కణం యొక్క నిర్మాణం
అన్ని కణాలు మూడు ప్రధాన క్రియాత్మకమైన విషయాలు కలిగి ఉంటాయి:
1. కణ త్వచం లేదా ప్లాస్మా పొర
2. న్యూక్లియస్
3. సైటోప్లాజం
కణం యొక్క బయటి త్వచం ప్లాస్మా పొర. ఇది లిపిడ్లు, ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దాని లోపల సైటోప్లాజమ్ ఉంటుంది. సైటోప్లాజంలో వివిధ సెల్యులార్ లేదా సెల్ ఆర్గానిల్స్ మరియు మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లు మొదలైనవి చేరి ఉంటాయి.
మైట్రోకాండ్రియా(Mitochondria) అంతర్జీవ ద్రవ్యజాలం. రైబో సోములు, లైసోసోములు, గాల్జీ సంక్లిష్టం, కేంద్రకం వంటివి వృక్ష, జంతుకణం రెండింటిలో కనబడతాయి. సెంట్రియోల్స్ అనే నిర్మాణాలు కేవలం జంతుకణాల్లో మాత్రమే కనిపిస్తాయి. వృక్షకణాల్లో ఉండవు. మైటోకాండ్రియాలు పోగుల్లో ఉంటాయి. వీటి చుట్టూ రెండు పొరలతో ఉండే త్వచం ఉంటుంది. దీని లోపలి భాగాన్ని మాత్రిక అంటారు. మాత్రికలో డి.ఎన్.ఎ., రైబోజోమ్లు ఉంటాయి.
కణంలో శక్తి A.T.P. (అడినోసైన్ ట్రైఫాస్పేట్) అనే రూపంలో తయారై ఉంటుంది. శక్తిని A.T.P. రూపంలోనే కణం వినియోగించుకొంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం కణంలో లిపిడ్, ప్రొటీన్ల తయారీకి, కణాన్ని విషపదార్థాల బారినుంచి రక్షించడానికి, యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గాల్జీ సంక్లిష్టం స్రావక క్రియకు, లైసోసోములను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.
కేంద్రకంలో (Nuclear) క్రోమోజోములు ఉంటాయి. D.N.A. వీటిపై ప్రోటీన్ తొడుగు కలిసి క్రోమోజోములను ఏర్పరుస్తాయి. మైటోకాండ్రియాలు కార్బోహైడ్రేట్లను, కొవ్వులను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, వీటిని కణశక్తి భాండాగారాలు అంటారు. D.N.A. కేంద్రకంలోనే కాకుండా మైటోకాండ్రియా, హరితరేణువులలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని స్వయంప్రతిపత్తి కలిగిన కణాంగాలు అని అంటారు.
లైసోజోమ్ లు (Lysosomes) గుండ్రంగా, ఒకే త్వచంతో కప్పి ఉంటాయి. వీటిలో అనేక ఎంజైమ్లు ఉండి, సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడానికి ఉపయోగపడతాయి. కణం చనిపోయిన తర్వాత వీటిలోని ఎంజైమ్లు కణాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని కణ ఆత్మహత్యా కోశాలు లేదా కణ ఆటంబాంబులు అంటారు.
రైబోజోమ్ లు (Ribosomes) గోళాకారంగా ఉండే నిర్మాణాలు. ఇవి రైబోకేంద్రకామ్ల (ఆర్.ఎన్.ఎ.) ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి. కాబట్టి, వీటిని రైబో న్యూక్లియో ప్రొటీన్ రేణువులంటారు. రైబోజోమ్లు కణంలో స్వేచ్ఛగా లేదా అంతర్జీవ ద్రవ్యజాలానికి అతికి ఉంటాయి. గుంపులుగా ఉన్న రైబోజోమ్లనే పాలిజోమ్లు (polysomes) అంటారు. ఇవి ప్రొటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి.
కణంలో నాళాలు, తిత్తుల్లాంటి నిర్మాణాలున్న కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది రెండు రకాలు. అవి: 1) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. 2) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. దీనిపై రైబోజోమ్లు అతుక్కుని ఉంటాయి. ఇది ప్రొటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. కణంలో నాళాల మాదిరి ఉండే మరో నిర్మాణం గాల్జి సంక్లిష్టం. ఇది కూడా ప్రొటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. తంతువులతో నిర్మితమై, కణమంతా వ్యాపించి ఉండే నిర్మాణాన్ని కణద్రవ్య పంజరం అంటారు. ఇది కణానికి యాంత్రికబలాన్ని ఇస్తుంది.
కణాంగాల్లో అన్నింటికంటే ముఖ్యమైంది కేంద్రకం(Nuclear). ఇది రెండు పొరలతో కప్పి ఉంటుంది. ఈ పొరను కేంద్రకత్వచం అంటారు. కేంద్రకం లోపల ఉన్న పోగుల్లాంటి నిర్మాణాలను క్రోమాటిన్ పదార్థం అంటారు. ఇది కణవిభజన సమయంలో క్రోమోజోమ్లుగా మారుతుంది. క్రోమాటిన్ లేదా క్రోమోజోమ్లు డి.ఎన్.ఎ. ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. డి.ఎన్.ఎ. లో జన్యువులు ఉంటాయి. ఇవి నిర్ణీత లక్షణాలను నియంత్రిస్తాయి.
కేంద్రకం కణంలోని అన్ని జీవక్రియలను తన అధీనంలో ఉంచుకుంటుంది. నిర్దిష్ట కేంద్రకం ఉండే జీవులను నిజకేంద్రక కణాలని, నిర్దిష్ట కేంద్రకం లేని జీవులను కేంద్రక పూర్వజీవులని అంటారు.కిరణజన్య సంయోగక్రియ
ఆకుపచ్చని మొక్కలు నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ ను వినియోగించుకుని కాంతి, క్లోరోఫిల్ సహాయంతో గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్లను తయారుచేసుకునే క్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ చర్య ఒక కాంతి రసాయన చర్య. మొక్కల్లోని ఆకుపచ్చ భాగాలైన పత్రాల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి, పత్రాన్ని ఆహార కర్మాగారం లేదా ఆహార ఉత్పాదక భాగంగా పిలుస్తారు. పత్రం నిర్మాణం కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిలోని కణాల్లో హరిత రేణువులనే కణాంగాలు ఉంటాయి. వీటిలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన చర్యలు జరుగుతాయి. పత్రంలోని పత్ర రంధ్రాల ద్వారా కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్ ప్రసారం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ చర్యను మొత్తం కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు.
పై చర్యలో కార్బన్ డై ఆక్సైడ్ చివరికి గ్లూకోజ్ గా మారుతుంది. కాంతి నీటిని విశ్లేషిస్తుంది. దీంతో నీటి నుంచి ఆక్సిజన్ వెలువడుతుంది. ఈ ప్రక్రియను నీటి కాంతి విశ్లేషన అంటారు. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పత్రహరితం అనేది ఒక వర్ణద్రవ్యం. మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఇదే. పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం.
హరితరేణువులో పత్రహరితంతో పాటు ఇతర వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి ఒక సమూహంగా హరితరేణువులో దొంతరలుగా ఉండే థైలకాయిడ్ల పొరలో అమరి ఉంటాయి. వర్ణ ద్రవ్య సహూహాలు చర్యా కేంద్రాలుగా నిర్మతమై ఉంటాయి. ఈ కేంద్రాలు కాంతిచర్యావ్యవస్థ-1, కాంతిచర్యావ్యవస్థ- II అనే రకాలుగా ఉంటాయి. ఈ చర్యాకేంద్రాల్లో ఉన్న వర్ణద్రవ్యాలు కాంతిని గ్రహిస్తాయి. వర్ణద్రవ్యాల్లో పత్రహరితం మాత్రమే కాంతిని ఉపయోగించుకుంటుంది. ఇతర వర్ణద్రవ్యాలు పత్రహరితాన్ని కాంతి తీక్షణత నుంచి రక్షిస్తాయి. కాబట్టి, వీటిని రక్షక వర్ణ ద్రవ్యాలు అంటారు.
కిరణజన్య సంయోగక్రియలో జరిగే చర్యలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి 1) కాంతి చర్యలు, 2) నిష్కాంతి చర్యలు. కాంతి చర్యలు కాంతి సమక్షంలోనే జరుగుతాయి. కాంతి కిరణాలు ఫోటాన్లనే రేణువులు. ఫోటాన్లలో ఉండే శక్తిని క్వాంటమ్ శక్తి అంటారు. చర్యా కేంద్రాల్లో ఉన్న పత్రహరితం కాంతిని శోషించి ఫోటాన్లలో ఉండే శక్తిని గ్రహిస్తుంది. దీనివల్ల పత్రహరితంలోని ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయికి వెళుతుంది. ఎలక్ట్రాన్ గ్రహీతలు దీన్నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుంటాయి. సైటోక్రోములు, ప్లాస్టోక్వినోన్లు, ఫెర్రిడాక్సిన్లు వంటివి ఎలక్ట్రాన్ వాహకాలుగా పని చేస్తాయి. ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ల రవాణా, నీటి విశ్లేషణ జరగడంతో ప్రోటాన్లు
థైలకాయిడ్ పొర నుంచి అవర్ణికలోకి చేరతాయి. దీనివల్ల కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్ గా మారడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి ఆడినో సైన్ ట్రై పాస్ఫేట్ (ఎ.టి.పి), నికోటినమైడ్ అడినిన్ డై న్యూక్లియోటైడ్ పాస్ఫేట్ (ఎన్.ఎ.డి.పి. హెచ్) రూపంలో ఉంటుంది. కాంతి చర్యల్లో కేవలం శక్తి మాత్రమే ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఏర్పడదు.
నిష్కాంతి చర్యల్లో కార్బన్ డై ఆక్సైడ్ వినియోగమై గ్లూకోజ్ గా మారుతుంది. ఈ చర్యలకు కాంతి అవసరం లేదు. అంటే, ఇవి కాంతి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా జరుగుతాయి. ఈ చర్యలన్నీ హరిత రేణువులోని ఆవర్ణికలో జరుగుతాయి. వీటిని గుర్తించింది మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త. కాబట్టి, ఈ వలయరూపంలో జరిగే చర్యలను నోబెల్ బహుమతి లభించింది. నిష్కాంతి చర్యల్లో మొదట కార్బన్ డై ఆక్సైడ్ ను రిబ్యులోజ్ బిస్ పాస్ఫేట్ అనే పదార్థం గ్రహిస్తుంది. దీనివల్ల మొదట ఆరు కర్బన పరమాణువుల అస్థిర పదార్థం ఏర్పడి, వెంటనే స్థిర పదార్థమైన మూడు కర్బన పరమాణువులు ఉన్న పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనే పదార్థంగా మారుతుంది. ఇది కొన్ని చర్యల తరువాత గ్లిజరాల్డిహైడ్-3-పాస్ఫేట్ అనే పదార్థంగా మారుతుంది. దీన్నుంచి గ్లూకోజ్ ఏర్పడుతుంది. రిబ్యులోజ్ బిస్ పాస్ఫేట్ పునరుద్ధరణ జరుగుతుంది. ఇలా చర్యలన్నీ వలయరూపంలో జరుగుతాయి. కాంతి చర్యలో చివరికి ఏర్పడిన గ్లూకోజ్ పిండిపదార్థంగా మారుతుంది. కిరణజన్య సంయోగక్రియ నిర్మాణాత్మక చర్య. దీనిలో పదార్థాలు తయారవుతాయి. ఈ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని హైడ్రిల్లా మొక్క ద్వారా నిరూపించవచ్చు. అయోడిన్ పరీక్ష ద్వారా పిండిపదార్థం ఏర్పడుతుందని తెలుస్తుంది. లైట్ స్క్రీన్ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని, ఆకు సగభాగంతో చేసే ప్రయోగం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించవచ్చు.మొక్కల వర్గీకరణ
భూమిపై ఉండే మొక్కలను పుష్పించే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని రెండు విభాగాలుగా విభజించారు. అవి: 1) పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగాములు, 2) పుష్పించే మొక్కలు లేదా ఫానిరోగాములు. పుష్పించని మొక్కలు ప్రాథమికమైనవి. వీటిని తిరిగి థాలో ఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనే రకాలుగా విభజించారు.
థాలో ఫైటా
కాండం, వేరు, పత్రాలు అనే నిర్మాణాలు నిర్దిష్టంగా ఉండని వాటిని థాలో ఫైటా మొక్కలు అంటారు. శైవలాలు, శిలీంద్రాలు థాలో ఫైటాకు చెందుతాయి. శైవలాలు ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. ఇవి స్వయం పోషకాలు. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, వాల్వాక్స్ లాంటివి శైవలాలకు ఉదాహరణ. శిలీంద్రాలు పరపోషిత థాలో ఫైటా జీవులు ఈస్ట్, బూజులు వీటికి ఉదాహరణ.
బ్రయోఫైటా
ఈ మొక్కలు తడిగోడలు, తడినేల మీద పెరుగుతాయి. ఇవి దట్టంగా తివాచీలా లేదా వెల్వెట్ వస్త్రంలా మెత్తగా ఉంటాయి. ఈ మొక్కల కాండం నుంచి మూల తంతువులు లేదా వైజాయిడ్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి భూమిలోని లవణాలను, నీటిని గ్రహిస్తాయి. వీటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంథరీడియా, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియా అంటారు. బ్రయోఫైటా మొక్కలను సాధారణంగా మాస్ మొక్కలని పిలుస్తారు.
టెరిడోఫైటా
ఈ మొక్కలు మరింత స్పష్టంగా వేరు, కాండం, పత్రాలు అనే నిర్మాణాలు ఉంటాయి. కాండం నుంచి అబ్బురపు వేర్లు ఉర్భవిస్తాయి. టెరిడోఫైటా మొక్కలను సాధారణంగా ఫెర్లు అంటారు. వీటి పత్రాలను ఫ్రాండ్సు అంటారు. వీటి అడుగు భాగాన సిద్ధబీజాశయ పుంజం (సోరస్) ఏర్పడి వీటిలో సిద్ధబీజాశయాలు ఏర్పడతాయి. వీటి జీవితచక్రంలో సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. ఫెర్న్ మొక్కలను ఎక్కువగా అలంకరణ కోసం పెంచుతారు.
పుష్పించే మొక్కలను ఫలాలు లేదా విత్తనాలు ఏర్పడే స్థానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) వివృత బీజాలు లేదా జిమ్నో స్పర్ములు 2) అవృత బీజాలు లేదా ఆంజియోస్పర్ములు. వివృత బీజ మొక్కలను నగ్న విత్తనాలున్న మొక్కలు అంటారు. ఇవి విత్తనాలను నేరుగా మొక్కపై ఉత్పత్తి చేస్తాయి. వీటిలోని పుష్పాలను శంకువులు లేదా కోన్స్ అంటారు. సైకస్, నీటమ్ లాంటివి వివృతబీజ మొక్కలకు ఉదాహరణ.
బీజదళాల సంఖ్యను బట్టి ఆవృతబీజాలను తిరిగి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) ద్విదళ బీజాలు 2) ఏకదళ బీజాలు. ద్విదళ బీజ విత్తనాల్లో రెండు బీజదళాలు ఉంటాయి. వీటిలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. చిక్కుడు, మామిడి, టొమాటో మొదలైనవి వీటికి ఉదాహరణ. ఏకదళ బీజ విత్తనాల్లో ఒకే బీజదళం ఉంటుంది. వీటిలో పీచువేరు వ్యవస్థ ఉంటుంది. వరి, గోధుమ, జొన్న, కొబ్బరి లాంటివి ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ. ఆవృత బీజాల నుంచే మానవుడికి అవసరమైన ఆహార పదార్థాలు, దుస్తులు లాంటివి సమకూరుతున్నాయి.
మొక్కలు - ఉపయోగాలు
మొక్కలు మానవుడికి ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఔషధాలు, దుస్తులు లాంటివి సమకూరుస్తున్నాయి. అనేక రకాల మొక్కలను మానవుడు సాగుచేసి తన అవసరానికి వినియోగించుకుంటున్నాడు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కలన్నీ వన్యజాతి మొక్కల నుంచి ఉద్భవించినవే. మానవుడి రక్షణ, సహాయం పొందకుండా నివసించే మొక్కలను వన్యజాతి మొక్కలంటారు. ఇవి సాగు మొక్కలతో పోల్చితే ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. మొక్కల నుంచి లభ్యమయ్యే ఉత్పత్తులనుబట్టి వీటిని ధాన్యాలు, నార, ఔషధాలు, కలపనిచ్చే మొక్కలని విభజించవచ్చు.
ధాన్యాలనిచ్చే మొక్కలు
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉపయోగపడేవి ధాన్యాలు. ఇవి గడ్డిజాతి మొక్కలు. గింజల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, తక్కువ మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటివి ధాన్యాలను ఇచ్చే మొక్కలు.
ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు వరి ముఖ్య ఆహార పదార్థం. వరి ఏకవార్షిక మొక్క. ఇది గడ్డి జాతికి చెందింది. ఆసియా, యూరప్, అమెరికాల్లో పండించే వరిని ఒరైజా సటైవా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. వీటిలో జపానిక, ఇండిక, జవానిక అనే మూడు ఉపజాతులు ఉన్నాయి. మనదేశంలో ఇండికా ఉపజాతి రకాన్ని సాగుచేస్తున్నారు. వరిని అన్నంగా తినడంతో పాటు దీనితో పిండివంటలు, ఇడ్లీ, దోసె లాంటి వాటిని తయారుచేస్తారు. వడ్లను వేడినీటిలో ఉడికించి ఎండబెట్టి, మిల్లు ఆడించి ఉప్పుడు బియ్యాన్ని తయారు చేస్తారు. తవుడు నుంచి వచ్చిన నూనె వంటల్లో ఉపయోగపడుతుంది. వరిగడ్డిని పశువుల మేతగా, ఊకను ఇటుకలను కాల్చడానికి ఉపయోగిస్తారు. స్థానికంగా వరిలో హంస, జయ, మసూరి, ఫల్గుణ లాంటి రకాలు ఉన్నాయి. భారత దేశంలోని కటక్ లో ఉన్న ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోను, ఫిలిప్పైన్స్ లోని మనిలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వరికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి.
వరి తర్వాత ఎక్కువగా ఉపయోగపడుతున్న మరో ధాన్యపు మొక్క గోధుమ. దీని శాస్త్రీయనామం ట్రిటికమ్ వల్గేర్. గోధుమ పిండిని చపాతీ, పూరి లాంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గోధుమ గడ్డిని పశువుల మేతగాను, ఇంటికప్పులకు, ప్యాకింగ్ పరిశ్రమలోను ఉపయోగిస్తారు. ట్రిటికమ్ ఏస్టివమ్ అనే గోధుమ రకాన్ని బ్రెడ్ వీట్ అని అంటారు. మొక్కజొన్న శాస్త్రీయనామం జియామేస్. దీన్ని ఆహారంగా, పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఆల్కహాల్, ప్లాస్టిక్ లాంటి వాటి తయారీలో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ధాన్యాల్లో చిన్నగింజలతో కూడిన జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి వాటిని చిరుధాన్యలు అంటారు.
మాంసకృత్తులు, నూనెల మొక్కలు
పప్పు ధాన్యాలు లేదా అపరాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు మాంసకృత్తులు వీటి నుంచే లభిస్తాయి. మాంసకృత్తులు శరీరం పెరుగుదలకు, నిర్మాణానికి అవసరం. పెసర, మినుము, కంది లాంటివి వీటికి ఉదాహరణ. నిత్యజీవితంలో ఉపయోగించే వంట నునెలు వేరుశెనగ, సన్ ఫ్లవర్, పామాయిల్, కొబ్బరి, నువ్వులు లాంటి మొక్కల నుంచి లభ్యమవుతాయి. వీటిలో సఫ్లవర్ నూనె అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో ఉంటుంది. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండి గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ నూనెలే కాకుండా మొక్కల నుంచి సువాసన నిచ్చే నూనెలు కూడా లభ్యమవుతాయి. నిమ్మ, లావెండరు నూనెలు, కర్పూరతైలం మొదలైనవి వీటికి ఉదాహరణ. వేపగింజల నుంచి వచ్చిన నూనె సూక్ష్మజీవ నాశకంగా ఉపయోగపడుతుంది.
కలప, నారల మొక్కలు
కలప సాధారణంగా గృహనిర్మాణాలకు, గృహోపకరణాలకు, వ్యవసాయ పనిముట్లకు, పడవలు, వాహనాల తయారీకి ఉపయోగిస్తారు. రోజ్ వుడ్, సాలు, టేకు, వేపలాంటివి కలపనిచ్చే మొక్కలు. మొక్కలతో ఉత్పత్తి అయ్యే సన్నని పొడవాటి కేశాల లాంటి నిర్మాణాలను నార లేదా పీచు అంటారు. ఇవి మందమైన గోడలతో ఉండే నిర్జీవ కణాలు. గాసిపియం జాతికి చెందిన మొక్క పత్తి గింజల నుంచి మృదువైన కేశాల లాంటి పోగులు ఏర్పడతాయి. వీటిని దారాలుగా మార్చి వస్త్రాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. క్రొటాలేరియా జంషియా అనే మొక్క నుంచి జనపనార లభిస్తుంది. దీన్ని గోనెసంచులు, వలలు, తాళ్ల తయారీకి ఉపయోగిస్తారు. హైబిస్కస్ కెన్నాబినస్ అనే మొక్క నుంచి గోగునార లభిస్తుంది. దీన్ని కూడా గోనె సంచులు, తాళ్ల తయారీకి వాడతారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకస్ న్యూసిఫెరా. దీని ఫలాల నుంచి కొబ్బరి నార లభిస్తుంది. దీన్ని తాళ్లు, బ్రష్ లు, సంచుల తయారీకి వాడతారు. ఈ నారతో కుషన్లు, పరువులు, దిండ్లు లాంటి వాటిని తయారుచేస్తారు.
ఔషధ మొక్కలు
మొక్కలు తాము తయారు చేసుకున్న రసాయన పదార్థాలను పత్రాలు, బెరడు, ఫలాలు, విత్తనాలు లాంటి భాగాల్లో నిల్వ చేసుకుంటాయి. వీటిని మనం నేరుగాగాని, శుద్ధిచేసిగాని ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేద వైద్య విధానంలో మొక్కల నుంచి వచ్చే ఔషధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలు వివిధ మొక్కలను లవంగాలుగా వాడతారు. దాల్చిన మొక్క ఎండబెట్టిన బెరడును దాల్చిన చెక్కగా వాడతారు. కుంకుమ పువ్వు (సాఫ్రాన్)ను కీలం, కీలాగ్రం నుంచి సంగ్రహిస్తారు. ఇంగువను ఇంగువ మొక్క వేరు నుంచి సేకరించిన స్రావంతో తయారుచేస్తారు. సుగంధ ద్రవ్యాల్లో మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు (కింగ్ ఆఫ్ స్పైసిస్) లేదా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటారు. యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి (క్వీన్ ఆఫ్ స్మైసిస్) అంటారు. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియంలు కూడా పరోక్షంగా మొక్కల నుంచి లభిస్తాయి. కొన్నివేల సంవత్సరాల కిందట మొక్కలు భూమిలోకి కుంగి మట్టితో కప్పబడి పాక్షికంగా దహనం చెందడం, ఒత్తిడి కారణంగా శిలాజ ఇంధనాలుగా ఏర్పడ్డాయి.
వ్యవసాయ జీవశాస్త్రం
మొక్కల్లో పిండి పదార్థం తయారు కావడానికి, రోగ నిరోధకశక్తి ఏర్పడేందుకు, అధిక వేడి, చల్లదనాన్ని తట్టుకోవడానికి పొటాషియం తోడ్పడుతుంది. పొటాషియం లోపం వల్ల ఆకుల్లో తెల్లవి మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ముడతలు పడి వాటి అంచులు ఎండిపోతాయి. ఏ పోషక పదార్థం లేకపోయినా మొక్కల్లో పెరుగుదల లోపిస్తుంది. మొక్కలకు కావలసిన పోషక లవణాలను ఇచ్చే పదార్థాలను ఎరువులు అంటారు. ఇవి రెండు రకాలు. 1) సహజ లేదా స్వాభావిక ఎరువులు, 2) కృత్రిమ లేదా రసాయనిక ఎరువులు. సహజ ఎరువులు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారవుతాయి. పశువుల వెంట, కంపోస్టు, గింజల నుంచి నూనె తీయగా మిగిలిన పిండి, ఎముకల పొడి మొదలైనవి వీటికి ఉదాహరణ. సహజ ఎరువులు లవణాలను భూమిలోకి విడుదల చేయడానికి కొంత సమయం అవసరం. కర్మాగారాల్లో రసాయన పదార్థాలతో తయారు చేసిన వాటిని రసాయనిక ఎరువులు అంటారు. ఇవి లవణాలను తొందరగా మొక్కకు అందిస్తాయి. అమోనియం సల్ఫేటు, యూరియా, సూపర్ ఫాస్పేటు వంటివి రసాయన ఎరువులకు ఉదాహరణ. రసాయనిక ఎరువుల్లో మిశ్రమ ఎరువులు ఒకటి కంటే ఎక్కువ పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తాయి. ఎరువులు వేసినప్పుడు మొక్కలకు తగినంత నీటిని సరఫరా చేయాలి.
మొక్కలను ఆశించే కీటకాలను నివారించే పదార్థాలను కీటక నాశనులు (పెస్టిసైడ్లు) అంటారు. బాక్టీరియాలను నివారించడానికి వాడే పదార్థాలను బ్యాక్టీరియోసైడ్లు అని బూజులను (శిలీంధ్రాలను) నివారించేవాటిని ఫంగిసైడ్లు అంటారు. బ్రాడ్ కాస్టింగ్ పద్ధతిలో విత్తడానికి దున్నిన నేలలో విత్తనాలను వెదజల్లుతారు. ఇవి మొలకెత్తిన తరువాత ఒత్తుగా ఉన్న చోటు నుంచి వీటిని తీసివేసి, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నాటుతారు. పప్పులు, వేరుశనగ గింజలను ఈ పద్దతిలో విత్తుతారు.
కలుపు మొక్కల నివారణ:
సాగు మొక్కలతో పాటు పోటీ పడి పెరిగే అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. వీటిని భౌతిక, రసాయనిక, జీవ పద్ధతుల ద్వారా నియంత్రిస్తారు. దున్నడం, పనిముట్లతో పెరికి వేయడం, చేత్తో తీసివేయడం వంటివి భౌతిక పద్దతులు. రసాయనిక పద్ధతుల్లో కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగపడే రసాయనాలను గుల్మనాశకాలు లేదా హెర్బిసైడ్స్ అంటారు. 2, 4 - డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం (2, 4-D) అనేది వీటికి ఉదాహరణ. జీవక్రియా పద్ధతుల్లో కలుపు మొక్కలను సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి నాశనం చేస్తారు. పంటమార్పిడి విధానం ద్వారా కూడా కలుపు మొక్కలను నియంత్రించవచ్చు.
తెగుళ్లు-నియంత్రణ:
వివిధ పంట మొక్కలకు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, కీటకాల వల్ల అనేక తెగుళ్లు వస్తాయి. కీటకాలు, గొంగళి పురుగు దశలో మొక్కలకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి మెత్తటి ఆకులను తినేస్తాయి. కాండాలను, కాయలను గొంగళి పురుగులు తొలచివేస్తాయి. తెగుళ్లను నియంత్రించడానికి పొడి రూపంలో ఉండే మందులను డస్టర్ అనే సాధనంతో, ద్రవ రూపంలో ఉండే మందులను ప్రేయర్ అనే సాధనంతో చల్లుతారు. విత్తనాలను విత్తేముందు రసాయనాలతో శుద్ధి చేయడం, తెగులు సోకిన మొక్కలను నాశనం చేయడం, పంట మార్పిడి చేయడం కలుపు మొక్కలను ఏరివేయడం, వ్యాధి నిరోధక శక్తి ఉన్న మొక్కలను పెంచడం వంటి పద్ధతుల ద్వారా పంటలపై వచ్చే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులను నియంత్రించవచ్చు.
మిరపకు సోకే తెగుళ్లు:
మిరప మొక్కకు శిలీంధ్రాలు (ఫంగస్), బ్యాక్టీరియా, కీటకాల వల్ల పలు రకాల తెగుళ్లు సోకుతాయి.
మిరపను ఆశించే తెగుళ్లు - నివారణ
ఫంగస్ ద్వారా సోకే తెగుళ్లు
ఎ) మొదలుకుళ్లు తెగులు - తెగులు సోకిన మొక్కలను కాల్చేయాలి
బి) బూడిద తెగులు - గంధకపు పొడి చల్లాలి
సి) కాయకుళ్లు-కొమ్మఎండుతెగులు - డైతేన్ ఎం-45 మందు చల్లాలి
బ్యాక్టీరియావల్ల సోకే తెగుళ్లు
ఎ) వేరుపురుగు - వేప పిండిని పొలంలో చల్లాలి
బి) పేరుబంక - మోనోక్రోటోఫాస్ చల్లాలి
సి) కాయతొలిచే పురుగు - ఎండోసల్ఫాన్ చల్లాలి
నిమ్మజాతి మొక్కలకు సోకే తెగుళ్లు:
నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి మొక్కలను నిమ్మజాతి మొక్కలంటారు. వీటి ద్వారా మనకు విటమిన్-సి లభిస్తుంది. చీనీ (బత్తాయి) మొక్కలకు వైరస్ల వల్ల ట్రస్టీజా, మొజాయిక్, ఎల్లో కార్కివీన్ వంటి తెగుళ్లు సంభవిస్తాయి. ట్రస్టీజా తెగులుకు ఏసిడ్స్ అనే కాటకాలు వాహకాలుగా ఉంటాయి. మొజాయిక్ తెగులులో ఆకుల్లో పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఎల్లో కార్కివీన్ తెగులు కస్క్యూటీ అనే పరాన్న ఔషధ మొక్క వల్ల కూడా వ్యాపిస్తుంది. నిమ్మజాతి మొక్కల్లో జంథోమొనాస్ సిట్రి అనే బాక్టీరియా వల్ల సిట్రస్ కాంకర్ (గజ్జి తెగులు) వస్తుంది. లీ మైనర్, సిట్రస్ బటర్ ఫ్లై, ఏసిడ్స్, నల్లిపురుగులు వంటి కీటకాలు ఈ మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు మొనోక్రోటోఫాస్ అనే రసాయనాలను చల్లవచ్చు.
ద్రాక్ష, కొబ్బరి మొక్కలకు సోకే తెగుళ్లు:
ద్రాక్ష మొక్కలపై శిలీంధ్రం వల్ల డైనీమిల్ డ్యూ అనే తెగులు సోకుతుంది. వేన్ గల్ బీటిల్ అనే కీటకం కాండం చుట్టూ బెరడును తొలిచేస్తుంది. కొబ్బరి చెట్లలో రైనోసిరాస్ బీటిల్ అనే కీటకం కాండం చివర ఉండే లేత ఆకులను, పుష్పాలను నాశనం చేస్తుంది. వైరస్ వల్ల కొబ్బరిలో విక్ట్ అనే తెగులు సోకుతుంది.
పత్తి, చెరకు మొక్కలకు సోకే తెగుళ్లు:
పత్తి మొక్కలను అనేక రకాల కీటకాలు ఆశిస్తాయి. ఈ కీటకాలన్నీ గొంగళి పురుగుదశలో పైరుకు నష్టాన్ని కలిగిస్తాయి. పత్తిని ఆశించే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి పురుగు వంటివి రసాన్ని పీల్చే పురుగులకు ఉదాహరణ. మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, గులాబి రంగు పురుగు వంటివి కాయ తొలిచే పురుగులకు ఉదాహరణ. పత్తిని ఆశించే తెగుళ్లఓ ముఖ్యమైనవి నల్లమచ్చ, వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఎండుతెగుళ్లు, చెరకును కాండం తొలిచే పురుగు, పిండినల్లి పొలుసు పురుగు, వేరుపురుగు, దూదేకుల పురుగు వంటివి ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. శిలీంధ్రాల వల్ల కీటక లేదా కొరడా తెగులు, ఎర్రకుళ్లు వంటివి సోకుతాయి.
పరిసరానుగుణ్యత
మొక్కల్లో పరిసరానుగుణ్యత
మొక్కలు వివిధ పరిసరాల్లో నివసిస్తూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ దేహభాగాల్లోను, జీవన విధానాల్లోను మార్పు చేసుకోవడాన్నే పరిసరానుగుణ్యత అంటారు.
నీటిలో ఉండే మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి. 1) నీటిపై తేలే మొక్కలు. ఉదాహరణ పిస్టియా (అంతర తామర), ఐకార్నియా, ఉల్ఫియా 2) నీటిలో నాటుకుని పైకి తేలే మొక్కలు. ఇవి వేర్ల సహాయంతో భూమిలో నాటుకుని పొడవైన పత్ర వృంతాల సహాయంతో నీటిపై తేలుతుంటాయి. ఉదాహరణ కలువ, తామర మొక్కలు. 3) పూర్తిగా నీటిలో ఉండే మొక్కలు. వీటికి ఉదాహరణ హైడ్రిల్లా, వాలిస్ నేరియా, యుట్రిక్యులేరియా. ఈ నీటి మొక్కల్లో అనేక అనుకూలనాలు కనిపిస్తాయి. పిస్టియా, ఐకార్నియాల్లో నీటిమీద తేలడానికి సమతూకం జరిపే వేళ్లు ఉన్నాయి. నీటి మొక్కల కాండాల్లో గాలిగదులు ఉండి గాలిని నిల్వ చేస్తాయి. ఇవి మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. తామర మొక్క పత్రాలపైన మైనపుపూత ఉంటుంది. ఇది పత్రాలపై నీరు నిల్వ ఉండకుండా, పత్రరంధ్రాలు మూసుకుపోకుండా సహాయపడుతుంది. కొన్ని నీటి మొక్కల్లో పత్రాలు చీలి ఉండి నీటి ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయి. నీటి మొక్కల్లో వేరువ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండదు.
ఎడారి మొక్కలు
నీరు అతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. నాగజెముడు, కాక్టస్, బ్రయోఫిల్లమ్, కలబంద మొదలైనవి వీటికి ఉదాహరణ. ఈ మొక్కల వేళ్లు లోతుగా ఉన్న నీటిని పీల్చుకోడానికి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నాగజెముడు (ఒపన్షియా) మొక్కలో కాండం పైనున్న పత్రాలు బాష్పోత్సేకాన్ని తగ్గించుకోడానికి ముళ్లలా మారి ఉంటాయి. దీనిలో కాండం ఆహారం తయారుచేసుకోవడానికి వీలుగా ఆకుపచ్చగా ఉంటుంది. కలబంద, బ్రయోఫిల్లమ్ మొక్కలు నీటిని పత్రాల్లో నిల్వ చేసుకుంటాయి. మరికొన్ని నీటిని కాండాల్లో నిల్వ చేసుకుంటాయి. ఈ అనుకూలనాలన్నీ నీటి పొదుపుకు సంబంధించినవి.
జంతువుల్లో పరిసరానుగుణ్యత
వివిధ పరిసరాల్లో నివసించే జంతువులు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా తమ శరీర నిర్మాణాన్ని మార్పిడి చేసుకున్నాయి. నీటిలో నివసించే చేపలకు నీటిలో కరిగిన ఆక్సిజనను పీల్చుకోవడానికి మొప్పలు ఉన్నాయి. వీటి శరీరం నీటిలో చలనానికి ఉపయుక్తంగా ఉంటుంది. చేపలోని తోక దిశను మార్చుకోవడానికి, రెక్కలు సమతాస్థితిని నిలపడానికి, ఈదడానికి ఉపయోగపడతాయి. కప్ప నీటిలో, నేలపైన నివసిస్తుంది. కాబట్టి దీన్ని ఉభయజీవి అంటారు. కప్పకు ఉండే రెండు జతల కాళ్లు నేలపై దుమకడానికి ఉపయోగపడుతుంది. వెనక కాళ్ల మధ్య ఉండే చర్మం తెడ్లలా పనిచేసి నీటిలో ఈదడానికి సహాయపడుతుంది. కప్పకు నేల మీద శ్వాసించడానికి ఒక జత ఊపిరితుత్తులు ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు తడిగా ఉండే చర్మం సహాయంతో శ్వాసిస్తుంది. పాముల శరీరంపై ఉండే పొలుసులు పాకడానికి సహాయపడతాయి. పక్షుల్లో ముందరి జత చలనాంగాలు రెక్కలుగా మారి గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. రెక్కల్లో ఉండే ఈకలు గాలిని అడ్డుకుని తెరచాపలా ఉంటాయి. ఎముకలు బోలుగా గాలితో నిండి ఉండి శరీర బరువు తగ్గించడానికి, తేలికగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. ఎడారిలో నివసించే జంతువులు తమ శరీరం ద్వారా నీటిని నష్ట పోకుండా అనేక అనుకూలనాలను చూపుతాయి. ఒంటె ఆహారం దొరికినప్పుడు ఎక్కువగా తిని జీర్ణమైన ఆహారాన్ని కొవ్వు రూపంలో దాచుకుంటుంది. ఆహారం దొరకనప్పుడు దీనిని కరిగించుకుని శక్తిని, నీటిని పొందుతుంది. నీటిని కూడా నేరుగా తన శరీరంలో దాచుకుంటుంది. శరీరంపై వెంట్రుకలుంటాయి. స్వేద రంధ్రాలు ఉండవు. దీనివల్ల ఒంటెకు చెమట పట్టదు. ఇసుక ముక్క రంధ్రాల్లో దూరకుండా అవి సన్నగా, లోపల ఉంటాయి. కనురెప్పలు ముందుకు వచ్చి ఇసుక నుంచి కాపాడతాయి. పాదాల అడుగున వెడలైన మెత్తలు ఉండి ఇసుకలో నడపడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకమైన అనుకూలనాలు ఉండడం వల్ల ఒంటెను ఎడారి ఓడ అంటారు.
ధ్రువ ప్రాంతాల్లో ఉండే జంతువులైన ధ్రువపు ఎలుగు బంట్లు, సీళ్లు, పెంగ్విన్లు కూడా అనేక అనుకూలనాలను చూపుతాయి. వీటిలో ధ్రువపు ఎలుగుబంటి శరీరంపై ఉన్న దట్టమైన ఉన్ని శరీరం నుంచి వేడి బయటకు పోకుండా, బయటి చలి శరీరానికి తగలకుండా కాపాడుతుంది. పాదాల అడుగున ఉన్న వెంట్రుకలు మంచుపై నిలదొక్కుకోవడానికి, ముందరి పాదాల మధ్య ఉన్న చర్మం ఈదడానికి ఉపయోగపడతాయి. శీతాకాలంలో అధిక చలి నుంచి రక్షించుకోవడానికి ఇవి శీతాకాలపు నిద్రను చూపిస్తాయి. ఈ సమయంలో ఇవి కదలకుండా పడుకుని శ్వాసక్రియను నెమ్మదిగా జరుపుకొంటూ నిల్వ ఉన్న కొవ్వును శరీర అవసరాలకు వాడుకుంటాయి.
పశుసంపద
ఆవులు, ఎడ్లను తెల్లజాతి, దున్నలు, గెదెలను నల్లజాతి పశువులని అంటారు. పశువుల నుంచి మనకు పాలు, మాంసం లభిస్తాయి. పాల ఉత్పత్తిని పెంచడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒంగోలు జాతి, హర్యానా జాతి పశువులు మన దేశంలో ఉండే తెల్లజాతి పశువులు. ఒంగోలు జాతి పశువులు అధిక వాతావరణ ఉష్ణోగ్రతను విషజ్వరాలను తట్టుకుంటాయి. ఇంగ్లండ్ కు చెందిన జెర్సీ ఆవులను, డెన్మార్క్ కు చెందిన హాల్ స్టీన్ ఆవులను మన దేశంలోని ఆవులతో సంకర పరచి సంకరజాతి ఆవులను సృష్టించారు. ఇవి పాలను అధికంగా ఇస్తాయి.
ఆవుపాలకంటే గేదెపాలలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి కాబట్టి, పాల పదార్థాలు తయారు చేయడానికి గేదెపాలు అనుకూలమైనవి. ఆవుల కంటే గేదెలు వ్యాధులను ఎక్కువగా తట్టుకుంటాయి. మనదేశంలో ముర్రా, భద్వారి, జఫ్రాబాడి, సుర్తి, మేష్న, నాగ పూరి, నీలిరావి వంటి గేదె జాతులు ఉన్నాయి. వీటిలో ముర్రాజాతి గేదెలు ఎక్కువ పాలను ఇస్తాయి. పశుగ్రాసాల కోసం నేపియర్ గడ్డి, పారాగడ్డి వంటి వాటిని పెంచుతారు. తీపిజొన్న, లూస్నర్, జనుము, వంటివి కూడా పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. పెరుగుదలకు, శరీరాభివృద్ధికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వులు, పిండిపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండటం వల్ల పాలను సంపూర్ణాహారం అంటారు.
సాధారణ పద్ధతుల్లో సంకరజాతి పశువులను ఉత్పత్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించం కోసం కృత్రిమ గర్భధారణ, సూపర్ ఓవ్యులేషన్, పిండిమార్పిడి అనే విధానాలను అనుసరిస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో ఎద్దుల నుంచి సేకరించిన శుక్లాన్ని-180°C వద్ద నత్రజని ద్రావణంలో మొదట నిల్వ చేస్తారు. దీన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి ఆవుల్లోకి ప్రవేశపెడతారు. ఆవు నుంచి ఒకేసారి అనేక అండాలను విడుదల చేయడానికి గర్భంతో ఉన్న ఆడ గుర్రాల రక్తం నుంచి సేకరించిన సీరమ్ గొనాడో ట్రాపిన్ అనే హార్మోన్ ను ఎక్కిస్తారు. ఇలా వచ్చిన అండాలను కృత్రిమ ఫలదీకరణ జరిపి పిండాలను మరో ఆవులోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతినే పిండమార్పిడి అంటారు.
చేపలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మత్స్య సంవర్ధనం అంటారు. చేప మాంసంలో విటమిన్-ఎ, డి, శరీరానికి ఉపయోగపడే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. బొచ్చె, వాలుగ, మట్టగిడస మొదలైనవి మంచి నీటి చేపలకు ఉదాహరణ. పొలస, సుడుము, సొర, రిబ్బను చేప వంటివి సముద్ర చేపలకు ఉదాహరణ. చేపలు గుడ్లు పెట్టడానికి వాటికి పియూష గ్రంథి స్రావాన్ని ఎక్కిస్తారు. చేపలను డబ్బాల్లో నిల్వ చేసే ముందు క్లాడ్లీడియం బోటులీనమ్ వంటి బాక్టీరియాలను లేకుండా చూడాలి. మేకలు,
గొర్రెల నుంచి మనకు మాంసం, ఉన్ని లభిస్తుంది. నెల్లూరు జాతి గొర్రెలు రుచిగల మాంసాన్ని, దక్కన్ జాతి గొర్రెలు మాంసంతో పాటు ఉన్నిని కూడా ఇస్తాయి. కోళ్లలో గుడ్లు పెట్టే వాటిని లేయర్స్ అని, మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అని అంటారు. గుడ్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి వైట్ లెగ్ హార్న్ రకాన్ని పెంచుతారు.
జంతువులు - ఉపయోగాలు
పట్టుదారం పట్టుపురుగుల నుంచి లభిస్తుంది. వీటి పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు పట్టును ఉత్పత్తి చేస్తుంది. దీని లాలాజలం గ్రంథులు పట్టు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి. పట్టులో నాలుగు రకాలున్నాయి. అవి: మల్బరి పట్టు, టస్సార్ పట్టు, ఈరిపట్టు, ముగాపట్టు. వీటిలో మల్బరి పట్టు ఎక్కువ నాణ్యమైంది. మల్బరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం బొంబెక్స్ మోరి. ఇవి మల్బరి ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.
మల్బరి పట్టు ఉత్పత్తి - వివిధ దశలు :
ఆడజీవి పెట్టిన గుడ్లు పొదిగి గొంగళిపురుగులుగా మారతాయి. ఇవి మల్బరి ఆకులుతింటూ పెరుగుతాయి. దీని తర్వాత గొంగళి పురుగులు తమ పాత కవచాన్ని వదిలి కొత్త కవచాన్ని ఏర్పర్చుకుంటాయి. దీన్ని నిర్మోచనం అంటారు. గొంగళిపురుగు శరీరం చుట్టూ పట్టు దారాలతో కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని కుకూన్ అంటారు. పట్టుపురుగు జీవితదశలోని ఈ దశను ప్యూపా అంటారు. ఈ దశ తర్వాత ప్యూపా మార్పు చెందివ ప్రౌఢజీవిగా మారి కుకూనను ఛేదించుకుని బయటికి వస్తుంది. ఈ ప్రక్రియను రూపవిక్రయం అంటారు. దీనికి ముందే కుకూన్లను వేడినీటిలో ఉంచి లోపల ఉన్న మాత ను చంపి కుకూన్ల నుంచి పట్టుదారాన్ని రీలింగ్ యూనిట్లలో సేకరిస్తారు. ప్రౌఢజీవి కుకూన్ నుంచి బయటకు వస్తే పట్టుదారం ముక్కలైపోతుంది. ఇది పట్టుదారం తయారీకి ఉపయోగపడదు. పట్టు పురుగు గొంగళిపురుగుకు సూక్ష్మజీవి వల్ల పెట్రైన్ అనే వ్యాధి వస్తుంది. పట్టులో పైబ్రోయిన్ అనే ప్రొటీను ఉంటుంది.
టస్సార్ పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం ఆంథిరియా పాఫియా. ఇది ఓక్, ఫిగ్ మొక్కల పై పెరుగుతుంది. ఈరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం అట్టాకస్ రిసిని. ఇది ఆముదం ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. ముగా పట్టును ఆంథోరియా ఆస్సమా అనే పట్టుపురుగు ఉత్పత్తి చేస్తుంది. పట్టుదారాలు తేలికగా దృఢంగా ఉంటాయి. వీటిని దుస్తులు, పారాచూట్టు, చేపల వలలు, ఇన్సులేటర్ కాయిల్స్, రేసింగ్ కార్లటైర్లు లాంటి వాటిని తయారు చేయడానికి వాడతారు.
తేనె:
తేనెను ఎపిస్ జాతికి చెందిన కీటకాలైన తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. వీటి పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఒక గుంపులోని తేనెటీగలు రాణి ఈగ, డ్రోనులు, కూలి ఈగలు అనే రకాలుగా ఉంటాయి. సమూహానికి ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. గుడ్లను పెట్టడం దీని ముఖ్య విధి. కూలి ఈగలు మకరందాన్ని సేకరించి తేనె పట్టులో నింపుతాయి. వీటికి మైనపు గ్రంథులు ఉండటం వల్ల ఇవి మైనాన్ని ఉత్తప్తి చేస్తాయి. వీటికి దాడిచేసే స్వభావం ఉంటుంది. డ్రోనులు మగ ఈగలు. ఇవి రాణి ఈగతో సంపర్కం జరుపుతాయి.
తేనెటీగల్లో నాలుగు రకాలున్నాయి. అవి: 1) ఎపిస్ డార్సేట. దీన్ని రాక్ తేనెటీగ అని కూడా అంటారు. ఇది ఎక్కువ తేనెను ఇచ్చినప్పటికీ వీటిని మచ్చిక చేసుకోవడానికి వీలుపడదు. 2) ఎపిస్ ఇండికా. దీన్ని ఇండియన్ తేనెటీగ అంటారు. దీన్ని తేనెను ఉత్పత్తి చేయడానికి పెంచుతారు. 3) ఎపిస్ ఫ్లోరియా. దీన్ని చిన్న తేనెటీగ అంటారు. 4) ఎపిస్ మిల్లి ఫెరా.
తేనె మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే చక్కెరలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. తేనెను కేకులు, బిస్కెట్లు, బ్రెడ్లు లాంటి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద, యునాని వైద్యంలో వాడతారు. ఇది దగ్గు, ఎనీమియా, జలుబు లాంటి వాటిని నివారిస్తుంది. తేనెటీగల మైనాన్ని కొవ్వొత్తుల తయారీకి, తోళ్ల పరిశ్రమలోనూ వాడతారు.
లక్క
లక్క టకార్డియా లక్క లేదా రాసిఫర్ లక్క అనే కీటకం శరీరం నుంచి స్రవిస్తుంది. ఇది తుమ్మ, రేగు, రావి, మామిడి, సాల్ లాంటి వృక్షాలపై పెరుగుతుంది. కీటకం చెట్ల రసాలను పీల్చుకుని రక్షణ కోసం లక్కను విడుదల చేస్తుంది. ఈ లక్కను చెట్ల నుంచి తీసి శుభ్రపరిచి అనేక రకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని సీలింగ్ ఏజెంట్ గా, ప్రింటింగ్ లో, పెయింట్స్, వార్నిష్ తయారీలో ఉపయోగిస్తారు. ఆభరణాలను నింపడానికి, ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఇన్సులేటర్ గా లక్క ఉపయోగపడుతుంది.
సర్పాలు, పక్షుల ఆర్థిక ప్రాముఖ్యం
ఇవి పొలంలో ఎలుకల జనాభాను అదుపులో ఉంచి పంటను రక్షిస్తాయి. కొన్ని దేశాల్లో సర్పాల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. వీటి విషాన్ని యాంటి వీనమ్ తయారు చేయడానికి, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. సర్పాల చర్మాలను హాండ్ బ్యాగులు, బెల్టులు, కొన్ని దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు.
పక్షుల నుంచి మనకు మాంసం, గుడ్లు లభిస్తాయి. కోడి, బాతు, టర్కీ పక్షి లాంటివి మనకు ఉపయోగపడతాయి. కోళ్లలో రోడ్ ఐలెండ్, లెగ్ హరన్ జాతి కోళ్లను పెంచుతున్నారు. ఆహారం, సంతానోత్పత్తి కోసం పక్షులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోతాయి. సైబీరియా కొంగ రష్యా నుంచి భారత దేశానికి వలస వస్తుంది. పక్షులను సహజ పరిస్థితుల్లో పరిరక్షించే ప్రదేశాన్ని శాంక్చుయరీ అంటారు. పక్షులకు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, పరిరక్షించే ప్రదేశాన్ని ఎవియరీ అంటారు.
క్షీరదాల ఉపయోగం
క్షీరదాల్లో ఆవు, గేదె, గుర్రం, మేక, గొర్రె, పంది లాంటి జంతువులు మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆవు, గేదెల నుంచి పాలు లభిస్తున్నాయి. కొన్ని పశువులు వ్యవసాయంలో ఉపయోగపడుతున్నాయి. మేకలు, గొర్రెల నుంచి పాలు, మాంసం, తోలు లభిస్తున్నాయి. గొర్రె శరీరం మీద పొడవుగా, బిరుసుగా, నిటారుగా ఉండే రోమాలను ద్వితీయ రోమాలు లేదా ప్లీస్ అంటారు. వీటి నుంచి ఉన్ని దుస్తులను తయారు చేస్తారు. స్పెయిన్ దేశానికి చెందిన మెరీనో జాతి, న్యూజిలాండ్ దేశానికి చెందిన కోరిడెల్ జాతి గొర్రెల నుంచి మేలు రకం ఉన్ని లభిస్తుంది. తోలుకు కొరాకుల్ జాతి గొర్రె ప్రసిద్ధిచెందింది.
పందులను ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు. ఇవి మిగతా జంతువుల కంటే త్వరగా పెరుగుతాయి. ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువ, ఖర్చు తక్కువ. పంది మాంసాన్ని ఫోర్క్ అంటారు. దేసి గోరి రకాలు భారతదేశంలో ప్రసిద్ధి. బెర్క్ షైర్, యార్క్ షైర్, లాండ్ రేస్ రకాలు విదేశాల్లో ప్రసిద్ధి చెందాయి.
గుర్రాలు రవాణాకు, వినోదానికి ఉపయోగపడతున్నాయి. మధ్య ఆసియా, రష్యా దేశాల్లో నివసించే ప్రిజివాల్ స్కి గుర్రాలను మచ్చిక చేసిన గుర్రాల పూర్వీకులుగా భావిస్తారు. మగ గాడిద, ఆడ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడిన జీవిని మ్యూల్ అంటారు. ఆడ గాడిద, మగ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడ్డదాన్ని హిన్ని అంటారు. మ్యూల్స్ వంధ్య జీవులు. ఇవి పర్వత ప్రాంతాల్లో బరువులు మోయడానికి ఉపయోగపడతాయి.
నిమ్నస్థాయి జంతువుల ప్రయోజనాలు
నిమ్నస్థాయి జంతువులైన ప్రోటోజోవాలు, స్పంజికలు, మొలస్కా జీవులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రోటోజోవా వర్గంలోని ఫారామిని ఫెరిడా, రేడియోలేరియా విభాగ జీవులు కవచంతో ఉంటాయి. ఇది కాల్షియం కార్బొనేట్, సిలికాన్తో నిర్మితమై ఉంటుంది. ఈజీవులు చనిపోయిన తర్వాత వీటి అస్థిపంజరాలు సముద్రం ఆడుగుకు చేరి ఓషన్ ఊజ్ గా ఏర్పడి, గట్టిపడి శిలలుగా ఏర్పడతాయి. ఇలాంటి రాయిలాంటి నిర్మాణాలతో కట్టడాలను నిర్మిస్తారు. ఇవి పరిశ్రమల్లో మెరుగు పెట్టడానికి, ఆకురాయిలా వాడటానికి కూడా ఉపయోగపడుతున్నాయి.
సముద్రాల్లో నివసించే స్పంజికల అస్థిపంజరం కంటకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కంటకాలు కాల్షియం కార్పొనేట్, సిలికాన్, స్పాంజిన్ తంతువులతో నిర్మితం. స్పంజికలు మరణించిన తర్వాత కంటకాలు సముద్రం అడుగుభాగానికి చేరి అడ్డుగోడల్లో తయారవుతాయి. ఈ ప్రదేశం అనేక జంతువులకు ఆవాసంగా ఉంటుంది. మొలస్కా జంతువులు మానవుడికి ఆహారం, అలంకరణ వస్తువులుగా ఉపయోగపడతాయి. వీటిలో రెండు కల్పాలుండే ద్వికవాటులైన ఆల్చిప్ప, ఆయిష్టర్లు ఆహారంగా ఉపయోగపడతాయి. మొలస్కా జంతువుల పైన ఉండే కర్పరాలను ఆటబొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీకి, కోళ్లకు ఆహారం, రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ముత్యాలు మొలస్కా జీవులైన ముత్యపు చిప్పలు లేదా పెరల్ ఆయస్టర్ల నుంచి లభ్యమవుతాయి. ఈ జీవుల కర్పరంలోకి ఇసుక రేణువుల లాంటివి చేరినప్పుడు దాని చుట్టూ కాల్షియం కార్బొనేటు స్రవించి ముత్యంలా మారుతుంది.
జీవ నియంత్రణ
పంటలను ఆశించే కీటకాలను, వాటి సహజ శత్రువులను లేదా ఇతర జీవులను ఉపయోగించి నియంత్రించడాన్ని జీవశాస్త్రీయ నియంత్రణ లేదా జీవనియంత్రణ అంటారు. సాధారణ పద్ధతిలో కీటకాలను సంహరించడానికి డి.డి.టి. లాంటి కీటక నాశనులను వాడుతున్నారు. దీనివల్ల కాలుష్యం కలగడంతోపాటు అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. జీవ నియంత్రణలో కీటకాలను ప్రోటోజోవా జీవులను పరాన్నజీవులుగా ఉపయోగించి చీడ పురుగులను సంహరిస్తారు. ఇవి చీడ పురుగులోకి ప్రవేశించి వాటికి వ్యాధులను కలుగజేసి నియంత్రిస్తాయి. ఉదాహరణకు టాకినాడ అను ఈగలను, గొంగళిపురుగులను అదుపులో పెట్టడానికి ఉపయోగిస్తారు.
చీడపీడలను అదుపులో పెట్టడానికి వాటిని ఆహారంగా తీసుకునే పరభక్షకాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు నీటిలో నివసించే దోమ కీటక లార్వాలను సంహరించడానికి చేపలను ఉపయోగిస్తారు. పక్షులు, కప్పలు కూడా పరభక్షోఆలుగా ఉపయోగపడతాయి. కీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు విడుదలచేసే బాహ్య హార్మోన్లను ఫెరమోన్లు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షించడానికి తోడ్పడతాయి. ఈ హార్మోన్లను కీటకాల బోనుల్లో ఉంచి చీడ పురుగులను అదుపులో ఉంచుతారు.
మరో జీవ నియంత్రణ పద్ధతిలో మగ పురుగులకు మాత్రమే శక్తిమంత X కిరణాలను ప్రసరింపజేసి వాటిని వంధ్య జీవులగా మారుస్తారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. వేప లాంటి మొక్కల నుంచి వచ్చిన రసాయనాలు కూడా చీడపీడలను సంహరించడానికి ఉపయోగపడతాయి. ఇవి కీటకాల రూప విక్రయాన్ని నిలుపుదల చేసి వాటి అభివృద్ధిని నిరోధిస్తాయి. ఆహార పదార్థాల నిల్వ ధాన్యాలు, వండిన ఆహార పదార్థాలు, సండ్లు, కూరగాయల లాంటి వాటిని సరిగా నిల్వచేయాలి. లేకపోతే వాటి పై కీటకాలు, బ్యాక్టీరియా, శిలీంద్రాలు ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఆహారపదార్థాలపై శిలీంద్రాలు చర్య జరిపి వాటిని ఇతర పదార్థాలుగా మారుస్తాయి. ఉదా: చక్కెర ద్రావణం,
జామ్ లపై ఈస్ట్ అనే శిలీంద్రం పెరిగి ఆ పదార్థాలను ఆల్కమాల్, కార్బన్ డై ఆక్సైడ్ గా మారుస్తుంది. సరిగా నిల్వచేయని చేపలపై క్లాస్ట్రీడియం బ్యాక్టీరియా పెరిగి విషపూరితం చేస్తుంది. వేరు సెనగను సరిగా నిల్వచేయకపోతే వాటి పై శిలీంద్రాలు ఆశించి అప్లోటాక్సిన్ విషపదార్థాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కాలేయానికి హానికరం. ఆహార పదార్థాలను నిల్వచేయడానికి కింది పద్ధతులున్నాయి.
ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చేపలు లాంటి వాటిని ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. దీనివల్ల ఈ పదార్థాల్లోని తేమ బాగా తగ్గిపోయి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువుగా ఉండదు. చేపలు, మాంసం లాంటి వాటిని మండుతున్న కట్టెలపై ఉంచి కూడా వాటిలోని తేమను తొలగించి సూక్ష్మ జీవుల పెరుగుదలను అరికట్టవచ్చు. చిన్నపిల్లల ఆహారం, పాలపొడి లాంటి వాటిని పరిశ్రమల్లో తుంపర పద్దతిలో ఆరబెడతారు. మామిడి, చింత, టమాట లాంటి వాటిని ఉప్పును కలిపి ఎండబెట్టడం లేదా ఊరవేయడం ద్వారా నిల్వచేయొచ్చు. ఆహార పదార్థాలను రిఫ్రిజరేటర్ లో ఉంచడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవుల పెరుగుదల ఆగిపోతుంది.
గ్రామీణ ప్రాంతాలలో ధాన్యాలను నేల గదుల్లో నిల్వ చేస్తారు. పాల లాంటి ద్రవాలను నిల్వ చేయడానికి వాటిని పాశ్చరైజేషన్ చేస్తారు. పాలను 65°C వద 30 సెకన్లు లేదా 72°C వద్ద 15 సెకన్లు ఉంచి సూక్ష్మజీవరహితం చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు.
ఆహార పదార్థాలను ఉడికించి డబ్బాల్లో ఉంచి గాలి లేకుండా సీలువేసి నిల్వచేస్తారు. గాలి లేకపోవడం వల్ల చాలావరకు సూక్ష్మజీవుల పెరుగుదల ఆగిపోతుంది. ధాన్యాలను నాశనం చేసే కీటకాలను సంహరించడానికి డి.డి.టి., మలాథియాన్ లాంటి కీటక నాశనులను వాడతారు. పొగబారినుంచి ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు ఇథైలిన్ డై బ్రోమైడ్ లేదా అల్యూమినియం ఫాస్పయిడ్ ను ఉపయోగిస్తారు. ఎలుకలను నియంత్రించడానికి జింక్ ఫాస్పయిడ్, వార్పరిన్ అనే రసాయనాలను ఆహారపదార్థాలతో కలిపి తినేట్లు చేస్తారు. దీనివల్ల అవి చనిపోతాయి.
జంతువులన్నింటిని వెన్నెముక లక్షణం ఆధారంగా రెండు రకాలుగా విభజించారు. అవి: 1) అకశేరుకాలు లేదా వెన్నెముకలేని జంతువులు 2) సకశేరుకాలు లేదా వెన్నెముక కలిగిన జంతువులు.
అకశేరుకాలు :
1. ప్రోటోజోవా
2. ఫొరిఫెరా
3. సీలెంటరేటా
4. ప్లాటి హెల్మింథిస్ని
5. మాటి హెల్మింథిస్
6. నిలేడా
7. ఆర్థ్రోపోడా
8. మొలస్కా
9. ఇఖైనోడర్మేటా
ప్రోటోజోవా : ఇవి జంతువుల్లో ప్రాథమిక జీవులు. ఇవి ఏకకణయుతంగా నిర్దిష్ట కేంద్రకంతో ఉంటాయి. ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. అమీబా, పారామీషియం, వర్టి సెల్లా, ప్లాస్మోడియం, యూగ్లినా లాంటివి ప్రోటోజోవాజీవులకు ఉదాహరణ.
పొరిఫెరాజీవులు : ఇవి బహుకణ జీవులు. వీటి శరీరంలో అనేక రంధ్రాలు ఉంటాయి. ఇవి స్థానబద్ద జీవులు. వీటికి ఉదాహరణ స్పంజికలు.
సీలెంటరేటా : ఈ జీవులు రెండు పొరలతో కూడిన దేహాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. శరీరం మధ్యలో కుహరం ఉంటుంది. నోటి చుట్టూ స్పర్శకాలు లేదా టెంటకిల్స్ అనే నిర్మాణాలుంటాయి. ఇవి ఆహార సేకరణకు, గమనానికి ఉపయోగపడతాయి. హైడ్రా అనేది సీలెంటరేటాకు చెందిన జీవి.
ప్లాటి హెల్మింథిస్ : ఈ జీవులు బల్లపరుపుగా ఉండే జీవులు. వీటి శరీరంలో మూడు పొరలుంటాయి. కాబట్టి ఇవి త్రిస్తరిత జీవులు. ఈ విభాగంలో ఎక్కువగా జీవులు పరాన్న జీవనం గడుపుతాయి. ఉదాహరణకు మానవుడి జీర్ణనాళంలో నివసించే బద్దెపురుగు.
నిమాటి హెల్మింథిస్ : ఇవి పొడవుగా, స్తూపాకారంగా రెండు చివరల మొనదేలి ఉంటాయి. ఇవి దారపు పోగుల్లా ఉంటాయి. వీటికి ఉదాహరణ మానవుడి పేగులో నివసించే ఏలికపాము.
అనిలెడా : ఈ జీవుల్లో శరీరం స్తూపాకారంగా ఉండి శరీరమంతా ఉంగరాల్లాంటి ఖండితాలు ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. వానపాము, జలగ వీటికి ఉదాహరణ.
ఆర్థ్రోపోడా : వీటికి కీళ్లతో కూడిన కాళ్లు ఉంటాయి. ఇవి జంతురాజ్యంలో అత్యధికంగా ఉండే జీవులు. ఈగ, బొద్దింక లాంటి కీటకాలతోపాటు సాలెపురుగు, తేలు, పీతలాంటి జంతువులు. ఈ విభాగానికి చెందుతాయి.
మొలస్కా : మెత్తటి శరీరం ఉన్న జీవులు మొలస్కా విభాగానికి చెందుతాయి. వీటికి రక్షణగా శరీరంపైన పెంకు లాంటి కర్పరముంటుంది. ఇవి సముద్రాల్లో, మంచి నీటిలో నివసిస్తాయి. నత్త, ఆల్చిప్ప, ముత్యాలను ఏర్పరిచే ముత్యపు చిప్పలు వీటికి ఉదాహరణ.
ఇఖైనోడర్మేటా : జీవుల చర్మం మందంగా ముళ్లతో ఉంటుంది. ఇవి పూర్తిగా సముద్రపు జీవులు. సముద్ర నక్షత్రం, సముద్ర దోసకాయలు, సీఅర్చిన్ లాంటి జీవులు వీటికి ఉదాహరణ.
సకశేరుకాలు
వెన్నెముక ఉన్న జంతువులు అభివృద్ధి చెందిన జీవులు. వీటిని చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనే విభాగాలుగా విభజించారు.
చేపలు : ఇవి జలచర జీవనం గడుపుతాయి. వీటి శరీరంపై పొలుసులుంటాయి. రెండు గదుల గుండె ఉంటుంది. దేహ ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీటిని శీతలరక్త జీవులు అంటారు. ఉదాహరణకు సొరచేప, కొర్రమట్ట, క్యాట్ ఫిష్ మొదలైనవి.
ఉభయచరజీవులు : ఇవి నీటిలోను, నేలపైనా జీవిస్తాయి. చర్మం తడిగా ఉండి, గుండె మూడు గదులతో ఉంటుంది. వీటికి చలించడానికి ఒక జంత అంగాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ కప్ప.
సరీసృపాలు : ఇవి భూమిపై పాకే జంతువులు. వీటి శరీరంపై పొలుసులు ఉంటాయి. వీటి గుండె అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులతో ఉంటుంది. మొసలి, బల్లి లాంటి జీవుల్లో గమనానికి రెండు జతల అంగాలు ఉంటాయి. పాము, తాబేలు, మొసలి సరీసృపాలకు చెందిన జీవులు.
పక్షులు : ఇవి ఎగరడానికి తగిన దేహ అనుకూలనాలను చూపుతాయి. శరీరంపై ఈకలుంటాయి. ముందరి జత అంగాలు రెక్కలుగా మార్పు చెంది ఎగరడానికి ఉపయోగపడతాయి. నోరు ముందుకు సాగి ముక్కుగా మార్పు చెంది ఉంటుంది. ఇవి ఉష్ణరక్తజీవులు. శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారకుండా స్థిరంగా ఉంటుంది. నాలుగు గదుల గుండెతో ఉంటాయి.
క్షీరదాలు : ఇవి క్షీరగ్రంథులను కలిగి ఉంటాయి. శరీరంపై వెంట్రుకలు, దంతాలు అనేక రకాలుగా ఉండి, విభాజక పటలం (డయాఫ్రమ్) ఉండటం వీటి ముఖ్య లక్షణం. ఇవి కూడా ఉష్ణరక్త జంతువులు. మానవుడు, కోతి తిమింగలం, ఆవు లాంటివి క్షీరదాలకు ఉదాహరణ.
జంతువులలో పోషకాహార విధానం
జంతువులు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోలేవు కాబట్టి వాటిని పరపోషకాలు అంటారు. జంతువులకు తయారయిన ఆహారం అవసరం కాబట్టి అవి తినే మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, పాము కప్పలను తింటాయి, కీటకాలు జంతువుల మృతదేహాలను తింటాయి, పక్షులు పురుగులు మరియు కీటకాలను తింటాయి.
పోషకాహార పద్ధతులు
పోషకాహారంలో రెండు రకాలు ఉన్నాయి. అవి:
1) స్వయం పోషణ (ఆటోట్రోఫిక్)
2) పరపోషణ (హెటెరోట్రోఫిక్) పరపోషణ ద్వారా పోషకాహారం
అన్ని జంతువులు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు వంటి సాధారణ అకర్బన పదార్థాల నుండి తమ స్వంత ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. దీనిని పరపోషణ ద్వారా పోషకాహార తయారీ (హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్) అంటారు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను పరపోషకాలు అంటారు. ఉదాహరణకు, మనిషి, కుక్క, పిల్లి, జింక, పులి, ఆవు, ఈస్ట్ వంటి పచ్చని మొక్కలు అన్నీపరపోషకాలే. పోషకాహారం రకాలు
పరపోషణ విధానం
పోషకాహారం యొక్క మూడు రకాల పరపోషణ విధానాలు కలవు:
1) పూతికాహారుల పోషణ
2) పరాన్నజీవి పోషణ
3) జాంతవ భక్షక (హోలోజోయిక్)పోషణ
పూతికాహారులు పోషణ
పూతికాహారులు అంటే తమ ఆహారాన్ని పొందడం కోసం చనిపోయిన మరియు కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలపై ఆధారపడే జీవులు. ఈ జీవులు చనిపోయిన మరియు కుళ్ళిన చెట్ల కుళ్ళిన కలప, కుళ్ళిన ఆకులు, చనిపోయిన జంతువులు, కుళ్ళిన రొట్టె మొదలైన వాటిని తింటాయి.
శిలీంధ్రాలు మరియు అనేక బ్యాక్టీరియా పూతికాహారుల వర్గంలోకి వస్తాయి. పూతికాహారులు చనిపోయిన మరియు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాల నుండి సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని వాటి వెలుపల సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి ఈ సరళమైన పదార్థాలను గ్రహిస్తాయి.
పరాన్నజీవి పోషణ
ఈ విధానంలో జీవులు ఇతర జీవులను చంపకుండా వాటి అతిథేయి అని పిలువబడే ఇతర జీవులను తింటాయి. ఒక క్రమ పద్ధతిలో ఆహారాన్ని పొందే జీవులను పరాన్నజీవులు అంటారు. పరాన్నజీవులు అతిథేయికి హాని చేస్తాయి, అది మొక్క లేదా జంతువు కావచ్చు. పరాన్నజీవులు మానవజాతికి, పెంపుడు జంతువులకు మరియు పంటలకు వ్యాధులను కలిగిస్తాయి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, కుకుటా వంటి కొన్ని మొక్కలు, ప్లాస్మోడియం, రౌండ్వార్మ్లు వంటి కొన్ని జంతువులు పరాన్నజీవి పోషణకు ఉదాహరణలు.
జాంతవ భక్షక పోషణ
ఈ విధానంలో జీవులు ఘన లేదా ద్రవ ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఆ ఆహారం మొక్కల ఉత్పత్తి లేదా జంతు ఉత్పత్తి ఏదైనా కావచ్చు. ఈ ప్రక్రియలో ఒక జీవి సంక్లిష్టమైన సేంద్రీయ ఆహార పదార్థాన్ని తన శరీరంలోకి తీసుకుంటుంది. తరువాత శరీర కణాలలోకి శోషించబడిన ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. శోషించబడని ఆహారం విసర్జన ప్రక్రియ ద్వారా జీవుల శరీరం నుండి బయటికి పంపబడుతుంది. మనిషి, పిల్లి, కుక్క, ఎలుగుబంటి, జిరాఫీ మొదలైనవి ఈ రకమైన పోషణను కలిగి ఉండే జీవులకు ఉదాహరణలు.
ఆహారపు అలవాట్ల ఆధారంగా జంతువులను మూడుసమూహాగా విభజించవచ్చు:
1) శాకాహారులు
2) మాంసాహారులు
3) సర్వభక్షకులు
శాకాహారులు
గడ్డి, ఆకులు, పండ్లు, బెరడు మొదలైన మొక్కలను మాత్రమే తినే జంతువులను శాకాహారులు అంటారు. శాకాహార జంతువులకు ఉదాహరణలు ఆవు, మేక, గొర్రెలు, గుర్రం, ఒంటె, జింక మొదలైనవి.
మాంసాహారులు
ఇతర జీవులను మాత్రమే తినే జంతువులను మాంసాహారులు అంటారు. ఇవి మొక్కలను తినవు. సింహం, పులి, కప్ప, రాబందు, తోడేలు, బల్లి మొదలైనవి మాంసాహార జంతువులకు ఉదాహరణలు.
సర్వభక్షకులు
మొక్కలు మరియు ఇతర జంతువుల మాంసం రెండింటినీ తినే జంతువులను సర్వభక్షకులు అంటారు. కుక్క, కాకి, పిచ్చుక, ఎలుగుబంటి, చీమ మొదలైనవి సర్వభక్షక జంతువులకు ఉదాహరణలు.
జంతువులలో పోషకాహార ప్రక్రియ
జంతువులలో పోషకాహార ప్రక్రియలో వివిధ దశలు జంతువులలో పోషణ ప్రక్రియలో ఐదు దశలు ఉన్నాయి:
1) అంతరగ్రహణం
2) జీర్ణక్రియ
3) శోషణ
4) స్వాంగీకరణ
5) విసర్జన
అంతరగ్రహణం
శక్తిని పొందడానికి మరియు జీవిత కార్యకలాపాలను కొనసాగించడానికి ఆహారం తినడాన్ని అంతరగ్రహణం అంటారు.
జీర్ణక్రియ
జంతువులు తినే ఆహారం వాటి శరీరం గ్రహించలేని పెద్ద కరగని అణువును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కరగని ఆహార అణువులను చిన్న అణువులుగా విభజించే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు.
జంతువులు జీర్ణక్రియకు భౌతిక మరియు రసాయన పద్ధతులను ఉపయోగిస్తాయి. భౌతిక పద్ధతి అంటే నోటిలో ఆహారాన్ని నమలడం, నెమరువేయడం(కొన్ని జంతువులు); రసాయన పద్ధతి అంటే శరీరం ఆహారంలో జీర్ణ రసాలను కలపడం. జీర్ణం అయిన తర్వాత ఆహారాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది.
శోషణం
ఆహార అణువులు చిన్నవిగా మారిన తర్వాత అవి పేగు గోడల గుండా వెళ్లి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియను శోషణ అంటారు.
స్వాంగీకరణ
తిన్న ఆహారం శరీరంలోని అన్ని భాగాలకు, ప్రతి కణానికి చేరవేయబడి తద్వారా శక్తి ఉత్పత్తి జరుగుతుంది. శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు కోసం పదార్థాలు తయారు చేయబడతాయి. ఈ ప్రక్రియను స్వాంగీకరణం అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే శరీరంచే శోషించబడిన ఆహారం శరీరంలోకి కలిసి పోవడాన్ని స్వాంగీకరణం అంటారు.
విసర్జన
జీర్ణం కాని ఆహారాన్ని శరీరం నుండి బయటకు తరలించే ప్రక్రియను విసర్జన అంటారు.
ఏకకణ జీవులలో పోషణ ప్రక్రియ ఒకే కణం ద్వారా మాత్రమే జరుగుతుంది.
ఇవి మూడు రకాలు. అవి ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్తఫలికికలు. రక్త కణాలు ఎముక మజ్జ నుంచి ఏర్పడుతాయి. పిండాభివృద్ధిలో వీటిని కాలేయం ఏర్పరుస్తుంది. రక్తం, రక్తకణాలు ఏర్పడడాన్ని హీమోపాయిసస్ అంటారు. శరీరంలోని మరో ముఖ్య ద్రవం శోషరసం. ఎర్రరక్త కణాలు లేని ద్రవం శోషరసం. శరీర కణజాలాల మధ్య ప్రత్యేక నాళాల్లో శోషరసం ప్రవహిస్తుంది. దీనిలో తెల్ల రక్తకణాలు ఉంటాయి కాబట్టి ఇదికూడా రోగనిరోధక శక్తిలో పాల్గొంటుంది.
ఎర్ర రక్తకణాలు:
ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో 4.5 నుంచి 5 మిలియన్ల ఎర్రరక్తకణాలు ఉంటాయి. శరీరంలో సుమారు 32 బిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు ఆ తర్వాత అవి ప్లీహంలో నశిస్తాయి. ఎముక మజ్జలో ఇవి ఏర్పడడాన్ని ఎరిత్రోపాయిసిస్ అంటారు. ఇవి ద్విపుటాకారంలో ఉంటాయి. అభివృద్ధి చెందిన క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం, ఇతర కణభాగాలు ఉండవు. కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. హీమోగ్లోబిన్లో రెండు భాగాలు ఉంటాయి. అవి.. హీం, గ్లోబిన్. ఇనుమును ఫెర్రస్ రూపంలో కలిగి ఉన్న కర్బన పదార్థం హీం. గ్లోబిన్ ఒక ప్రొటీన్. రక్తం ఎరుపురంగులో ఉండటానికి కారణమైన వర్ణకం హీమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ల రవాణాను నిర్వహిస్తుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది. హీమోగ్లోబిన్ ఏర్పడడానికి, ఎర్రరక్తకణాలు అభివృద్ధి చెందడానికి ఇనుము, విటమిన్ బి12 (సైనకోబాలమిన్), విటమిన్ బి2 (ఫోలిక్ ఆమ్లం) అవసరమవుతాయి. ఆహారంలో ఇవి లోపిస్తే అనీమియా (రక్తహీనత) సంభవిస్తుంది.
తెల్ల రక్తకణాలు:
వీటిని ల్యూకోసైట్లు అంటారు. శరీర రక్షక భటులుగా వ్యవహరిస్యాఇ. వీటి జీవితకాలం కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు. గ్రాన్యులోసైట్లు, ఎగ్రాన్యులోసైట్లు. గ్రాన్యులోసైట్ల కణద్రవ్యంలో ప్రత్యేక కణికలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మూడు రకాలు. అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఎగ్రాన్యులోసైట్లు రెండు రకాలు. మోనోసైట్లు, అసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్, అలర్జీ చర్యల్లో పాల్గొంటాయి. న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిలో ప్రధానమైనవి లింఫోసైట్లు. ఇవి రెండు రకాలు. అవి T, B లింఫోసైట్లు. T లింఫోసైట్లు మళ్లీ రెండు రకాలు. అవి CD4/ T4 కణాలు, CD8 కణాలు. శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి దాన్ని నాశనం చేసే ప్రక్రియను T లింఫోసైట్లు ప్రారంభిస్తాయి. వీటి ద్వారా సెల్యులార్ ఇమ్యూనిటీ లభిస్తుంది. వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతి దేహకాల (యాంటి బాడీస్) ను విడుదల చేసి ఇమ్యూనిటీని అందించేవి B లింఫోసైట్లు. ఈ రకమైన ఇమ్యూనిటీ హ్యుమోరల్ ఇమ్యూనిటీ తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణంగా పెరిగితే ల్యుకేమియా లేదా రక్త కేన్సర్ వస్తుంది. వీటి సంఖ్య అసాధారణంగా తగ్గడం ల్యూకోపినియా.
రక్త ఫలకికలు:
ఇవి నిజమైన కణాలు కాదు. ఎముక మజ్జలో మెగాక్యారియో సెట్ల నుంచి ఏర్పడిన ఖండితాలు. వీటి జీవితకాలం 3-10 రోజులు. ప్రతి క్యూబక్ మిల్లీ మీటరు రక్తంలో 2.56 లక్షలు ఉంటాయి. గాయమైనప్పుడు రక్త స్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి. గాయమైన ప్రాంతంలో ఇవి విచ్ఛిన్నం చెంది థ్రాంబోప్లాస్టిన్ పదార్థాన్ని విడుదలచేస్తాయి. ఇవి రక్తంలోని ప్రాథాంబినను థ్రాంబిన్ గా మారుస్తాయి. ఆ తర్వాత థ్రాంబిన్ చర్య ద్వారా రక్తంలోని ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా మారుస్తాయి. ఫైబ్రిన్ ప్రొటీన్ పోగులుగా మారి సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చి రక్తం నష్టాన్ని నివారిస్తుంది. ఈ ప్రక్రియలో 13 ప్రధాన రక్తస్కందన కారకాలు, కొన్ని అనుబంధ కారకాలు పాల్గొంటాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని హిపారిన్ నివారిస్తుంది. రక్త సంకోచానికి కావాల్సిన ఖనిజం కాల్షియం. అనుబంధ కారకాల్లో ముఖ్యమైంది. విటమిన్-కె. ఏ చిన్న దెబ్బ తగిలినా రక్తస్కంధనం జరగని వ్యాధి హీమోఫీలియో. కృత్రిమ రక్తస్కందన కారకాలుగా ఉపయోగించేవి సిట్రేట్లు, ఆక్సలేట్లు, డైకెమరల్.
ఎర్రరక్తకణాల్లోని ప్రత్యేక ప్రతిజనకాల ఆధారంగా మానవ రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజించారు. A, B, O రక్తవ్యవస్థను తొలిసారిగా ల్యాండ్ స్టీనర్ గుర్తించారు. మానవ ఎర్రరక్తకణాలపై A, B ప్రతిజనకాలు ఉండటం లేదా లేకపోవడం ఆధారంగా మనుషులు నాలుగు వర్గాలు. A గ్రూపు ఎర్రరక్తకణాల్లో A అనే ప్రతిజనకం ఉంటుంది. B గ్రూపు ఎర్ర రక్తకణాలపై B ప్రతి జనకం ఉంటుంది. ఎర్ర రక్తకణాలపై A, B ప్రతిజనకాలు రెండూ ఉన్నవారు AB గ్రూపునకు చెందుతారు. ఈ రెండు ప్రతిజనకాలూ లేనివారు O గ్రూపునకు చెందుతారు. A గ్రూపు రక్తాన్ని B గ్రూపు వారికి ఇస్తే A ప్రతిజనకానికి విరుద్దంగా B వ్యక్తి శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై రక్తం గడ్డకడుతుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అదేవిధంగా B గ్రూపు రక్తాన్ని A గ్రూపు వారికి ఇస్తే ఇదే సమస్య వస్తుంది. కాబట్టి A గ్రూపు వారికి A గ్రూపు రక్తాన్ని, B గ్రూపు వారికి B గ్రూపు రక్తాన్ని ఇవ్వాలి. ఐతే వీరిద్దరికీ O గ్రూపు రక్తాన్ని ఇవ్వొచ్చు. అదేవిధంగా AB గ్రూపు వారికి A, B, 0 గ్రూపు రక్తాన్ని ఇవ్వొచ్చు. కాబట్టి AB గ్రూపు వారు విశ్వగ్రహీతలు. O గ్రూపు వారి రక్తాన్ని అందరికీ ఇవ్వొచ్చు. కాబట్టి వీరు విశ్వదాతలు. వీరికి మాత్రం O గ్రూపు రక్తాన్నే ఇవ్వాలి. A, B ప్రతిజనకాలకు అదనంగా మనిషి ఎర్ర రక్తకణాలపై Rh ప్రతిజనకాన్ని కూడా ల్యాండ్ స్టీనర్, వీనర్ గుర్తించారు. ABO రక్త వ్యవస్థకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఎర్ర రక్తకణాలపై Rh ప్రతిజనకం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. దీన్ని కలిగి ఉన్నవారిని Rh పాజిటివ్ అని, లేనివారిని Rh నెగిటివ్ అని సంబోధిస్తారు. అరుదుగా ఎవరిలో లేని ప్రతిజనకం కొందరి ఎర్రరక్తకణాల్లో ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ బాంబే ప్రతిజనకం. బాంబే రక్త గ్రూపునకు చెందినవారిలో బాంబే ప్రతిజనకం (H) ఉంటుంది.
రక్త ప్రసరణ
శరీరంలో రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అకశేరుకల్లో నాడీ జనిత, సకశేరుకాలలో కండర జనిత గుండె ఉంటుంది. మనిషిలో నాలుగు గదుల గుండె ఉంటుంది. ఊపిరితిత్తుల మధ్యలో మీడియా సీనియం అనే కుహరంలో గుండె అమరి ఉంటుంది. గుండెలోని పై గదులు కర్ణికలు. కింది గదులు జఠరికలు. గుండె లయ ఒక కండర కణుపులో మొదలవుతుంది. దీన్ని లయారంభకం అంటారు. మానవుడి గుండెలో రెండు లయారంభకాలు ఉంటాయి. సిరాకర్ణికా కణుపు గుండె కుడికర్ణిక కుడివైపు పై భాగంలో ఉంటుంది. రెండోది కర్ణికా జఠరికా కణుపు. ఇది కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉంటుంది. సిరా కర్ణికా కణుపు వద్ద జనించిన సంకోచ తరంగాలు కర్ణికలకు మాత్రమే పరిమితమవుతాయి. దీని నుంచి సంకోచ తరంగాలను అందుకున్న కర్ణిక, జఠరిక కణుపు హిస్ కండరకట్ట ద్వారా జఠరికలకు చేరుతాయి. ఈ విధంగా మొత్తం గుండె సంకోచిస్తుంది. గుండె సంకోచం సిస్టోల్. గుండె సడలిక డయాస్టోల్. కీర్ణకల సంకోచం ద్వారా రక్తం జఠరికల్లోకి చేరుతుంది. జఠరికల సంకోచం ద్వారా మళ్లీ రక్తం కర్ణికల్లోకి చేరకుండా ప్రత్యేక కవాటాలు అడ్డుకుంటాయి. ఎడమ కర్ణిక, జఠరికల మధ్య అగ్రద్వయ లేదా మిట్రల్ కవాటం, కుడి కర్ణిక, జఠరికల మధ్య అగ్రత్రయ కవాటం ఉంటాయి.
శరీరంలోని సిరలు వివిధ భాగాల నుంచి సేకరించిన మలిన/ ఆమ్లజని రహిత రక్తాన్ని ఊర్ధ్వ, నిమ్న మహా సిరల ద్వారా గుండె కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. ఐతే ఒక్క పుపుస సిర మాత్రమే ఊపిరితిత్తుల నుంచి శుద్ద/ ఆమ్లజని సహిత రక్తాన్ని ఎడమ కర్ణికలోకి విడుదల చేస్తుంది. కర్ణికలు సంకోచిస్తాయి. జఠరికల్లోకి రక్తం చేరుతుంది. ఎడమ జఠరికలోకి చేరిన శుద్ద రక్తం మహాధమని ద్వారా శరీరంలోని ధమనుల్లోకి చేరుతుంది. కుడి కర్ణికలోకి చేరిన మలిన రక్తం ఒక పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ విధంగా శరీరంలోని ధమనులన్నీ గుండె ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తాన్ని అన్ని శరీర భాగాలకూ సరఫరా చేస్తాయి. ఒక పుపుస ధమని మాత్రమే గుండె కుడి జఠరిక నుంచి మలిన రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఈ రకంగా గుండె కుడి భాగంలో మలిన రక్తం, ఎడమ భాగంలో శుద్ధ రక్తం స్వతంత్రంగా సరఫరా కావడం ద్విరక్త ప్రసరణ అంటారు.
మానవ వ్యాధులు
మన సాధారణ ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పు కనిపిస్తే దాన్ని వ్యాధి అనొచ్చు. లేదా సక్రమంగా పని చేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోలపరిచే పరిస్థితిని వ్యాధి అంటారు.
వ్యాధులు రెండు రకాలు. అవి 1) పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉదాహరణకు తొర్రి పెదవి, పుట్టు చెవుడు, పుట్టు గుడ్డి మొదలైనవి. 2) ఆర్జిత వ్యాధులు. వ్యాక్తి జీవితకాలంలో సూక్ష్మజీవుల వల్ల లేదా పోషకాహార లోపం, గాయాలు లాంటి కారణాల వల్ల వచ్చే వ్యాధులను ఆర్జిత వ్యాధులు అంటారు.
ఆర్జిత వ్యాధులు రెండు రకాలు. అవి: 1) ఇతరులకు వ్యాపించనివి. 2) ఇతరులకు వ్యాపించేవి (అంటు వ్యాధులు). మధు హేహం, రేచీకటి, రక్తపోటు, కీళ్లనొప్పులు లాంటివి ఒకరి నుంచి మరొకటి వ్యాపించవు. వైరస్, బ్యాక్టీరియా, శిలీంద్రాల్లాంటి సూక్ష్మ జీవుల వల్ల వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. వీటిని అంటు వ్యాధులు అంటారు.
అంటు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మానవ శరీరంలోకి ప్రవేశించే ముందు అవి ఉండే ప్రదేశాన్ని లేదా ఆవాసాన్ని ఆశ్రయం (రిజర్వాయర్) అంటారు. ఈ ఆశ్రయాలు మూడు రకాలు. అవి: 1) మానవ ఆశ్రయాలు 2) జంతు ఆశ్రయాలు 3) నిర్జీవ ఆశ్రయాలు. మానవుడిలో వైరస్, బ్యాక్టీరియా, శిలీంద్రాలు, ప్రోటోజోవా పరాన్న జీవులు ఆశ్రయం పొందుతూ వ్యాధులను కలిగిస్తాయి. కీటకాలు, ఎలుకలు, పందులు, కుక్కల్లాంటివి జంతు ఆశ్రయాలకు ఉదాహరణ. వీటిలో ఉన్న సూక్ష్మజీవులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మానవుడికి సంక్రమించి వ్యాధిని కలిగిస్తాయి. ఈ జంతు ఆశ్రయజీవుల్లో వ్యాధి కారక సూక్ష్మజీవులు ఉంటూ వాటికి హాని కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. ఏ ఆశ్రయజీవి అయితే సూక్ష్మజీవులను ఒకవ్యక్తి నుంచి మరోవ్యక్తికి వ్యాపింపజేస్తుందో దాన్ని వాహకం (Carrier) అంటారు. వాహకాలు వ్యాధిని ప్రత్యక్షంగా వ్యాప్తి చెందిస్తాయి. ఉదాహరణ మలేరియా వ్యాధికి ఆడ ఎనాఫిలిస్ దోమలు, ఫైలేరియా (బోదకాలు) వ్యాధికి ఆడ క్యూలెక్స్ దోమలు వాహకాలుగా ఉంటాయి. వాహకాలను అదుపులో ఉంచి వ్యాధులను నియంత్రించవచ్చు. గాలి, నీరు, నేల, మనుషుల నుంచి వచ్చే తుంపరల్లాంటి వాటిలో ఉండే సూక్ష్మజీవులు మానవులకు సంక్రమించి వ్యాధులను కలుగజేస్తాయి. ఇవన్నీ నిర్జీవ ఆశ్రయాలకు ఉదాహరణ.
వ్యాధులు వ్యాపించే విధానం
ఆశ్రయంలో ఉండే వ్యాధి జనక సూక్ష్మజీవులు గాలి, నీరు, ఆహారం, కీటకాలు, ప్రత్యక్ష తాకిడి లాంటి వాటి ద్వారా వ్యాపించి వ్యాధులను కలగజేస్తాయి. వ్యాధి గ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వ్యాధి జనకాలు గాలిలో విడుదలవుతాయి. ఈ గాలిని ఆరోగ్యవంతుడైన మానవుడి పీల్చుకున్నప్పుడు వ్యాధి వస్తుంది. జలుబు, ఫ్లూజ్వరం, డిప్తీరియా, కోరింతదగ్గు, క్షయ, న్యూమోనియా లాంటివి ఈ విధంగానే వ్యాపిస్తాయి. కలుషితమైన నీరు లేదా ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటిలోని సూక్ష్మజీవులు మానవుడికి సంక్రమించిచ వ్యాధులను కలిగిస్తాయి. కలరా, టైఫాయిడ్, అతిసారం, అమీబియాసిస్, పోలియో లాంటివి నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. మలేరియా, బోదకాలు, డెంగీ, ఎల్లో ఫీవర్, చికున్ గున్యా లాంటివి దోమల వల్ల వ్యాపిస్తాయి. రేబిస్ వైరస్లు ఉన్న కుక్క కోతి, పిల్లి లాంటివి కరవడం వల్ల రేబిస్ వస్తుంది. నేలలో, కలుషితమైన వస్తువులపై ఉండే సూక్ష్మజీవుల వల్ల డిప్తీరియా వస్తుంది. గజ్జి, తామర లాంటివి ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాపిస్తాయి.
వ్యాధి పద్ధతి
మానవుడికి సూక్ష్మజీవుల వల్ల వ్యాధి సంక్రమించి అది తగ్గేవరకు ఉన్న దశలను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) సంక్రమణదశ 2) పొదిగే కాలం 3) వ్యక్తమయ్యే దశ 4) అంత్య దశ. వివిధ రకాల ఆశ్రయాల్లో ఉన్న వ్యాధి జనకసూక్ష్మ జీవులు గాలి, నీరు, ఆహారం, కీటకాల్లాంటి వాటి ద్వారా మానవుడికి సంక్రమిస్తాయి. మానవ శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు వెంటనే వ్యాధిని కలిగించవు. దీనికి కొద్ది సమయం పడుతుంది. తక్కువ సంఖ్యలో మానవుడిలోకి చేరిన సూక్ష్మజీవులు సరైన కణజాలాన్ని ఎంచుకుని అక్కడ స్థిరపడి, తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటూ ఆ కణజాలాన్ని నష్టపరుస్తాయి లేదా విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మానవుడికి వ్యాధి వస్తుంది. ఇలా సూక్ష్మజీవులు ప్రవేశించిన నాటినుంచి వ్యాధి వ్యక్తమయ్యే దశ వరకు ఉన్న సమయాన్ని పొదిగే కాలం అంటారు. పొదిగే కాలం వ్యాధిని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు క్షయ 2-10 వారాలు, డిప్తీరియా 2-6 రోజులు, కోరింత దగ్గు 7-14 రోజులు, టైఫాయిడ్ 1-3 వారాల పొదిగే కాలం ఉంటుంది. పొదగే కాలంలో సూక్ష్మజీవులు తమ సంఖ్యను వృద్ధిచెందించుకుని ఆతిథేయిని నష్టపరచడం వల్ల రోగ లక్షణాలు వ్యక్తమవుతాయి. ఈ దశనే వ్యక్తమయ్యే దశ అంటారు. రోగ లక్షణాలు వేర్వేరు వ్యాధులకు వివిధ రకాలుగా ఉంటాయి. వీటిని బట్టి వైద్యులు వ్యాధిని నిర్ధారించి తగిన ఔషధాలను ఇస్తారు. చికిత్స వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు చనిపోయి వ్యాధి తగ్గుతుంది. ఈ దశనే వ్యాధి అంత్యదశ అంటారు. దీని తర్వాత రోగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కాలాన్ని రికవరీ పీరియడ్ గా వ్యవహరిస్తారు.
మానవునికి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు
వ్యాధులు - కలుగచేసే వైరస్
- చికెన్ పాక్స్ లేదా వేరిసెల్లా - వెరిసెల్లా వైరస్ లేదా చికెన్ పాక్స్ వైరస్
- ఇంఫ్లూయెంజా (ఫ్లూ) - ఇంఫ్లూయెంజా వైరస్
- మీజిల్స్ (రూబెల్లా) - మీజిల్స్ వైరస్
- గవద బిళ్ళలు - పారామిక్సో వైరస్ (లేదా) మీక్సోవైరస్ పెరటోడిస్
- రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ - రెస్పిరేటరి సిన్షియల్ వైరస్
- స్మాల్ పాక్స్ (వేరియోలా) - స్మాల్‌పాక్స్ వైరస్ లేదా వేరియోలా వైరస్
- కొలరాడో టిక్ ఫీవర్ - కొలిటవైరస్
- డెంగ్యు జ్వరం - ప్లావీవైరెస్
- ట్రకోమా - క్లమీడీయో ట్రాకోమాటిస్
- చికున్ గున్యా, ఎన్ సెఫలైటిస్-అల్ఫా వైరస్
- ఎయిడ్స్-హ్యుమన్ ఇమ్యునో వైరస్
- హెర్పిస్ - హెర్పిస్ సింప్లెక్స్ వైరస్
- జలబు - రినో వైరస్లు
- సైటో మెగాలో ఇన్ క్లూసియన్ వ్యాధి - హ్యుమన్ సైటో మెగాలో వెరస్
- ల్యుకేమియా - హ్యుమన్ టి సెల్ ల్యుకేమియా వైరస్
- ఇన్ ఫెక్టియస్ మోనో న్యూక్లియోసిస్-ఎస్టీన్ బార్ వైరస్
- రేబిస్-రేబిస్ వైరస్
- హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ, - హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ వైరస్లు
- ఎక్యుట్ వైరల్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ - రోటావైరస్
- పోలియో - పోలియోవైరస్
- మెదడువాపు (లేదా) ఎన్ సెఫలైటిస్ - ఆర్బో వైరస్
- సార్స్ - కరోనా వైరస్ (సార్స్ కోవ్ -1)
- కోవిడ్ -19 - కరోనా వైరస్ 2 (సార్స్ కోవ్ -2)
మానవునికి బాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధులు
వ్యాధులు - కలుగచేసే బాక్టీరియా
వ్యాధి - కలిగించే బాక్టీరియా
* డిప్తీరియా - కోరని బాక్టీరియం డిప్తీరియో
* లెజియోనారిస్ - లెజియోనెల్లా న్యూమోఫిల్లా
* మెనెంజైటస్ - నిస్సేరియా మెనెంజిటైడిస్
* కోరింతదగ్గు లేదా పట్టుసీస్ - బోర్డిటెల్లా పర్టునిస్
* స్కార్లెట్ జ్వరం - స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్
* క్షయ - మైక్రోబాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్
* సిట్టకోసిస్ - క్లమీడియా సిట్టసి
* ఆహార పదార్థాల విషపూరితం - స్టాఫైలోకోకన్ ఆరీయస్
* టైఫాయిడ్ జ్వరం - సాల్మ్ నెల్లా టైఫి, సాల్మ్ నెల్లా పారాటైఫి
* కలరా - విబ్రియో కలరే
* లైమ్ వ్యాధి - బోరియోల్లా బర్గ్ డోఫెరీ
* ప్లేగు - యోర్సీనియో పెస్టిస్
* ఆంధ్రాక్స్ - బాసిల్లస్ ఆంధ్రాక్సిక్
* క్యాట్ చ్ వ్యాధి - బార్టనెల్లా హిన్ స్కేలి
* గ్యాస్ గాంగ్రీన్ (లేదా) మయోనె క్రాసిస్ - క్లాస్టేడియం పి ఫిన్లైన్స్, కాస్ట్రీడియం నోవి, క్లాస్ట్రీడియం పిడమ్
* కాంక్రాయిడ్ (లేదా) లైంగిక అల్సర్ వ్యాధి - హిమోఫిలస్ ద్యుక్రెయి
* గనేరియా - నిస్సేరియా గనేరియా
* కుష్టు - మైక్రోబాక్టీరియం లెప్రె
* పెప్టిక్ అల్సర్ (జీర్ణనాళ అల్సర్) హీలియోబాక్టర్ పైలోరి
* టాక్సిక్ షాక్ సిండ్రమ్ - స్టఫైలోకోకల్ స్కాలైడ్
* సిఫిలిస్ - ట్రిపినిమా పాలిడమ్
* టెటనస్ - క్లాస్ట్రేడియం టెటాని
* టాలరీమియా - ఫ్రాన్సి సెల్లా టాలరెన్సిసిస్
* కలరా - విబ్రియోకలరా
* బోటులిజమ్ - క్లాస్టేడియంబో టుల్లేనమ్
* గ్యాస్ట్రో ఎంటరైటిస్ - కంపైలో బాక్టర్ బెజుని
* సాల్మనెల్లోసిస్ - స్మాలోనెల్లా
* ప్రైజియెల్లోసిస్ - షైజిల్లా
* టైఫాయిడ్ - సాల్మ్ నెల్లా టైఫి.
మానవునికి ప్రోటోజోవా ద్వారా సంక్రమించే వ్యాధులు
వ్యాధులు - కలుగచేసే ప్రోటోజోవా
* అమీబియాసిస్ - ఎంటమీబా హిస్టాలటికా
* మలేరియా - ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్
* లైడ్జినియాసిస్ లేదా అతి నిద్రావ్యాధి - ట్రపనోసోమా గాంబియెన్సీ
* చాగా వ్యాధి - ట్రిపనోసోమా క్రుజి
* టాక్సోప్లాస్మోసిస్ - టాక్సోప్లాస్మా గోండి
* ట్రైకో మొనియాసిస్-ట్రైకోమోనాస్ వజినాలిస్
* బాలెంటడియల్ డీసెంటరీ-బాలంటిడియమ్ కోలీ
* క్రిప్టో స్పోరిడియాసిస్ - క్రిప్టోస్పోరిడియమ్ పారమ్
* జీరార్డియాసిస్ - జిరార్డియా లాంబియా
* పయోరియా (లేదా) జింజీవాలిస్ - ఎంటమీబా జింజివాలీస్
మానవునికి శిలీంద్రాల ద్వారా సంక్రమించే వ్యాధులు
శిలీంద్ర వ్యాధులలో రెండవ రకం వ్యాధులు అంతర్గత శీలింద్రవ్యాధులు. కొన్ని శిలీంద్రాలు వివిధ శరీర భాగాలలో అంతర్గతంగా నివశిస్తూ వ్యాధులను కలిగిస్తాయి మరియు ఆ భాగాన్ని ప్రభావితం చేసి నష్టపరుస్తాయి. ఈ రకమైన వ్యాధులు, ఊపిరితిత్తులు, జీర్ణక్రియభాగాలు, రక్తం వంటి వాటిలో కూడా కనబడవచ్చు. శిలీంద్రవ్యాధులు రావడానికి ఆహారలోపం, శరీరం బలహీనంగా వుండటం, పరిశుభ్రత పాటించకపోవడం, శరీరంపై చమట ఎక్కువట పట్టడం వంటి కారణాలుగా చెప్పవచ్చు. శిలీంద్రాలు బాహ్య లేదా అంతర్గతంగా కాక ఆహార పదార్థాలపై ధాన్యాలపై సంక్రమణ జరిపి విష పదార్థాలను ఉత్పత్తి చేసి మానవునికి వ్యాధులను కలిగిస్తాయి. ఆస్పర్జిల్లస్ జాతులు వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న గింజలపై నివశిస్తూ అప్లోటాక్సిన్లు అనే విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషపదార్థాల వలన మానవునికి కాలేయ వ్యాధి అయిన సిర్రోసిస్ రావడానికి అవకాశం ఉంది.
వ్యాధులు - కలుగచేసే శిలీంద్రాలు
* బ్లాక్ పయెడ్రా - పయె హర్టీ *
వైట్ పయె డ్రా - ట్రైకోస్పోరాన్ బీజియెల్లి
* టీనియావెర్సికోలా - మలసీజియా ఫర్ ఫర్
* టనియోబార్బె - ట్రైకోఫైటాన్ మెంట(ఫైట్స్
* జాయిచ్ - ఎపిడెర్మో, ఫైటాన్ ఫ్లోకోజమ్
* టినియాపెడిస్ - ట్రైకోఫైటాన్ రూబ్రమ్
* క్రోమోబ్లాస్టోమైకాసిస్ - ఫయలో ఫోరా వెర్రుకోసా
* మధురా మైకాసిస్ - మధురెల్లా మైసిటోమాటిస్
* స్పోరో ట్రైకాసిస్ - స్పోరో త్రిక్స్ చిన్న
* బ్లాస్టో మైకాసిస్ -బ్లాస్టోమైసిస్ డెర్మ టైటిస్
* హిస్టోప్లాస్మోసిస్-హిస్టోప్లాస్మా కాప్సులేటమ్
* కాక్సిడియోడో మైకాసిస్-కాక్సిడియోడిస్ ఇమీటస్
* ఆస్పర్జిల్లోసిస్-ఆస్పరిల్లస్ ప్యుమిగేటస్, ఆస్పరిల్లస్ ప్లావస్
* కాండిడియాసిస్ - కాండిడిడా ఆర్థికన్స్
* న్యూమోసిస్టిస్ న్యూమోనియా - న్యూమోసిస్టిస్ కారిని
మానవునిలో జీర్ణవ్యవస్థ
ఆహారంలో శోషణ చెందని సంక్షిప్త అణువులు రక్తంలో శోషణ చెంది, సరళ అణువులుగా మారుతాయి. ఈ ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. దీనికోసం శరీరంలో ప్రత్యేక జీర్ణవ్యవస్థ ఉంటుంది. జీర్ణవ్యవస్థలో జీర్ణనాళం, అనేక అనుబంధ జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణ రసాల్లోని ఎంజైములు, రసాయనిక చర్యల ద్వారా జీర్ణక్రియను నిర్వహిస్తాయి.
నోటి కుహరంలో దంతాలతో నమలడం వల్ల ఆహారపదార్థాలు మెత్తబడతాయి. లాలాజల గ్రంథుల నుంచి విడుదలయ్యే లాలాజలంలో టయలిన్ ఎంజైమ్ ఆహారంలోని స్టార్చ్ ను మాల్టోజ్ గా విచ్చిన్నం చేస్తుంది. నోటిలో లాలాజలంలో కలిసిన ఆహారం, ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయం కుడ్యంలోని జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే జఠరరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ ఉంటాయి. ముందుగా క్రియారహిత రూపంలో పెప్సిన్ విడుదలవుతుంది. ఆ తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రభావం ద్వారా క్రియాశీల రూపంలోకి మారుతుంది. ప్రొటీన్లను ప్రొటియో లు, పెట్రోలు అనే ఖండితాల్లోకి పెప్సిన్ విచ్ఛిన్నం చేస్తుంది.
జీర్ణాశయంలో జఠర రసంలో ఆహారం కలిసిపోయి ఆమ్లయుతం అవుతుంది. ఆ తర్వాత ఆహారం చిన్న పేగు మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి చేరుతుంది. అక్కడ కాలేయం నుంచి విడుదలయ్యే పైత్యరసం, క్లోమం నుంచి విడుదలయ్యే క్లోమరసంతో ఆహారం కలుస్తుంది. కాలేయం, లంబికల మధ్య ఉండే పిత్తాశయంలో పైత్యరసం నిల్వ ఉండి, ఆ తర్వాత ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. పైత్యరసంలో పైత్యరసం లవణాలు, వర్ణకాలు ఉంటాయి. ఎంజైమ్లు ఉండవు. సోడియం, పొటాషియం టారోకొలేట్లు, గ్లైకోకొలేట్లు ఈ మూడూ పైత్యరస లవణాలు. కొవ్వుల ఎమర్జెనను పైత్యరస లవణాలు తయారుచేస్తాయి. బైలిరూబిన్, బైలివర్జిన్లు పైత్యరస వర్ణకాలు. ఇవి వ్యర్థాలు. ఇవి చివరకు మల పదార్థం ద్వారా విసర్జితమవుతాయి. క్లోమరసం రెండు దశల్లో విడుదలవుతుంది. మొదటి దశలో విడుదలైన క్లోమరసంలో బైకార్బొనేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రసంలో కలిసిన తర్వాత ఆహారం క్షారయుతమవుతుంది. ఆ తర్వాత రెండో దశలో ఎంజైమ్లు అధికంగా ఉన్న క్లోమరసం విడుదలవుతుంది. క్లోమరసంలోని ఎంజైమ్ లు ఆంత్రమూలంలో జీర్ణక్రియను నిర్వహిస్తాయి. నోటి కుహరంలో జీర్ణం కాకుండా మిగిలిన స్టారు అమిలాప్సిన్ మాల్టోజ్ గా విచ్ఛిన్నం చేసుత &ంది. జీర్ణాశయంలోని పెప్టాన్లు, ప్రొటియోజీలను- ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్లు పెప్టైలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఆహారంలోని కొవ్వులను స్టియాప్సిన్ ఎంజైమ్ ట్రైగ్లిజరైడ్లుగా విచ్ఛిన్నం చేస్తుంది. క్లోమరసం, పైత్యరసంతో కలిసి క్షారయుతంగా మారిన ఆహారం కైల్.
చిన్న పేగులోని రెండో భాగం జెజునంలో జీర్ణక్రియ పూర్తవుతుంది. జెజునం కుడ్యంలోని ఆంత్ర గ్రంథులు, ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయి. ఆంత్రరసంలోని ఎంజైమ్లు జీర్ణ క్రియను పూర్తిచేస్తాయి. ఎంజైమ్ చర్య ద్వారా మాల్టేట్-మాల్టోజ్, రెండు గ్లూకోజ్ అణువులుగా విచ్ఛిన్నం చెందుతుంది. అదే విధంగా ఇన్వర్టేజ్ ఎంజైమ్ ద్వారా సుక్రోజ్ ఒక గ్లూకోజ్, ఒక ఫ్రక్టోజ్ గా విచ్ఛిన్నం చెందుతుంది. లాక్టేజ్ ఎంజైమ్ చర్యద్వారా లాక్టోజ్-గ్లూకోజ్, గాలక్టోజ్ గా విచ్ఛిన్నం చెందుతుంది. పెప్పై లన్నీ ఎరిప్సిన్ వంటి ఎంజైమ్ ద్వారా అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చెందుతాయి. ట్రైగ్లిసరైడ్లు చివరకు ఫాటి ఆమ్లాలు, గ్లిసరాల్ గా విచ్ఛిన్నమవుతాయి.
చిన్న పేగులోని మూడో భాగం ఇలియం. ఇక్కడ జీర్ణమైన ఆహారం సరళ అణువులుగా రక్తంలోకి శోషణ చెందుతుంది. రక్తంలోకి శోషణ చెందిన ఆహారం శరీర చర్యలకు, పెరుగుదలకు ఉపయోగపడటం సాంగ్వీకరణం. జీర్ణంకాని వ్యర్థం పెద్ద పేగులోకి చేరి అధిక నీరు శోషణ చెందడం ద్వారా మలంగా మారుతుంది. పురీషనాళం చివరిలో ఉన్న పాయువు నుంచి మలం విసర్జితమవుతుంది.
జీర్ణవ్యవస్థలోని కీలక చర్యలను హార్మోన్లు నియంత్రిస్తాయి. జఠర గ్రంథుల నుంచి జఠర రసం విడుదలను గ్యాస్ట్రిన్ ప్రేరేపిస్తుంది. పిత్తాశయం నుంచి పైత్యరసం విడుదలను కొలిసెస్టో కైనిన్ ప్రేరేపిస్తుంది. అదేవిధంగా క్లోమం నుంచి క్లోమరసం విడుదలను సెక్రిటిన్, ప్యాంక్రియోజామిన్ ప్రేరేపిస్తాయి.
- మానవ శ్వాసకోశ వ్యవస్థ
మనం ఆహారం, నీరు లేకుండా కొన్ని రోజులు జీవించగలము. కానీ శ్వాస తీసుకోవడానికి అవసరమైనందున మనం గాలి లేకుండా కొన్ని నిమిషాల కన్నా ఎక్కువ సేపు జీవించలేము. కాబట్టి, మానవ శ్వాసకోశ వ్యవస్థ గురించి చర్చించే ముందు, శ్వాసక్రియలో ముఖ్యమైన భాగమైన శ్వాస ప్రక్రియను తెలుసుకోవడం చాలా అవసరం.
శ్వాసక్రియ ప్రక్రియ:
శ్వాసక్రియ జరిగే సమయంలో మనం ముక్కు ద్వారా మన ఊపిరితిత్తులలోకి గాలిని పీల్చి ఆపై దానిని బయటికి వదులుతాము. శ్వాసక్రియ సమయంలో ఆక్సిజన్ సహిత గాలిని శరీరంలోకి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాస అని కార్బన్ డయాక్సైడ్ సహిత గాలిని విడుదల చేయడాన్ని నిచ్ఛ్వాస అని పిలుస్తారు. శ్వాసక్రియ సమయంలో ఈ రెండు ప్రక్రియలు క్రమం తప్పకుండా జరుగుతాయి. కాబట్టి, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను కలిపి శ్వాసక్రియ అని అనవచ్చును.
శ్వాసక్రియ విధానం :
ఊపిరితిత్తులు నాసికా మార్గం మరియు శ్వాసనాళం ద్వారా మన నాసికా రంధ్రాలకు (ముక్కు రంధ్రాలు) అనుసంధానించబడి ఉంటాయి. మనం గాలి పీల్చినప్పుడు, అది మన నాసికా రంధ్రాలలోకి ప్రవేశించి, నాసికా మార్గం మరియు శ్వాసనాళం గుండా ప్రయాణించి ఊపిరితిత్తులను చేరుకుంటుంది. మన శరీరంలోని ఛాతి కుహరం అనే గాలి చొరబడని ప్రదేశంలో మన రెండు ఊపిరితిత్తులు అమరి ఉంటాయి. ఛాతి కుహరం చుట్టూ పక్కటెముకల మధ్య కండరయుత పక్కటెముకతో ఊపిరితిత్తులు అనుసంధానించబడి ఉంటాయి. ఛాతి కుహరం దిగువన డయాఫ్రామ్ అని పిలువబడే కండరాల వంపు ఉంటుంది. అందువలన, ఇది ఛాతి కుహరం యొక్క అంతస్తును ఏర్పరుస్తుంది. ఇందు కారణంగా పక్కటెముక మరియు డయాఫ్రామ్ యొక్క కదలిక వలన శ్వాసక్రియ ప్రభావితమవుతుంది.
శ్వాస కోశ వ్యవస్థ
మానవులలో శ్వాసక్రియ ప్రక్రియలో ముక్కు, నాసికా మార్గం లేదా నాసికా కుహరం, శ్వాసనాళం, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు మరియు డయాఫ్రామ్ మొదలైన అవయవాలు పాల్గొంటాయి.
శ్వాస వ్యవస్థ ముక్కు నుండి ప్రారంభమవుతుంది. మన ముక్కుకు నాసికా రంధ్రాలు అని పిలువబడే రెండు రంధ్రాలు ఉంటాయి. నాసికా రంధ్రాల వెనుక ఉన్న మార్గాన్ని నాసికా కుహరం అంటారు. ముక్కులో ఉండే నాసికా రంధ్రాల ద్వారా శ్వాసక్రియ కోసం గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఈ గాలి నాసికా మార్గంలోకి వెళుతుంది. ఇది నోటి కుహరం లేదా బుక్కల్ కేవిటీ నుండి గట్టి, అస్థి అంగిలి ద్వారా వేరు చేయబడుతుంది. తద్వారా మనం ఆహారం తినేటప్పుడు కూడా గాలిని పీల్చుకోవచ్చు. నాసికా మార్గం లోపల గ్రంధుల ద్వారా శ్లేష్మం స్రవిస్తుంది. నాసికా మార్గం ద్వారా గాలి వెళ్ళినప్పుడు, ధూళి కణాలు మరియు ఇతర మలినాలను నాసికాకేశాలు మరియు శ్లేష్మం ద్వారా బంధించబడతాయి తద్వారా స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తులలోకి వెళుతుంది. ఫారింక్స్ అనేది నోరు మరియు వాయు నాళాల మధ్య ఉన్న గొంతు భాగం. గాలి నాసికా మార్గం నుండి ఫారింక్స్ లోకి ప్రవేశించి, అక్కడి నుండి వాయునాళంలోకి (శ్వాసనాళం) ప్రవేశిస్తుంది.
మృదులాస్థి అనబడే మృదువైన ఎముకల వలయాలతో శ్వాసనాళం నిర్మితమై ఉండడం వలన శ్వాసనాళంలో వాయువు ప్రసరించనప్పుడు కూడా అది నిలకడగానే ఉంటుంది. శ్వాసనాళం పైభాగంలో స్వరపేటిక ఉంటుంది. శ్వాసనాళం మెడ క్రిందికి ఉండి దాని దిగువన చివర బ్రోంకి అని పిలువబడే రెండు చిన్న గొట్టాలుగా విభజించబడింది. ఇవి ఊపిరితిత్తులతో అనుసంధానించబడి ఉంటాయి. ఊపిరితిత్తులు ఛాతీ కుహరం లేదా థొరాసిక్ కుహరంలో ఉంటాయి. ఇది డయాఫ్రామ్ అని పిలువబడే కండరాల విభజన ద్వారా ఉదర కుహరం నుండి వేరు చేయబడుతుంది. ఊపిరితిత్తులు ఫ్లూరా అని పిలువబడే రెండు సన్నని పొరలతో కప్పబడి ఉంటాయి. ఊపిరితిత్తులు పక్కటెముకలతో తయారు చేయబడిన రిబ్ కేజ్లో ఉంటాయి.
బ్రోంకి యొక్క ఏకవచనం బ్రోంకస్ మరియు అవి ఊపిరితిత్తులలో విభజింపబడి పెద్ద సంఖ్యలో బ్రోన్కియోల్స్ అని పిలువబడే చిన్న గొట్టాలను ఏర్పరుస్తాయి. వాటి చివర్లలో గాలి సంచుల వంటి చిన్న పర్సును అల్వియోలీ (ఏకవచన అల్వియోలస్) అని పిలుస్తారు. అల్వియోలీ యొక్క గోడలు చాలా పలుచగా ఉంటాయి. ఇవి రక్త కేశనాళికల చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఆల్వియోలీ నుండి ఆక్సిజన్ శరీరంలోకి గ్రహించబడి, కార్బన్ డయాక్సైడ్ విసర్జించబడుతుంది. ఈ విధంగా అల్వియోలీలో వాయు మార్పిడి జరుగుతుంది.
ఊపిరితిత్తులలో మిలియన్ల సంఖ్యలో ఆల్వియోలీలు ఉంటాయి. ఇవి వాయువుల ప్రవాహానికి తగు స్థలాన్ని ఏర్పరుస్తాయి. ఎక్కువ మొత్తంలో స్థల లభ్యత వాయువుల ప్రవాహాన్ని పెంచుతుంది. డయాఫ్రామ్ ఉచ్ఛ్వాస మరియు నిచ్ఛ్వాసల్లో సహాయకారిగా ఉంటుంది. ఛాతీ కండరాలు కూడా ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడతాయి.
మనం గాలి పీల్చినప్పుడు, పక్కటెముకలతో అనుసంధానించబడిన డయాఫ్రామ్ తో పాటూ కండరాలు కూడా సంకోచిస్తాయి. దీని కారణంగా ఛాతి కుహరం విస్తరిస్తుంది. ఈ కదలిక ఛాతీ కుహరం లోపలి పరిమాణాన్ని పెంచుతుంది. దీని కారణంగా, ఛాతి కుహరం లోపల గాలి పీడనం తగ్గడంతో పాటు బయటి నుండి అధిక పీడనంతో ప్రవహించే గాలి నాసికా రంధ్రాలు, శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది.
ఈ విధంగా, శ్వాస పీల్చుకునే ప్రక్రియలో ఊపిరితిత్తుల గాలి సంచులు లేదా అల్వియోలీ ఆక్సిజన్ తో కూడిన గాలితో నిండిపోతాయి. ఆల్వియోలీ చుట్టూ రక్త కేశనాళికలు ఉండే కారణంగా ఆక్సిజన్ ఆల్వియోలీ గోడల నుండి రక్తంలోకి వ్యాపిస్తుంది. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనే ఎర్రటి వర్ణద్రవ్యం ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. రక్తం శరీరంలోని కణజాలాల గుండా వెళుతున్నప్పుడు, దానిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో అధిక సాంద్రత కారణంగా కణాలలోకి వ్యాపిస్తుంది. ఈ ఆక్సిజన్ జీర్ణమైన ఆహారం లేదా కణాలలో ఉండే గ్లూకోజ్ తో కలిసి శక్తిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ వ్యర్ధంగా ఉత్పత్తి చేయబడి, శరీర కణజాలాలలో అధిక సాంద్రత కారణంగా రక్తంలోకి వ్యాపిస్తుంది. రక్తం కార్బన్ డయాక్సైడ్ ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకువెళుతుంది, అక్కడ అది అల్వియోలీలోకి వ్యాపిస్తుంది. మనం గాలిని పీల్చినప్పుడు, డయాఫ్రామ్ మరియు పక్కటెముకలకు జోడించిన కండరాలు విశ్రాంతి పొందుతాయి. దీని కారణంగా మన ఛాతి కుహరం కుదించబడి చిన్నదిగా మారుతుంది. ఛాతి యొక్క ఈ సంకోచ కదలిక ఊపిరితిత్తుల అల్వియోలీ నుండి శ్వాసనాళం, నాసికా రంధ్రాలలోకి ఆ తరువాత శరీరం నుండి గాలిలోకి కార్బన్ డయాక్సైడ్ ను బయటకు విసర్జిస్తుంది. ఈ విధంగా వాయు మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది.
శ్వాసక్రియా రేటు
శ్వాసక్రియ అసంకల్పితంగా జరుగుతుంది కానీ శ్వాసక్రియ రేటు మెదడు యొక్క శ్వాసకోశ వ్యవస్థచే నియంత్రించబడుతుంది. విశ్రాంతి సమయంలో వయోజన మనిషిలో సగటు శ్వాస రేటు నిమిషానికి 15 నుండి 18 సార్లు ఉంటుంది. శారీరక వ్యాయామం సమయంలో శ్వాస రేటు పెరుగుతుంది. ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీర కణాలకు మరింత ఆక్సిజన్ ను సరఫరా జరుగుతుంది.
ఒక వ్యక్తి యొక్క రక్తంలో హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్తం యొక్క ఆక్సిజన్-వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, ఫలితంగా శ్వాస సమస్యలు, అలసట మరియు శక్తి లేకపోవడం వంటి రుగ్మతలు కలుగుతాయి. ఈ సందర్భంలో వ్యక్తి పాలిపోయి బరువు కోల్పోతాడు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకున్నపుడు, కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్ ను చాలా బలంగా బంధిస్తుంది. మెదడు, శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ ను తీసుకువెళ్లకుండా నిరోధిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువసేపు పీల్చినట్లయితే, ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. ఎక్కువసేపు ఆక్సిజన్ అందకపోవడం కారణంగా ప్రాణాపాయం సంభవించవచ్చు. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు శ్వాస సులభంగా అందడానికి ఆక్సిజన్ మాస్క్ ఇస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, రోగిని వెంటిలేటర్ అనే యంత్రం అమర్చి, రోగి శ్వాసనాళంలో నేరుగా గాలిని అందించే నాళాలు చొప్పించి అతడు సౌకర్యవంతంగా శ్వాసను తీసుకునేలా చేసి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడడం జరుగుతింది.
మానవ విసర్జక వ్యవస్థ
ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ విసర్జన ప్రక్రియ
మానవ శరీరంలో జరిగే శ్వాసక్రియ సమయంలో ఆహారం యొక్క ఆక్సీకరణ నుండి వ్యర్ధ ఉత్పత్తిగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ తరువాత శరీర కణజాలం నుండి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి రక్తం ద్వారా ఊపిరితిత్తులకు రవాణా చేయబడుతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై ముక్కు ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది.
మానవ శరీరంలో గల విసర్జక వ్యవస్థలో భాగమయిన మూత్రపిండాలు శరీరంలోని ద్రవ వ్యర్థాలను సేకరించి శరీరం నుండి వాటిని తొలగించడంలో సహాయకారిగా ఉంటాయి. మూత్రపిండాలకు సంబంధించి ప్రధాన అవయవాలు మూత్రాశయం, మూత్రనాళం, రెండు మూత్రపిండాలు మరియు రెండు మూత్ర నాళాలు. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి మానవ శరీర వెనుక భాగంలో కుడివైపున నడుముకు పైన ఉంటాయి. సాధారణంగా మానవులందరికీ రెండు మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాల ద్వారా నిరంతరం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. మూత్రపిండ ధమని వ్యర్థాలతో కూడిన రక్తాన్ని మూత్రపిండాలకు తీసుకువెళుతుంది. మూత్రపిండము యొక్క ముఖ్యమైన పని రక్తంలో గల అదనపు నీరు, వ్యర్ధ లవణాలు, టాక్సిన్, యూరియాను తొలగించి వాటిని మూత్రం రూపంలో విసర్జించడం. మూత్రపిండ సిర లేదా మూత్రపిండాలు శుద్ధిచేయబడిన రక్తాన్ని మూత్రపిండాల నుండి తిరిగి శరీరంలోకి రవాణా చేస్తాయి.
మూత్రపిండము యొక్క మూత్ర నాళము మూత్రాశయంలోకి తెరుచుకుని ఉంటుంది. మూత్రనాళాలు మూత్రపిండము నుండి మూత్రాశయం వరకు మూత్రాన్ని చేరవేసే నాళాలు. మూత్రం మూత్రాశయంలో నిలువ ఉంటుంది. మనం మూత్ర విసర్జనకు వెళ్ళే వరకు మూత్రాశయం పెద్దమొత్తంలో మూత్రాన్ని నిలిపి ఉంచుతుంది. మూత్రాశయానికి అనుసంధానించబడి ఉండే యురేత్రా అనే నాళం ద్వారా మూత్రం శరీరం నుండి బయటకు విసర్జించబడుతుంది.
మూత్రపిండం నెఫ్రాన్స్ అని పిలువబడే గణనీయమైన సంఖ్యలో విసర్జన యూనిట్లతో రూపొందించబడి ఉంటుంది. నెఫ్రాన్ యొక్క పైభాగంలో ఉన్న కప్పు ఆకారపు సంచిని బౌమాన్ గుళిక అంటారు. బౌమాన్ గుళిక నాళం యొక్క దిగువన ముగింపు నాళం ఉంటుంది. ఈ నాళాలన్నీ కలిసి నెఫ్రాన్ ను ఏర్పరుస్తాయి.
బౌమాన్ గుళిక, మూత్రాన్ని సేకరించే మూత్రపిండ నాళం ఒక నాళం యొక్క వ్యతిరేక దిశలో చివర్లలో కలుస్తాయి. బౌమాన్ గుళికలో గ్లోమెరులస్ అని పిలువబడే రక్త కేశనాళికలు ఉంటాయి. గ్లోమెరులస్ కు ఒక చివరన మూత్రపిండ ధమని అనుసంధానించబడి ఉంటుంది. ఇందులోకి కలుషితమైన రక్తంలోని యూరియా చేరవేయబడుతుంది. మరొక చివర యూరియాను శుద్ధి చేయబడిన రక్తాన్ని పంప్ చేసే మూత్రపిండ సిరతో అనుసంధానించబడి ఉంటుంది.
గ్లోమెరులస్ ద్వారా రక్తంలోని గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, లవణాలు, యూరియా, నీరు మొదలైన పదార్థాలు ప్రవహిస్తాయి. ఈ పదార్థాలన్నీ బౌమాన్ గుళికలో శుద్ధి అవుతాయి. ప్రోటీన్లు మరియు రక్త కణాలు గ్లోమెరులస్ కేశనాళికల ద్వారా ప్రవహించలేని పెద్ద అణువులు రక్తంలో మిగిలిపోతాయి. గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, లవణాలు, నీటితో సహా ప్రయోజనకరమైన సమ్మేళనాలు రక్త కేశనాళికలలోకి నెఫ్రాన్ నాళం ద్వారా పంపబడతాయి. యూరియా తిరిగి రక్త కేశనాళికలలోకి ప్రవేశించడానికి బదులుగా నెఫ్రాన్ నాళం యొక్క వెనుక భాగంలో నిలిచి ఉంటుంది.
నెఫ్రాన్ నాళం చుట్టూ ఉన్న రక్త కేశనాళికల ద్వారా, సహాయక అణువులు ఈ ప్రదేశంలో ప్రసరణలోకి తిరిగి శోషించబడతాయి. మూత్రం నెఫ్రాన్ నాళం నుండి బయటికి వెళ్ళే ద్రవం. మూత్రం నెఫ్రాన్ ద్వారా మూత్రపిండాలు సేకరించే వాహికలోకి రవాణా చేయబడి అక్కడి నుండి మూత్ర నాళానికి పంపబడుతుంది. అప్పుడు మూత్రం ఈ ప్రదేశం నుండి మూత్రాశయానికి చేరుకుంటుంది. ఆ తరువాత మన శరీరం నుండి విసర్జించబడుతుంది.
మూత్రపిండాల వైఫల్యం - వివరణ
ఏవైనా అనారోగ్య సమస్యల కారణంగా ఒక్కోసారి మూత్రపిండాలు వ్యాధి బారిన పడవచ్చు, గాయపడవచ్చు లేదా వాటికి రక్త సరఫరా తగ్గిపోవచ్చు. దీని వలన అవి పనిచేయడం ఆగిపోయి యూరియా మరియు ఇతర వ్యర్ధ పదార్థాలు రక్తంలో పేరుకుపోవడం జరుగుతుంది. దీనికారణంగా శరీరం యొక్క నీటి సమతుల్యతలో కూడా మార్పులు సంభవిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో రోగికి సరైన సంరక్షణ అందించకపోతే అది అతడి మరణానికి దారి తీస్తుంది. దీనికి మూత్రపిండ మార్పిడి ఉత్తమ పరిష్కారం. రోగి శరీరంలో పాడైన మూత్రపిండాన్ని తొలగించి, మరో ఆరోగ్యకరమైన వ్యక్తి నుండి సరిపోలిన మూత్రపిండాన్ని సేకరించి శస్త్రచికిత్స చేసి మార్పిడి చేస్తారు.
ఒక వేళ మూత్రపిండం మార్పిడి సాధ్యం కాకపోతే, రోగికి క్రమం తప్పకుండా రక్తశుద్ధి యంత్ర సహాయంతో రక్తశుద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనిని డయాలసిస్ అని పిలుస్తారు. రక్తశుద్ధి యంత్రాన్ని సాధారణంగా కృత్రిమ మూత్రపిండంగా కూడా పిలుస్తారు. రక్తం నుండి మలినాలను తొలగించడానికి డయాలసిస్ ప్రక్రియనుపయోగిస్తారు.
డయాలసిస్ ప్రక్రియలో రక్తం నుండి వ్యర్ధమైన యూరియాను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని శుద్ధి చేస్తారు. రోగి యొక్క చేతి ధమని ద్వారా డయాలసిస్ యంత్రం యొక్క డయాలిజర్లోకి రక్తాన్ని పంపుతారు. ఇది డయాలసిస్ ద్రావణంతో నిండిన ట్యాంక్ లో కాయిల్ ఆకారంలో ఉండే ఎంపిక చేయబడిన పారగమ్య పొర యొక్క పొడవైన నాళాలతో తయారు చేయబడి ఉంటుంది.డయాలసిస్ ద్రావణంలో నీరు, గ్లూకోజ్ మరియు లవణాలు ఆరోగ్యకరమైన రక్తంలో ఉన్న వాటికి సరిపోయిన మోతాదులో ఉంటాయి. రోగి యొక్క రక్తంలో ఉండే యూరియా వంటి వ్యర్థాలు చాలా వరకు ఎంపిక చేయబడిన పారగమ్య పొర సెల్యులోజ్ ట్యూబ్ ద్వారా డయలైజింగ్ ద్రావణంలోకి రోగి యొక్క రక్తం ప్రవహిప జేయబడి శుద్ధి చేయబడుతుంది. రోగి చేతి సిరల ద్వారా శుభ్రం చేయబడిన రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు.
మానవులలో నియంత్రణ, సమన్వయం
మానవులలో నియంత్రణ మరియు సమన్వయం నాడీ వ్యవస్థ మరియు ఎండోక్రైన్ వ్యవస్థ అని పిలువబడే హార్మోన్ల వ్యవస్థ ద్వారా జరుగుతుంది.
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మంలను గ్రాహకాలు అంటారు. అవి మన చుట్టూ ఉన్న వాతావరణం నుండి సమాచారాన్ని అందుకుంటాయి. గ్రాహకం అనేది ఇంద్రియ అవయవంలోని కణాల సమూహం, ఇది కాంతి, ధ్వని, వాసన, రుచి, వేడి మొదలైన నిర్దిష్ట రకమైన ఉద్దీపనలను సున్నితంగా గ్రహిస్తుంది.
అన్ని గ్రాహకాలు ఇంద్రియ నరాల ద్వారా వెన్నుపాము మరియు మెదడుకు విద్యుత్ ప్రేరణల రూపంలో సందేశాన్ని పంపుతాయి. మోటారు నరాలు అని పిలువబడే మరొక రకమైన నరాలు మెదడు మరియు వెన్నుపాము నుండి ప్రతిస్పందనను ఎఫెక్టార్లకు ప్రసారం చేస్తాయి. ఎఫెక్టార్ అనేది నాడీ వ్యవస్థ నుండి పంపిన సూచనల ప్రకారం ఉద్దీపనకు ప్రతిస్పందించే శరీరంలోని ఒక భాగం. కండరాలు మరియు గ్రంధులు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
మానవ నాడీ వ్యవస్థ
నాడీ వ్యవస్థ మన శరీరం యొక్క కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. ఇది మన ప్రవర్తన, ఆలోచన మరియు చర్యలన్నింటినీ నియంత్రిస్తుంది. మన శరీరంలోని ఇతర వ్యవస్థలన్నీ నాడీ వ్యవస్థ ద్వారా మాత్రమే పనిచేస్తాయి. ఇది ఒక అంతర్గత వ్యవస్థ నుండి మరొక వ్యవస్థకు సమాచారాన్ని పంపుతుంది. ఉదాహరణకు, మనం ఆహారాన్ని నోటిలో పెట్టినప్పుడు, లాలాజల గ్రంధుల నుండి లాలాజలం విడుదల అవుతుంది.
న్యూరాన్లు
నాడీ వ్యవస్థను తయారు చేసే కణాలను న్యూరాన్లు అంటారు. న్యూరాన్ శరీరంలో అతిపెద్ద కణం. న్యూరాన్ యొక్క నిర్మాణం శరీరంలో సందేశాలను త్వరగా తీసుకువెళ్లే విధంగా ఉంటుంది. ఈ సందేశాలు విద్యుత్ ప్రేరణలు లేదా నరాల ప్రేరణల రూపంలో ఉంటాయి.
న్యూరాన్లలో మూడు భాగాలు ఉన్నాయి:
1) కణ శరీరం
2) డెండ్రైట్లు
3) ఆక్సాన్
న్యూరాన్ యొక్క కణ శరీరంలో సైటోప్లాజం మరియు న్యూక్లియస్ ఉంటాయి. న్యూరాన్ యొక్క కణ శరీరంలో నుండి చాలా పొడవైన మరియు సన్నని తంతులు బయటకు వస్తాయి. పొట్టి తంతులను డెండ్రైట్లు అని పొడవైన తంతులను ఆక్సాన్ అని అంటారు. ఆక్సాన్ మైలిన్ అనే ఇన్సులేటింగ్ మరియు రక్షిత కోశంతో కప్పబడి ఉంటుంది. ఇది కొవ్వు, ప్రోటీన్లతో మిశ్రమంతో తయారు చేయబడింది.
నాడీ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే సందేశాలు నరాల ప్రేరణలుగా పిలువబడే విద్యుత్ ప్రేరణల రూపంలో ఉంటాయి. డెండ్రైట్లు గ్రాహకాల నుండి నరాల ప్రేరణలు లేదా సందేశాలను ఎంచుకొని వాటిని కణ శరీరంలోకి, ఆక్సానక్ కు పంపుతాయి. ఆక్సాన్ ఈ ప్రేరణలను సినాప్స్ అనే జంక్షన్ ద్వారా మరొక న్యూరాన్ కు పంపుతుంది. న్యూరాన్లు మూడు రకాలు- సెన్సరీ న్యూరాన్లు, మోటార్ న్యూరాన్లు మరియు రిలే న్యూరాన్లు.
1) సెన్సరీ న్యూరాన్లు గ్రాహకాల నుండి వెన్నుపాము మరియు మెదడు లోని కేంద్ర నాడీ వ్యవస్థకు సందేశాలను ప్రసారం చేస్తాయి.
2) కేంద్ర నాడీ వ్యవస్థ నుండి కండరాల కణాలు లేదా ఎఫెక్టార్లకు సందేశాలను ప్రసారం చేయడం మోటారు న్యూరాన్ల పని.
3) రిలే న్యూరాన్లు ఇతర న్యూరాన్ల మధ్య వలయం(లింక్)గా పనిచేస్తాయి. అవి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటాయి. రెండు న్యూరాన్ల మధ్య ఉండే చిన్న ఖాళీని సినాప్స్ అంటారు. న్యూరోట్రాన్స్మిటర్ అనే రసాయన పదార్థం ద్వారా నరాల ప్రేరణలు ఈ చిన్న ఖాళీ పైకి తీసుకువెళతాయి.
ఇంద్రియ కణాలు లేదా గ్రాహకాలు ఇంద్రియ అవయవాల డెండ్రైట్ తో సంబంధం కలిగి ఉంటాయి. రిసెప్టర్ పైన పనిచేసే ఉద్దీపన ఉన్నప్పుడు, దానిలో విద్యుత్ ప్రేరణను ఉత్పత్తి చేసే రసాయన ప్రతిచర్య సంభవిస్తుంది. ఈ ప్రేరణ ఇంద్రియ న్యూరాన్ యొక్క డెండ్రైట్ నుండి దాని కణశరీరానికి ఆ తరువాత ఆక్సాన్ వెంట ప్రయాణిస్తుంది. ఆక్సాన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ చివరిలో సినాప్స్ చిన్న మొత్తంలో రసాయన పదార్థాన్ని విడుదల చేస్తుంది. తదుపరి న్యూరాన్ యొక్క డెండ్రైట్లో ఇలాంటి విద్యుత్ ప్రేరణ ప్రారంభమవుతుంది. ఈ విధంగా విద్యుత్ ప్రేరణ వెన్నుపాము మరియు మెదడులోని రిలే న్యూరాన్లను చేరే వరకు న్యూరాన్లలో తీసుకువెళుతుంది. రిలే న్యూరాన్లు, మోటారు న్యూరాన్లు ఒకే విధంగా అనుసంధానించబడి ఉంటాయి. మెదడు, వెన్నుపాము నుండి కండరాలు, గ్రంధుల వంటి ప్రభావాలకు విద్యుత్ ప్రేరణలను తీసుకురావడంలో సహాయపడతాయి. విద్యుత్ ప్రేరణ ఒక దిశలో మాత్రమే ప్రయాణిస్తుందని సినాప్స్ నిర్ధారిస్తుంది.
విటమిన్లు సూక్ష్మమైన పోషక పదార్థాలు. ఇవి శక్తినిచ్చే పదార్థాలు కావు. ఇవి శరీరంలోని వివిధ జీవక్రయిలను పరోక్షంగా నియంత్రిస్తాయి. వీటి లోపం వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. ఎ, బి, సి, డి, ఇ, కె అనే ఆరు రకాల విటమిన్లు ఉన్నాయి. విటమిన్ల గురించ అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అని అంటారు. విటమిన్లను వర్గీకరించి, మొదటిసారిగా విటమిన్-బి, ను వేరుచేసిన శాస్త్రవేత్త కాసిమర్ ఫంక్. విటమిన్లకు పేరు పెట్టింది ఇతడే. ఇతడిని విటమిన్ల పితామహుడు అంటారు.
కరిగే విధానాన్ని బట్టి విటమిన్లు రెండు రకాలు. అవి: 1) నీటిలో కరిగే విటమిన్లు. వీటికి ఉదాహరణ బి, సి. 2) కొవ్వులో ఎక్కువగా నిల్వఉండని విటమిన్లు బి, సి.
విటమిన్-ఎ:
దీని రసాయన నామం రెటినాల్. దీని లోపం వల్ల రేచీకటి. కళ్లు పొడిబారిపోవడం, చర్మం గరుకుగా మారడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఇది షార్క్ చేప నూనెలో ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ బొప్పాయి, ఆకుకూరలు లాంటి వాటి ద్వారా మన శరీరం ఈ విటమిన్ను తయారు చేసుకుంటుంది.
బి కాంప్లెక్స్ విటమిన్లు:
బి విటమిన్లను తిరిగి అనేక రకాలుగా విభజించారు. వీటన్నింటినీ కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్లు అంటారు.
1) థయామిన్:
దీన్ని బి1 విటమిన్ అంటారు. దీని లోపం వల్ల మానవుడిలో బెరి-బెరి వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ ధాన్యలు, పాలు, మాంసం, చిక్కుడు గింజలు లాంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే, గంజిని వంపితే ఈ విటమిన్ ను కోల్పోతాం.
2) రైబోఫ్లావిన్:
దీన్ని విటమిన్-బి2 అంటారు. దీని లోపం వల్ల నాలుకపై పుండ్లు ఏర్పడటం, నోటి చివర పగలడం లాంటి వ్యాధులు కలుగుతాయి. గోధుమ పిండి, ఆవు పాలు, గుడ్లు, మొలకెత్తే విత్తనాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.
3) నియాసిన్:
దీన్నే విటమిన్-బి3 అంటారు. దీని లోపం వల్ల పెల్లగ్రా అనే చర్మ వ్యాధి కలుగుతుంది. మాంసం, చేపలు, ఆకుపచ్చని కూరగాయలు, బటానీ లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
4) పైరిడాక్సిన్:
దీన్ని విటమిన్-బి6 అంటారు. రక్తంలో తెల్లరక్తకణాల ఉత్పత్తికి ఈ విటమిన్ అవసరం. కోడిగుడ్డు, మాంసం, ఆకుపచ్చని కూరగాయలు, విత్తనాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.
5) సయనోకోబాలమైన్:
దీన్ని విటమిన్-బి12 అంటారు. దీనిలోపం వల్ల పెరినీషియస్ ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ మనం తీసుకునే అనేక రకాల ఆహార పదార్థాల్లో ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషణ చేస్తుంది.
6) పాంటోథెనిక్ ఆమ్లర్:
దీనిలోపం వల్ల అరికాళ్లలో మంటలు, మలబద్దకం కలుగుతాయి. మాంసం, పాలు, చిలగడదుంప లాంటివాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
7) బయాటిన్:
దీనిలోపం వల్ల చర్మవాపు, దురదలాంటివి కలుగుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కూరగాయాలు, విత్తనాలు, జంతువుల కాలేయం, మూత్రపిండం లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
8) ఫోలిక్ ఆమ్లం:
దీని లోపం వల్ల మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనే వ్యాధి కలుగుతుంది. ఎర్రరక్తకణాల తయారీకి దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, కాలీఫ్లవర్, మూత్రపిండం లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్-సి:
దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది. ఉసిరి, నిమ్మజాతి పండ్ల లాంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది.
విటమిన్-డి:
దీన్ని కాల్సిఫెరాల్ అని కూడా పిలుస్తారు. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియో మలేషియా అనే వ్యాధులు వస్తాయి. ఇది కాడ్ చేప కాలేయ నూనె, కోడిగుడ్లలో లభిస్తుంది. మన శరీరం సూర్యరశ్మి సహాయంతో ఈ విటమిన్ను తయారు చేసుకుంటుంది.
విటమిన్-ఇ:
దీని రసాయనిక నామం టోకోఫెరాల్. శుక్రకణాల ఉత్పత్తికి, గర్భస్రావాన్ని నిరోధించడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. గుడ్లు, పాలు, సోయా నూనె, ఆకుకూరలు లాంటి వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
విటమిన్-కె:
దీన్ని ఫిల్లోక్వినోన్ అంటారు. ఇది లోపిస్తే రక్తం గడ్డకట్టదు. కోడిగుడ్డు, ఆవుపాలు, టమోటో, క్యాలీ ఫ్లవర్ లాంటి వాటిలో ఇది ఎక్కువగా లభిస్తుంది.
కార్బోహైడ్రేట్లు-సి:
మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. అన్ని రకాల చక్కెరలు, పిండిపదార్థం వీటికి ఉదాహరణ. సాధారణ చక్కెర, గింజలు, దుంపలు, పండ్లు, తేనెల నుంచి మనకు కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.
లిపిడ్లు:
ఇవి మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కణాలు ఏర్పడటానికి, శరీర పెరుగుదలకు అవసరం. జంతువుల నుంచి లభించే కొవ్వులు, మొక్కల నుంచి లభించే నూనెలు వీటికి ఉదాహరణ.
ప్రోటీన్లు:
ఇవి శరీర పెరుగుదలకు, అభివృద్ధికి, గాయాలు మానడానికి ఉపయోగపడతాయి. మాంసం, చిక్కుడు గింజలు, పప్పు ధాన్యలు, గుడ్డు లాంటి ఆహారపదార్థాల ద్వారా ఇవి మనకు లభిస్తాయి.
CHEMISTRY
పారిశ్రామిక రసాయన శాస్త్రం
పారిశ్రామిక రంగం పురోగతి సాధించి, ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో మానవ జీవనం చాలా మెరుగయింది. సిమెంటు, గాజు, మృణ్మయ పాత్రలు, సబ్బులు, ప్లాస్టిక్ లు, పాలిమర్లు, ఎరువులు తదితరాలు నిత్యం మన అవసరాలను తీరుస్తున్నాయి. ఈ ఉత్పత్తులన్నింట్లో రసాయనాల పాత్ర చాలా ముఖ్యమైంది.
సిమెంటు పరిశ్రమ
జోసెఫ్ ఆస్పిడిన్ (1824) సిమెంటును కనుగొనడంతో దాని ద్వారా తయారైన నిర్మాణాలు ఇంగ్లండ్ లోని పోర్ట్ లాండ్ లో ఉన్న గృహ నిర్మాణాల్లో గట్టిగా ఉండటంతో ఈ సిమెంటుకు పోర్ట్ లాండ్ సిమెంటు అనే పేరొచ్చింది. సిమెంటు బూడిదరంగుతో ఉండటానికి కారణం దానిలో ఉండే ఐరన్ ఆక్సైడ్. కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్, జిప్సంల మిశ్రమంమే సిమెంటు.
సిమెంటు తయారీకి సున్నపురాయి, బంకమన్ను, జిప్సంలను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. కడిగి శుభ్రపరచిన బంకమట్టిని సున్నపు రాయి పొడికి తడి పద్దతిలో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ముడి స్లర్రీ అంటారు. పొడి పద్దతిలో సున్నపు రాయి అయిదు భాగాలు, బంక మట్టి ఒక భాగం కలిపి మెత్తని పొడి చేస్తారు. ఈ ప్రక్రియను పల్వరైజేషన్ అంటారు. ఈ మిశ్రమాన్ని ముడి చూర్ణం అని పిలుస్తారు. ముడి స్లర్రీ లేదా ముడి చూర్ణాన్ని ప్రగల పదార్థం అంటారు. దీన్ని తిరుగుడు కొలిమిలో వేసి గ్యాస్ లేదా బొగ్గు మండించి, 1700°C నుంచి 1900°C కి వేడి చేస్తారు. ఈ ప్రక్రియలో నీరు, CO2, వెలువడి, రసాయన చర్య జరిగి బూడిదరంగులో గట్టి బంతుల వంటి క్లింకర్ ఏర్పడుతుంది. దీనికి రెండు నుంచి మూడు శాతం జిప్సం కలిపి ఏకరీతి చూర్ణం చేస్తే సిమెంటు తయారవుతుంది.
పూర్వకాలంలో గృహ నిర్మాణంలో కాల్చిన సున్నం, ఇసుక, నీటి మిశ్రమం వాడేవారు. దీన్ని లైమ్ మోర్టార్ అంటారు. సిమెంటు, ఇసుక, నీటి మిశ్రమాన్ని సిమెంటు మోర్టార్ అంటారు. దీనికి గులక రాళ్లను కలిపితే సిమెంటు కాంక్రీటు తయారవుతుంది. ఈ కాంక్రీటును భవనాలు, రహదారుల నిర్మాణానికి వాడతారు. దీన్ని ఇనుప చట్రాల్లో పోస్తే ఆర్.సి.సి. తయారవుతుంది. ఆర్.సి.సి. అంటే రీఇన్ఫడ్ సిమెంట్ కాంక్రీట్. ఇది అన్నిటికంటే దృఢమైంది. దీన్ని పెద్ద భవనాలు, వంతెనల నిర్మాణానికి ఉపయోగిస్తారు.
సబ్బుల పరిశ్రమ
రసాయనికంగా సబ్బు అనేది కొవ్వు ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణం. నూనెలు లేదా కొవ్వుల్లో ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. జంతువుల కొవ్వులో స్టియరిక్, పామిటిక్ ఆమ్లాలు ఉంటాయి. వేరుశెనగ నూనెలో అరాడిక్, పత్తి గింజల నూనెలో లినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. వెన్నలో బ్యుటిరిక్ ఆమ్లం ఉంటుంది. నూనె లేదా కొవ్వులను క్షారం సమక్షంలో జలవిశ్లేషణం జరిపితే సబ్బు తయారవుతుంది. ఈ ప్రక్రియను సెపానిఫికేషన్ అంటారు. సబ్బు తయారీని స్థూలంగా ఈ సమీకరణం ద్వారా సూచించవచ్చు.
సబ్బు తయారీలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో నూనె లేదా కొవ్వును ఫ్యాటీ ఆమ్లాలుగా జలవిశ్లేషణ చేస్తారు. ఈ దశలో నూనె లేదా కొవ్వును జింక్ ఆక్సైడ్ లేదా కాల్షియం ఆక్సైడ్ లేదా మెగ్నీషియం ఆక్సైడ్ ను చేర్చి, నీటి ఆవిరి పంపి 250°C వద్ద వేడి చేస్తారు. ఈ దశలో ఏర్పడిన గ్లిజరాలను స్వేదనం చేసి తొలగిస్తారు. ఇలా ఏర్పడిన ఫ్మాటీ ఆమ్లాల మిశ్రమాన్ని రెండోదశలో ఎండబెట్టి, అంశిక స్వేదం చేసి, వాటిని వేరు చేస్తారు. మూడోదశలో ఎన్నుకున్న ఫ్యాటీ ఆమ్లాల మిశ్రమానికి KOH, NaOH, Mg(OH)2, Ca(OH)2, ట్రైఇథనాల్ ఎమీన్ వంటి క్షారాలతో తటస్థీకరణం జరిపితే సబ్బు ఏర్పడుతుంది. సబ్బు అనేది రసాయనికంగా లవణం.
శారీరక శుభ్రత కోసం వాడే టాయిలెట్ సబ్బుల్లో పొటాషియం (K+ ) లవణాలు, బట్టలు ఉతికేందుకు వాడే సబ్బుల్లో సోడియం (Na+) లవణాలు, డ్రైక్లీనింగ్, అలంకరణ సామాగ్రి సబ్బుల్లో సామాన్యంగా 30 శాతం నీరు ఉంటుంది. టాయిలెట్ సబ్బుల్లో 7 నుంచి 10 శాతం స్వేచ్ఛా ఆమ్లాలుంటాయి. దుర్వాసన తొలగించే, క్రిమినాశక సబ్బుల్లో 3, 4, 5 టైబ్రోమోశాలి సిలెనిలైడ్ ఉంటుంది. షేవింగ్ క్రీములుగా వాడే సబ్బుల్లో పొటాషియం స్టియరేట్ కలుపుతారు. దీనివల్ల అది ఎక్కువ మొతాదులో ఎండిపోని నురగను ఇస్తుంది. పారదర్శక సబ్బుల్లో గ్లిజరాల్ ను స్వల్ప ప్రమాణంలో కలుపుతారు.
గాజు పరిశ్రమ
సోడా గాజును సాధారణ గాజు అంటారు. గాజు తయారీలో ముడి పదార్థాలుగా సున్నపురాయి. (CaCO3) బట్టల సోడా (Na2CO3), శుద్ద సిలికా (SiO2) లను తీసుకుంటారు. వీటిని బ్యాచ్ అంటారు. వీటికి పగిలిన గాజు ముక్కలను చేరుస్తారు. పగిలిన గాజు ముక్కలను కల్లెట్ అని పిలుస్తారు. ఇవన్నీ కలపడంవల్ల గాజు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవనం చెంది, ఇంధనం ఆదా అవుతుంది. పై పదార్థాలను కొలిమిలోకి పంపి 1000°C కి వేడి చేస్తారు. అప్పుడు వేడి గాజు తయారవుతుంది. దీని పై భాగంలో నురగవంటి మలినాలు తేలుతూ ఉంటాయి. వీటిని గ్లాస్ గల్ అంటారు. తెడ్ల సహాయంతో ఈ మలినాలను తీసివేస్తారు.
వేడి గాజును ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా చల్లారుస్తారు. ఈ ప్రక్రియను మంద శీతలీకరణం లేదా ఎనీలింగ్ అంటారు. దీనివల్ల గాజుకు పెళుసుదనంపోయి గట్టిదనం వస్తుంది. గాజు పై అక్షరాలు రాసే ప్రక్రియను ఎచింగ్ అంటారు. దీనికోసం హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం (HF) ఉపయోగిస్తారు. గాజు పై మొదట మైనం పూత పూస్తారు. తర్వాత అక్షరాల రూపంలో మైనాన్ని తీసివేసి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం పూత పూస్తారు. (HF) గాజుతో చర్యపొంది హైడ్రో ఫ్లోసిలిసిక్ ఆమ్లం (H2SiF6 ) ఏర్పడుతుంది. దీన్ని, మైనాన్ని తొలగించినప్పుడు గాజు పై అక్షరాలు కనిపిస్తాయి.
గాజు రకం - ఉపయోగాలు
సోడాగాజు - సీసాలు, కిటికీ అద్దాలు
ప్లింట్ గాజు - విద్యుత్ బల్బులు, కంటి అద్దాలు
పైరెక్స్ గాజు - ప్రయోగశాల పరికరాలు
గట్టిగాజు - గట్టిగాజు పరికరాలు
క్వార్జ్ గాజు - దృశాపరికరాలు, విద్యుత్ బల్బులు
బోరోసిలికేట్ గాజు - వంట పాత్రలు, గొట్టపు ద్వారాలు
క్రూ గాజు - UV కిరణాలను నిరోధించే అద్దాలు
వేడిగాజును చల్లార్చి మెత్తగా అయిన స్థితిలో దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతి ఉన్న వస్తువులను తయారు చేస్తారు. ఈ ప్రక్రియను గ్లాస్ బ్లోయింగ్ అంటారు. బ్లోయింగ్ ప్రక్రియలో ఆక్సీఎసిటిలీన్ జ్వాలను 3300°C ఉష్ణోగ్రతను ఇస్తుంది. అన్ని గాజు రూపాలు బ్లోయింగ్ కు పనికిరావు. పైరెక్స్ గాజు, బోరోసిలికేట్ గాజులకు మాత్రమే ఈ ప్రక్రియను వినియోగిస్తారు. లోహ ఆక్సైలు లేదా లవణాలు చేర్చి గాజుకు ప్రత్యేకమైన రంగులు ఆపాదించవచ్చు. ప్రత్యేకమైన అవసరాలను బట్టి భిన్న రంగులు తయారు చేస్తారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
కాల్షియం సల్పేట్ డై హైడ్రేట్ ను జిప్సం అంటారు. దీని ఫార్ములా CaSo4_2H2O ఇది మనదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో అధికంగా లభిస్తుంది. దీన్ని 120°C కి వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు నీటిని కలిపిన వెంటనే గట్టిపడుతుంది. దీన్ని ఫాల్స్ సీలింగ్ కు, సర్జికల్ ప్లాస్టర్ గా, చాక్ పీసుల తయారీకి, వినాయకుడి విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసకు సోడియం క్లోరైడ్ (Nacl) కలపడం వల్ల అది వెంటనే గట్టిపడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు పటిక పొడిని కలిపినప్పుడు అది చాలా కఠినంగా తయారవుతుంది. జిప్పంను 200°C వద్ద వేడి చేసినప్పుడు అది నీటిని పూర్తిగా కోల్పోయి డెడ్ ప్లాస్టర్ ఏర్పడుతుంది. దీనికి నీటిని కలిపినప్పుడు గట్టిగా మారే స్వభావం ఉండదు.
మృణ్మయ పాత్రలు
వీటి తయారీకి ముడిపదార్థలుగా బంకమన్ను, ఫెల్ స్పార్, సిలికాలను ఉపయోగిస్తారు. ఈ ముడి పదార్థాలను చూర్ణం చేసి తగినంత నీరు కలిపి ఎండబెడతారు. ఎండిన వస్తువులను కొలిమిలో వేడిచేసినప్పుడు మృణ్మయ పాత్రలు ఏర్పడతాయి. ఈ పాత్రలను సాధారణ కుండ పాత్రలు , మృత్తికా పాత్రలు అని రెండు రకాలుగా విభజించవచ్చు. సాధారణ కుండపాత్రలు 1100°C వద్ద మాత్రమే తయారవడం వల్ల అవి అంత గట్టిగా ఉండవు. వీటిని గృహాల్లో పాత్రలుగా, కూజాలుగా, ఇంటి పైకప్పు పెంకులుగా ఉపయోగిస్తారు. మృత్తికా పాత్రల తయారీకి 1800°C ఉష్ణాన్ని ఉపయోగిస్తారు. ఇవి గట్టిగా ఉంటాయి. వీటిని స్పార్క్ ప్లర్లు, పచ్చడి జాడీలు, టాయిలెట్ సామాగ్రి, టైల్స్ తయారీకి ఉపయోగిస్తారు.
కృత్రిమ ఎరువులు
మొక్కల పురుగుదలకు అవసరమైన అనేక మూలకాలు నేల నుంచి లభిస్తాయి. కొన్ని పంటల తర్వాత నేల నిస్సారం అవుతుంది. అలాంటప్పుడు ఎరువుల రూపంలో రసాయనాలను నేలలో చల్లి మొక్కలకు ఆ మూలకాలను తిరిగి అందించవలసి ఉంటుంది. ఈ మూలకాలు మొక్కలకు అందకపోతే, పంట నిస్సారమై ఆహార సమస్య ఏర్పడుతుంది. అందుకే వీటిని ఆవశ్యక పోషకాలు అంటారు. ఈ మూలకాలను కృత్రిమ ఎరువుల ద్వారానే మొక్కలకు అందించగలం.
ఆవశ్యకమైన పోషకాలను సహజ, ప్రాథమిక, ద్వితీయ, సూక్ష్మ పోషకాలని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు సహజ పోషకాలు. 2. నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియంలు (NPK) ప్రాథమిక పోషకాలు. 3. కాల్షియం, సోడియం, సల్ఫర్, మెగ్నీషియంలు ద్వితీయ పోషకాలు. 4. కాపర్, మూలబ్దినం, మంగనీస్, కోబాల్ట్, జింక్, బోరాన్, ఇనుములు సూక్షపోషకాలు.
జంతువుల పేడ, కంపోస్టు మొదలైనవి సహజ ఎరువులు అయితే కృత్రిమ ఎరువులు ముఖ్యంగా మూడు రకాలు 1. పోటాషియం , 2. నైట్రోజన్, 3. ఫాస్పరస్ ఎరువులు.