేశాల మధ్య మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరిగే చర్యలకు రెండు దేశాలు ఉపక్రమించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. భారత్‌లోని వ్యాపారాలకు సంబంధించి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చైనాను విస్తరణ వాద దేశంగా భావించడం అర్థరహితమని భారత్‌లో చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జీ రాంగ్ ట్వీట్ చేశారు.

ఆత్మనిర్భర్ యాప్ చాలెంజ్ ప్రారంభం
ప్రపంచస్థాయి మేడ్ ఇన్ ఇండియా యాప్స్ను తయారు చేయడంలో దేశంలోని ఐటీ, స్టార్టప్ రంగాల వారికి సరైన వేదిక కల్పించేందుకు ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న ఈ చాలెంజ్‌ను ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ఈ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... యాప్ చాలెంజ్‌లో పాల్గొనాలని స్టార్టప్‌లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • భారత్ తయారీ యాప్‌లు ప్రపంచ స్థాయిలో రాణించగలవని నిరూపించాలి.
  • ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న భారతీయ యాప్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి, ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం.
  • ఈ చాలెంజ్ ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు దోహదపడుతుంది.
  • ఎవరికి తెలుసు?, మీరు రూపొందించిన ఈ యాప్‌లను నేను కూడా ఉపయోగించవచ్చునేమో.
  • ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వారు గానీ, అలాంటి ఉత్పత్తులను సృష్టించే దృష్టి, నైపుణ్యం ఉన్న వారికి ఈ చాలెంజ్ సాయపడుతుంది.
  • ప్రపంచస్థాయి మేడ్ ఇన్ ఇండియా యాప్స్ తయారు చేయాలని ఐటీ, స్టార్టప్ రంగాల వారిలో అపారమైన ఉత్సాహం ఉంది. వీరి ఆలోచనలు, ఉత్పాదనలకు సరైన వేదిక కల్పించేందుకు ఈ చాలెంజ్‌ను ప్రారంభించింది.


ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం
ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద 10 వేల పడకలతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జూలై 5న ప్రారంభించారు. ఈ సెంటర్‌ను ఆపరేషన్ కరోనా వారియర్స్ పేరిట ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు.
20 ఫుట్‌బాల్ మైదానాలంత..
1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్‌లో 200 ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్‌లో 20 ఫుట్‌బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. మరోవైపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్‌డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా సందర్శించారు.

ఫేస్‌బుక్‌తో సీబీఎస్‌ఈ భాగస్వామ్యం
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ, ఆన్‌లైన్ వెల్‌బీయింగ్, అగ్‌మెంటెడ్ రియాలిటీ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ జూలై 5న వెల్లడించారు. కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఎలిమెంట్స్ యాప్ ఆవిష్కరణ
స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ఎలిమెంట్స్ యాప్‌ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జూలై 5న ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు.

దేశవ్యాప్తంగా కోటి కరోనా టెస్టులు
దేశంలో ఇప్పటి వరకు 1,00,04,101 కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్త, మీడియా సమన్వయకర్త డాక్టర్ లోకేశ్ శర్మ జూలై 6న తెలిపారు. ప్రస్తుతం 1,105 ల్యాబ్‌లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ల్యాబ్‌లు 788, ప్రైవేట్ ల్యాబ్‌లు 317 ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా టెస్టుల సామర్థ్యం మే 25న 1.5 లక్షలు ఉండగా, ఇప్పుడు 3 లక్షలకు చేరిందని తెలియజేశారు.
ప్రపచంలో మూడో స్థానానికి...
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో భారత్ రష్యాను దాటేసి ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు 7 లక్షలకు, మరణాలు 20 వేలకు చేరువవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జూలై 6న ప్రకటించింది. రికవరీ రేటు 60.85 శాతంగా నమోదయి్యంది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనా మరణాల విషయంలో ఇండియా ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ప్రపంచంలోనే తొలిసారిగా రైళ్లకు సౌర విద్యుత్
భారతీయ రైల్వే శాఖ మరో అరుదైన ఘనత సాధించింది. మధ్యప్రదేశ్‌లోని బినా పట్టణంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రైల్వే ఓవర్‌హెడ్ లైన్‌కు మళ్లించింది. అంటే ఈ కరెంటుతో రైళ్లు నడుస్తాయి. రైళ్లు నడపడానికి సౌర విద్యుత్‌ను ఉపయోగించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు.
బీహెచ్‌ఈఎల్ భాగస్వామ్యంతో..
రైల్వేశాఖ, బీహెచ్‌ఈఎల్ సంయుక్త భాగస్వామ్యంతో బినా పట్టణంలోని రైల్వేశాఖ స్థలంలో 1.7 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి గోయెల్ చెప్పారు. ఇక్కడ ప్రతిఏటా 25 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందన్నారు. తద్వారా రైల్వేశాఖకు ఏటా రూ.1.37 కోట్ల మేర ఆదా అవుతుందన్నారు.

మహిళా సైనికాధికారుల కమిషన్ గడువు పెంపు
మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జూలై 7న ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం 2020, ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్ కమిషన్‌ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.

ఏఆర్‌హెచ్‌సీ అభివృద్ధి ప్రతిపాదనకు ఆమోదం
పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్- ఏఆర్‌హెచ్‌సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 8న జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు.
ఏఆర్‌హెచ్‌సీ-వివరాలు

  • పట్టణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏఆర్‌హెచ్‌సీని అభివృద్ధి చేస్తారు.
  • ఏఆర్‌హెచ్‌సీలో భాగంగా ప్రభుత్వ నిధులతో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌజింగ్ కాంప్లెక్స్‌లను 25 ఏళ్ల కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ఏఆర్‌హెచ్‌సీలుగా మారుస్తారు.
  • కన్సెషన్ అగ్రిమెంట్ పొందిన వ్యక్తి/సంస్థ ఆ భవన సముదాయానికి మరమ్మతులు చేసి, ఇతర సదుపాయాలు కల్పించి ఆవాసయోగ్యంగా మారుస్తారు. ఈ పథకానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ కింద రూ. 600 కోట్లను కేటాయించారు.
  • కన్సెషన్ అగ్రిమెంట్‌దారులను పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. 25 ఏళ్ల అగ్రిమెంట్ కాలం ముగిసిన తరువాత, ఆ కాంప్లెక్స్‌లు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్తాయి. అనంతరం మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది.
  • సొంత భూమిలో ఏఆర్‌హెచ్‌సీలను నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక అనుమతులు, సదుపాయాలు, ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పిస్తారు. పన్ను చెల్లింపుల్లోనూ రాయితీ ఇస్తారు.
  • ఈ పథకం ద్వారా 3.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని 2020, మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

జూలై 2020 రాష్ట్రీయం

 

ఏపీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రమేష్‌కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్‌కుమార్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు(ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) వరకు పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జూలై 2న ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రమేష్‌కుమార్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత పశ్చిమబెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యునిగా కూడా సేవలందించారు.
కమిషనర్‌గా శ్రీనివాసరావు
రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లుగానీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు గానీ (ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) పదవిలో కొనసాగుతారు.

హైదరాబాద్‌లో ఎన్‌పీసీఐ డేటా సెంటర్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‌కు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు జూలై 2న శంకుస్థాపన చేశారు. పేమెంట్ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వహించడం, వివాదాల పరిష్కారానికి ఆర్‌బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఎన్‌పీసీఐను 2008లో ఏర్పాటు చేశాయి.
భూకంపం వచ్చినా...
అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎన్‌పీసీఐ ఈ డేటా సెంటర్‌ను ఎన్‌పీసీఐ నిర్మిస్తోంది. భూకంపం, తుపాన్ల వంటి ప్రకతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థకు ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులను అప్పగించారు.
డిజిటల్ చెల్లింపుల కేంద్రంగా హైదరాబాద్...
ఎన్‌పీసీఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్/ ఆన్‌లైన్ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భస్తుంది. భౌగోళికంగా, మానవవనరుల పరంగా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు ఎన్‌పీసీఐ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడానికి దోహదపడ్డాయి.

కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ ప్రారంభం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్కాస్) ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 3న సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్‌ను ప్రారంభించారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించేందుకు కంప్యూటర్‌లో బటన్ నొక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచనుగా ఏ కోత లేకుండా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడంతో పాటు, లంచాల ప్రసక్తి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.
ఆప్కాస్ ఏర్పాటు లక్ష్యం...
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వేతనాలు పూర్తిగా చెల్లించడం, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం. ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వాటన్నింటిలో మహిళలకు 50 శాతం ఇవ్వడం ఆప్కాస్ లక్ష్యం. ఆప్కాస్ చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు.


ఏపీలో సున్నా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల
సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ఇక నుంచి నేరుగా సున్నా వడ్డీ ప్రయోజనాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్‌కు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లిస్తే అక్టోబర్‌లో.. రబీకి చెందిన రుణాలను సకాలంలో చెల్లిస్తే మార్చిలో సున్నా వడ్డీ రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా జూలై 8న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,150 కోట్లను 57 లక్షల మంది రైతుల ఖాతాలకు కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల్లోని రైతులనుద్ధేశించి ప్రసంగించారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు

  • రైతులకు సాగులో ఉపయోగపడే యంత్రాలు నేరుగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పరిధిలోకి తీసుకువస్తున్నాం.
  • అవి అవసరమైన రైతులు ఆర్‌బీకేలను సంప్రదిస్తే, తక్కువ వ్యయానికే పొందవచ్చు. దాదాపు రూ.1,572 కోట్ల వ్యయంతో యంత్రాలు సేకరిస్తున్నాం.
  • పశు సంవర్థక శాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా శ్యాచురేషన్ పద్ధతిలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తుంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలందిస్తుంది.
  • మత్స్యకారులు ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారు. ఆ పరిస్థితిని మార్చడం కోసం దాదాపు రూ.2,800 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
  • ఇటీవలే జువ్వలదిన్నె ఫిష్ ల్యాండింగ్ కేంద్రానికి సంబంధించి కేంద్రం, నాబార్డుతో ఒప్పందం చేసుకున్నాం. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు ఇవాళ కేంద్రం, నాబార్డుతో రూ.1,000 కోట్లతో ఒప్పందం చేసుకుంటున్నాం. 8 ఫిషింగ్ హార్బర్లలో 4 ఫిషింగ్ హార్బర్ల పనులు రూ.1,300 కోట్లతో మొదలు పెడుతున్నాం.

ఆవిష్కరణలు...

  • వ్యవసాయ యాంత్రీకరణ చర్యలలో భాగంగా కర్నూలు జిల్లా తంగడంచ, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, శ్రీకాకుళం జిల్లా నైరాలో యంత్ర శిక్షణ కేంద్రాల పనులకు సంబంధించి సీఎం జగన్ ఆన్‌లైన్‌లో శిలా ఫలకాలు ఆవిష్కరించారు. రూ.42 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ కేంద్రాలలో ఏటా సుమారు 1,500 మందికి శిక్షణ ఇస్తారు.
  • వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రుణాలు, వైఎస్సార్ రైతు భరోసా, కౌలు రైతులకు మేలు చేసే విధంగా తీసుకువచ్చిన పంటసాగుదారు హక్కు పత్రం, వరిలో సరైన మోతాదుల్లో ఎరువుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యం, రైతులకు ఉద్దేశించిన 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
  • ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు తెలిపే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ రూపొందించిన డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా మాసపత్రికను సీఎం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ రూపొందించిన మత్స్య సాగుబడి మార్గదర్శి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.


నాలో.. నాతో.. వైఎస్సార్ పుస్తకావిష్కరణ
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ విజయమ్మ రాసిన నాలో.. నాతో.. వైఎస్సార్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

  • గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీలోని ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
  • రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు, రూ.40 కోట్ల అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియంకు సీఎం శంకుస్థాపన చేశారు. 6 ఎకరాల్లో రెండంతస్తుల్లో ప్రపంచ స్థాయి ఆడిటోరియం నిర్మిస్తున్నారు.
  • 3 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు మరింత తగ్గి సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ.1.51 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా కానుంది. అనంతరం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.


125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన
రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్ మైదాన్ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు జూలై 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే చూడదగ్గ ప్రదేశంగా అంబేడ్కర్ మెమోరియల్ పార్క్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌గా నామకరణం

  • నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం ఉంది.
  • విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 1997లో దీని పేరు స్వరాజ్ మైదాన్గా మార్చింది.
  • ఇప్పుడు ఈ మైదానానికే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్గా ప్రభుత్వం నామకరణం చేసింది.
  • ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది.
  • 20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన పూదోట (పార్కు), ఓపెన్ ఎయిర్ థియేటర్‌తోపాటు వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు.
జూలై 2020 ఎకానమీ
 
జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ఇంటెల్ క్యాపిటల్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి తాజాగా ఇంటెల్ క్యాపిటల్ 0.39 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 1,894.5 కోట్లని రిలయన్స్ జూలై 3న వెల్లడించింది. దీంతో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ. 1.17 లక్షల కోట్ల పైచిలుకు ఉంటుందని పేర్కొంది. కంప్యూటర్ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ పెట్టుబడుల కార్యకలాపాలను ఇంటెల్ క్యాపిటల్ విభాగం పర్యవేక్షిస్తుంది.

అపోలో క్యాన్సర్ సెంటర్‌కు జేసీఐ గుర్తింపు
చెన్నైలోని అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ ప్రతిష్టాత్మక జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ) గుర్తింపు దక్కించుకుంది. దీంతో దేశంలో జేసీఐ ధ్రువీకరణ పొందిన తొలి అత్యాధునిక క్యాన్సర్ కేర్ ఆసుపత్రిగా చెన్నైలోని ఆస్పత్రి నిలిచిందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి జూలై 3న వెల్లడించారు. రోగుల సంరక్షణ, భద్రత విషయంలో పాటించే ఉత్తమ ప్రమాణాల ఆధారంగా ఈ అంతర్జాతీయ అక్రెడిటేషన్ లభిస్తుంది. ఇప్పటికే అపోలో గ్రూప్‌నకు చెందిన ఏడు ఆసుపత్రులు జేసీఐ చేజిక్కించుకున్నాయి.

ఆత్మ నిర్భర్ కోసం అసోచామ్ సూచన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్-స్టీల్, నాన్ ఫై మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని అసోచామ్ పేర్కొంది.

రూ. లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటు
వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు, టెక్నాలజీని ప్రవేశపెట్టేవారికి, స్టార్టప్‌లకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 8న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం..
  • మౌలిక సదుపాయాలు, రవాణా వసతుల కోసం ఏర్పాటయ్యే రైతు గ్రూపులకు కూడా ఈ నిధి కింద రుణ సాయం అందుతుంది.
  • కరోనా వైరస్ తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధి అదనం.
  • అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ పదేళ్ల పాటు 2029 వరకు అమల్లో ఉంటుంది.
  • సాగు అనంతరం పంట ఉత్పత్తుల విక్రయం వరకు వసతుల నిర్వహణ (శీతల గోదాములు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు తదితర), సామాజిక సాగు తదితరాలకు దీర్ఘకాల రుణ సాయం పొందొచ్చు.
  • రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) కేంద్రం రూ.10,000 కోట్లను సమకూరుస్తుంది. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తుంది.
  • గరిష్టంగా రూ.2 కోట్ల రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నారు.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం క్షీణత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో మైనస్ 5.2 శాతం క్షీణిస్తుందని ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ- డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) అంచనా వేసింది. కరోనా వైరస్ ఇప్పటికీ విస్తరిస్తుండడం, పలు దేశాల ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగే అవకాశాలే కనిపిస్తుండడం తన అంచనాలకు కారణంగా తెలిపింది. ఈ మేరకు గ్లోబల్ అవుట్‌లుక్ నివేదికను డీఅండ్‌బీ విడుదల చేసింది. 132 దేశాలపై అధ్యయనం చేసిన అవుట్‌లుక్ 2022కు ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమించే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. డీఅండ్‌బీ విశ్లేషణే నిజమైతే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంతటి తీవ్ర క్షీణత చూడ్డం ఇదే తొలిసారి అవుతుంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009లో 1.7 శాతం క్షీణత నమోదయి్యంది.
క్షీణతలోనే భారత్..: నాలుగు దశాబ్దాల అనంతరం భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో క్షీణతలోకి జారనుందని డీఅండ్‌బీ చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు. 2020, మార్చిలోనే భారత్ రేటింగ్‌ను డీఅండ్‌బీ డీబీ4డీ నుంచి అధిక రిస్క్‌తో కూడిన డీబీ5సీలోకి మార్చిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆగస్టు వరకు ఈపీఎఫ్ చెల్లింపుల పథకం
చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్ చెల్లింపుల పథకాన్ని 2020, ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ జూలై 8న నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద ఈపీఎఫ్ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ పథకం ప్రకారం... 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు

  • 2020, నవంబర్ వరకు ఉచిత రేషన్ కార్యక్రమానికి ఆమోదం.
  • లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులైన పేద మహిళల కోసం ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను.. వారు సెప్టెంబర్ చివరి వరకు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు మూడు ఉచిత సిలిండర్లను తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.

జూలై 2020 ద్వైపాక్షిక సంబంధాలు

రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు
కరోనా సంక్షోభం, వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. తదితర అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూలై 2న ఫోన్‌లో చర్చించారు. కోవిడ్-19 అనంతరం ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, 2020 ఏడాది చివర్లో జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సును విజయవంతం చేసే దిశగా సంప్రదింపులను మరింత విసృ్తతం చేయాలని తీర్మానించారు. భారత్‌లో జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. భారత్‌తో అన్ని రంగాల్లో ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్న పుతిన్.. ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

చైనా విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోం
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో జూలై 3న జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
సమావేశంలో మంత్రి ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ... భారత్ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్‌వేర్ ఉందో ట్రోజన్ హార్స్ ఉందో (వైరస్‌లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు అని మంత్రి వ్యాఖ్యానించారు.

చైనా దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో సరిహద్దులున్న దేశాలు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్‌వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుంది. విద్యుత్ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది.

బలగాల ఉపసంహరణకు మరికొన్ని రోజులు
గల్వాన్ లోయలోని భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ముగిసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్మీ వర్గాలు జూలై 7న వెల్లడించాయి. పెట్రోలింగ్ పాయింట్ 15 హాట్‌స్ప్రింగ్‌‌స వద్ద ఉపసంహరణ ప్రక్రియ జూలై 7నే పూర్తి కావచ్చని, గొగ్రా ప్రాంతంలో మాత్రం మరి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపాయి.
సాధ్యమైనంత త్వరగా...
ఇరుదేశాల ఆర్మీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చలు, ఆ తరువాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల మధ్య జూలై 5న జరిగిన చర్చల నేపథ్యంలో.. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా, బలగాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఉపసంహరణ కార్యక్రమం జూలై 6న ప్రారంభమైంది.
పీపీ 14 నుంచి...
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రెండు దేశాల సైన్యాలు ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్లాలి. అలాగే, భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చలు కొనసాగించాలి అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయలోని పీపీ 14 నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని, టెంట్స్‌ను తొలగించాయని తెలిపాయి.

రివ్యూ పిటిషన్‌కు జాదవ్ అంగీకరించలేదు: పాక్
గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తనకు విధించిన మరణశిక్షపై రివ్యూపిటిషన్ దాఖలు చేయడానికి అంగీకరించలేదనీ, తాను గతంలో పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌కే పరిమితం కావాలని భావిస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కి 2017లో పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. జాదవ్‌ని కలిసేందుకు మరోమారు అవకాశం ఇస్తున్నట్టు పాకిస్తాన్ మీడియా రిపోర్టు చేసింది. కుల్‌భూషణ్ కేసులో ఐసీజే తీర్పుని పాటిస్తున్నామని మేలో పాకిస్తాన్ వెల్లడించింది.
పచ్చి మోసం: భారత్
జాదవ్ తన మరణశిక్షపై అప్పీల్‌కు వెళ్ళేందుకు నిరాకరించారన్న పాక్ వాదన పచ్చి మోసమని భారత్ పేర్కొంది. రివ్యూపిటిషన్ వేయకుండా ఉండేందుకు, తనకున్న చిట్టచివ్వరి న్యాయపరమైన అవకాశాన్ని వాడుకోనివ్వకుండా జాదవ్‌పై పాకిస్తాన్ ఒత్తిడి చేసిందని స్పష్టమౌతోందని, ఇది నిర్లజ్జాకరమైన చర్య అని భారత విదేశాంగ శాఖ మండిపడింది.

జూలై 2020 సైన్స్ & టెక్నాలజీ

ఆగస్టు 15 నాటికి కరోనా టీకా: ఐసీఎంఆర్


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్‌ను 2020, ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్‌ఐవీ) కలిసి ఐసీఎంఆర్ పనిచేస్తుంది. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది.
దేశంలోని 12 ప్రాంతాల్లో...
కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్ ఉన్నాయి. భారత్‌లో దేశీయంగానే తయారు చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదేనని ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ లేఖలో పేర్కొన్నారు.


జైడస్ కరోనా వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి

అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ జైకోవ్-డి కు డ్రగ్‌‌స కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి లభించింది. జైడస్ కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ తయారు చేసిన వ్యాక్సిన్ జంతువులపై చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు మానవ ప్రయోగాల కోసం మొదటి, రెండో దశలకు డీసీజీఐ అనుమతించింది. త్వరలోనే మానవులపై ఈ కంపెనీ టీకాను పరీక్షించి చూస్తుంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
60.73 శాతంగా రికవరీ రేటు
కరోనా వైరస్ వ్యాప్తిని త్వరితగతిన గుర్తించడం, సరైన సమయానికి వైద్య చికిత్సను అందించడం ద్వారా భారత్ రికవరీ రేటులో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. 60.73 శాతం రికవరీ రేటు సాధించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలై 3న వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6,25,544కి చేరుకుంది. ఇందులో 3,79,891 మంది కోవిడ్ నుంచి కోలుకుంటే, 2,27,439 మంది చికిత్స పొందుతున్నారు.

క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో
కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు ఈ ఔషధం పని చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షను ముగించినట్లు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్/రిటోనవిర్ కాంబినేషన్ డ్రగ్‌ను హెచ్‌ఐవీ/ఎయిడ్‌‌స చికిత్సలో వాడుతున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనాను నయం చేస్తుందని ప్రచారం కావడంతో దీనిపై డబ్ల్యూహెచ్‌వో పరీక్ష చేపట్టింది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా బాధితులకు ఉపయోగపడినట్లు ఆధారాలు లభించలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. క్లోరోక్విన్ ఇచ్చినప్పటికీ బాధితుల్లో మరణాల రేటు తగ్గలేదంది.

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి
కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. కోవిడ్-19 గాలి ద్వారా సోకుతుందని, అతి సూక్ష్మ స్థాయి కణాలూ వైరస్‌ను మోసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఇచ్చే సలహా, సూచనల్లో మార్పులు చేయాలని వారు కోరారు. ఇందుకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ అది కేవలం దగ్గు, తుమ్ముల ద్వారా తుంపర్లతోనే ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పడం తెలిసిందే.

మూడో దశ ప్రయోగాలకు సైనోవాక్ వ్యాక్సిన్
కరోనా మహమ్మారి నిరోధానికి చైనీస్ కంపెనీ సైనోవాక్ తయారు చేస్తున్న టీకా మానవ ప్రయోగాల్లో కీలకమైన మూడో దశకు చేరుకుంది. చైనాలోని వూహాన్‌లో 2019, డిసెంబర్‌లో కరోనా వైరస్‌ను గుర్తించగా సైనోవాక్ 2020, జనవరి నెల నుంచే టీకా తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జంతు పరిశోధనలతోపాటు మానవ ప్రయోగాల్లో తొలి రెండు దశలను పూర్తిచేసుకున్న సైనోవాక్ కీలకమైన మూడో దశ మానవ ప్రయోగాలను మాత్రం బ్రెజిల్‌లో నిర్వహిస్తోంది.
ఏడాది చివరికి వ్యాక్సిన్!
2020 ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పుణే కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సిరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదార్ పూనవల్లా జూలై 7న తెలిపారు.

జూన్ 2020 అవార్డ్స్
 
వెయిట్ లిఫ్టర్ సంజితకు అర్జున అవార్డు
రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చాను అవార్డు అవార్దు ఇవ్వనున్నారు. సంజిత డోపింగ్‌కు పాల్పడలేదని రుజువు కావడంతో 2018 ఏడాదిలో నిలుపుదల చేసిన అవార్డును ఇప్పుడు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక అర్జునను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ జూన్ 25న ప్రకటించింది. 2014, 2018 కామన్వెల్త్ క్రీడలో సంజిత స్వర్ణ పతకాలు సాధించింది.
నిర్దోషిగా బయటపడినపుడు...
2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. 2018, ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కు 11 డీడీయూపీఎస్‌పీ అవార్డులు

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)-2020 అవార్డులు లభించాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు 2020 ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి.
అవార్డులు వివరాలు ఇలా..
జిల్లా స్థాయిలో: పశ్చిమ గోదావరి
మండల స్థాయిలో: రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ జిల్లా)
గ్రామ పంచాయతీ స్థాయిలో: కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా).
పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ-గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను అందిస్తోంది.

డీడీఎస్‌కు పర్యావరణ అవార్డు
జహీరాబాద్: పర్యావరణాన్ని కాపాడుతూ సహజ పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్)కి ప్రిన్స్ అల్‌బర్ట్ మొనాకో అవార్డు లభించింది. జూన్ 11న రాత్రి దీనికి సంబంధించిన వివరాలను డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీశ్ మీడియాకు వెల్లడించారు. పర్యావరణానికి సంబంధించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రిన్స్ అల్‌బర్ట్ అవార్డు ఈసారి డీడీఎస్‌కు దక్కిందన్నారు. వ్యవసాయరంగంలో జీవ వైవిధ్యంపై డీడీఎస్ మహిళలు 30 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించారని వివరించారు. జూన్ 11న మొనాకో దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ టెలి కాన్ఫరెన్స్ లో ప్రిన్స్ అల్‌బర్ట్ మెమోరియల్ ఫౌండేషన్, డీడీఎస్‌కు అవార్డును ప్రకటించిందని, చెప్పారు. భారతదేశానికి గత 13 సంవత్సరాల్లో ఈ అవార్డు రావడం రెండోసారి అని, మొదటి సారి ప్రఖ్యాత పర్యావరణ వేత్త డాక్టర్ సునీతా నారాయణ్ దీనిని అందుకున్నారని తెలిపారు. తర్వాత 2020 సంవత్సరానికి డీడీఎస్‌కే ఈ అవార్డు దక్కిందన్నారు.

రత్తన్‌లాల్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్‌లాల్(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పేర్కొంది. రత్తన్‌లాల్ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది.

ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా
అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. 2021, ఫిబ్రవరి 28న జరగాల్సిన 93వ ఆస్కార్ వేడుకలను కరోనా వైరస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు అవార్డుల కమిటీ ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్‌‌ట్స అండ్ సెన్సైస్‌ జూన్ 16న ప్రకటించింది. 2021, ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని వెల్లడించింది. ఆస్కార్ 2021 అవార్డుల కోసం నామినేషన్ తేదీని కూడా డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అకాడమీ నిర్ణయించింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల చివరిదశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్‌లు ఆగిపోగా, మరెన్నో చిత్రాలు విడుదలకు నోచుకోలేదు.


కిరణ్ మజుందార్ షాకు అంతర్జాతీయ అవార్డు
బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షాని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. జీవఔషధాల సంస్థను స్థాపించి.. గడిచిన 30 ఏళ్ల నుంచి సమర్థవంతంగా, వృద్ధి బాటలో ఈ సంస్థను నడిపిస్తున్నందుకు గానూ ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 పురస్కారం దక్కింది. దాతృత్వం పట్ల ఆమెకు ఉన్న అభిరుచి, ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దడంలో కనబర్చిన చిత్తశుద్ధి వంటి అంశాల ఆధారంగా అవార్డును ప్రకటిస్తున్నట్లు జడ్జింగ్ ప్యానెల్ ప్రకటించింది. వర్చువల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు కార్యక్రమంలో జూన్ 4న ఆమెను ఈ అవార్డుతో సత్కరించింది. మొత్తం 41 దేశాల నుంచి 46 మంది పారిశ్రామికవేత్తలు ఈ అవార్డుకు పోటీ పడ్డారు. గతంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నారాయణ మూర్తి భారత్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు.

మైకేల్ క్లార్క్‌కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం
ఆసీస్ ప్రపంచకప్ విజయ సారథి మైకేల్ క్లార్క్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారానికి ఎంపికయ్యాడు. క్రికెట్‌కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్‌కు ఈ పురస్కారం దక్కింది. 39 ఏళ్ల క్లార్క్ తన కెరీర్‌లో 115 టెస్టులాడి 8643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7981 పరుగులు, 34 టి20ల్లో 488 పరుగులు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. ఆసీస్‌లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం. గతంలో దిగ్గజ క్రికెటర్లయిన అలెన్ బోర్డర్, బాబ్ సింప్సన్, స్టీవ్ వా, మార్క్ టేలర్, రికీ పాంటింగ్‌లకు ఈ అవార్డు లభించింది.

రామన్ మెగసెసె పురస్కారాలు రద్దు
ఆసియన్ నోబెల్ ప్రైజ్‌గా పేరు పొందిన మెగసెసె పురస్కారాలు రద్దయ్యాయి. ఫిలిప్పీన్స్ లో కరోనా ఉద్ధృతి కారణంగా 2020 మెగసెసె
అవార్డులను రద్దు చేస్తున్నట్లు ది రామన్ మెగసెసె అవార్డ్ ఫౌండేషన్ జూన్ 9న ప్రకటించింది. ఆరు దశాబ్దాల్లో ఈ పురస్కారాలు రద్దు కావడం ఇది మూడోసారి. 1970లో ఆర్థిక సంక్షోభం, 1990లో భూకంపం కారణంగా ఈ అవార్డులను ప్రదానం చేయలేదు.
1957 ఏప్రిల్‌లో...
మెగసెసె అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరున ఏర్పాటు చేశారు. ఆసియన్ నోబెల్ ప్రైజ్గా పేరు పొందిన మెగసెసె అవార్డును 1957 ఏప్రిల్‌లో రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ (న్యూయార్క్), ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పాయి. ఈ అవార్డుకు ఏటా వివిధ రంగాలలో విశేష ప్రతిభ/కృషి కనపరచిన ఆసియాకు చెందిన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేస్తారు.
మొత్తం ఆరు విభాగాల్లో...
మొత్తం ఆరు విభాగాల్లో ఈ అవార్డులు ప్రకటిస్తారు. అవి 1. గవర్నమెంట్ సర్వీసు 2. పబ్లిక్ సర్వీసు 3. కమ్యూనిటీ లీడర్‌షిప్ 4. జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్‌‌ట్స 5. పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాడింగ్ 6. ఎమర్జంట్ లీడర్‌షిప్. ఎమర్జంట్ లీడర్‌షిప్ అవార్డును మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 2001 నుంచి అందజేస్తున్నారు.

ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తకు సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డు
పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్ సెన్సైస్ విభాగంలో 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని న్యూట్రిషన్ లైవ్ -2020 పేరుతో జూన్ 2న జరిగిన ఆన్‌లైన్ సదస్సులో వెల్లడించారు.
జాతీయ పోషకాహార సంస్థలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సుబ్బారావు ఇప్పటివరకు సుమారు 63 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. రాయల్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (యూకే) సభ్యుడైన సుబ్బారావుకు ఈ అవార్డు దక్కడంపై జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత హర్షం వ్యక్తం చేశారు.

జూలై 2020 స్పోర్ట్స్
 
ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి విజేతగా బొటాస్
ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆస్ట్రియాలోని స్పీల్‌బర్గ్‌లో జూలై 5న జరిగిన ఈ రేసులో పోల్ పొజిషన్తో బరిలోకి దిగిన బొటాస్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 55.739 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ రేసులో తొమ్మిది మంది మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని రెండో రేసు ఇదే వేదికపై జూలై 10న జరగనుంది.


స్పీడ్ చెస్ గ్రాండ్‌ప్రి విజేతగా వాలెంటినా
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళల స్పీడ్ చెస్ గ్రాండ్‌ప్రి-2 ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో వాలెంటినా గునీనా (రష్యా) విజేతగా నిలిచింది. జూలై 5న జరిగిన ఫైనల్లో గునీనా 7-5 పాయింట్ల తేడాతో అనా ఉషెనినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కాటరీనా లాగ్నో (రష్యా) 9.5-2.5తో సారాసదత్ (ఇరాన్)పై గెలిచింది.
భారత చెస్ 66వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆకాశ్
భారత చెస్‌లో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల జి.ఆకాశ్ భారత్ తరఫున 66వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) కౌన్సిల్ సమావేశంలో ఆకాశ్‌కు అధికారికంగా జీఎం హోదా ఖరారు చేశారు. 2012లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆకాశ్ 2014లో ఇంజినీరింగ్ విద్య కోసం చెస్ నుంచి నాలుగేళ్లపాటు విరామం తీసుకున్నాడు. 2018లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెస్‌లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం 2495 ఎలో రేటింగ్ కలిగిన ఆకాశ్ నాలుగు జీఎం నార్మ్‌లను సంపాదించి గ్రాండ్‌మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు.

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా డికాక్
క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) వార్షిక అవార్డుల్లో సఫారీ జట్టు వన్డే, టి20 జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పురుషుల విభాగంలో 27 ఏళ్ల డికాక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన డికాక్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్నీ కూడా సొంతం చేసుకున్నాడు. తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో డికాక్ ఇప్పటివరకు 47 టెస్టుల్లో, 121 వన్డేల్లో, 44 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
మహిళల కేటగిరీలో...
మహిళల కేటగిరీలో లారా వోల్వార్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది. మరోవైపు పేసర్ లుంగీ ఇన్‌గిడి వన్డే, టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకోగా... డేవిడ్ మిల్లర్ ఫేవరెట్ ప్లేయర్గా నిలిచాడు.

బ్యాడ్మింటన్‌కు చైనా స్టార్ లిన్ డాన్ వీడ్కోలు
రెండు దశాబ్దాలు బ్యాడ్మింటన్‌ను ఏలిన చైనా విఖ్యాత షట్లర్ లిన్ డాన్ జూలై 4న ఆటకు వీడ్కోలు పలికాడు. గాయాలతో ఒకప్పటిలా నేను మా జట్టు సహచరులతో కలిసి పోరాడలేనందునే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు చైనా సోషల్ మీడియా యాప్ వైబోలో లిన్ పోస్ట్ చేశాడు. 2000 నుంచి 2020 వరకు ఆటలో కొనసాగిన నేను జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని 37 ఏళ్ల లిన్ పేర్కొన్నాడు.
లిన్ డాన్ గురించి...
  • బ్యాడ్మింటన్‌కు సూపర్ డాన్గా చిరపరిచితుడైన లిన్ 2002లో తన తొలి టైటిల్ సాధించాడు. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం అతను కనీసం ఒక్క టోర్నీలోనైనా విజయం సాధించడం విశేషం.
  • అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో 666 మ్యాచ్‌లలో విజయాలు... 66 టైటిల్స్ సాధించాడు. ప్రపంచంలోని అన్ని టైటిళ్లను గెలుచుకున్నాడు.
  • రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
  • ఐదు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్, మరో ఐదుసార్లు ఆసియా గేమ్స్ విజేత.
  • ఐదు సుదిర్మన్ కప్ విజయాల, థామస్ కప్‌లో అరడజను బంగారు పతకాలు సాధించాడు. అలాగే 4 ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణాలు, 2 ప్రపంచకప్ విజయాలు సాధించాడు.
  • 28 ఏళ్లకే సూపర్ గ్రాండ్ స్లామ్ సాధించాడు. అంటే బ్యాడ్మింటన్ చరిత్రలో ఉన్న 9 మేజర్ టైటిళ్లను సాధించిన ఏకై క షట్లర్‌గా చరిత్రకెక్కాడు.
  • ఒలింపిక్ చాంపియన్‌షిప్ (2008, 2012) నిలబెట్టుకున్న తొలి, ఒకేఒక్క బ్యాడ్మింటన్ ఆటగాడు కూడా లిన్ డానే.
  • బ్యాడ్మింటన్‌లో దిగ్గజ చతుష్టయంగా గుర్తింపు తెచ్చుకున్న నలుగురిలో చివరగా డాన్ రిటైరయ్యాడు. మిగతా ముగ్గురు లీ చోంగ్ వీ, తౌఫీక్ హిదాయత్, పీటర్ గేడ్‌లతో పోలిస్తే లిన్ డాన్ ఎక్కువ ఘనతలు సాధించాడు.

ఏఐబీఏ-ఐబా ర్యాంకింగ్‌‌సలో అమిత్‌కు అగ్రస్థానం
ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో రజత పతకం నెగ్గిన ఏకై క భారత బాక్సర్‌గా గుర్తింపు పొందిన అమిత్ పంఘాల్ మరో ఘనత సాధించాడు. జూలై 6న విడుదల చేసిన అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ప్రపంచ ర్యాంకింగ్‌‌సలో అమిత్ పురుషుల 52 కేజీల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జకార్తా-2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా బాక్సర్ ఖాతాలో 1300 పాయింట్లు ఉన్నాయి. అమిత్ చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ జైరోవ్ షకోబిదిన్ (ఉజ్బెకిస్తాన్) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోగా... అసెనోవ్ పనేవ్ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.
ఏఐబీఏ-ఐబా ర్యాకింగ్స్‌లో మొత్తం తొమ్మిది వెయిట్ కేటగిరీలకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు టాప్-10లో ఉన్నారు. దీపక్ (49 కేజీలు) ఆరో ర్యాంక్‌లో, కవీందర్ బిష్త్ (56 కేజీలు) నాలుగో ర్యాంక్‌లో, మనీశ్ కౌశిక్ (64 కేజీలు) ఆరో ర్యాంక్‌లో నిలిచారు. 2019 ఏడాది జనవరిలో ఐబా ప్రకటించిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్‌‌సలో టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) తాజా ర్యాంకింగ్‌‌సలో మూడో స్థానానికి పడిపోయింది. ఇదే విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 21వ ర్యాంక్‌లో నిలిచింది.

టాప్ బ్యాట్స్‌మన్ ఎవర్టన్ వీక్స్ కన్నుమూత
వెస్టిండీస్ నాటితరం టాప్ బ్యాట్స్‌మన్ ఎవర్టన్ డి కార్సీ వీక్స్(95) జూలై 1న కన్నుమూశారు. 1948నుంచి 1958 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వీక్స్ 15 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు సహా 4455 పరుగులు చేశారు. ఆయన టెస్టు బ్యాటింగ్ సగటు (58.61) ఆల్‌టైమ్ జాబితాలో టాప్-10లో ఉండటం విశేషం. అత్యంత వేగంగా 12 ఇన్నింగ్‌‌సలలోనే 1000 పరుగులు సాధించిన వీక్స్ దశాబ్దకాలం పాటు క్రికెట్ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు.
33 ఏళ్ల వయసుకే...
23 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన వీక్స్... తొడ గాయం కారణంగా 33 ఏళ్ల వయసుకే ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. 1951లో విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన ఆయనకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా చోటు దక్కింది. క్రికెట్‌కు వీక్స్ చేసిన సేవలకు 1995లో నైట్‌హుడ్ పురస్కారం దక్కడంతో ఆయన పేరు పక్కన సర్ చేరింది. రిటైర్మెంట్ తర్వాత ఐసీసీ మ్యాచ్ రిఫరీగా, కోచ్‌గా కూడా వీక్స్ పని చేశారు. ఆయన కుమారుడు డేవిడ్ ముర్రే విండీస్ తరఫున 10 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు.
3 డబ్ల్యూస్‌లో ఒకరిగా...
సర్ క్లయిడ్ వాల్కాట్, సర్ ఫ్రాంక్ వారెల్, సర్ ఎవర్టన్ వీక్స్ కలిసి వెస్టిండీస్ విఖ్యాత బ్యాటింగ్ త్రయం 3 డబ్ల్యూస్గా గుర్తింపు పొందారు. భీకర పేస్‌కు తోడు ఈ ముగ్గురి బ్యాటింగ్ జట్టుకు గొప్ప విజయాలు అందించింది. బార్బడోస్‌లోనే 18 నెలల వ్యవధిలో పుట్టిన ఈ ముగ్గురు మూడు వారాల వ్యవధిలోనే విండీస్ తరఫున అరంగేట్రం చేశారు. ల్యుకేమియాతో ఫ్రాంక్‌వారెల్ 1967లోనే చనిపోగా, వాల్కాట్ 2006లో మరణించారు. వీరిలో ఇద్దరు బతికుండగానే బ్రిడ్‌‌జటౌన్‌లో ఈ ముగ్గురి పేరిట ఆంగ్ల అక్షరం గి రూపంలో స్మారకం ఏర్పాటు చేశారు. మిగతా ఇద్దరి సమాధులు ఉన్న చోటనే వీక్స్‌ను కూడా ఖననం చేయనున్నారు.

భారత ఒలింపిక్ సంఘం కొత్త లోగోలకు ఆమోదం
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రూపురేఖల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దృశ్యపరంగా, బ్రాండింగ్ పరంగా తమ సంఘానికి కొత్త లుక్ ఇవ్వాలని ఐఓఏ నిర్ణయించింది. భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొని 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ తరహా ఆలోచనలతో ముందుకు వచ్చింది. కొత్త లోగోలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 15న వీటిని ఘనంగా ఆవిష్కరిస్తారు.
మాస్క్‌లు, శానిటైజర్లు నిత్యావసరాలు కాదు
నిత్యావసర వస్తువుల చట్టం 1955 పరిధిలో నుంచి ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లను కేంద్రం ప్రభుత్వం తొలగించింది. తగినంత సరఫరా పరిస్థితులు నెలకొన్నందునే వీటిని ఈ చట్టం పరిధి నుంచి తొలగిస్తున్నట్లు వినియోగ వ్యవహారాల శాఖ సెక్రటరీ లీనా నందన్ తెలిపారు. 2020. మార్చి 13న మాస్క్‌లు, శానిటైజర్లను కేంద్రం నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. తొలుత జూన్ 30 వరకు నిత్యావసర జాబితాలో ఉన్నట్టు కేంద్రం పేర్కొనగా.. తగినంత సరఫరా ఉండడంతో కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని లీనానందన్ స్పష్టం చేశారు.

యూటీఆర్ ప్రొ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రాంజల
ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూటీఆర్ ప్రొ టెన్నిస్ సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ప్రాంజల 6-3, 6-3తో డబుల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ డెసిరే క్రాజిక్ (అమెరికా)పై నెగ్గింది.
రెండు అంతర్జాతీయ టోర్నీలు రద్దు
కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దయ్యాయి. 2020, ఆగస్టులో జరగాల్సిన చైనా మాస్టర్స్ సూపర్-100తోపాటు అక్టోబర్‌లో జరగాల్సిన డచ్ ఓపెన్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) జూలై 7న ప్రకటించింది.

ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రద్దు
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వాయిదా పడిన ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ రద్దయ్యింది. కోవిడ్-19 కారణంగా ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు భారత గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) చైర్మన్ దేవాంగ్ షా జూలై 3న ప్రకటించారు. యూరోపియన్ గోల్ఫ్ టూర్‌లో భాగంగా జరిగే ఈ టోర్నీ... వాస్తవానికి 2020, మార్చి 19 నుంచి 23 వరకు గురుగ్రామ్‌లో జరగాల్సింది. కరోనా వైరస్ నేపథ్యంలో అప్పట్లో ఈ టోర్నీని వాయిదా వేశారు. 2020, అక్టోబర్‌లో నిర్వహించాలని తొలుత భావించినా... దేశంలో వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో టోర్నీ రద్దుకే మొగ్గు చూపామని షా తెలిపారు.
నలుపు రంగు కార్లతో ఎఫ్1 రేస్
జాత్యహంకారానికి వ్యతిరేకంగా నల్లజాతీయులకు అండగా నలుపు రంగు కార్లతో ఫార్ములావన్ సర్క్యూట్‌లో పాల్గొనాలని మెర్సిడెజ్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా జూలై 3న జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ప్రాక్టీస్ సెషన్‌లో మెర్సిడెజ్ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ నలుపు రంగు కార్లతో ట్రాక్‌పై దూసుకెళ్లారు. సహజంగా మెర్సిడెజ్ సిల్వర్ కలర్ కార్లతో బరిలోకి దిగేది.

ఎఫ్1లో అలోన్సో పునరాగమనం
ప్రఖ్యాత ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో ఫునరాగమనం ఖాయమైంది. వచ్చే సీజన్‌లో అతను రెనౌ జట్టు తరఫున మళ్లీ బరిలో దిగనున్నాడు. డేనియల్ రికియార్డో స్థానాన్ని అలోన్సో భర్తీ చేయనున్నట్లు రెనౌ యాజమాన్యం ప్రకటించింది. 2018లో ఫార్ములావన్ నుంచి తప్పుకున్న 38 ఏళ్ల అలోన్సో చివరిరేసులో మెక్‌లారెన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 32 రేసుల్ని నెగ్గిన అలోన్సో... గతంలో రెనౌకు ప్రాతినిధ్యం వహిస్తూ రెండు వరల్డ్ టైటిళ్లు (2005, 2006) తన ఖాతాలో వేసుకున్నాడు.

జూలై 2020 వ్యక్తులు

 

మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఓవర్‌డ్రాఫ్ట్- భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం త్వరలో విడుదల కానుంది. ఈ విషయాన్ని పుస్తకాన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ఎన్‌పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్‌బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.

ఐఎఫ్‌ఎస్‌సీఏ చైర్మన్‌గా ఇంజేటి శ్రీనివాస్
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంజేటి శ్రీనివాస్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్ల వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. తెలుగు వ్యక్తి అయిన శ్రీనివాస్, కేంద్రంలో కార్పొరేట్ శాఖా సెక్రటరీగా 2020, మే 31న పదవీ విరమణ పొందారు. ఐఎఫ్‌ఎస్‌సీఏ గాంధీనగర్ కేంద్రంగా 2020, ఏప్రిల్ 27న ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్‌లో జరిగే అన్ని లావాదేవీలను ఇది పర్యవేక్షిస్తుంటుంది.

ప్రజాకవి, గాయకుడు నిస్సార్ కన్నుమూత
ప్రజాకవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి సహాయ కార్యదర్శి మహ్మద్ నిస్సార్‌ను (58) కరోనా కాటేసింది. ఈ మహమ్మారి సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. జూలై 8న కన్నుమూశారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పడిన కష్టాలను బాధలను పేర్కొంటూముదనష్టపు కాలం.. ఇంకెంతకాలంఅంటూ ఇటీవలే ఓ పాట పాడారు. అదే ఆయన చివరి పాట.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో లక్షలాది మందిని ఉద్యమ పథంలోకి నడిపిన నిస్సార్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. మహ్మద్ అబ్బాస్, హలీమా దంపతులకు 1962 డిసెంబర్ 16న ఆయన జన్మించారు. సీపీఐ కార్యకర్తగా, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడిగా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన పదునైన కంచుకంఠంతో పాడిన పాటలు గొప్ప చైతన్యాన్ని కలిగించాయి. పలు కవితలు కూడా రాశారు. దోపిడీ, పీడనలు, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.