<b> సెప్టెంబర్ 2019 కరెంటు అఫైర్స్ </b>

సెప్టెంబర్ 2019 కరెంటు అఫైర్స్

సెప్టెంబర్ అంతర్జాతీయం

అత్యంత సురక్షిత నగరంగా టోక్యో

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. ఈ మేరకు ప్రపంచంలోని 60 సురక్షితమైన నగరాల జాబితా-2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. భారత్‌లోని ముంబై 45వ స్థానంలో, ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి.

అత్యంత సురక్షితమైన నగరాలు

ర్యాంకు

నగరం

దేశం

1

టోక్యో

జపాన్

2

సింగపూర్

సింగపూర్

3

ఒసాకా

జపాన్

4

ఆమ్‌స్టర్‌డ్యామ్

నెదర్లాండ్స్

5

సిడ్నీ

ఆస్ట్రేలియా

6

టొరంటో

కెనడా

7

వాషింగ్టన్

అమెరికా

8

కోపెన్‌హ్యాగన్

డెన్మార్క్

9

సియోల్

దక్షిణ కొరియా

10

మెల్‌బోర్న్

ఆస్ట్రేలియా

20

హంకాంగ్

హంకాంగ్

45

ముంబై

భారత్

52

న్యూఢిల్లీ

భారత్

56

ఢాకా

బంగ్లాదేశ్

57

కరాచీ

పాకిస్తాన్

58

యంగూన్

మయన్మార్

ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్-60 సిటీలతో ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతం డిజిటల్ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది.

అంతరిక్షంలో అమెరికా స్పేస్ కమాండ్

అంతరిక్షంలో దేశ ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా స్పేస్ కమాండ్‌ను ప్రారంభించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గల వైట్‌హౌస్‌లో ఆగస్టు 30న జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ స్పేస్ కమాండ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇక అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎవరూ సవాల్ చేయలేరన్నారు. అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను స్పేస్‌కామ్ కాపాడుతుందని పేర్కొన్నారు.

9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు


వాషింగ్టన్: 2001లో అమెరికాలోని వరల్డ్‌ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ కేసును 2021లో చేపట్టనున్నట్లు మిలటరీ కోర్టు జడ్జి ఎయిర్‌ఫోర్స్ కల్నల్ డబ్ల్యూ షేన్ కోహెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు వ్యూహ రచనతోపాటు అమలు చేసినందుకు యుద్ధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ప్రస్తుతం అమెరికా వైమానిక స్థావరం గ్వాంటానమో బే జైలులో ఉన్నారు. వీరిపై 2021 జనవరి 11వ తేదీ నుంచి అక్కడే విచారణ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. వీరిని 2002-2003 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్‌లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి పలు రహస్య ప్రాంతాల్లో ఉంచి, విచారణ జరిపింది. చివరికి 2006లో గ్వాంటానమో బే జైలుకు తరలించింది. మిలటరీ చట్టాల ప్రకారం వీరిపై నేరం రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. నిందితుల్లో సెప్టెంబర్ 11 దాడులతోపాటు ఇతర ఉగ్రచర్యలకు కుట్రపన్నిన అల్ ఖైదా సీనియర్ నేత ఖలీద్ షేక్ మొహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచి, ముస్తఫా అల్ హౌసవి ఉన్నారు. అల్‌ఖైదాకు చెందిన మొత్తం 19 మంది సభ్యులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేసి రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన, ఒకటి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌పైన కూల్చడంతోపాటు మరో దానిని పెన్సిల్వేనియాలో నేల కూల్చారు. ఈ ఘటనల్లో మొత్తం 3వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

అత్యుత్తమ జీవన నగరంగా వియన్నా


ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను సెప్టెంబర్ 4న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 99.1 పాయింట్లతో గతేడాదిలాగే వియన్నా తొలిస్థానంలో నిలవగా.. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి.

ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి.

ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాలు

ర్యాంకు

నగరం

దేశం

1

వియన్నా

ఆస్ట్రియా

2

సిడ్నీ

కెనాడా

3

ఒసాకా

జపాన్

48

లండన్

ఇంగ్లండ్

58

న్యూయార్క్

అమెరికా

76

బీజింగ్

చైనా

118

న్యూఢిల్లీ

భారత్

119

ముంబై

భారత్

136

కరాచీ

పాకిస్తాన్

138

ఢాకా

బంగ్లాదేశ్

140

డమాస్కస్

సిరియా

సెప్టెంబర్ 2019 జాతీయం 

సీబీడీటీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు

Pramod chandra

 

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రమోద్ చంద్ర పదవీకాలం 2019, ఆగస్టు 31తో ముగియనుండగా.మరో ఏడాది పాటు ఆయనను కొనసాగించింది.

కిసాన్-జవాన్ సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్

జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో ఆగస్టు 29న డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఏడుపు ఆపాలని పాకిస్తాన్‌కు సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్‌లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు.

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభం

ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ను మొదలు పెట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిట్‌నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేదన్నారు.
ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రధాని మోదీతో ఏడీబీ ప్రెసిడెంట్ భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రెసిడెంట్ టకెహికో నకావో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 29న ఈ సమావేశం సందర్భంగా భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఏడీబీ అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది.
ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నకావో మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందన్నారు. కేంద్రానికి ఆర్‌బీఐ నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చన్నారు. నాలుగురోజుల నకయో భారత్ పర్యటన ఆగస్టు 30తో ముగుస్తుంది. మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఏడీబీ అంచనా. 2020-21లో ఇది 7.2 శాతంగా ఉంటుందని విశ్లేషిస్తోంది.

మూకదాడులపై బిల్లుకు బెంగాల్ ఆమోదం

మూకదాడులు, హత్యలు, నేరపూరిత సంఘటనలు నియంత్రించే ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్-2019 బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆగస్టు 30న ఆమోదం తెలిపింది. మూకదాడులు నియంత్రించి సామన్యులకు రక్షణ కల్పించడం, అటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు తీసుకొచ్చారు. మూకదాడులకు పాల్పడే వారిపై 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడేలా బిల్లులో పొందుపరిచారు. మూకదాడులు సామాజిక దుశ్చర్యలను ప్రేరేపిస్తున్నాయని, కలిసికట్టుగా వీటికి వ్యతిరేకంగా పోరాడాలని బిల్లుపై చర్చలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

అస్సాంలో ఎన్‌ఆర్‌సీ తుదిజాబితా విడుదల

గువాహటి: వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుది జాబితా ఆగస్టు 31న విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌ఆర్‌సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు. అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కార్యాలయం ఆగస్టు 31న ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్ ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది. ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.

ఎన్నార్సీ పూర్వాపరాలివీ..

  • 1951: స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) తయారైంది.
  • 1955: భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు.
  • 1951 -1966: తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది.
  • 1965: భారత పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు.
  • 1971: మరోసారి వెల్లువలా చొరబాట్లు.
  • 1979: అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు
  • 1983: నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు.
  • 1985: భారత ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్ తేదీగా నిర్ణయం.
  • 1997: అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో డీఅక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం.
  • 2003: పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు.
  • 2005-1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్‌ఆర్‌సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం.
  • 2010: బార్‌పేటలోని ఛాయాగావ్‌లో ఎన్‌ఆర్‌సీ జాబితా సవరణ తాలూకూ పైలట్ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత.
  • 2016: ఎన్‌ఆర్‌సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు
  • 2017: డిసెంబరు 31న ఎన్‌ఆర్‌సీ తొలి ముసాయిదా జాబితా విడుదల
  • 2019 జూలై 31న ఎన్‌ఆర్‌సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు
  • 2019 ఆగస్టు 31. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు.

ఆర్మీలో 575 మంది కశ్మీర్ యువకులు

జమ్మూ కశ్మీర్ చెందిన 575 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. వారు ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 31న స్థానిక బానా సింగ్ మైదానంలో పరేడ్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో పని చేసేందుకు వీరిని నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. దేశానికి సేవ చేయాలనే తపన కశ్మీర్ యువకుల్లో కనపడిందని ఆయన తెలిపారు. తమ కుమారులు ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నారైలకూ ఆధార్

న్యూఢిల్లీ: మూడు నెలల్లో భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్ కార్డులు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా ఆరునెలల కాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని సంస్థ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా సాంకేతిక మార్పులు ఇప్పటికే చేపట్టామని.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఆధార్ కార్డు జారీ కోసం టైమ్‌స్లాట్‌లు బుక్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. అయితే ఎన్నారైలకు ఆధార్ కార్డు జారీపై ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. యూఐడీఏఐ దేశంలో మరిన్ని ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆధార్ నమోదు, జారీ, మార్పులు చేర్పుల వంటి అన్ని సౌకర్యాలకూ ఈ కేంద్రాలు కేంద్రంగా మారనున్నాయి.

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(58)ను కేంద్రం నియమించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ(72)ను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తెలిపింది. రాజస్తాన్ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ స్థానంలో మిశ్రా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆక్వా ఆక్వేరియా ఇండియా ప్రారంభం

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 30న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా ఇండియా-2019 ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉందని, ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నంబర్ వన్‌కు చేరాలని అన్నారు. ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపీఈడీఏ లాంటి సంస్థలు, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు కృషి చేయాలని సూచించారు.

మలయాళ మనోరమ సదస్సులో మోదీ

కేరళలోని కోచీలో ఆగస్టు 30న నిర్వహించిన మలయాళ మనోరమ సదస్సును ఉద్దేశించి న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నిర్మాణాత్మక విమర్శలను తానెప్పుడూ స్వాగతిస్తానని, ప్రజా జీవితంలో భిన్నాప్రాయాలకు తావుండాలని, అందరూ తమ తమ భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా... సమాజంలో అంశాలపై చర్చ నిరంతరం సాగుతూనే ఉండాలని పేర్కొన్నారు.

పది ఆయుష్ కేంద్రాలు ప్రారంభం

హరియాణాలో ఏర్పాటైన పది ఆయుష్ కేంద్రాలను ఆగస్టు 30న న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే ఆయుర్వేద, సిద్ధ తదితర భారతీయ వైద్యవిధానాలకు విశేష సేవలందించిన 12 మంది వ్యక్తుల పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. వీరిలో గాంధీజీ వ్యక్తిగత వైద్యుడు దిన్‌షా మెహతా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆయుష్ కార్యక్రమంలోకి తాజాగా సోవా రిగ్‌పా అనే బౌద్ధ వైద్యవిధానాన్ని చేరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రాచీన, ఆధునిక వైద్యవిధానాల మేళవింపుతోనే దేశ ఆరోగ్య రంగం మెరుగుపడగలదని స్పష్టం చేశారు.

ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ ప్రారంభం

కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్- 2019 సదస్సు సెప్టెంబర్ 4న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ (ఆర్‌ఈఎస్) ప్రొఫెసర్ చైమ్ ఈష్డె పాల్గొన్నారు.
సదస్సు సందర్భంగా ఐటీసీ-2019 చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. 2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామన్నారు.

భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అపాచీ ఎహెచ్-64ఇ యుద్ధ హెలికాప్టర్లు భారత్ అమ్ముల పొదిలో చేరాయి. మొత్తం ఎనిమిది హెలికాప్టర్లను పఠాన్ కోట వైమానిక దళానికి అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ సెప్టెంబర్ 3న అందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ హెలికాప్టర్లకు పూజలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థలతో 2015లో 22 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. 2019, జూలైలో నాలుగు హెలికాప్టర్లు అప్పగించారు. ఆఖరి విడత మార్చి 2020 నాటికల్లా బోయింగ్ సంస్థ అందించాల్సి ఉంది. కాలం చెల్లిన ఎంఐ-35 హెలికాప్టర్ల స్థానంలో అపాచీ కొనుగోలు చేశారు.

అపాచీ హెలికాప్టర్ల ప్రత్యేకతలు

  • గంటకి 284 కి.మీ. వేగంతో దూసుకెళ్లేందుకు సాయపడే రెండు టర్బోషాఫ్ట్ ఇంజిన్లు
  • ఎత్తు : 15.24 అడుగులు
  • బరువు : 6,838 కేజీలు
  • రెండు రెక్కలను కలుపుతూ కొనల మధ్య దూరం: 17.15 అడుగులు
  • ఒకేసారి 8 క్షిపణుల్ని ప్రయోగించే సత్తా
  • నిట్టనిలువుగా ఎగిరే సామర్థ్యం : నిముషానికి 2 వేల అడుగులు కంటే ఎక్కువ
  • ఒక్కో నిమిషానికి గరిష్టంగా ఎగరగల ఎత్తు : 2,800 అడుగుల కంటే ఎక్కువ
  • అన్నిరకాల ప్రతికూల వాతావరణాల్లోనూ రేయింబగళ్లు ప్రయాణించే ఆధునిక సాంకేతికత
  • లక్ష్యాలను ఛేదించడానికి లేజర్, ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థ
  • 35 ఎంఎం ఫిరంగులు ఒకేసారి 1200 రౌండ్లు కాల్చే సామర్థ్యం
  • యుద్ధభూముల్ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పంపే సదుపాయం

 ద్వైపాక్షిక సంబంధాలు

జాధవ్‌ను కలిసేందుకు అనుమతించిన పాక్

Current Affairs
కుల్‌భూషణ్ జాధవ్(49)

ఇస్లామాబాద్: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను దౌత్యాధికారులు కలుసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం అని విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

యూటీఏతో ప్రెసిడెన్సీ వర్సిటీ ఎంవోయూ

అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్(యూటీఏ)తో బెంగళూరుకు చెందిన ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం, యూటీఏతో కలిసి ఐదేళ్ల కాలానికి బీటెక్, ఎంఎస్ ప్రోగ్రామ్‌లను అందించనుంది. దీనిప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి మూడేళ్లు ప్రెసిడెన్సీ వర్సిటీలో చదవాలి. నాలుగో ఏడాది అమెరికాలోని యూటీఏలో అండర్ గ్రాడ్యుయేట్ నాన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు ఎన్‌రోల్ అవుతారు. ఇది విజయవంతంగా పూర్తిచేస్తే అమెరికాలో రెండేళ్లపాటు ఎంఎస్ కోర్స్ పూర్తి చేయవచ్చు.

భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ

రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో సెప్టెంబర్ 4న నిర్వహించిన భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజవాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రం సందర్శన

భారత్-రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ఈ సదస్సు సందర్భంగా మోదీ తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. భారత్-యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టోక్‌లోని జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు.

చెన్నై-వ్లాడివోస్టోక్ నౌకామార్గం

ప్రధాని మోదీ-పుతిన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల భేటీ అనంతరం భారత్, రష్యాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ....తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టోక్ వరకూ పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్-రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ-పుతిన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.

గగన్‌యాన్‌కు రష్యా సహకారం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

రాష్ట్రీయం (ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ)

ఏపీలోని మూడు నగరాల్లో క్రీడా కాంప్లెక్స్‌లు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో అన్ని వసతులతో సమీకృత క్రీడా కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ క్రీడల అభివృద్ధికి, మౌలికవసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 2014 నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఏపీ క్రీడాకారులకు వైఎస్సార్ క్రీడాప్రోత్సాహకం కింద నగదు అందించనున్నట్లు మంత్రి తెలిపారు..

తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా మహిళ గవర్నర్

సాక్షి, హైదరాబాద్/చెన్నై: బీజేపీలో సుష్మాజీ ఆఫ్ తమిళనాడు గా పేరు సంపాదించుకున్న డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను కేంద్రం రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఆమె రాష్ట్రానికి నియమితులైన తొలి మహిళా గవర్నర్ కావడం విశేషం. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై.. అనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో 1961 జూన్ 2వ తేదీన జన్మించారు.

కుటుంబ నేపథ్యం :

తమిళనాడులో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమరి ఆనందన్, కృష్ణకుమారి దంపతులకు తమిళిసై సౌందర్‌రాజన్ జన్మించారు. తండ్రి ఆనందన్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, తమిళనాడు పీసీసీ చీఫ్‌గా పని చేశారు. తమిళిసై భర్త డాక్టర్ పి.సౌందర్‌రాజన్ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు. రామచంద్ర మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. సౌందరరాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె కెనడాలో సానోలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రామచంద్ర మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేశారు.

చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి :

ఆమె తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడంతో చిన్నతనం నుంచే తమిళిసై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే తన తండ్రి బాటలో కాంగ్రెస్ వైపు కాకుండా ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి ఆనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు.

సౌందరరాజన్ రాజకీయ ప్రస్థానం..

  • ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులరాలైన ఆమె సౌత్ చెన్నై డిస్ట్రిక్ట్ మెడికల్ వింగ్ సెక్రటరీగా 19990-2001 మధ్య పని చేశారు.
  • 2001-2004 వరకు స్టేట్ మెడికల్ వింగ్ జనరల్ సెక్రటరీ.
  • 2004-2005 వరకు మూడు జిల్లాల జోనల్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
  • 2005-2007 వరకు సదరన్ స్టేట్స్ మెడికల్ వింగ్ ఆల్ ఇండియా కో-కన్వీనర్.
  • 2007-2010 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి.
  • 2010-2013 వరకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు.
  • 2013నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు.
  • 2014 ఆగస్టు 16 నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు.

 ఎకానమీ

ఆర్‌బీఐ 2018-19 వార్షిక నివేదిక విడుదల

2018-19 (జూలై-జూన్) వార్షిక నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ ప్రస్తుత మందగమన పరిస్థితులను ఆర్‌బీఐ తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. దీనిని సైక్లికల్ ఎఫెక్ట్ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది.
  • దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉన్నాయి. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలి.
  • వ్యాపార పరిస్థితులు మెరుగుపరచాలి.
  • ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి వంటివి ప్రధానం.
  • బ్యాంకింగ్‌లో వేగంగా విలీనాల ప్రక్రియ.
  • వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్‌బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019-20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది.
  • ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వైఫల్యం నేపథ్యంలో- వాణిజ్య రంగానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణం 20 శాతం పడిపోయింది. 2017-18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే, 2018-19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లు.
  • అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం.
  • బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గాయి. 2017-18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018-19లో 9.1 శాతానికి తగ్గాయి.
  • బ్యాంక్ మోసాల విలువ 2018-19లో రూ.71,543 కోట్లకు చేరాయి. 2017-18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగింది. ఇక కేసులు, 15% పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరాయి.
  • ప్రైవైటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలోనే విడుదల.
  • యువతకు ఆర్‌బీఐ పట్ల అవగాహన పెంచేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను విసృ్తతంగా ఉపయోగించుకోవడం.
  • కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో ఆర్‌బీఐ వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది.

పది ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం

దేశంలోని పది ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ)ను విలీనం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 30న ప్రకటించారు. మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. ఈ పది బ్యాంకుల లీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది.

మరోవైపు పీఎస్‌బీల్లో గవర్నెన్స్ పరమైన పలు సంస్కరణలను కూడా మంత్రి నిర్మలా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

బ్యాంకుల విలీనం-వివరాలు

బ్యాంకుల విలీనం-వివరాలు

స్విస్ ఖాతాల వివరాలు అందుబాటులోకి

స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు సెప్టెంబర్ 1వతేదీ నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఆగస్టు 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది.

తత్కాల్ టికెట్లతో రూ.25,392 కోట్లు ఆధాయం

న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్ల పద్ధతి రైల్వేల పంట పండిస్తోంది. తత్కాల్ బుకింగ్‌ల ద్వారా గత నాలుగేళ్లలో తమకు రూ. 25,392 కోట్ల ఆదాయం వచ్చిందని ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ సమాధానమిచ్చింది. ఇందులో రూ. 21,530 కోట్ల ఆదాయం తత్కాల్ కోటా నుంచి రాగా, తత్కాల్ ప్రీమియం ద్వారా మరో 3,862 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించామని వెల్లడించింది. తత్కాల్ సేవల ద్వారా 2016-19 కాలానికి రైల్వేల ఆదాయం 62 శాతం పెరిగిందని తెలిపింది. రైల్వేశాఖ తత్కాల్ పద్ధతిని 1997లోనే ప్రవేశపెట్టినప్పటికీ, 2004లోనే దేశమంతా అమలు చేసింది. ఈ పద్ధతిలో రెండో తరగతి టికెటై్లతే టికెట్ ధరపై 10 శాతం, మిగతా తరగతులకు 30 శాతం అధిక ధర వసూలు చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2,677 రైళ్లలో తత్కాల్ పద్ధతిలో టికెట్ బుకింగ్‌‌స జరుగుతున్నాయి. ఈ రైళ్లలో అందుబాటులో ఉన్న మొత్తం 11.57 లక్షల సీట్ల నుంచి 1.71 లక్షల సీట్లను తత్కాల్ టికెటింగ్ కోసం కేటాయించారు.

ఐడీబీఐ బ్యాంకుకు రూ. 9,300 కోట్ల నిధులు

ఐడీబీఐ బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్‌ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్-టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది.

 

సైన్స్ & టెక్నాలజీ

పాకిస్తాన్ అణు క్షిపణి పరీక్ష విజయవంతం

అణు వార్‌హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ఘజ్నవి అనే క్షి పణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆగస్టు 29న పాకిస్తాన్ ప్రకటించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొంది. అణు బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అభినందించారని పాకిస్తాన్ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ తెలిపారు.

పాకిస్తాన్ ప్రభుత్వం 2019, జనవరిలో నాజర్, మే నెలలో షహీన్-2 అనే బాలిస్టిక్ మిస్సైళ్లను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షించిన ఘజ్నవి ద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు. స్కడ్ టైప్ బాలిస్టిక్ మిస్సైల్‌ను అభివృద్ధి చేసి ఘజ్నవిని రూపొందించినట్లు నిపుణులు భావిస్తున్నారు.

జాబిల్లి చెంతకు చేరిన చంద్రయాన్-2

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై 22న ప్రయోగించిన చంద్రయాన్-2లోని ఆర్బిటర్‌లో ఇంధనాన్ని సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 6.21 గంటలకు 52 సెకన్లపాటు మండించి ఐదోసారి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. బెంగళూరులోని బైలాలులో గల భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ పర్యవేక్షించారు. చంద్రయాన్-2 ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నాలుగుసార్లు ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం తాజాగా ఐదోసారి ఆపరేషన్‌ను చేపట్టి చంద్రుడికి దగ్గరగా 119 కి.మీ, చంద్రుడికి దూరంగా 127 కి.మీ, ఎత్తుకు తగ్గించారు. సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య ఆర్బిటర్ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దిగేలా చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ చంద్రుడి కక్ష్యలో 100ఁ30 కిలోమీటర్లు ఎత్తులోకి చేరుకున్నాక ఆర్బిటర్ నుంచి ల్యాండర్ నెమ్మదిగా వేరు పడుతుంది. ఆ తరువాత ల్యాండర్‌ను కూడా మండించి సెప్టెంబర్ 3, 4 తేదీల్లో రెండుసార్లు ఆపరేషన్ చేపట్టనున్నారు. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో ల్యాండింగ్ అయ్యేలా చేస్తారు.

 

అవార్డ్స్

ఎంపీ మార్గాని భరత్‌కు భారత్ గౌరవ్ అవార్డు

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)కు భారత్ గౌరవ్ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో ఆగస్టు 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేతుల మీదుగా భరత్ అవార్డు అందుకున్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైన భరత్ లోక్‌సభలో వివిధ అంశాలపై తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతున్న తీరుకు గుర్తింపుగా భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఈ పురస్కారంతో సత్కరించింది.

టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో ఆగస్టు 29న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు యాదగిరి, టీవీరావులు పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను టీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది.

ఏపీకి సఫారీ ఇండియా అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు సఫారీ ఇండియా- దక్షిణాసియా ట్రావెల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఆగస్టు 30న జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో మెరుగైన సేవలు, వసతులు కల్పించినందుకుగాను ఏపీకి ఈ అవార్డు దక్కింది. సుస్థిర పర్యాటకం-సవాళ్లు థీమ్‌తో సఫారీ ఇండియా ఏటా దక్షిణాసియా ట్రావెల్ అవార్డు అందజేస్తుంది.

ఇక్రిశాట్ డెరైక్టర్‌కు జయశంకర్ పురస్కారం

ఇక్రిశాట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డెరైక్టర్ రాజీవ్ కె.వర్షిణికి ప్రొఫెసర్ జయశంకర్ లైఫ్‌టైమ్ పురస్కారం లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా వర్షిణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పరిస్థితులకు అనువైన కొత్త వంగడాల రూపకల్పనపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలన్నారు.

డాక్టర్ హేమలతకు ఛేంజ్ మేకర్ అవార్డు

జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ హేమలత ఛేంజ్ మేకర్ అవార్డును దక్కించుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ అవార్డును తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా హేమలత అందుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. శిశు పోషణ విషయంలో విశేషకృషి చేసినందుకు గుర్తింపుగా హేమలతకు ఈ అవార్డు దక్కింది.

ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు లభించింది. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. 2019, సెప్టెంబర్ 24న బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే .

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా గ్లోబల్ గోల్‌కీపర్ ఇస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.

స్పోర్ట్స్

జాతీయ క్రీడా పురస్కారాలు

2019  సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 29న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులతోపాటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్టీయ్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ అందజేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు.

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు

రెజ్లర్ బజరంగ్ పూనియా, పారా అథ్లెట్ దీపా మాలిక్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నలభించింది. దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. దీంతో ఖేల్ రత్న అందుకున్న తొలి మహిళా పారా అథ్లెట్‌గా, అత్యధిక వయస్కురాలిగా దీపా నిలిచింది. రాజీవ్ ఖేల్ రత్న విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు బహుమానంగా అందిస్తారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

బజరంగ్ పూనియా

రెజ్లింగ్

2

దీపా మాలిక్

పారా అథ్లెటిక్స్

అర్జున అవార్డు

2019 ఏడాదికి మొత్తం 19 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డు గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందిస్తారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

భమిడిపాటి సాయిప్రణీత్

బ్యాడ్మింటన్

2

రవీంద్ర జడేజా

క్రికెట్

3

పూనమ్ యాదవ్

క్రికెట్

4

మొహమ్మద్ అనస్

అథ్లెటిక్స్

5

తజీందర్‌పాల్ సింగ్

అథ్లెటిక్స్

6

స్వప్న బర్మన్

అథ్లెటిక్స్

7

గుర్‌ప్రీత్ సింగ్ సంధు

ఫుట్‌బాల్

8

సోనియా లాథర్

బాక్సింగ్

9

చింగ్లెన్‌సానా సింగ్

హాకీ

10

ఎస్.భాస్కరన్

బాడీ బిల్డింగ్

11

అజయ్ ఠాకూర్

కబడ్డీ

12

అంజుమ్ మౌద్గిల్

షూటింగ్

13

ప్రమోద్ భగత్

పారా బ్యాడ్మింటన్

14

హర్మీత్ దేశాయ్

టేబుల్ టెన్నిస్

15

పూజా ధాండా

రెజ్లింగ్

16

ఫౌద్ మీర్జా

ఈక్వెస్ట్రియన్

17

సిమ్రన్ సింగ్ షెర్గిల్

పోలో

18

సుందర్ సింగ్ గుర్జర్

పారా అథ్లెటిక్స్

19

గౌరవ్ సింగ్ గిల్

మోటార్ స్పోర్ట్స్

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

మొహిందర్ సింగ్ ధిల్లాన్

అథ్లెటిక్స్

2

సందీప్ గుప్తా

టేబుల్ టెన్నిస్

3

విమల్ కుమార్

బ్యాడ్మింటన్

ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

సంజయ్ భరద్వాజ్

క్రికెట్

2

రామ్‌బీర్ సింగ్ ఖోఖర్

కబడ్డీ

3

మెజ్‌బాన్ పటేల్

హాకీ

ద్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

మనోజ్ కుమార్

రెజ్లింగ్

2

లాల్‌రెమ్‌సంగా

ఆర్చరీ

3

అరూప్ బసక్

టేబుల్ టెన్నిస్

4

నితిన్ కీర్తనే

టెన్నిస్

5

మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్

హాకీ

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్

  1. రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (మాంచో ఫై, అనంతపురం)
  2. గగన్ నారంగ్ స్పోర్‌‌ట్స ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్)
  3. గో స్పోర్ట్స్ ఫౌండేషన్.

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).
బజరంగ్ గైర్హాజరు.

రాజీవ్ ఖేల్త్న్రకు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు.

ప్రపంచకప్ షూటింగ్‌లో అభిషేక్‌కు స్వర్ణం

ప్రపంచకప్ షూటింగ్‌లో భారత షూటర్ అభిషేక్ వర్మకు స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగస్టు 29న(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగం ఫైనల్లో అభిషేక్ 244.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ సౌరభ్ చౌదరి 221.9 పాయింట్లతో కాంస్యం నెగ్గాడు. రజత పతకాన్ని టర్కీ షూటర్ ఇస్మాయిల్ కెలెస్(243.1) చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం


ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఆగస్టు 31న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్-234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా -215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు.

టి20క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు

భారత మహిళా క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. వన్డేలపై మరింత దృష్టిసారించేందుకు, 2021లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 3న ఆమె తెలిపింది. 36 ఏళ్ల మిథాలీ ప్రస్తుతం భారత వన్డే జట్టు సారథిగా వ్యవహరిస్తుంది.

మహిళా క్రికెట్‌లో టి20లు ప్రారంభమైన 2006 నుంచి టీమిండియా 104 మ్యాచ్‌లు ఆడితే అందులో 89 మ్యాచ్‌ల్లో మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. టి20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగుల (84 ఇన్నింగ్‌‌సల్లో 2,364 పరుగులు; సగటు 37.5, అత్యధిక స్కోరు 97 నాటౌట్) ఘనత మిథాలీ పేరిటే ఉంది. 2006లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఆమె చివరి మ్యాచ్‌నూ అదే ఇంగ్లండ్‌పై 2019, మార్చిలో గువాహటిలో ఆడింది. ఈ క్రమంలో 32 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించింది. వీటిలో 2012, 2014, 2016 ప్రపంచ కప్‌లున్నాయి.

 వ్యక్తులు

భారతదేశంలో శ్రీశైలం పుస్తకావిష్కరణ

శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్ర, సంస్కృతి, వీర శైవమత విశిష్టతను తెలిపే ‘దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాకులో ఆగస్టు 30న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి ఈ పుస్తకాన్ని గ్రంథస్తం చేశారు. శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్రతోపాటు పంచమఠాలు, అక్కమహాదేవి చరిత్ర, పండుగలు, జాతరలు, మధ్యయుగం నాటి వీరశైవ మత వ్యాప్తి, అనాటి నాణేల విశిష్టతను ఈ పుస్తకం తెలియజేస్తోంది.

పీఎంవో నుంచి వైదొలిగిన సెక్రటరీ మిశ్రా

ప్రధానమంత్రి కార్యలయం(పీఎంవో)లో ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి ఆగస్టు 30న వైదొలిగారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా ప్రధాని మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. దీంతో రెండు వారాలపాటు ఆయన తాత్కాలికంగా కొనసాగుతారు. 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు.
మిశ్రా పీఎంవో నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఇటీవలే కేబినెట్ కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన పీకే సిన్హాను పీఎంఓలో ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’(ఓఎస్డీ)గా ప్రభుత్వం నియమించింది.

భారతీయ అమెరికన్‌కు జడ్జి పదవి

వాషింగ్టన్: ప్రముఖ భారతీయ అమెరికన్ అటార్నీ షిరీన్ మాథ్యూస్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జడ్జిగా నామినేట్ చేశారు. కాలిఫోర్నియా సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్టికల్-3 జడ్జీగా మాథ్యూస్ పేరును అధ్యక్షుడు ప్రతిపాదించినట్లు నేషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ (ఎన్‌ఏపీఏబీఏ) తెలిపింది. ఆమె పేరు ఆమోదం పొందితే షిరీన్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన మొదటి అమెరికా మహిళగా, భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రికార్డు సృష్టిస్తారని పేర్కొంది. జీవిత కాలం ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో ఆమె అసిస్టెంట్ అటార్నీగా పనిచేశారు.