<b>జూన్ కరెంట్‌ అఫైర్స్‌ 2020</b>

జూన్ కరెంట్‌ అఫైర్స్‌ 2020

జూన్ 2020 అంతర్జాతీయం

జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్ ఆమోదం
హాంకాంగ్‌పై మరింత పెత్తనం చెలాయించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంట్ మే 28న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును హాంకాంగ్ పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే 2020, ఆగస్టు కల్లా చట్టరూపం దాల్చుతుంది. ఇవి అమల్లోకి వస్తే హాంకాంగ్ ప్రాదేశిక స్వతంత్ర ప్రతిపత్తి, పౌరులకున్న రాజకీయ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడతాయని విమర్శకులు అంటున్నారు.
ప్రజాస్వామ్య హక్కులు, చైనా నుంచి మరింత స్వతంత్ర ప్రతిపత్తి కోసం 2019 ఏడాది ప్రజాస్వామ్య వాదులు చేపట్టిన ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడికింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాంకాంగ్‌పై మరింత పట్టు సాధించడం ద్వారా వీటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది.


డబ్ల్యూహెచ్‌ఓతో అమెరికా తెగదెంపులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని ఆ సంస్థ తప్పుదోవ పట్టించిందనీ, వైరస్ విషయంలో చైనాను బాధ్యునిగా చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కోవిడ్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని మేం చేసిన వినతిని డబ్ల్యూహెచ్‌ఓ పట్టించుకోలేదు. డబ్ల్యూహెచ్‌ఓకు అత్యధికంగా 45కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుతుండగా చైనా 4కోట్ల డాలర్లిచ్చి పెత్తనంచేస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే, చైనా నుంచి ప్రయాణాలపై నిషేధం విధించి ఉండేవాడిని. చైనా ఒత్తిడి వల్లే అలా చేయలేదు. అందుకే ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంటున్నాంఅని తెలిపారు.

జీ-7 కూటమిలో భారత్‌ను చేర్చాలి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ-7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ-10 లేదంటే జీ-11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మేరకు మే 30న వెల్లడించారు. 2020, జూన్‌లో నిర్వహించాల్సిన జీ-7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. కోవిడ్-19 విజృంభిస్తున్న ఈ తరుణంలో అమెరికాలో ఈ సదస్సును ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోందో చర్చించడానికి ఇప్పుడు సభ్య దేశాలుగా ఉన్న జీ-7 సరైనది కాదు. ఈ కూటమికి కాలం చెల్లిపోయింది. కొత్త దేశాలను కలుపుకొనిపోవాల్సిన అవసరం ఉంది అని ట్రంప్ అన్నారు.
ఏడు అభివృద్ధి చెందిన దేశాలతో...
ప్రపంచంలో ఏడు అభివృద్ధి చెందిన దేశాలతో జీ-7 కూటమి ఏర్పడింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో ఏర్పాటైన ఈ కూటమి ప్రతీ ఏడాది సమావేశమై అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరుపుతుంది. అయితే ఈ కూటమిని విస్తరించి ఇందులోకి ఆస్ట్రేలియా, భారత్, దక్షిణ కొరియాలను ఆహ్వానించాలని, రష్యాని కూడా తిరిగి కూటమి గూటిలోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు.
మళ్లీ మోదీకి ఆహ్వానం
జీ-7 దేశాల వార్షిక సమావేశానికి ఈసారి అమెరికా అధ్యక్షత వహిస్తోంది. 2019 ఏడాది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు అధ్యక్షుడు మేక్రాన్ మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. 2020 ఏడాది జరిగే సదస్సుకి ట్రంప్ మోదీని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాభవం పెరుగుతోందని అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు.

కొత్త మ్యాప్‌పై నేపాల్ పార్లమెంటులో బిల్లు
భారత్‌తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకువెళుతోంది. భారత భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మే 31న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తర్వాత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
భారత్ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను నేపాల్ విడుదల చేసింది. ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు.

చైనా విమానాలపై అమెరికా నిషేధం
చైనాకు చెందిన ఎయిర్ చైనా, చైనా ఈస్ట్రర్స్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, జియామెన్ ఎయిర్‌లైన్స్ సంస్థలపై అమెరికా నిషేధం విధించింది. 2020, జూన్ 16వ తేదీ నుంచి సదరు సంస్థల విమానాలు అమెరికాలోకి రావడానికి, అమెరికా నుంచి వెళ్లడానికి వీళ్లేదని యూఎస్ రవాణా విభాగం జూన్ 3న వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020, ఏడాది ప్రారంభంలో నిలిపివేసిన అమెరికాకు చెందిన యునెటైడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలను పునఃప్రారంభించే విషయంలో చైనా విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్లాయిడ్ మృతిపై పౌరహక్కుల విచారణ..
అమెరికా పోలీసుల దాష్టీకానికి బలైన నల్లజాతీయుడు ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్‌జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మరోవైపు ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జూన్ 3న జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి
కోవిడ్ చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుమతినిచ్చింది. ఈ ఔషధానికి సంబంధించిన సేఫ్టీ డేటాను నిపుణులు పరిశీలించారని, ఆ తరువాతే క్లినికల్ ట్రయల్స్‌ను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని జూన్ 3న డబ్ల్యూహెచ్‌ఓ డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియెసస్ తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతినివ్వడం అంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కోసం ఎన్‌రోల్ అయి ఉన్న రోగులకు డాక్టర్లు హైడ్రాక్సీ క్లోరొక్విన్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వవచ్చు. గతంలో ఈ క్లినికల్ ట్రయల్స్‌ను డబ్ల్యూహెచ్‌ఓ అనుమతించలేదు.

జూన్ 2020 జాతీయం

మార్కెట్లోకి సొనాలికా ఇంటెలిజెంట్ వెంటిలేటర్
కోవిడ్-19 వైరస్ సోకినవారిని రక్షించడం కోసం ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సొనాలికా ఇంటెలిజెంట్ వెంటిలేటర్ సిస్టమ్స్ (కృత్రిమ శ్వాస వ్యవస్థ)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాధి బారిన పడిన వారికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుండగా, ఈ సమస్యను అధిగమించడానికి సహకరించే అధునాతన పరికరాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సమర్థవంతమైన దేశీ ఉత్పత్తిని అందించడమే లక్ష్యంగా ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సోనాలికా గ్రూప్ వైస్ చైర్మన్ అమృత్ సాగర్ మిట్టల్ మే 28న పేర్కొన్నారు.
అధిక పీడనం ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేయడం, ఇంధనం లేకుండానే పనిచేసే ఎయిర్ కంప్రెసర్ వంటి నూతనతరం ఫీచర్లు ఇంటెలిజెంట్ వెంటిలేటర్‌లో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం ఐసీయూలోనే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా పనిచేసే ఈ వెంటిలేటర్ సిస్టమ్స్.. ఆసుపత్రి ఇన్‌ఫ్రాలో ఇబ్బంది ఉన్న సమయంలో బ్యాక్‌అప్ కంప్రెసర్‌గా ఉంటుందని వివరించింది.

ఆధార్‌తో పాన్ జారీ విధానం ప్రారంభం
ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్‌లైన్‌లో పాన్ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 28న ప్రారంభించారు. ఆధార్ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
దేశ ఆర్థిక పరిస్థితిపై ఎఫ్‌ఎస్‌డీసీ దృష్టి
కోవిడ్-19 ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డీసీ) దృష్టి సారించింది. మే 28న జరిగిన ఈ కీలక సమావేశానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. కరోనా వైరస్ సంక్షోభం దేశంలో ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం ఇదే తొలిసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ 22వ కౌన్సిల్ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చీఫ్ అజయ్ త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ, పీఎఫ్‌ఆర్‌డీఏఐ చైర్మన్ సుప్రీతం బందోపాధ్యాయ పాల్గొన్నారు.


గ్లోబల్ లీడర్‌గా భారత్: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కోవిడ్-19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ చేస్తున్న పోరాటాన్ని లేఖలో ప్రస్తావించారు.

వికాస్ యాత్ర డాక్యుమెంట్
మోదీ రెండోవిడత ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రజాసేవకు సంబంధించిన చిత్రాలు, వీడియోలతో కూడిన డాక్యుమెంట్‌ను మే 30న మోదీ ట్వీట్‌చేశారు. దేశ పురోగతికి సంబంధించి తీసుకున్న అన్ని చర్యల్ని ఇందులో పొందుపరిచారు. మోదీ తన వెబ్‌సైట్ www.narendramodi.inలో ఈ డాక్యుమెంట్‌ను ఉంచారు.

పంటల కనీస మద్ధతు ధరలు పెంపు
ఆహార, వాణిజ్య పంటల కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 1న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనలను ఆమోదించారు. ప్రస్తుత 2020-21 పంట సంవత్సరానికి(2020 జూలై- 2021 జూన్) ఈ ఎమ్మెస్పీ వర్తిస్తుంది. మద్దతు ధర పెంపులో ఉత్పత్తి వ్యయంపై మెరుగైన ప్రతిఫలంతోపాటు, వైవిధ్య పంటల ప్రోత్సాహం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా కనీసం 50 శాతం ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర ఉండాలని 2018-19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించారు.
14 ఖరీఫ్ పంటలకు...
కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రెసైస్ సిఫారసుల మేరకు 2020-21 సంవత్సరానికి గానూ 14 ఖరీఫ్ పంటలకు మద్ధతు ధరలను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ పంటలపై, దిగుబడి ఖర్చుపై 50శాతం నుంచి 83శాతం వరకు రైతుకు లాభం వచ్చేలా ధరల పెంపు ఉంది అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు.
2020-21 ఏడాదికి పంటల కనీస మద్ధతు ధరలు


పంట

పెంపు(రూ.లలో)

మద్దతు ధర క్వింటాలుకు(రూ.లలో)

వరి(కామన్ గ్రేడ్)

53

1,868

వరి (గ్రేడ్ ఏ)

53

1,888

జొన్న(హైబ్రీడ్)

70

2,620

జొన్న(మల్దండి)

70

2,640

బాజ్రా

150

2,150

రాగి

145

3,295

మొక్కజొన్న

90

1,850

కందులు

200

6,000

పెసర

146

7,196

మినుములు

300

6,000

వేరుశనగ

185

5,275

పొద్దుతిరుగుడు

235

5,885

సోయాబీన్(ఎల్లో)

170

3,880

నువ్వులు

370

6,855

నైజర్ సీడ్

755

6,695

పత్తి(మీడియం స్టేపుల్)

260

5,515

పత్తి(లాంగ్ స్టేపుల్)

275

5,825విదేశీ వస్తువుల జాబితా ఉపసంహరణ
స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించేలా సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాలు) క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయాలను నిషేధిస్తూ తీసుకొచ్చిన వెయి్య విదేశీ ఉత్పత్తుల జాబితాను ప్రభుత్వం జూన్ 1న ఉపసంహరించింది. 2020, జూన్ 1 నుంచి విక్రయాల జాబితా అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భండార్ మే 29న జారీ చేసిన ఈ జాబితాలో కొన్ని దేశీయ ఉత్పత్తులు కూడా ఉన్నందువల్ల కేంద్ర హోం శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. భారత కంపెనీలైన డాబర్, వీఐపీ ఇండస్ట్రీస్, యురేకా ఫోర్బ్స్, జాక్వెర్, నెస్లే వంటి సంస్థలకు చెందిన వస్తువులు కూడా తొలగింపునకు గురైన వస్తువుల లిస్టులో ఉన్నాయి.
రాజీవ్‌గాంధీ వర్సిటీ కార్యక్రమంలో మోదీ సందేశం
బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జూన్ 1న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ వస్తువుల జాబితా ఉపసంహరణ
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : కేంద్ర హోం శాఖ
ఎందుకు : నిషేధిత జాబితాలో కొన్ని దేశీయ ఉత్పత్తులు ఉన్నందువల్ల

తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశలో భారత్
దేశంలో కోవిడ్-19 వ్యాధి తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వైద్య నిపుణులు, ఐసీఎంఆర్ కోవిడ్ -19 అధ్యయన బృందం సభ్యులు వెల్లడించారు. దేశంలో 1.90 లక్షల మందికి కోవిడ్ సోకి, 5వేల మంది మరణించినప్పటికీ దేశంలో ఇంకా సామాజిక వ్యాప్తి జరగలేదనడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు.
రికవరీ రేటు 48.19 శాతం
దేశంలో కోవిడ్-19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్ ఇటలీల తర్వాత ఏడో స్థానంలోకి భారత్ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు చెబుతున్నాయి. 91,818 మంది వైరస్ బాధితులు కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 48.19 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మహారాష్ట్ర, గుజరాత్‌కు నిసర్గ తుపాను ముప్పు
అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్(గుజరాత్)కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం నిసర్గ తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ జూన్ 2న వెల్లడించింది. ఈ తుపాను ఉత్తర మహారాష్ట్రను దాటి, దక్షిణ గుజరాత్‌లోకి ప్రవేశించి, అలీబాగ్ వద్ద హరిహరేశ్వర్, డామన్‌ల మధ్య జూన్ 3వ తేదీన తీరందాటే అవకాశం ఉన్నదని తెలిపింది. తుపాను తీరందాటే సమయంలో గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.ఎస్.హొసలీకర్ హెచ్చరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కి చెందిన 14 జాతీయ విపత్తు సహాయక బృందాలు తీరప్రాంతాల్లో రక్షణచర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్ సూచించిన పేరు...
తాజా తుపానుని నిసర్గగా పిలుస్తున్నారు. నిసర్గ పేరుని బంగ్లాదేశ్ సూచించినట్టు భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర, గుజరాత్‌కు నిసర్గ తుపాను ముప్పు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : భారత వాతావరణ శాఖ

భారత్‌లో రెమ్‌డెసివిర్ డ్రగ్‌కు ఆమోదం
కోవిడ్-19 చికిత్స కోసం యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ను భారత్‌లో అమ్మేందుకు ప్రముఖ అమెరికా ఫార్మా కంపెనీ గిలియాడ్ సెన్సైస్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) అనుమతినిచ్చింది. అయితే, అత్యవసర సందర్భాల్లో మాత్రమే, ఆసుపత్రిలో కోవిడ్-19కు చికిత్స పొందతున్నవారికే వాటిని వినియోగించాలని స్పష్టం చేసింది. తీవ్ర స్థాయి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పెద్దలకు గరిష్టంగా ఐదు రోజుల కోర్సుగా ఇంజక్షన్ రూపంలో ఈ ఔషధాన్ని వాడాలని పేర్కొంది. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే దీన్ని వాడాలని హెచ్చరించింది.
ట్రయల్ రూల్స్ ప్రకారం...
ప్రత్యేక పరిస్థితుల్లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేకుండా నేరుగా వినియోగించేందుకు వీలు కల్పించే నూతన డ్రగ్ అండ్ క్లినికల్ ట్రయల్ రూల్స్, 2019 ప్రకారం సీడీఎస్‌సీఓ తాజా నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివిర్ను ఉత్పత్తి చేసి, అమ్మేందుకు అనుమతించాలని భారతీయ ఫార్మా కంపెనీల సిప్లా, హెటెరొ ల్యాబ్స్ పెట్టుకున్న దరఖాస్తు ఇంకా పరిశీలన దశలోనే ఉంది.


ఫరీద్ కోట్ కేసులో పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు
ఫరీద్ కోట్ మహారాజు హరీందర్ సింగ్ బ్రార్‌కు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తికి వారసులెవరనే విషయంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు జూన్ 2న కీలక తీర్పును వెలువరించింది. మహారాజు కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లకు 75 శాతం, తల్లి దివంగత మొహిందర్ కౌర్‌కు మిగతా 25 శాతం వాటా చెందుతుందని స్పష్టం చేసింది. మొహిందర్ కౌర్ వాటాపై హరీందర్ సింగ్ సోదరుడైన మంజిత్ ఇందర్ సింగ్ వారసులకు హక్కు ఉంటుందని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపకం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తీర్పునిచ్చారు.
మూడేళ్ల వయసులో రాజుగా..
మూడేళ్ల వయసులో హరీందర్ సింగ్ ఫరీద్‌కోట్ ఎస్టేట్‌కు రాజయ్యారు. సంస్థానం చివరి రాజు అయిన ఆయన నరీందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు. కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్, మహీపిందర్ కౌర్. కుమారుడు హర్మొహిందర్ సింగ్ 1981లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. కూతురు మహీపిందర్ కౌర్ పెళ్లి కాకముందే మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ 1989లో చనిపోయారు. అనంతరం ఆయన ఎస్టేట్ ఆస్తులపై వివాదం మొదలైంది.
20 వేల కోట్లకు పైనే...
మహారాజు హరీందర్‌కు వంశపారంపర్యంగా వచ్చిన విలువైన ఆస్తులు హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హరియాణాల్లో ఉన్నాయి. వాటి విలువ రూ. 20 వేల కోట్లకు పైనే. కోర్టు కేసు నడుస్తుండగా దీపిందర్ కౌర్ మరణించారు.

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌కు కేబినెట్ ఆమోదం
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020కి జూన్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్) దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించకూడదు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు.
ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ- ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. తాజా నిర్ణయంపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ... ఏపీఎంసీలు, రాష్ట్రాల ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు.


నిత్యావసర వస్తువుల చట్ట సవరణకు ఆమోదం
65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్- ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూన్ 3న ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు.
ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది.


శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా కోల్‌కతా పోర్ట్
కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదం తెలిపింది. 2020, జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు 2020, ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఆలీబాగ్ సమీపంలో తీరం దాటిన నిసర్గ
అరెబియా సముద్రంలో చెలరేగిన నిసర్గ తుపాను మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లా ఆలీబాగ్ సమీపంలో జూన్ 3న తీరం దాటింది. అనంతరం దిశను మార్చుకుని ఉరణ్, పన్వెల్, పుణే, నాసిక్ మీదుగా ముందుకు వెళ్లిపోయింది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైకి తుపాను ముప్పు తప్పింది. నిసర్గ తుపాను కారణంగా రాయిగఢ్ జిల్లాతోపాటు రత్నగిరి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వివిధ గ్రామాల్లో ఇళ్లు, భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తుపాను కారణంగా ఇద్దరు మృతి చెందారు. నిసర్గ ప్రభావంతో గుజరాత్‌లో ఇప్పటిదాకా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.

విదేశీ పెట్టుబడుల కోసం కమిటీలు ఏర్పాటు
కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జూన్ 3న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్‌మెంట్ విధానాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం.
ఉన్నత స్థాయి సాధికార గ్రూప్...
సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్)ను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. దీనికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ఈజీవోఎస్‌లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ, వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్‌మెంట్‌ల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. కేబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈజీవోఎస్ విధానాలు...
పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లకు తగిన ఇన్‌ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు.
పీడీసీలు ఏర్పాటు...
కేబినెట్ తాజా నిర్ణయం ప్రకారం.. మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌లలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి.
పీడీసీ ప్రధాన లక్ష్యం..
వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం పీడీసీ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్‌చార్జ్‌గా ఉంటారు.

జూన్ 2020 రాష్ట్రీయం

ఏపీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడి: కియా
ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ప్రకటించింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.400 కోట్లకుపైగా) అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ షిమ్ వెల్లడించారు. కియా ఎస్‌యూవీ వాహనాల తయారీ కోసం ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. మన పాలన- మీ సూచనలో భాగంగా మే 28న పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన మేధోమథన సదస్సులో పాల్గొన్న షిమ్ ఈమేరకు ప్రకటన చేశారు.
పారిశ్రామిక రంగంపై జరిగిన సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఏఎన్‌యూకి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు
లండన్ ప్రధాన కేంద్రంగా ఉన్న క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్‌‌స) ఐ గేజ్ ఇచ్చే ర్యాంకింగ్‌‌సలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)కి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు లభించింది. ఈ విషయాన్ని ఏఎన్‌యూ ఆన్‌లైన్ ర్యాంకింగ్‌‌స కోఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగ కిషోర్ మే 28న తెలిపారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ, యూనివర్సిటీలో ఆన్‌లైన్ పరిజ్ఞానం వినియోగం అంశాలను ప్రాతిపదికగా క్యూఎస్ తాజా ర్యాంకులను ప్రకటించింది.

యూఎస్ ప్రెసిడెంట్ స్కాలర్
ప్రతిష్టాత్మక యూఎస్ ప్రెసిడెన్షియల్ స్కాలర్-2020 పురస్కారాన్ని అనంతపురం జిల్లాకు చెందిన ిపి.సంజనరెడ్డి దక్కించుకుంది. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అమెరికాలోని విస్‌కాన్సిన్ రాష్ట్రం నుంచి అమ్మాయిల కోటాలో ఆమె ఈ పురస్కారాన్ని సాధించారు. విద్య, ఆర్ట్స్, టెక్నాలజీలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దీనిని అందిస్తారు. చియ్యేడు గ్రామానికి చెందిన పెద్దగొర్ల లక్ష్మీరెడ్డి, సమత దంపతులు పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. లక్ష్మీరెడ్డి విస్‌కాన్సిన్ రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె సంజన బ్రూక్‌ఫీల్డ్ ఈస్ట్ ఉన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది.

తెలంగాణలో పంటల చిత్రపటం రూపకల్పన
నూతన వ్యవసాయ విధానం ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటల వారీగా సాగుచేయాల్సిన విస్తీర్ణాన్ని వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు ఖరారు చేశాయి. జిల్లాల వారీగా 2019 వానాకాలంలో పంటల వారీగా సాగు విస్తీర్ణం గణాంకాలను దృష్టిలో పెట్టుకుని 2020 వానాకాలానికి సంబంధించి పంటల చిత్రపటం (క్రాప్ మ్యాపింగ్)ను రూపొందించాయి. 2019, వానాకాలం, యాసంగి కలుపుకుని రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేయగా, కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో అదనంగా మరో 10లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, పంటల వారీగా వానా కాలంలో సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేశారు.

హెచ్‌సీయూకు పీఎంఆర్‌ఎఫ్ ఇన్‌స్టిట్యూట్ హోదా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కు ప్రకటించగా తాజాగా ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోస్ (పీఎంఆర్‌ఎఫ్) గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్ హోదాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (ఎంహెచ్‌ఆర్‌డి) శాఖ ప్రకటించింది. గత కొన్నేళ్ళుగా హెచ్‌సీయూ పనితీరు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ విభాగంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2019లో 11వ ర్యాంకింగ్ సాధించడంతో ఈ హోదాను పొందేందుకు అవకాశం కలిగింది. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోస్ కింద ఫెలోషిప్‌లను అందించగల దేశంలోని అతికొద్ది సంస్థలలో ఒకటిగా హెచ్‌సీయూ గుర్తింపు పొందినట్లయింది.


మాదకద్రవ్య విమోచనా కేంద్రాలు ప్రారంభం
మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని తిరిగి సమాజ జీవనంలోకి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మే 29న మన పాలన, మీ సూచన కార్యక్రమం సందర్భంగా డిజిటల్ విధానంలో 15 కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు.
13.7 శాతం మంది...
ఎన్‌డీడీటీసీ, ఎయిమ్స్, భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 13.7 శాతం ప్రస్తుతం మద్యం వినియోగిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయటమే ప్రభుత్వ ధ్యేయం. ఏపీలో మద్యం కారణంగా 47 లక్షల మంది, ఓపియాయిడ్ బాధితులు 3.6 లక్షల మందికి సహాయం అవసరం.
వైద్య రంగంపై మేధోమథన సదస్సు
మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 29న క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య రంగంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. లబ్ధిదారులు, వైద్య రంగ నిపుణులతో ముఖాముఖి నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించారు.


ఏపీ ఎన్నికల కమిషనర్ ఆర్డినెన్స్ రద్దు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు రద్దుచేసింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా రద్దుచేసింది. నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పదవీ కాలం పూర్తయ్యే వరకు రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనివ్వాలని చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మే 29న తీర్పునిచ్చింది.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్, కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావులతో పాటు మరికొందరు వేర్వేరుగా 13 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు తాజా తీర్పును వెలువరించింది.


కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరాయి. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి చేరింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మే 29న మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు.

రైతు వేదికలకు శంకుస్థాపన
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 30న ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 10,641 ఆర్‌బీకేలను సీఎం ప్రారంభించారు. ఆర్‌బీకేలలో ఉండే కియోస్క్‌ను కూడా సీఎం ప్రారంభించగా ఓ రైతు దీనిద్వారా తనకు కావాల్సిన విత్తనాలను ఆర్డర్ చేశారు. అనంతరం 155251 ఇంటరాక్టివ్ కాల్ సెంటర్ నెంబరుతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (గన్నవరం)ను సీఎం ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగాపురంలోని ఆర్‌బీకేల పనితీరును ముఖ్యమంత్రి లైవ్ ద్వారా వీక్షించారు.
సీఎం-యాప్ ఆవిష్కరణ...
మార్కెట్ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన సీఎం-యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించి ఆల్ ది వెరీ బెస్ట్ అని టైప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు ఈ సందేశం ఒకేసారి చేరింది. అనంతరం లోగోను కూడా సీఎం ఆవిష్కరించారు. సీఎం యాప్‌లో అగ్రికల్చరల్ అసిస్టెంట్లు రోజూ పంటల సమాచారం, మార్కెట్ ధరలు, గిట్టుబాటు ధరల కల్పన, అవసరమైతే మార్కెట్ ఇంటర్‌వెన్షన్ తదితరాలు అప్‌లోడ్ చేస్తారు.

యూఎంటీసీకి విశాఖ ట్రామ్ డీపీఆర్ తయారీ బాధ్యత
విశాఖలో లైట్ మెట్రో కారిడార్‌కి అనుసంధానంగా నిర్మించాలని భావిస్తున్న 60.20 కిలోమీటర్ల ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన సవివర నివేదిక (డీపీఆర్) రూపొందించే బాధ్యతను అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు జూన్ 1న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. డీపీఆర్ తయారీకి వివిధ సంస్థలు దాఖలు చేసిన బిడ్లలో యూఎంటీసీ తక్కువగా రూ.3.37 కోట్లకు దాఖలు చేయడంతో ఆ సంస్థకు ఈ బాధ్యత అప్పగించారు. విశాఖలో 80 కిలోమీటర్ల మేర నిర్మించనున్న లైట్ మెట్రో కారిడార్ల డీపీఆర్ రూపకల్పన బాధ్యతను కూడా ఈ సంస్థే దక్కించుకుంది.

ఏపీలో మరో రెండు సెల్‌ఫోన్ తయారీ యూనిట్లు
యాపిల్, రెడ్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెల్‌ఫోన్లను తయారుచేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఆంధ్రప్రదేశ్ మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ప్రస్తుతం శ్రీ సిటీ(చిత్తూరు జిల్లా)లో ఉన్న యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ (ఇండియా) ఎండీ, కంట్రీ హెడ్ జోష్ ఫౌల్గర్ తెలిపారు. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ఈఐఎఫ్-2020 పేరిట నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ఈ మేరకు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత వచ్చే ఐదేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ విలువ 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని రాష్ట్రం అందిపుచ్చుకోవాలన్నారు.

జూన్ 2020 ఎకానమీ

2019-20 ఏడాదిలో జీడీపీ వృద్ధి 4.2 శాతం
2019 ఏప్రిల్ -2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 4.2 శాతం నమోదయి్యంది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) మే 29న జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. 2018-19లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం...
2019-2020 ఏడాది వృద్ధి రేటు


మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)

5.2 శాతం

రెండో త్రైమాసికం (జూలై- సెప్టెంబర్)

4.4 శాతం

మూడో త్రైమాసికం (అక్టోబర్- డిసెంబర్)

4.1 శాతం

నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి)

3.1 శాతం

2019-2020 ఏడాది (ఏప్రిల్- మార్చి)

మొత్తం 4.2 శాతం

తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి
జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018-19లో రూ.1,26,521గా ఉంది. ఇది 2019-20లో(ప్రస్తుత ధరల ఆధారంగా) రూ.1,34,226కు చేరింది. దీంతో వృద్ధి 6.1 శాతంగా నమోదైంది.
కట్టు తప్పిన ద్రవ్యలోటు...
తాజా లెక్కల ప్రకారం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయి్యంది. వాస్తవానికి 2019-20 ఏడాది మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. ఇక రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది.
41 సంవత్సరాల తర్వాత...
నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరం 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారిపోనుంది. 1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు.

వీధి వ్యాపారులకు ప్రత్యేక పథకం ఆవిష్కరణ
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI-పీఎం స్వనిధి)ని జూన్ 1న ఆవిష్కరించింది. దీని ద్వారా వారికి రూ. 10 వేల వరకు రుణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 50 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 2020, మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులు రూ. 10 వేల వరకు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లించాలి. సమయానికి కానీ, ముందుగా కానీ చెల్లించినవారికి వార్షిక వడ్డీలో 7 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఆ రాయితీ మొత్తం ఆరు నెలలకు ఒకసారి వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం మార్చి 2022 వరకు అమల్లో ఉంటుంది. సమయానికి రుణ వాయిదాలు చెల్లించినవారికి రుణ పరిమితిని పెంచే అవకాశం ఉంది. పథకం అమలు కోసం మొబైల్ యాప్‌ను, వెబ్ పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ
సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది.

ఎంఎస్‌ఎంఈ ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ జూన్ 1న ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్‌‌స (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం వంటి ప్రతిపాదనలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్‌ను ఏర్పాటు చేస్తారు. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
ఎంఎస్‌ఎంఈ నిర్వచనంలో సవరణలు...
ఎంఎస్‌ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది.

భారత్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మూడీస్
భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్ రేటింగ్)ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్ బీఏఏ2 అయితే దీనిని బీఏఏ3కి తగ్గిస్తున్నట్లు జూన్ 1న ప్రకటించింది. ఇక భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి, విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన ఒత్తిడులు, తక్కువ ఆదాయం-వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు మూడీస్ పేర్కొంది.
ఎవరి రేటింగ్ ఎలా...


ఎస్‌అండ్‌పీ

బీబీబీ - స్టేబుల్

ఫిచ్

బీబీబీ - స్టేబుల్

మూడీస్

బీఏఏ3 నెగటివ్

జీడీపీ 4 శాతం క్షీణత...
కోవిడ్-19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. నిజానికి కోవిడ్ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్ ప్రస్తావించింది. మరోవైపు ప్రభుత్వానికి రుణ భారం పెరగనుందని తెలిపింది. కరోనాకు ముందు 2019-20లో భారత్ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72 శాతం ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84 శాతానికి పెరిగే అవకాశం ఉందని వివరించింది.
కరెన్సీకీ కోత
భారత ప్రభుత్వ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్‌‌సను కూడా మూడీస్ బీఏఏ2 నుంచి బీఏఏ 3కి తగ్గించింది. అలాగే భారత్ లోకల్ కరెన్సీ సీనియర్ అన్‌సెక్యూర్డ్ రేటింగ్‌‌సనూ బీఏఏ2 నుంచి బీఏఏ 3కి కుదించింది. ఇక షార్ట్‌టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను పీ-2 నుంచి పీ-3కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది.
ఏమిటి ఈ రేటింగ్..?
ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి. ఎస్‌అండ్‌పీ, ఫిచ్, మూడీస్ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడీస్ ఇచ్చిన రేటింగ్ బీఏఏ3 నెగటివ్ అవుట్‌లుక్ కూడా ఇప్పటికీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే జంక్ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ బీఏఏ3 నెగటివ్కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో క్రమంగా తగ్గిస్తూ వచ్చింది.

జూన్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు

సరిహద్దుపై థర్డ్ పార్టీ ప్రమేయం వద్దు: చైనా

భారత్-చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను చైనా తిరస్కరించింది. భారత్-చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు థర్డ్ పార్టీ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ మే 29న మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్-చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు.
ఉద్రిక్తతలపై చర్చించుకోలేదు
తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్-మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్-మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని పేర్కొన్నాయి.

జీ-7 దేశాల సదస్సుపై మోదీ, ట్రంప్ చర్చలు
జీ-7 దేశాల సదస్సు, కరోనా మహమ్మారి సహా పలు అంశాలపై భారత ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 2న ఫోన్‌లో చర్చించారు. జీ 7 కూటమికి అమెరికా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ట్రంప్ ప్రణాళికపై చర్చించాం. కోవిడ్-19 మహమ్మారి, పలు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి అని మోదీ ట్వీట్ చేశారు. కరోనా అనంతర ప్రపంచ నిర్మాణంలో భారత్, అమెరికా సంబంధాలు కీలకమైన పునాదిగా నిలుస్తాయన్నారు. జీ-7 దేశాల సదస్సుకు హాజరుకావాలని మోదీని ట్రంప్ ఈ సందర్భంగా ఆహ్వానించారు.
మిలటరీని దింపుతా: ట్రంప్
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఈ ఉద్యమాలను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్ జూన్ 1న ప్రకటించారు.

జూన్ 2020 సైన్స్ & టెక్నాలజీ

కరోనా వ్యాధికారక వైరస్ తయారీలో విజయం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కీలకమైన ముందడుగు వేసింది. టీకాతో పాటు కరోనా చికిత్సకు అవసరమైన మందులను అభివృద్ధి చేసేందుకు వీలుగా వ్యాధికారక వైరస్‌ను పరిశోధనశాలలోనే తయారు చేయడంలో విజయం సాధించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని రోగుల ద్వారా సేకరించిన వైరస్‌ను వైరాలజిస్ట్ డాక్టర్ క్రిష్ణన్ హెచ్ హర్షన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం విజయవంతంగా వృద్ధి చేయగలిగిందని సీసీఎంబీ మే 28న తెలిపింది. కరోనా నివారణ కోసం ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసి ఉపయోగించేందుకు ప్రయత్నం జరుగుతున్న విషయం తెలిసిందే.

మా వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుంది: చైనా
కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుందని చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్ సంస్థ సినోవాక్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు కరోనావాక్‌గా పేరు పెట్టినట్లు మే 30న తెలిపింది. సినోవాక్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనావాక్‌ను కోతులపై ప్రయోగించగా, కరోనా కణాలను ఇది సమర్థవంతగా అడ్డుకుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు దశల పరీక్షలు పూర్తి అయ్యాయి. చైనాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నందును మూడో దశ పరీక్షలు యూకేలో చేపట్టనున్నారు. ఒకేసారి 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక ముప్పు ఉన్నవారికి ఈ వ్యాక్సిన్ మొదటగా అందించే అవకాశం ఉంది.

చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం మే 30న మధ్యాహ్నం 3.22 గంటలకు లాంచ్ ప్యాడ్ 39ఏ నుంచి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను మోసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెహంకన్ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) బయల్దేరింది. నింగిలోకి దూసుకెళ్లిన 19గంటల తర్వాత ఐఎస్‌ఎస్‌కు చేరుకుంది. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములతో బెహంకన్, హార్లీ వీరూ పనిచేస్తారు.
ఇదే తొలిసారి..
ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాముల్ని తీసుకొని రోదసి యాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్ నేరుగా వీక్షించారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌తో ట్రంప్ ముచ్చటించారు.
స్పేస్ ఎక్స్..
అంగారక గ్రహంపై నివసించడానికి వీలుగా కాలనీలు నిర్మించాలని, అంతరిక్ష ప్రయాణానికయ్యే వ్యయ భారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన బిలియనీర్ ఎలన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో ఈ సంస్థను ప్రారంభించారు. అప్పట్నుంచి వ్యోమనౌకల తయారీ పనులు, ఇతర అంతరిక్ష పరిశోధనల్లో ఈ సంస్థ నిమగ్నమైంది. 2011 తర్వాత ఐఎస్‌ఎస్ కేంద్రానికి సరకు రవాణా చేసిన అనుభవం కూడా ఉంది.
ప్రయోగ బృందంలో భారతీయుడు
తాజా ప్రయోగంలో భారత ఇంజనీర్ బాల రామమూర్తి కీలక పాత్ర పోషించారు. స్పేస్ క్రూ ఆపరేషన్స్ అండ్ రీసోర్సెస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆయన ఈ ప్రయోగం సమయంలో కెన్నడీ లాంచ్ కంట్రోల్ సెంటర్ ఫైరింగ్ రూమ్ 4లో విధులు నిర్వర్తించారు. చెన్నైకి చెందిన రామమూర్తి యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొమ్మిదేళ్లుగా స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్నారు.

జూన్ 2020 అవార్డ్స్

ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తకు సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డు
పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్ సెన్సైస్ విభాగంలో 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని న్యూట్రిషన్ లైవ్ -2020 పేరుతో జూన్ 2న జరిగిన ఆన్‌లైన్ సదస్సులో వెల్లడించారు.
జాతీయ పోషకాహార సంస్థలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సుబ్బారావు ఇప్పటివరకు సుమారు 63 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. రాయల్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (యూకే) సభ్యుడైన సుబ్బారావుకు ఈ అవార్డు దక్కడంపై జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత హర్షం వ్యక్తం చేశారు.

జూన్ 2020 స్పోర్ట్స్

జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జాతీయ క్రీడలను ఈసారి నిరవధికంగా వాయిదా వేశారు. క్రీడలకు ఆతిథ్యమివ్వాల్సిన గోవాలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా దెబ్బకు జాతీయ క్రీడల నిర్వాహక కమిటీ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని గోవా క్రీడల మంత్రి మనోహర్ అగోంకర్ మే 28న ఐఓఏకు తెలిపారు. సెప్టెంబర్ చివర్లో జరిగే కమిటీ సమావేశంలో క్రీడల షెడ్యూల్‌ను నిర్ణయిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం 2020, అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది.
2015లో చివరిసారిగా...
నిజానికి 2018 నవంబర్‌లోనే జరగాల్సిన ఈ క్రీడలు గోవా ప్రభుత్వ అలసత్వం కారణంగా ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి. 2020 ఏడాది గేమ్స్ నిర్వహించేందుకు గోవా సిద్ధమైనప్పటికీ కరోనాతో మరోసారి ఆటంకం ఏర్పడింది. చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జాతీయ క్రీడలు జరిగాయి.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వాయిదా
కరోనా వైరస్ నేపథ్యంలో మెగా టోర్నమెంట్‌ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చేరింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ 2020, సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగాల్సింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ మెగా టోర్నీని 2021 ఏడాది జనవరి 11 నుంచి 24 వరకు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ మే 29న తెలిపింది. 2020, సెప్టెంబర్‌లో జరగాల్సిన టోర్నీకి అర్హత పొందిన క్రీడాకారులే వాయిదా పడిన టోర్నీలో ఆడతారని వివరించింది.

అత్యధిక ఆర్జనగల క్రీడాకారుడిగా ఫెడరర్
ఏడాది కాలంలో అత్యధిక ఆర్జనగల క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలిసారి టాప్ ర్యాంక్‌లో వచ్చాడు. ఫోర్భ్స్ పత్రిక విడుదల చేసిన టాప్-100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ ఐదో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి ఫెడరర్ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు (రూ. 803 కోట్లు) సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ.
రెండో ర్యాంక్‌కు రొనాల్డో..
గతేడాది టాప్లో నిలిచిన పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 10 కోట్ల 50 లక్షల డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ (10 కోట్ల 40 లక్షల డాలర్లు) మూడో ర్యాంక్‌లో నిలిచాడు.
ఏకైక క్రికెటర్ కోహ్లి...
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. గతేడాది 100వ ర్యాంక్‌లో నిలిచిన కోహ్లి ఈసారి 2 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 196 కోట్లు) ఆర్జనతో 66వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లికి ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా... 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్-100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్ నుంచి ఏకై క క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం.

టెన్నిస్ క్రీడాకారులకు ఐటీఎఫ్ ఆర్థిక సాయం
కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైన ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని తెలిపింది. సింగిల్స్‌లో 500-700 మధ్య... డబుల్స్‌లో 175-300 మధ్య ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. అర్హులైన క్రీడాకారులకు ఒక్కోక్కరికి 2000 డాలర్లు (రూ.1,51,100) లభించవచ్చని వివరించింది.
ఐటీఎఫ్ తాజా నిర్ణయంతో 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది. పురుషుల సింగిల్స్‌లో మనీశ్ కుమార్ (642 ర్యాంక్), అర్జున్ ఖడే (655)...డబుల్స్‌లో సాకేత్ మైనేని (180), విష్ణువర్ధన్ (199), అర్జున్ ఖడే (231), విజయ్ సుందర్ ప్రశాంత్ (300)... మహిళల సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ (606), సౌజన్య భవిశెట్టి (613), జీల్ దేశాయ్ (650), ప్రాంజల యడ్లపల్లి (664)... డబుల్స్‌లో రుతుజా భోస్లే (196), సానియా మీర్జా (226) ఈ సహాయం అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ఏటీపీ, డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆతిథ్య దేశాలు, అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి 60 లక్షల డాలర్ల (రూ. 45 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి.

ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ అనుమతి
ప్రీమియం స్పోర్ట్ ఈవెంట్ అయిన ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ వేదిక లాక్‌డౌన్ నుంచి ఓపెన్ కానుంది. ఇక్కడ జరిగే రెండు రేసుల్లో పాల్గొనే వారి కోసం 14 రోజుల క్వారంటైన్ నిబంధనకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2020 జూలై, ఆగస్టులో ఇక్కడ రెండు రేసులు జరుగనున్నాయి.
సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ కంటే ముందుగా... జూలై 5, 12వ తేదీల్లో ఆస్టియ్రాలో, 19న హంగేరీలో ఎఫ్1 రేసులు జరుగనున్నాయి. మొత్తానికి ఇంగ్లండ్‌లో ఆటలకు గేట్లు ఎత్తేయనున్నారు. దీంతో చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.

జూన్ 2020 వ్యక్తులు

శ్రీలంక అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్
ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక విభాగం ఆధ్వర్యంలో మే 30న జరిగే అంతర్జాతీయ వర్చువల్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం అందింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్-19 రీ షేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. సుమారు వంద దేశాల్లో 45 మిలియన్ల మంది సభ్యులు ఉన్న ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ పలు అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తుంది.
మే 30న జరిగే వర్చువల్ సదస్సులో ఆ సంస్థ చైర్మన్ పాల్ పోల్‌మన్, యునెటైడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ అర్మిడ సల్సియా అలిస్‌జబానా పాల్గొంటారు.

ఛత్తీస్‌గఢ్ తొలి సీఎం అజిత్ జోగి కన్నుమూత
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మే 29న తుదిశ్వాస విడిచారు.
తొట్టతొలి ముఖ్యమంత్రి...
ఛత్తీస్‌గఢ్ ప్రజలు కలెక్టర్ సాహెబ్అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు సీఎంగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్‌పూర్ జిల్లాలోని జోగిసర్‌లో ఆయన జన్మించారు.
ప్రభుత్వ అధికారిగా...
ఢిల్లీ యూనివర్సిటీలో లా చదవిని జోగి.. 1967లో రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం.
జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపన...
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న జోగి.. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తదనంతర కాలంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. శాసనసభతోపాటు లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు.
రచయితగా...
అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్అనే పుస్తకాలు రాశారు.

మాతృభూమి వీరేంద్రకుమార్ మృతి
రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక మాతృభూమిమేనేజింగ్ డెరైక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) మే 28న కన్నుమూశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003-2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికై న హైమవతభువిల్వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు.
కేంద్ర మంత్రిగా...
పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వీరేంద్ర కుమార్ 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్‌డీ దేవెగౌడ కేబినెట్‌లలో బాధ్యతలు నిర్వహించారు.

ఐఎన్‌ఎస్ సర్కార్ కమాండర్‌గా గోఖలే
తూర్పు నావికాదళం (ఈఎన్‌సీ) ప్రధాన కార్యాలయం అయిన ఐఎన్‌ఎస్ సర్కార్ నూతన కమాండింగ్ ఆఫీసర్‌గా రాహుల్ విలాస్ గోఖలే మే 30న పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సంప్రదాయ పుల్లింగ్ అవుట్ వేడుక ద్వారా ప్రస్తుత కమాండర్ కె.ఎ.బోపన్నకు ఐఎన్‌ఎస్ సర్కార్ అధికారులు, నేవీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
పాక్‌లో నావల్ అడ్వైజర్‌గా...
ఐఎన్‌ఎస్ సర్కార్ 23వ కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితులైన రాహుల్ విలాస్ గోఖలే 1992 జనవరి 1వ తేదీన భారత నావికాదళంలో చేరారు. ఐఎన్‌ఎస్ ఖుక్రీ, ఐఎన్‌ఎస్ కోల్‌కత్తాలలో నేవిగేషన్ అండ్ డెరైక్షన్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. న్యూఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్ వద్ద డెరైక్షన్ పర్సనల్ పాలసీ అడ్వైజర్‌గా, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వద్ద హైకమిషన్ ఆఫ్ ఇండియా నావల్ అడ్వైజర్‌గానూ గోఖలే విధులు నిర్వర్తించారు.

మోదీ జీవితంపై కొత్త పుస్తకం విడుదల
ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికర అంశాలు ఉన్న ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ప్రధానిగా మోదీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 29న ఆ జీవిత కథాత్మక పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ బాలకృష్ణన్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. నరేంద్ర మోదీ- హార్బింజర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ అపొసిల్ ఆఫ్ వరల్డ్ పీస్ అనే ఈ పుస్తకాన్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిశ్ అగర్వాల, అమెరికన్ రచయిత్రి ఎలిజబెత్ హోరన్ సంయుక్తంగా రచించారు. ఈ-బుక్‌గానూ ఇది అందుబాటులో తెచ్చారు. ఇంగ్లిష్‌సహా 10 విదేశీ భాషల్లో, తెలుగు సహా 10 భారతీయ భాషల్లో లభిస్తుంది.

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎ.పరమేశం నియామకం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎ.పరమేశంను నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తాకు కేంద్రం పదోన్నతి కల్పించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యునిగా నవంబర్ 30న నియమించిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న ఆర్కే జైన్‌కు కేంద్రం పదోన్నతి కల్పించి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్, పీపీఏ సీఈవో బాధ్యతలను కూడా గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహిస్తూ వస్తున్నారు.

భారత మాజీ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా
ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత మాజీ స్టార్ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్‌కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్ థెరపీని మధ్యలోనే ఆపేశారు. దాంతో డింకో సింగ్ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్ లో ప్రయాణించి మళ్లీ మణిపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

జెస్సికాలాల్ హంతకుడి విడుదలకు ఆమోదం
1999లో సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో దోషిగా యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న మనుశర్మను ముందుగానే విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జూన్ 2న ఆమోదం తెలిపారు. మనుశర్మను ముందే విడుదల చేయాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన మే 11న జరిగిన భేటీలో ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డ్ సిఫారసు చేసింది.
మను శర్మ మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కొడుకు. దక్షిణ ఢిల్లీలో ఉన్న టామరిండ్ కోర్ట్ రెస్టారెంట్‌లో మద్యం అందించేందుకు నిరాకరించిందన్న కారణంతో మోడల్ జెస్సికా లాల్‌ను మనుశర్మ తుపాకీతో కాల్చి చంపేశాడు. 1999 ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగింది. ట్రయల్ కోర్టు మనుశర్మను నిర్దోషిగా తేల్చింది. హైకోర్టు 2006 డిసెంబర్‌లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.

అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నవీన్
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రథమ స్థానం లభించింది. నవీన్ తర్వాత ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ రెండో స్థానంలో, కేరళ సీఎం పినరయ్ విజయన్ మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. సీ ఓటర్-ఐఏఎన్‌ఎస్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 2020, మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్‌కామ్ జూన్ 2న ఈ వివరాలను ప్రచురించింది.
మోదీ పట్ల 65 శాతం మంది సంతృప్తి
వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం) ముందు వరుసలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 83.6 శాతం సంతృప్తి వ్యక్తమైంది.
సీఎంలకు ప్రజాదరణ ఇలా...

  • నవీన్ పట్నాయక్ పాలనపై 82.96 శాతం మంది ఒడిషా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
  • భూపేష్ భగేల్ పాలనపై 81.06 శాతం మంది ఛత్తీస్‌గఢ్ ప్రజలు, పినరయ్ పాలనపై కేరళలో 80.28 శాతం సంతృప్తి వ్యక్తమైంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై మొత్తం 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
  • 72.56 శాతం మంది ప్రజల మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఐదో స్థానంలోనూ, 74.18 శాతం మంది మద్దతుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 6వ స్థానంలోనూ నిలిచారు.
  • 54.26 శాతం మంది ప్రజల మద్దతుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 16వ స్థానంలో నిలిచారు.
  • కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యూడ్యూరప్ప 67.21 శాతం మంది మద్దతుతో 8వ స్థానంలోనూ, 41.28 శాతం ప్రజాదరణతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 19వ స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది.

ప్రజాదరణ కలిగిన టాప్ - 10 సీఎంలు


ర్యాంకు

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి

నికర సంతృప్తి రేటింగ్

1.

ఒడిశా

82.96

2.

ఛత్తీస్‌గఢ్‌ఢ్

81.06

3.

కేరళ

80.28

4.

ఆంధ్రప్రదేశ్

78.01

5.

మహారాష్ట్ర

76.52

6.

ఢిల్లీ

74.18

7.

హిమాచల్‌ప్రదేశ్

73.96

8.

కర్ణాటక

67.21

9.

అసోం

67.17

10.

రాజస్తాన్

65.61


కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ రియాజ్ మృతి
కరోనా వైరస్ బారినపడ్డ పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) జూన్ 2న మృతి చెందారు. ఈ విషయాన్ని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వెల్లడించారు. లెగ్ స్పిన్నర్ అయిన రియాజ్.. 1987 నుంచి 2005 వరకూ 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. రిటైర్‌మెంట్ తర్వాత మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో ప్రధాన కోచ్‌గా పనిచేశారు. రియాజ్ కంటే ముందు మరో పాక్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. 2020, ఏప్రిల్ 13న జాఫర్ కన్నుమూశాడు.
ఎఫ్1 సీజన్ ప్రారంభం...
ఎట్టకేలకు ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ ప్రారంభంకానుంది. మార్చి 15న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో 2020 సీజన్ మొదలుకావాల్సినా... కరోనా వైరస్ కారణంగా సాధ్యపడలేదు. దాంతో ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితోపాటు డచ్, మొనాకో, ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి రేసులు రద్దయ్యాయి. మరో ఐదు రేసులు వాయిదా పడ్డాయి. యూరప్ దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎఫ్1 మేనేజ్‌మెంట్ సీజన్ మొదలుపెట్టడానికి సిద్ధమైంది. జూలై 5న ఆస్టియ్రా గ్రాండ్‌ప్రి రేసుతో 2020 సీజన్ ఆరంభమవుతుంది.

ఏపీ సీఎస్ పదవీ కాలం 3 నెలలు పొడిగింపు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. వాస్తవంగా 2020, మే 31నాటికి సాహ్ని పదవీ కాలం ముగియనుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు నీలం సాహ్ని పదవీ కాలాన్ని 2020, సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సిన్హా జూన్ 3న ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐఐ ప్రెసిడెంట్‌గా ఉదయ్ కొటక్
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కొటక్ ఎన్నికయ్యారు. 2020-21 ఏడాదికి ఉదయ్ కొటక్ ఎన్నికైనట్లు సీఐఐ జూన్ 3న ప్రకటించింది. కిర్లోస్కర్ సిస్టమ్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ విక్రమ్ కిర్లోస్కర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు.