<b> అక్టోబర్ కరెంట్ అఫైర్స్ </b>

అక్టోబర్ కరెంట్ అఫైర్స్

ఐఎంఎఫ్ వార్షిక సదస్సులో నిర్మలా

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 18న పాల్గొన్నారు. అక్టోబర్ 14న ప్రారంభమైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు అక్టోబర్ 20న ముగియనున్నాయి.

 

సీసీఎల్ చైర్మన్ ప్రసాద్‌కు లైఫ్ టైం అవార్డు

ఇన్‌స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. 

 

ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి గానూ ప్రసాద్‌కు ఈ అవార్డు దక్కింది. 1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

 

పాకిస్తాన్‌కు ఎఫ్‌ఏటీఎఫ్ చివరి హెచ్చరిక

ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని ఎఫ్‌ఏటీఎఫ్ పాకిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది.

 

2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్‌ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు తప్పవని ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ అక్టోబర్ 18న హెచ్చరించారు.

 

అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నన్ఘఢార్ ప్రావిన్స్ హస్కమిన జిల్లాలో ఉన్న ఓ మసీదులో అక్టోబర్ 18న భారీ పేలుడు జరిగింది.

ఈ పేలుడు కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు

 

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డీజీగా అనూప్

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అనూప్‌కుమార్ సింగ్ నియమితులయ్యారు.

1985 ఐపిఎస్ బ్యాచ్‌కి చెందిన అనూప్ 2020, సెప్టెంబర్ 30 వరకు ఎన్‌ఎస్‌జీ డెరైక్టర్ జనరల్‌గా కొనసాగనున్నాడు. 1984లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేశారు.

 

తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు.

 

ఈ మేరకు అక్టోబర్ 18న కేంద్ర చట్టం, న్యాయ శాఖకు ఆయన లేఖ రాశారు. 2018, అక్టోబర్ 3న 46వ సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. 2019, నవంబర్ 17తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే పేరును గొగోయ్ ప్రతిపాదించారు. ఒకవేళ జస్టిస్ బాబ్డే పేరు సీజేఐగా ఖరారైతే ఆయన 2021 ఏప్రిల్ 3 వరకు అంటే 17 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.

 

మహిళల స్పేస్‌వాక్ విజయవంతం

అమెరికాకి చెందిన మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్‌లు చేపట్టిన స్పేస్‌వాక్ అక్టోబర్ 18న విజయవంతమైంది.

పురుషులతోకలసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్ వాక్ చేసిన తొలి సందర్భం ఇదే. 2019, మార్చి నుంచి క్రిస్టినా కోచ్, ఫిబ్రవరి నుంచి జెస్సికా మియెర్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉన్నారు.

 

క్రిస్టీనా కోచ్


వయస్సు: 40 ఏళ్ళు.
చదువు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ
అభిరుచులు: రాక్ క్లైంబింగ్, పడవ నడపడం, సుదూర ప్రయాణాలు.
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3008(ఎరుపురంగు గీతలు)
స్వస్థలం: జాక్సన్ విల్లే

  • స్పేస్‌వాక్ చేసిన మగువల్లో 14వ వారు.
  • గతంలో 3 సార్లు స్పేస్ వాక్ చేశారు.

తొలిసారి: 3-29-2019 - 6 గంటల 45 నిమిషాల సేపు నిక్‌హాగ్‌తో పాటు ఆకాశంలో తేలుతూ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌లో పాల్గొన్నారు.
రెండవ సారి: 10-06-2019 - 7 గంటల 1 నిమిషం.
చివరిసారి: 10-11-2019న 6 గంటల 45 నిమిషాల పాటు డ్రీవ్ మోర్గాన్‌తో కలిసి స్పేస్‌వాక్ చేశారు.

జెస్సికా మియెర్


వయస్సు: 43 ఏళ్ళు
చదువు: స్పేస్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ, మెరైన్ బయాలజీలో పీహెచ్‌డీ.
తొలిసారి స్పేస్ వాక్..
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3004(ప్లెయిన్ సూట్)
హెల్మెట్ నంబర్: 11
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3008(ఎరుపురంగు గీతలు)
అభిరుచులు: రన్నింగ్, స్కీయింగ్, హైకింగ్, ప్రైవేట్ పైలట్.

  • స్పేస్‌వాక్ చేసిన మహిళల్లో 15వ వారు.

స్వస్థలం: క్యారీబౌ, మెయిన్.

 

9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌కు రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ అక్టోబర్ 18న మరో రికార్డ్ ఘనత సాధించింది. 

ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.9,05,214 కోట్లను తాకింది. దీంతో రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన తొలి భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది.

 

ఏపీలో వైఎస్సార్ కిశోర పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ, స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘వైఎస్సార్ కిశోర పథకం’ ప్రారంభమైంది.

 

ఈ పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గుంటూరులో అక్టోబర్ 18న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వ్యక్తి జీవితంలో ’కీలకమైన బాల్యంలో తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవాలని, అదేవిధంగా యవ్వనంలో తల్లిదండ్రులను మోసం చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి’ అని చెప్పారు. హోంమంత్రి మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్‌లు అనర్ధాలకు కారణం అవుతున్నాయనీ.. ఒత్తిడితో సహా అనేక సమస్యలను యువత కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.

 

ఫిలిప్పిన్స్ అధ్యక్షుడితో రాష్ట్రపతి కోవింద్ భేటీ

ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భేటీ అయ్యారు.

 

ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 18న జరిగిన ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్య సంబంధాలు, సముద్రతీర భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

 

బ్రెగ్జిట్ ఒప్పందంపై అంగీకారం

యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడానికి (బ్రెగ్జిట్) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ అక్టోబర్ 17న ప్రకటించాయి.

 

ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31తో ముగియనుంది.

 

ప్రపంచంలోనే తొలి ఏఐ వర్సిటీ ప్రారంభం

ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ-కృత్రిమ మేధ) యూనివర్సిటీని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం అక్టోబర్ 17న ప్రారంభించింది.

 

ది మహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్సిటీ ఆఫ్ ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఎంబీజెడ్ యూఏఐ)గా పిలిచే ఈ వర్సిటీని యూఏఈ రాజధాని అబుదాబిలో నెలకొల్పారు.

 

నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ విడుదల

భారత ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలియజేసే ఇన్నోవేషన్ ఇండెక్స్-2019ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ న్యూఢిల్లీలో అక్టోబర్ 17న విడుదల చేశారు.

 

ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ, నీతి ఆయోగ్ సంయుక్తంగా రూపొందించిన ఈ ఇండెక్స్‌లో పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ర్యాంకులను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కర్ణాటక తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో సిక్కిం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ తొలి స్థానాలను చేజిక్కించుకున్నాయి. సశక్తపరచడం, పనితీరు చూపడం అంశాల్లో వచ్చిన సగటు స్కోరు ఆధారంగా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను తయారు చేశారు.

 

మెక్సికో నుంచి 311 మంది భారతీయులు వెనక్కి

సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు.

 

ఈ మేరకు ఈ 311 మందిని టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్ జాతీయ వలసల సంస్థ (ఐఎన్‌ఎమ్) అక్టోబర్ 17న ప్రకటించింది.

 

20 పశుగణన నివేదిక విడుదల

దేశవ్యాప్తంగా 535.78 మిలియన్ల పశు సంపద ఉందని కేంద్ర పశు సంవర్థక శాఖ వెల్లడించింది.

 

ఈ మేరకు అక్టోబర్ 17న ‘20వ పశుగణన నివేదిక’ను విడుదల చేసింది. 2012లో విడుదలైన 19వ పశుగణన నివేదికతో పోల్చితే 20వ పశుగణన నివేదికలో పశు సంపద 4.6 శాతం పెరిగిందని వెల్లడైంది. 20వ పశుగణన నివేదిక ప్రకారం గో సంపద 18 శాతం, గొర్రెల సంఖ్య 14.1 శాతం, మేకల సంఖ్య 10.1 శాతం, కోళ్ల సంఖ్య 16.8 శాతం పెరిగింది. అదేసమయంలో అశ్వసంపద 45.6 శాతం తగ్గి 3.4 లక్షలకు పడిపోయింది. అలాగే గాడిదల సంఖ్య 61.23 శాతం మేర తగ్గి 1.2 లక్షలకు, ఒంటెల సంఖ్య 37.1 శాతం తగ్గి 2.5 లక్షలకు పడిపోయింది.