ఫిబ్రవరి 2021

ఫిబ్రవరి 2021

ఫిబ్రవరి 2021 అంతర్జాతీయం

దక్షిణాసియా దేశాల సదస్సులో ప్రధాని మోదీ
భారత్‌కు పొరుగు దేశాలైన 10 దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలతో కలిసి ‘‘కోవిడ్‌–19 మేనేజ్‌మెంట్‌: ఎక్స్‌పీరియన్స్, గుడ్‌ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్‌’’ పేరిట ఫిబ్రవరి 18న నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. దక్షిణాసియా దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు.

ఫేస్‌బుక్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా
గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్‌ సంస్థ ఫేస్‌బుక్‌ తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్‌బుక్‌ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్‌ చేయడాన్ని బ్లాక్‌ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్‌బుక్‌ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది.
ఆస్ట్రేలియా రాజధాని: కాన్‌బెర్రా; కరెన్సీ: ఆస్టేలియన్‌ డాలర్‌
ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధానమంత్రి: స్కాట్‌ మోరిసన్‌

రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించిన అరబ్‌ దేశం?
అరబ్‌ దేశం సౌదీ అరెబియా... తమ దేశ రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించింది. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విజన్‌ 2030లో భాగంగా సౌదీ మహిళలకు విభిన్న విభాగాల్లో ప్రవేశం కల్పిస్తూ మహిళా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియన్‌ ఆర్మీ, రాయల్‌ సౌదీ వైమానిక దళం, రాయల్‌ సౌదీ నావికాదళం, రాయల్‌ సౌదీ వ్యూహాత్మక మిస్సైల్‌ ఫోర్స్, ఇతర సాయుధ బలగాలు, సైనిక వైద్య సేవారంగంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సౌదీ రక్షణ శాఖ ఫిబ్రవరి 22న ప్రకటించింది.
సౌది అరేబియా రాజధాని: రియాద్‌; కరెన్సీ: రియాల్‌
సౌది అరేబియా ప్రస్తుత రాజు: సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌ సౌద్‌
సౌది అరేబియా యువరాజు: మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌ సౌద్‌

ఆఫ్రికా దేశం ఘనా రాజధాని నగరం ఏది?
భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న ‘‘కోవిషీల్డ్‌’’ కోవిడ్‌ వ్యాక్సిన్‌ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి. నిరుపేద దేశాలకు కరోనా టీకా లభ్యమయ్యేలా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ టీకా డోసుల్ని పంపించారు. కోవాగ్జ్‌ కార్యక్రమం కింద కరోనా టీకా లభించే తొలి దేశం ఘనాయే. యూనిసెఫ్‌ ఆర్డర్‌ చేసిన ఈ కరోనా టీకా డోసులు అక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరి 24న చేరుకున్నాయి. కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యమైన 92 దేశాల్లో ఘనా కూడా ఉంది. ఘనా జనాభా 3 కోట్లు. ఈ దేశంలోఇప్పటివరకు 81 వేల కేసులు, 600మరణాలు సంభవించాయి.
డబ్ల్యూహెచ్‌ఓ, వ్యాక్సిన్‌ గ్రూప్‌ గవీ, కొయిలేషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్‌ సంయుక్తంగా పేద దేశాలను ఆదుకోవడానికి కోవాగ్జ్‌ కార్యక్రమం ప్రారంభించాయి.
ఘనా రాజధాని: అక్రా; కరెన్సీ: ఘనా సెడి
ఘనా ప్రస్తుత అధ్యక్షుడు: నానా అకుఫో–అడో
ఘనా ప్రస్తుత ఉపాధ్యక్షుడు: మహాముడు బావుమియా

ఇటీవల పాక్‌ భూభాగంలో ఏ దేశం సర్జికైల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది?
పాకిస్తాన్‌ భూభాగంలో ఫిబ్రవరి 2న తాము సర్జికైల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినట్లు ఇరాన్‌ ఎలైట్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్‌ ఉల్‌–అదల్‌ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్‌ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 4న ఒక ప్రకటన విడుదల చేసింది.
2018, అక్టోబర్‌ 16న...
పాకిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్‌ అయిన జైష్‌ ఉల్‌–అదల్‌ 2018, అక్టోబర్‌ 16న 12 మంది ఐఆర్‌జీసీ గార్డులను అపహరించింది. పాక్‌–ఇరాన్‌ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్‌జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఇరాన్‌ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది.
ఉగ్రవాద సంస్థ జైష్‌ ఉల్‌–అదల్‌... ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్‌ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది.

ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు?
మయన్మార్‌ సైనిక పాలకులు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అంగ్‌సాన్‌సూకీ సహా ప్రజాప్రభుత్వాన్ని గద్దె దింపిన మిలటరీ జుంటా... ప్రజాందోళనలు విస్తరిస్తుండటంతో ఈ చర్య తీసుకుంది. సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ దేశంలోని అతిపెద్ద నగరం యాంగూన్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పుకార్లు వ్యాప్తి చేస్తున్నారంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్ని నిలిపేసింది. మయన్మార్‌లో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ కొనసాగుతోందని.... లండన్‌ కేంద్రంగా ఉన్న ఇంటర్నెట్‌ అంతరాయాలు, నిషేధాలను పసిగట్టే ‘నెట్‌బ్లాక్స్‌’ సంస్థ తెలిపింది.
మయన్మార్‌(బర్మా) రాజధాని: న్యేఫిడా(Naypyidaw)
మయన్మార్‌ కరెన్సీ: క్యాట్‌ (kyat)
మయన్మార్‌ అధికార భాష: బర్మీస్‌(Burmese)

ఇంధన వినియోగం విషయంలో భారత్‌ స్థానం?
భారత్‌లో ఇంధన వినియోగం భారీగా పెరుగుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 9న ‘‘ఐఈఏ ఇండియా ఎనర్జీ అవుట్‌లుక్‌–2021’’ నివేదికను విడుదల చేసింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే 2030 నాటికి ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)ను అధిగమిస్తుందని, రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతుందని విశ్లేషించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
 • ఇంధన వినియోగం విషయంలో నాల్గవ అతిపెద్ద దేశంగా ప్రస్తుతం భారత్‌ ఉంది. చైనా, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
 • విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వంటి వంటి అంశాలు భారత్‌ ఇంధన అవసరాలను పెంచనున్నాయి.
 • 2000 తరువాత భారత్‌ ఇంధన డిమాండ్‌ రెట్టింపయ్యింది. బొగ్గు, ఆయిల్‌ భారత్‌ ప్రధాన ఇంధన వనరులుగా ఉన్నాయి.
 • సిమెంట్, స్టీల్, విద్యుత్‌ రంగాలకు గణనీయమైన డిమాండ్‌ పెరగనుంది.
 • సాంప్రదాయేతర ఇంధన వనరులపై భారత్‌ అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
 • 2019–40 మధ్య ప్రపంచం మొత్తం ఇంధన డిమాండ్‌లో భారత్‌ వాటా పావుశాతం ఉంటుంది. అప్పటికి ఎకానమీ విలువ 8.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది.
 • 2040 నాటికి భారత్‌ విద్యుత్‌ వ్యవస్థ కూడా యూరోపియన్‌ యూనియన్‌కన్నా భారీగా ఉండే వీలుంది.
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం దావోస్‌ సదస్సు
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌)కు సంబంధించిన దావోస్‌ ఎజెండా సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 28న ప్రసంగించారు. జనవరి 24 నుంచి 29 దాకా జరిగిన ఈ ఆన్‌లైన్‌ సదస్సులో సుమారు 1,000 మంది పైగా ప్రపంచ దేశాల నేతలు, దిగ్గజ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక, పర్యావరణ, సామాజిక, సాంకేతిక సవాళ్లు, టీకాల ప్రక్రియ, ఉద్యోగాల కల్పన మొదలైన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిపారు.
సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... కోవిడ్‌పై పోరులో ప్రపంచదేశాలకు భారత్‌ సహకారం అందిస్తుందని అన్నారు. ‘చాలా దేశాలకు కోవిడ్‌ టీకాలు పంపించాం. 150పైగా దేశాలకు మందులు అందజేశాం. దేశంలో తయారైన రెండు టీకాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. మరికొన్ని టీకాలను కూడా అందజేయనున్నాం’ అని ప్రధాని అన్నారు. దావోస్‌ నగరం స్విట్జర్లాండ్‌ దేశంలో ఉంది.
స్విట్జర్లాండ్‌ రాజధాని: బెర్న్‌; కరెన్సీ: స్విస్‌ ఫ్రాంక్‌
స్విట్జర్లాండ్‌ ప్రస్తుత అధ్యక్షుడు: గై పార్మెలిన్‌
స్విట్జర్లాండ్‌ ప్రస్తుత ఉపాధ్యక్షుడుఇగ్నాజియో కాసిస్‌

వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో భారత్‌ స్థానం?
కొత్తగా ఆవిష్కరించిన ఆరోగ్య సూచీ ప్రమాణాలను బట్టి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 11 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భారత్‌ 10వ స్థానంలో నిలిచింది. ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) జనవరి 28న విడుదల చేసిన ‘‘ఆసియా–పసిఫిక్‌ పర్సనలైజ్డ్‌ హెల్త్‌ ఇండెక్స్‌’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఇండెక్స్‌లో సింగపూర్‌ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్‌ తర్వాత తైవాన్‌ రెండో స్థానంలో, జపాన్‌ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి.
11 ఆసియా పసిఫిక్‌ దేశాలు...
ఆస్ట్రేలియా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, సౌత్‌ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, న్యూజీలాండ్‌ దేశాలలో వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నాయా? అనే విషయంపై అధ్యయనం చేసి ‘ఆసియా–పసిఫిక్‌ పర్సనలైజ్డ్‌ హెల్త్‌ ఇండెక్స్‌’ను రూపొందించారు. 27 విభిన్న ప్రమాణాల ఆధారంగా నాలుగు కేటగిరీల్లో వ్యక్తిగత ఆరోగ్య సూచీని కొలుస్తున్నారు. ఆరోగ్య సమాచారం విషయంలో భారత్‌ 41వ స్కోరుతో పదో స్థానం పొందింది.

పాకిస్తాన్‌కు చైనా అందజేసిన అధునాతన యుద్ధనౌక పేరు?
లాంగ్‌రేంజ్‌ మిస్సైల్స్, మెరుగైన రాడార్‌ వ్యవస్థతో కూడిన అధునాతన యుద్ధనౌక ‘‘టైప్‌054ఏబైపీ’’ను పాకిస్థాన్‌కు చైనా జనవరి 29న అందజేసింది. టైప్‌054ఏబైపీ యుద్ధనౌకలు నాలుగింటిని నిర్మించి ఇవ్వాలని 2017లో చైనాకు పాక్‌ కాంట్రాక్టు ఇచ్చింది. వీటిలో తొలినౌకను 2020, ఆగస్టులో పాక్‌కు అందించారు. తాజాగా రెండో నౌకను పాక్‌కు చైనా అందించింది. ఈ నౌకలను స్టెల్త్‌ మోడ్‌లో కూడా వాడవచ్చు. పాక్‌కు అన్ని రకాలుగా ఆయుధ సహకారం అందిస్తున్న చైనా, పాక్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు.

ఆక్స్‌ఫర్డ్‌ హిందీ వర్డ్‌ ఆఫ్‌–2020గా ఎంపికైన పదం?
2022 సంవత్సరంలో హిందీ భాషలో అత్యంత పాపులర్‌ అయిన పదంగా ఆక్స్‌ఫర్డ్‌ హిందీ విభాగం వారు ‘ఆత్మనిర్భరత’ అనే పదాన్ని ఎంపిక చేశారు. కోవిడ్‌–19 రికవరీ ప్యాకేజీ సమయంలో ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదం విరివిగా వాడుకలోకి వచ్చింది. ఏడాది కాలంతో అత్యంత ప్రభావం చూపడంతో పాటు, సంస్కృతిని, సంప్రదాయాలను సూచించే పదాలను వర్డ్‌ ఆఫ్‌ ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటిస్తుంది.

వరల్డ్‌ లాజిస్టిక్స్‌ పాస్‌పోర్ట్‌ గ్రూప్‌లో చేరిన దేశాలు?
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల అవకాశాలను పెంచేందుకు ఉద్దేశించిన వరల్డ్‌ లాజిస్టిక్స్‌ పాస్‌పోర్ట్‌ (డబ్ల్యూఎల్‌పీ) గ్రూప్‌లో భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాలు చేరాయి. భారత్‌లోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్‌ కంటైయినర్‌ టెర్మినల్, ఎమిరేట్స్‌ స్కైకార్గో తమ భాగస్వాములుగా ఉంటాయని డబ్ల్యూఎల్‌పీ ఫిబ్రవరి 3న పేర్కొంది. ప్రస్తుతం డబ్ల్యూఎల్‌పీ సీఈవోగా మైక్‌ భాస్కరన్‌ ఉన్నారు.
ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్‌ అమెరికా, దక్షిణ అమెరికాలోని వ్యాపార సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య మార్గాలను మెరుగుపర్చడంతో పాటు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై డబ్ల్యూఎల్‌పీ కసరత్తు చేస్తోంది. కొలంబియా, సెనెగల్, కజక్‌స్థాన్, బ్రెజిల్, ఉరుగ్వే తదితర దేశాలు ఇప్పటికే ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.

వూహాన్‌ మార్కెట్లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం
కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం జనవరి 31న చైనాలోని వూహాన్‌లో ఉన్న హూనన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ను సందర్శించింది. 2019 ఏడాదిలో కరోనా వైరస్‌ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి. ఈ మార్కెట్‌లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్‌ నుంచే కరోనా వైరస్‌ పుట్టిందన్న వాదన ఉంది. అయితే దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు.

ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నివేదికను ఆవిష్కరించిన అంతర్జాతీయ సంస్థ?
ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాటర్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌(UNU-INWEH) అనే సంస్థ ‘‘ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌’’ నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భారీ ఆనకట్టల జీవిత కాలంపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను... ఐరాస తాజాగా విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యమైన అంశాలు....
 • ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య నిర్మించిన 58,700 భారీ ఆనకట్టల జీవిత కాలాన్ని 50 నుంచి 100 ఏళ్లకే రూపకల్పన చేశారు. 50 ఏళ్ల తరువాత నుంచి ఇటువంటి భారీ ఆనకట్టల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది.
 • కాలం తీరిన భారీ ఆనకట్టలతో రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రజలు పెనుముప్పును ఎదుర్కోబోతున్నారు.
 • 2050 నాటికి.. అంటే మరో 30 ఏళ్లలో ఇటువంటి పురాతన ఆనకట్టలకు దిగువనే అత్యధిక మంది జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది.
 • నాలుగు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా భారీ డ్యాంలున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాల్లో మొత్తం 32,716 పెద్ద ఆనకట్టలు(ప్రపంచంలోనే 55 శాతం) ఉన్నాయి.
 • ఒక్క చైనాలోనే 23,841 భారీ ఆనకట్టలు(ప్రపంచంలోని మొత్తం డ్యాంలలో 40 శాతం) ఉన్నాయి. వీటిలో చాలా వాటికి త్వరలోనే 50 ఏళ్లు పూర్తవుతాయి. వీటికి ప్రమాదం పొంచి ఉంది.
 • కాలంతీరిన పెద్ద ఆనకట్టల సమస్య చాలా తక్కువ దేశాలెదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని పెద్ద ఆనకట్టలలో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి.
భారతదేశంలో...
 • భారతదేశంలో దాదాపు 1,115 భారీ ఆనకట్టలు నిర్మాణం జరిగి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తికానుంది.
 • దేశంలోని దాదాపు 4,250కి పైగా ఆనకట్టలకు 2050 నాటికి 50 ఏళ్లు నిండుతాయి. అలాగే 2050 సంవత్సరానికల్లా దేశంలోని 64 ఆనకట్టలకు 150 ఏళ్ల పూర్తవుతాయి.
 • 100 ఏళ్ల క్రితం నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్‌ డ్యాం బద్దలైతే దాదాపు 35 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఏ దేశ మిలటరీ ప్రకటించింది?
మయన్మార్‌ పాలన మరోసారి సైనిక జుంటా(మిలటరీ సమూహం) చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశం ఏడాది పాటు తమ ఆధీనంలో ఉంటుందని ఫిబ్రవరి 1న మయన్మార్‌ సైన్యం ప్రకటించింది. దేశ అగ్రనేత, కౌన్సిలర్‌ హోదాలో ఉన్న అంగ్‌సాన్‌ సూకీ, అధ్యక్షుడు విన్‌ మియింత్‌ సహా సీనియర్‌ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపింది. కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఔంగ్‌ హ్లయింగ్‌ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్‌ స్వే ఉంటారని సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’ టీవీ తెలిపింది.
కారణం ఇదే...
2020, నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు మిలటరీ తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది.
మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే..
1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్‌ వారినుంచి స్వాతంత్రం లభించింది.
1962: మిలటరీ నేత నీ విన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు.
1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్‌ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు.
1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్‌ అరెస్టు చేశారు.
1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ బంపర్‌ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది.
1991, అక్టోబర్‌: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.
2010, నవంబర్‌ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి.
2010, నవంబర్‌ 13: దశాబ్దాల హౌస్‌ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు.
2012: పార్లమెంట్‌ బైఎలక్షన్‌లో సూకీ విజయం సాధించారు.
2015, నవంబర్‌ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి కట్టబెట్టింది.
2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు.
2019, డిసెంబర్‌ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు.
2020, నవంబర్‌ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీకి మరోమారు మెజార్టీ దక్కింది.
2021, ఫిబ్రవరి 1: ఎన్నికల్లో జరిగిన అక్రమాల కారణంగా దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది.

ఫిబ్రవరి 2021 జాతీయం

 
పుగలుర్‌–త్రిస్సూర్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టు ప్రారంభం
320 కేవీ పుగలుర్‌(తమిళనాడు)– త్రిస్సూర్‌(కేరళ) పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఫిబ్రవరి 19న ఆన్‌లైన్‌ విధానంలో ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,070 కోట్లు వ్యయం చేశారు. రానున్న ఆరేళ్లలో దేశ సౌర విద్యుత్‌ సామర్థ్ధ్యం 13 రెట్లు పెరగనుందని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఫిబ్రవరి 19న ప్రధాని ఆన్‌లైన్‌ విధానంలో పాల్గొని, ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లలో అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను పెంచేందుకు విద్యాసంస్థలు చేపట్టాల్సిన చర్యలపై 25 అంశాలతో విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించాలని కోరారు. విశ్వభారతి యూనివర్సిటీని కోల్‌కతాలోని శాంతినికేతన్‌లో 1921, డిసెంబర్‌ 23న విశ్వ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించారు.

ఎంసీఈఎంఈ, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం
ఆర్మర్డ్‌ ట్రాక్డ్‌ రిపేర్‌ వాహనాల (ఏటీఆర్‌వీ) అంశంలో సమన్వయంతో పనిచేసేందుకు... సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (ఎంసీఈఎంఈ), సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఒప్పందం చేసుకున్నాయి. ఫిబ్రవరి 19న కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఏటీఆర్‌వీలకు సంబంధించిన శిక్షణ, తయారీ, విడిభాగాల రూపకల్పన, సాంకేతిక అంశాలపై ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి.

స్విగ్గీతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంఓయూ
వీధి వ్యాపారుల ఆహార పదార్థాలకు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించి వినియోగదారులకు డెలివరీ చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల స్విగ్గీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికెట్‌గల హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు స్వీకరించి ఆహారాన్ని డెలివరీ చేయడానికి మాత్రమే ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ సేవలు అందుబాటులోకి ఉన్నాయి.

నీతి ఆయోగ్‌ పాలక మండలి చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
నీతి ఆయోగ్‌ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం 20న పునర్‌వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్‌ సభ్యులుగా ఉంటారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. సాధారణంగా దేశ ప్రధాని నీతి ఆయోగ్‌ చైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ ఉన్నారు.
ఆరో సమావేశం...
నీతి ఆయోగ్‌ పాలక మండలి ఆరో సమావేశం ఫిబ్రవరి 20న ఆన్‌లైన్‌ విధానంలో జరిగింది. కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు.

దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరం
దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌–2021’ లో ఈ విషయం వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలిచాయి.
ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాలు..
ర్యాంకు నగరం
 • హైదరాబాద్‌
 • బెంగళూరు
 • పుణే
 • ఢిల్లీ
 • చెన్నై
 • లక్నో
 • కోయంబత్తూర్‌
 • నెల్లూరు
 • గుర్గావ్‌
 • మంగళూరు
ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ ప్రారంభం
దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు చేసే, సైబర్‌వేదికగా జరిగే నేరాలపై ప్రజల భాగస్వామ్యంతో నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమౌతోంది. దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఇంటర్‌నెట్‌లో సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్ట్‌లపై కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి)ని కేంద్ర హోం మత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. ఇందులో వాలంటీర్లుగా పనిచేయాలని భావించేవారు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన...
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 24న ఆమోదముద్ర వేసింది. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలన్న పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ సిఫారసు మేరకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి అనుమతి తరువాత పుదుచ్చేరి అసెంబ్లీ రద్దవుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానం నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం(మెతెరా స్టేడియం) ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 24న ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ‘‘ది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌’’లో ఈ ఉన్న ఈ స్టేడియాన్ని మొతెరా స్టేడియం అని పిలిచేవారు. తాజా దీనికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేశారు. స్టేడియంలోని రెండు ఎండ్‌లకు కార్పొరేట్‌ సంస్థలైన రిలయన్స్, అదానీల పేర్లు పెట్టారు. రూ.800 కోట్లు ఖర్చుతో ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ మైదానంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది.

ఏ సంఘటన కారణంగా గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు?
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన ‘చౌరీ చౌరా’ ఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 4న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా ప్రత్యేక తపాలా బిళ్ల(పోస్టల్‌ స్టాంపు)ను విడుదల చేశారు.
సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. పోలీసులందరూ సజీవదహనం కావడంతో 19 మందిని బ్రిటన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12న నిలిపేశారు.

ప్రస్తుతం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
దేశ జనాభాలో 21.5 శాతం మంది కోవిడ్‌ ప్రభావానికి లోనయినట్లు మూడో సెరో సర్వేలో తేలింది. ఈ మూడో సర్వేను 2020, డిసెంబర్‌ 17– 2021, జనవరి 8వ తేదీల మధ్య చేపట్టినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ ఫిబ్రవరి 4న తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 700 గ్రామాలు/వార్డుల్లో ఈ సర్వే నిర్వహించినట్లు వివరించారు. జనాభాలో అత్యధికులు ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
13 నుంచి రెండో డోస్‌...
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కోవిడ్‌–19 రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. ఇప్పటికే మొదటి డోస్‌ అందుకున్న ఆరోగ్య కార్యకర్తలు 49,93,427 మందికి ఈ డోస్‌ అందుతుందన్నారు. ఈ డోస్‌ అందుకున్న కేవలం 0.18 శాతం మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దేశంలో 2021, జనవరి 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ‘‘కోవిషీల్డ్‌’’, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ‘‘కోవాగ్జిన్‌’’ ఆరోగ్య కార్యకర్తలకు వేస్తున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దేశ జనాభాలో 21.5 శాతం మంది కోవిడ్‌ ప్రభావానికి లోనయ్యారు.
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌

2014 నుంచి దేశంలో నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య?
దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా నియంత్రణ రీత్యా 2014 నుంచి దేశంలో 296 మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీశాఖ మంత్రి సంజయ్‌ ధోత్రి ఫిబ్రవరి 4న రాజ్యసభకు తెలిపారు. ‘‘ఐటీ యాక్ట్‌ 2000, సెక్షన్‌ 69 ఏ’’ని అనుసరించి యాప్‌లపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ఈ యాప్‌ల ద్వారా వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం, మొబైల్‌లోని సమాచారం మొత్తాన్ని దేశం వెలుపలకు రహస్యంగా తరలించడం జరుగుతోందని కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు.
మయన్మార్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం
మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై నిషేధం విధించింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం, ప్రియతమ నేత అంగ్‌సాన్‌ సూకీని ప్రభుత్వం గద్దెదించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉండటం, దేశంలో అల్లర్లు తలెత్తుతాయన్న అనుమానాల నేపథ్యంలో సైనిక పాలకులు ఈ చర్య తీసుకున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2014 నుంచి నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య 296
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర కమ్యూనికేషన్, ఐటీశాఖ మంత్రి సంజయ్‌ ధోత్రి
ఎక్కడ : దేశంలో
ఎందుకు : దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా నియంత్రణ రీత్యా

రోప్‌వేలను ఏ శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది?
రోప్‌వేలు, కేబుల్‌ కార్లు, ఇతరత్రా వినూత్న రవాణా సాధనాలను జాతీయ రహదారుల శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4న కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్‌ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఇది దోహదపడగలదని మంత్రి పేర్కొన్నారు. రోప్‌వేలు... ఫ్రాన్స్‌లో 4,000, అమెరికాలో 2,000, స్విట్జర్లాండ్‌లో 1,500 ఉండగా, భారత్‌లో కేవలం 65 ప్రాజెక్టులే ఉన్నాయని.. వీటిల్లోనూ 22 మాత్రమే విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జాతీయ రహదారుల శాఖ పరిధిలోకి రోప్‌వేలు, కేబుల్‌ కార్లు, ఇతరత్రా వినూత్న రవాణా సాధనాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్‌ గడ్కరీ
ఎందుకు : రోప్‌వేలు, కేబుల్‌ కార్లు విస్కృతిని వేగవంతం చేసేందుకు

గుజరాత్‌ రాష్ట్ర హైకోర్టు ఏ నగరంలో ఉంది?
గుజరాత్‌ హైకోర్టు డైమండ్‌ జూబ్లీ వేడుకలు ఫిబ్రవరి 7న జరిగాయి. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పాల్గొని ప్రసంగించారు. గుజరాత్‌ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. 1960 ఏడాదిలో గుజరాత్‌ హైకోర్టును స్థాపించారు. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో ఈ హైకోర్టు ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్‌ నాథ్‌ ఉన్నారు.
మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు...
 • భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణలు చేపట్టింది.
 • దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి.
 • వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్‌ విచారణలు సాధ్యమయ్యాయి.
 • డిజిటల్‌ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నాం.
 • దేశంలో తొలి లోక్‌ అదాలత్‌ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గుజరాత్‌ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా

ఏ సంస్థకు చెందిన కోబ్రా దళంలో తొలిసారిగా మహిళలు చేరనున్నారు?
సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) తొలిసారిగా తన కమెండో బెటాలియన్‌ ఫర్‌ రిజల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా) కమెండో యూనిట్‌లో మహిళా కమెండోలను రంగంలోకి దించనుంది. ఈ కమెండోలు వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, 6 మహిళల, 15 ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎఎఫ్‌), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్‌ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో మొదటి మహిళా బెటాలియన్‌ 1986లో ఏర్పడింది. ఇటీవల 88వ మహిళా బెటాలియన్‌ 35వ రైజింగ్‌ డే(ఫిబ్రవరి 6) సందర్భంగా కోబ్రా శిక్షణకు 34 మంది మహిళా జవాన్లను ఎంపిక చేశారు.

జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు?
కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.50 కోట్లతో కొత్తగా నిర్మించిన దివంగత సైన్యాధికారి జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు ఫిబ్రవరి 6న ప్రారంభించారు. తిమ్మయ్య సాహసగాథలకు అద్దం పట్టేలా ఆయన జన్మించిన ఇల్లు ‘సన్నిసైడ్‌’నే మ్యూజియంగా మార్చారు.
ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం...
మడగాస్కర్‌ అడవిలో గుర్తించబడిన ఊసరవెల్లి ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపం. దీని శాస్త్రీయ నామం ‘‘బ్రూకెసియా ననా’’. కాలుష్యం, అడవుల నరికివేత కారణంగా అరుదైన ఈ జాతి ఊసరవెల్లులు అంతరించిపోతున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దివంగత సైన్యాధికారి జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ఎక్కడ : మడికెరి, కొడగు జిల్లా, కర్ణాటక
ఎందుకు : తిమ్మయ్య సాహసగాథలకు గుర్తుగా

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లుకు ఆమోదం
జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు–2021ను ఫిబ్రవరి 8న రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ క్యాడర్‌ను అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్‌ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
టైమ్స్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ఐఎస్‌బీ...
ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌–గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే టాప్‌ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థగా నిలిచింది. పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. 2020 ఏడాది ర్యాంకుల్లో 28వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు–2021కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : జమ్మూకశ్మీర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ క్యాడర్‌ను అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్‌ టెర్రిటరీ(ఏజీఎంయూటీ) క్యాడర్‌లో విలీనం చేసేందుకు

ఏ జిల్లాను విభజించి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు?
కర్ణాటక రాష్ట్రంలో గనులకు, హంపీ విజయనగర సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన బళ్లారి జిల్లాను రెండుగా విభజించారు. బళ్లారి నుంచి హొసపేట సహా పలు అసెంబ్లీ నియోజ కవర్గాలను వేరుచేసి విజయనగర అనే కొత్త జిల్లాను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 31వ జిల్లాగా విజయనగర అవతరించింది. కొత్త జిల్లాలో హొసపేటే (విజయనగర), కూడ్లిగి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, హువిన హడ గలి, హరపనహళ్లి తాలూకాలను చేర్చారు.
కర్ణాటక రాష్ట్ర రాజధాని: బెంగళూరు
కర్ణాటక ప్రస్తుత గవర్నర్‌: వాజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా
కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి: బీఎస్‌. యడియూరప్ప
విజయనగర సామ్రాజ్యం...
విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలించాయి. అవి.. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు. వీరి పరిపాలనా కాలంలో సాహిత్యం, వాస్తు శాస్త్రం, శిల్పం మొదలైన కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దీంతో విజయనగర రాజులకు చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది.

వంశాలు

పాలనా కాలం

సంగమ

క్రీ.శ.1336 – 1485

సాళువ

క్రీ.శ. 1486 – 1505

తుళువ

క్రీ.శ. 1505 – 1570

అరవీటి

క్రీ.శ. 1570 – 1646


బిహార్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య?
బిహార్‌లోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 9న మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మొత్తం 17 మంది కొత్త సభ్యులను కేబినెట్‌లో చేర్చింది. వీరి చేత బిహార్‌ గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా సభ్యులతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది. బిహార్‌ అసెంబ్లీ స్థానాల ప్రకారం చూస్తే 36 మంది వరకూ మంత్రులు ఉండవచ్చు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు, 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
బిహార్‌ రాష్ట్రం....
రాజధాని: పాట్నా
శాసనసభ సీట్లు: 243
శాసనమండలి: 95
లోక్‌సభ సీట్లు: 40 (జనరల్‌–34, ఎస్సీ–6, ఎస్టీ–0)
రాజ్యసభ సీట్లు: 16
హైకోర్టు: పాట్నా హైకోర్టు
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి, మైథిలీ
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.

మేజర్‌ పోర్ట్స్‌ అథారిటీ బిల్లు–2020కి ఆమోదం
దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘మేజర్‌ పోర్ట్స్‌ అథారిటీ బిల్లు–2020’’కి ఫిబ్రవరి 10న రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఎగువ సభలో జరిగిన బ్యాలెట్‌ ఓటింగ్‌లో బిల్లుకి అనుకూలంగా 84 ఓట్లు వస్తే, వ్యతిరేకిస్తూ 44 మంది ఓటు వేశారు. ఈ బిల్లుని లోక్‌సభ 2020, సెప్టెంబర్‌లోనే ఆమోదించింది. 1963 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.
బిల్లుపై చర్చ సందర్భంగా పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ... ‘‘ప్రైవేటు రంగ పోర్టులతో ప్రభుత్వ రంగ పోర్టులు పోటీ పడాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బిల్లు ద్వారా పోర్టులకు ఆ అధికారం వస్తుంది. ఇక అవి సర్వ స్వతంత్రంగా వ్యవహరించవచ్చు’’ అని చెప్పారు.

కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేయనున్న సంస్థ?
సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్‌ నిర్ణయించింది. ఈ అధ్యయన బాధ్యతలను జైపూర్‌కి చెందిన ‘సీయూటీఎస్‌ ఇంటర్నేషనల్‌’కు అప్పగించింది. అధ్యయనం కోసం అయిదు కేసులు ఎంపికయ్యాయి. గోవాలో మోపా విమానాశ్రయంపై చర్చల నిలిపివేత, తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంటు మూసివేత, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాల నిలిపివేత వంటివి ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ ఉన్నారు.

దివంగత సీఎం జయలలిత స్మారక నిలయం ఎక్కడ ప్రారంభమైంది?
చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ‘‘వేద నిలయం’’ స్మారక నిలయంగా మారింది. జయ జ్ఞాపకాలతో కూడిన వస్తు ప్రదర్శనతో రూపుదిద్దుకున్న జయ స్మారక నిలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి జనవరి 28న ప్రారంభించారు. సుమారు 48 ఏళ్లపాటు జయ వేద నిలయంలోనే నివసించారు. జయ ఇంటిని స్మారక నిలయంగా మారుస్తున్నట్లు 2017, ఆగస్టు 17న ప్రకటించారు.
70 దేశాలకు యూకే వైరస్‌
యాంటీబాడీస్‌ రక్షణ ప్రభావాన్ని తగ్గించి, వేగంగా విస్త్రుతంగా వ్యాప్తిచెందే యూకే కొత్త కరోనా వైరస్‌ 70 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలిసారి దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ కొత్త కరోనా వైరస్‌ వారం రోజుల్లోనే మరో 8 దేశాలకు వ్యాపించినట్టు తెలిపింది.
పల్స్‌ పోలియో–2021
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జనవరి 30న రాష్ట్రపతి భవన్‌లో పల్స్‌పోలియో–2021ను ప్రారంభించారు. పోలియో నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ డే–2021 సందర్భంగా జనవరి 31న దేశవ్యాప్తంగా ఉన్న 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనలో భాగంగా ‘జాతీయ పోలియో నిరోధక దినోత్సవాన్ని’ (నేషనల్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ డే) పాటిస్తున్నారు. 2021 పోలియో నిరోధక దినోత్సవాన్ని దేశంలో జనవరి 31న పాటిస్తున్నారు. 2021 సంవత్సరం సుమారు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. భారత్‌ను పోలియోరహిత దేశంగా 2014లో మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
అన్సారీ పుస్తకం...
భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారి ‘‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్‌’’ పేరుతో రాసిన పుస్తకం విడుదలైంది. రాజ్యసభ చైర్మన్‌గా తన అనుభవాలు, మరికొన్ని అంశాలను గురించి ఈ పుస్తకంలో అన్సారీ వివరించారు.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరును కమలంగా మార్చారు?
డ్రాగన్‌ ఫ్రూట్‌ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరుని ‘‘కమలం’’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్‌ ముఖ్యమంత్రి రూపాని ఇటీవల ప్రకటించారు. డ్రాగన్‌ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలనుకున్నట్లు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని రూపాని అన్నారు. ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. 1990లనుంచీ భారత్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ని పండిస్తున్నారు.
డ్రాగన్‌ ఫ్రూట్‌ ఎక్కడ పుట్టింది?
డ్రాగన్‌ ఫ్రూట్‌ చెట్టు ముళ్లజెముడు (కాక్టస్‌) జాతికి చెందినది. ఇది మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్‌ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ’పితాహాయ’ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్‌ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. వియత్నాంలో ‘థాన్‌ లాంగ్‌’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్‌ కళ్లు అని అర్థం.

ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021 ఎక్కడ జరుగుతోంది?
కర్ణాటక రాష్టంలోని బెంగళూరు యలహంక వైమానిక స్థావరంలో 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘‘ఏరో ఇండియా–2021’’ జరుగుతోంది. ఫిబ్రవరి 3న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు 78 విదేశీ కంపెనీలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
బెంగళూరులో ఉన్న హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లోని తేజస్‌ కేంద్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘‘తేజస్‌మార్క్‌–2 యుద్ధ విమాన తయారీ కేంద్రం’’ ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హెచ్‌ఏఎల్‌ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021
ఎప్పుడు: ఫిబ్రవరి 3, 4, 5
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ: యలహంక వైమానిక స్థావరం, బెంగళూరు, కర్ణాటక
ఎందుకు: రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన కోసం

83 తేజస్‌ యుద్ధ విమానాల కోసం ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
83 తేజస్‌ ఎంకే1ఏ లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ దిగ్గజ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)తో ఒప్పందం చేసుకుంది. హెచ్‌ఏఎల్‌ ఎండీ ఆర్‌.మాధవన్‌కు రక్షణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వి.ఎల్‌.కాంతారావు ఒప్పంద పత్రాలను అందజేశారు. బెంగళూరులో జరుగుతున్న ‘‘ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన–2021’’ సందర్భంగా ఫిబ్రవరి 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలో.... ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం విలువ రూ.48వేల కోట్లు. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు.
తేజస్‌ యుద్ధ విమానాన్ని భారత ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎడిఎ), హెచ్‌ఏఎల్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. వయసు పైబడుతున్న మిగ్‌ –21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు... 1980 లలో మొదలుపెట్టిన లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎల్‌సీఏ) కార్యక్రమంలో భాగంగా రూపుదిద్దుకున్న విమానమే తేజస్‌. 2003 ఏడాదిలో ఈ యుద్ధవిమానానికి అధికారికంగా ‘తేజస్‌‘ అని పేరు పెట్టారు.

ప్రబుద్ధ భారత అనే మాస పత్రికను ఎవరు ప్రారంభించారు?
రామకృష్ణ పరమహంస బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వామి వివేకానందుడు 1896 జూలైలో ‘‘ప్రబుద్ధ భారత(అవేకెన్‌డ్‌ ఇండియా)’’ అనే ఇంగ్లీషు మాస పత్రికను ప్రారంభించారు. ప్రబుద్ధ భారత 125 వార్షికోత్సవ వేడుకలను జనవరి 31న నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని మాయవతిలో ఉన్న అద్వైత ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... నిరుపేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

కృష్‌ –ఈ పురస్కారాలను ప్రదానం చేసిన సంస్థ?
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ సెక్టార్‌ (ఎఫ్‌ఈఎస్‌) తాజాగా వ్యవసాయ రంగంలో సృజనాత్మక విధానాలు అమలు చేసిన రైతులకు కృష్‌–ఈ చాంపియన్‌ పురస్కారాలు ప్రకటించింది. 4 కేటగిరీల్లో 10 జాతీయ అవార్డులు అందించింది.
 

ఫిబ్రవరి 2021 రాష్ట్రీయం

 
ఏపీలో ప్రభుత్వ స్టేట్‌ డేటా సెంటర్‌లు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి?
సైబర్‌ సెక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్‌ రెండు చోట్ల ఎస్‌డీసీలను ఏర్పాటు చేస్తోంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో ప్రైమరీ సైట్‌ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్‌ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అంతర్వేదిలో ముఖ్యమంత్రి...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2020, సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
సైబరాబాద్‌ కమిషనరేట్‌లో...
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో ట్రాన్స్‌జెండర్‌ డెస్క్‌ను ఫిబ్రవరి 19న కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్‌ అభ్యర్థనపై ఈ డెస్క్‌ను ప్రారంభించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
తెలంగాణ రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు విషయమై ఫిబ్రవరి 22న కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
 • హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుంది.
 • రెండు దశల్లో నిర్మించే ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.17 వేల కోట్లలో భూసేకరణకు రూ.4 వేల కోట్లు అవుతుంది. అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
 • సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు నిర్మించబోయే మొదటి దశకు 2017లోనే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించింది.
 • చౌటుప్పల్‌–షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నంబర్‌ కేటాయించాలి.
 • రూ.10వేల కోట్లతో మొదటిదశ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయి.
బయో ఏషియా–2021 సదస్సు థీమ్‌ ఏమిటి?
కోవిడ్‌–19 ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22న 18వ బయో ఆసియా సదస్సు–2021 ప్రారంభమైంది. కరోనా కారణంగా వివిధ దేశాల ప్రతినిధులు వర్చువల్‌ విధానం ద్వారా సదస్సులో పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 23 వరకు జరిగే ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లైఫ్‌ సెన్సైస్‌ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాల గురించి మంత్రి వివరించారు.
బయో ఏషియా–2021 సదస్సు థీమ్‌: మూవ్‌ ది నీడిల్‌
ముఖ్యాంశాలు...
 • 18వ బయో ఏషియా వార్షిక సదస్సు ఎజెండా కోవిడ్‌– 19 కేంద్రంగా ఉంది.
 • తెలంగాణ రాష్ట్ర లైఫ్‌ సెన్సైస్‌ సలహామండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.
 • ప్రస్తుతం బయో ఏషియా సీఈఓగా శక్తి నాగప్పన్‌ ఉన్నారు.
 • సుమారు 50 దేశాలకు చెందిన 1500 మంది నిపుణులు సదస్సులో పాల్గొంటున్నారు.
 • కరోనా నేపథ్యంలో సదస్సును తొలిసారిగా వర్చువల్‌ విధానంలో నిర్వహించనున్నారు.
భారత్‌ బయోటెక్‌కు అవార్డు...
బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు 2021 ఏడాది భారత్‌ బయోటెక్‌కు దక్కింది. అవార్డును భారత్‌ బయోటెక్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్‌ అందించారు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌తో పాటు పలు ఇతర టీకాలను భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈబీసీ నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం
ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న సమావేశమైన మంత్రివర్గం ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించనున్నారు.
కేబినెట్‌ ఇతర నిర్ణయాలు...
 • సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌కు ఆమోదం. 2021, ఏప్రిల్, 2022 మార్చి 31వ తేదీ వరకూ పథకాల వారీగా అమలు చేసే నెలల ఖరారు.
 • రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు రోడ్లు, భూసమీకరణ పనులకు (సమీకరించిన భూముల్లో పనులు) సంబంధించి రూ.3 వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం.
 • రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీ పర్పస్‌ సెంటర్లు, జనతా బజార్లు, ఫామ్‌ గేటు మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు ఆమోదం
 • ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణకు ఆమోదం.
ప్రాజెక్ట్‌ ఇండి వికీతో ఏ రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుంది?
ఆన్‌లైన్‌ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనే ‘వికీపీడియా’లో ఇంగ్లిషులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ట్రిపుల్‌ ఐటీల భాగస్వామ్యంతో కేంద్ర ఐటీ శాఖ ‘‘ఇండిక్‌ వికీ ప్రాజెక్టు’’ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కూడా భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం... వివిధ భాషల్లో సమాచారాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగు వికీపీడియాలో అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ, తెలంగాణ ఐటీ శాఖ కలిసి పనిచేయనున్నాయి.
మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ వికీ వ్యాసాల్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర అవతరణ తర్వాత భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాల్లోని సమాచారాన్నీ తెలుగులో అందుబాటులోకి తెస్తారు. వికీపీడియాలో లక్షల కొద్ది పేజీల సమాచారం అందుబాటులో ఉండగా, హిందీలో 1.34 లక్షల పేజీలు, తెలుగులో సుమారు 70 వేల పేజీల సమాచారం మాత్రమే ఉంది.

ఏ జిల్లాలోని బెరైటీస్‌ ఖనిజాన్ని విక్రయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది?
వైఎస్సార్‌ కడప జిల్లా మంగంపేట గనుల నుంచి 22 లక్షల మెట్రిక్‌ టన్నుల బెరైటీస్‌ ఖనిజాన్ని 2021–22 ఆర్థిక సంవత్సరంలో విక్రయించాలని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఇ–టెండర్‌ కమ్‌ ఇ–వేలం బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది. ఏడాదిలో 10 లక్షల టన్నుల ఎ–గ్రేడ్, 2 లక్షల టన్నుల బి–గ్రేడ్, 10 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల బెరైటీస్‌ ఖనిజాన్ని విక్రయించనున్నట్లు ఫిబ్రవరి 7న ఏపీఎండీసీ తెలిపింది.
బెరైటీస్‌
1992 నాటికి 5,08,000 టన్నుల బెరైటీస్‌ ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే. రంగులు, కాగితం, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. బెరైటీస్‌ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలు, రాజస్థాన్‌లోని ఆల్వార్‌ ప్రాంతాల్లో లభిస్తోంది.

భారత్‌ యోగా విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు?
సత్సంగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్‌ ముంతాజ్‌ అలీ (శ్రీఎం) ఆహ్వానం మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 7న చిత్తూరు జిల్లా మదనపల్లె వచ్చారు. మదనపల్లెలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌లో ‘‘భారత్‌ యోగా విద్యాకేంద్రం’’ను ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సదుం మండలం గొంగివారిపల్లెలో సత్సంగ్‌ ఫౌండేషన్‌కు చెందిన పీపుల్స్‌ గ్రోవ్‌ స్కూల్‌ను సందర్శించారు.

10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజాగా ఈడబ్ల్యూఎస్‌ కోటాతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగాయి.
ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీలు) మినహా ఆర్థి కంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

తెలంగాణ ఫైబర్‌(టీ ఫైబర్‌) గ్రిడ్‌ ప్రాజెక్టు ఉద్దేశం?
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) ఆధ్వర్యంలో ‘భారత్‌లో ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగం’ అనే అంశంపై జనవరి 29న జరిగిన వర్చువల్‌ సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ‘‘తెలంగాణ ఫైబర్‌(టీ ఫైబర్‌) గ్రిడ్‌’’ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.
రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళిక...
నాబార్డు ఆధ్వర్యంలో జనవరి 29న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్రానికి 2021–22 సంవత్సరానికి రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించారు. ‘స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2021–22’ను విడుదల చేశారు. రైతులకు మౌలిక వసతులు పెంచేందుకు, అధిక పెట్టుబడి అందించడంతో పాటు వారి ఆదాయం పెరిగేలా నాబార్డు, బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

ప్రపంచంలో అతిపెద్ద హైడ్రాలిక్‌ సిలిండర్లను అమర్చుతున్న ప్రాజెక్టు?
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే క్రస్ట్‌ గేట్ల నిర్వహణలో అత్యంత కీలకమైన 96 ‘హైడ్రాలిక్‌ హాయిస్ట్‌’ సిలిండర్లను జర్మనీలోని మాంట్‌ హైడ్రాలిక్‌ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే 70 సిలిండర్లు జర్మనీ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేర్చారు. ప్రపంచంలో హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లతో అతిపెద్ద గేట్లను అమర్చుతున్న ప్రాజెక్టు పోలవరమే. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఏ పథకం కింద గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘స్వదేశీ దర్శన్‌’’ పథకం కింద ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ కోట పునరుద్ధరణ కోసం రూ.3.92 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు ఐటీడీఏ ద్వారా మంజూరవుతుండగా, రాష్ట్ర టూరిజం శాఖ పనులను చేపడుతోంది. గోండురాజుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శాశ్వత ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే శిల్ప, హస్త కళాకారులు తయారు చేసిన వాటిని ప్రదర్శనగా ఉంచేందుకు మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో...
భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. గోండులలో ప్రధానంగా... మరియా గోండ్లు, కొండ మరియలు, భిషోహార్‌ మరియలు అనే మూడు రకాలున్నాయి. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ ప్రాంతమే ఈ మూడు రకాల గోండులకు పుట్టినిల్లు. తెలంగాణలో ఉన్న గోండులను ప్రధానంగా రాజగోండులు అని అంటారు.

ఫిబ్రవరి 2021 ఎకానమీ

 
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (సీఆర్‌ఆర్‌) ప్రస్తుతం 3 శాతంగా ఉంది. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరగనుంది.
వేగంగా భారత్‌ ఎకానమీ రికవరీ: ఎస్‌బీఐ
భారత్‌ ఎకానమీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక వివరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇంతక్రితం ఎకానమీ 7.4 శాతం క్షీణ అంచనాలను మైనస్‌ 7 శాతానికి మెరుగుపరచినట్లు ఫిబ్రవరి 10న వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది.
ఇండియా రేటింగ్స్‌...
భారత్‌ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫిబ్రవరి 10న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఎకానమీ 7.8 శాతం క్షీణిస్తుందని వివరించింది.
ఫిచ్‌ రేటింగ్స్‌...
2021–22లో భారత్‌ 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని అంచనావేస్తున్న ఫిచ్‌ రేటింగ్స్, 2025–26 వరకూ దాదాపు 6.5 శాతంగానే వృద్ధి రేటు ఉంటుందని భావిస్తోంది.

భారత ఆర్థిక సర్వే : 2020–21
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించాల్సి ఉంది. 2021–22లో ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 11 శాతానికి పెరుగుతుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి.’’ అని 2020–21 భారత ఆర్థిక సర్వే వెల్లడించింది. జనవరి 30న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచారు. సర్వేలోని అంశాలు, సూచనలు, అభిప్రాయాలు, అంచనాలను పరిశీలిస్తే...
11 శాతం వృద్ధి రేటు...
2021–22 ఆర్థిక ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుంది. నామినల్‌ జీడీపీ 15.4 శాతంగా ఉంటుంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్‌ 7.7 శాతానికి పడిపోవచ్చు. అయినా 2021–22 ఆర్థిక ఏడాదిలో వృద్ధి రేటు వీ(ఠి) షేప్‌ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుంది. దేశ జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్‌ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. 2019–20లో జీడీపీ వృద్ధి రేటు 4.2 శాతంగా ఉంటుందని అంచనా.
17 ఏళ్ల తర్వాత...
17 ఏళ్ల తర్వాత మళ్లీ 2020–21లో మనదేశం కరెంటు ఖాతా మిగులు నమోదు చేసే అవకాశం ఉంది. కరెంటు ఖాతా మిగులు జీడీపీలో 2 శాతంగా ఉండొచ్చు. సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులు పెరగడం ఇందుకు దోహదం చేస్తాయి. గత పదేళ్లలో కరెంటు ఖాతా లోటు సగటున 2.2 శాతంగా ఉంది. 2019–20 నాలుగో త్రైమాసికంలో కరెంటు ఖాతా మిగులులోకి (జీడీపీలో 0.1 శాతం) మనదేశం వచ్చింది. వాణిజ్య లోటు తగ్గడం ఇందుకు కారణం.
వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగం...
వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే వ్యవసాయ రంగాన్ని గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాలి. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనా ప్రభావంతో నేలచూపులు చూసిన వేళ... వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయి.
 • రుణ, మార్కెట్‌ సంస్కరణలు, ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగింది.
 • దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదు. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది.
 • మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయి. అందుకే గ్రామీణ వ్యవసాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
 • వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి.
 • నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది.
 • నూతన తరహా మార్కెట్‌ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయి.
 • మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించడం జరిగింది.
మౌలిక రంగానికి ప్రాముఖ్యత...
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు... వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గం. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైంది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేది. ఇన్‌ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసింది.
ప్రజారోగ్యానికి పెద్దపీట...
వైద్య రంగంపై ప్రభుత్వ వ్యయం పెరిగితే తద్వారా ప్రజలపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం జీడీపీలో కేవలం 1 శాతం మేర వైద్య రంగంపై ఖర్చు చేస్తున్నారు. దానిని 2.5 నుంచి 3 శాతం వరకు పెంచితే వైద్యం కోసం ప్రజలు చేసే వ్యయం 30 నుంచి 65 శాతం వరకు తగ్గుతుంది. ఆరోగ్య సౌకర్యాల అందుబాటులో మన దేశం ప్రపంచంలో 145వ స్థానం (మొత్తం 180 దేశాలకుగాను)లో ఉంది. లాక్‌డౌన్‌ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్‌ విధానాన్ని మరింత బలోపేతం చేయాలి.
రేషన్‌ ధరలు పెంచాలి...
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల(రేషన్‌ సరకులు) ధరలను పెంచాల్సిన అవసరం ఉంది. రేషన్‌ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. ఖర్చులు పెరుగుతున్నా 2013 నుంచి వీటి ధరల్లో మార్పు చేయలేదు. పీడీఎస్‌ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్‌లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించింది.
సరిగ్గా వినియోగించుకుంటే...
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు మంచివే. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు 9–12 తరగతుల్లో క్రమేణా వృత్తి విద్య కోర్సులను ప్రారంభించాలి.
ముఖ్యాంశాలు...
 • 2020–21లో కరెంటు ఖాతాలో 2 శాతం మిగులు ఉంటుంది.
 • రేటింగ్‌ ఏజెన్సీలు భారత్‌ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్‌ ప్రతిఫలించడం లేదు.
 • 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో కరోనా కారణంగా 22 కిలోమీటర్లకు పడిపోయింది.
 • కరోనా కాలంలోనూ భారత ఏవియేషన్‌ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదు.
 • 2019 జూలై నుంచి 2020 అక్టోబర్‌ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్‌మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది.
 • రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
 • కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐలు కలిసి మొత్తం రూ.29.87 లక్షల కోట్ల(జీడీపీలో 15 శాతం) ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాయి.
 • సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది.
 • పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి.
 • ఐటీ–బీపీఎమ్‌ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది.
 • నెలవారీ సగటున ఒక చందాదారు వైర్‌లెస్‌ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది.
 • కొవిడ్‌ సంక్షోభంలోనూ వర్ధమాన దేశాల్లో భారత్‌కు మాత్రమే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు వచ్చాయి.
ఆర్థిక సర్వే గురించి...
ఆర్థిక సర్వే అంటే ఏంటి?
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. భవిష్యత్‌ సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఏటా బడ్జెట్‌కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు.
ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ (డీఈఏ)లోని ఎకనమిక్‌ డివిజన్‌ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు(చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌– సీఈఏ) నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ప్రస్తుతం కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్‌ సీఈఏగా ఉన్నారు. సర్వేను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950–51లో ఆవిష్కరించారు.
 

ఫిబ్రవరి 2021 ద్వైపాక్షిక సంబంధాలు

తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు, బలగాల ఉపసంహరణ కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య తూర్పు లద్దాఖ్‌లో మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఫిబ్రవరి 21 పదో దఫా చర్చలు జరిగాయి. హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్‌లలో సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరుపక్షాలు చర్చలు జరిపాయి. గోగ్రా, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌లలో సైన్యం ఉపసంహరణపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ డెప్సాంగ్, డెమ్‌చోక్‌లపై ఎలాంటి అవగాహన కుదరలేదు. డెప్సాంగ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు 2013 తర్వాత చైనా చర్చించడం ఇదే మొదటిసారి.
చర్చల్లో భారత ప్రతినిధుల బృందానికి 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్, చైనా బృందానికి దక్షిణ జిన్‌జియాంగ్‌ మిలటరీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ లియూ లిన్‌ నేతృత్వం వహించారు.

లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య కుదిరింది?
రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం భారత్, మాల్దీవుల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంకుల మ«ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్‌ బ్యాంకుల నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటుంది. ఫిబ్రవరి 21న మాల్దీవుల రాజధాని మాలెలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీం పాల్గొన్నారు.
మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా భారత్, మాల్డీవుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం... మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్‌ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్‌ సహకారం అందించనుంది. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి.
మాల్దీవులు రాజధాని: మాలె ; కరెన్సీ: మాల్దీవియన్‌ రుఫియా
మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు: ఇబ్రహీం మొహమ్మద్‌ సోలిహ్‌
మాల్దీవులు ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఫైసల్‌ నసీమ్‌

ఏ ఆఫ్రికా దేశంతో భారత్‌ సీఈసీపీఏ ఒప్పందం చేసుకుంది?
ఆఫ్రికా దేశమైన మారిషస్‌తో కీలకమైన ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)పై భారత్‌ ఫిబ్రవరి 22న సంతకాలు చేసింది. ఒక ఆఫ్రికా దేశంతో ఈ తరహా ఒప్పందం చేసుకోవడం భారత్‌కు ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మారిషస్‌తో ఈ ఒప్పందం భారత వాణిజ్య విస్తృతికి అవకాశం కల్పించనుంది. మారిషస్‌ రాజధాని పోర్ట్‌లూయిస్‌ జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పంద కార్యక్రమంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్నాథ్, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పాల్గొన్నారు.
ఇరు దేశాలకూ వాణిజ్య అవకాశాలు
సీఈసీపీఏ ఒప్పందం ఇటు భారత్, అటు మారిషస్‌ ఉత్పత్తులు, సేవలకు వాణిజ్య అవకాశాలను విస్తృతం చేయనుంది. ఇరు దేశాలు మరో దేశ ఉత్పత్తులు, సేవలకు ప్రత్యేక ప్రవేశ అవకాశాన్ని కల్పిస్తాయి. సుమారు 300 ఉత్పత్తులను భారత్‌ మారిషస్‌కు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడనుంది.
మారిషస్‌ రాజధాని: పోర్ట్‌లూయిస్‌; కరెన్సీ: మారిషస్‌ రుపీ
మారిషస్‌ ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్‌
మారిషస్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: ప్రవింద్‌ జుగ్నాథ్‌

పాకిస్తాన్‌ ప్రధాని విమానానికి భారత్‌ అనుమతి
భారత గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అధికారిక పర్యటన కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రత్యేక విమానంలో శ్రీలంకకు వెళ్లనున్నారు. వీవీఐపీ విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లడానికి అన్ని దేశాలు అంగీకరించడం పరిపాటి. అయితే, పాకిస్తాన్‌ సర్కారు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. 2019లో భారత విమానాలు తమ గగనతలం గుండా వెళ్లకుండా నిషేధం విధించింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విమానం మరోమార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

న్యూయార్క్‌ అసెంబ్లీలో కశ్మీర్‌పై తీర్మానం
ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్‌ అమెరికన్‌ డే’గా ప్రకటించాలని గవర్నర్‌ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ ఫిబ్రవరి 8న ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. అసెంబ్లీ సభ్యుడు నాదర్‌ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్‌ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్‌ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
కశ్మీర్‌పై న్యూయార్క్‌ అసెంబ్లీ చేసిన తీర్మానంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్‌ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్‌ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది.
బైడెన్‌కు మోదీ ఫోన్‌
అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 8న తొలిసారి మాట్లాడారు. ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
 

ఫిబ్రవరి 2021 సైన్స్ & టెక్నాలజీ

అరుణ గ్రహంపై ల్యాండ్‌ అయిన నాసా రోవర్‌ పేరు?
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అత్యాధునిక రోవర్‌ ‘పర్సవరన్స్‌’ ఫిబ్రవరి 18న అరుణ గ్రహ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ అయింది. దీంతో మార్స్‌పై జీవం ఆనవాళ్లను నిర్ధారించేందుకు నమూనాల సేకరణకు మార్గం సుగమమైందని భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్‌ ఫ్లైట్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ స్వాతి మోహన్‌ ప్రకటించారు.
అట్లాస్‌–5 రాకెట్‌ ద్వారా...
 • అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో మార్స్‌ 2020 మిషన్‌ను నాసా చేపట్టింది.
 • మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్‌కేనర్వాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 30న అట్లాస్‌–5 రాకెట్‌ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న ‘పెర్‌సెవరెన్స్‌’ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది.
 • కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్‌ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు మినీ హెలికాప్టర్‌ను రోవర్‌లో అమర్చారు.
 • ఈ రోవర్‌ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది.
 • పర్సవరన్స్‌ రోవర్‌ 203 రోజుల పాటు, 47.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సంక్లిష్ట జెజెరొ బిలం వద్ద అరుణ గ్రహంపై అడుగిడింది.
ఏడో రోవర్‌గా...
 • పెర్సీ అనే ముద్దు పేరున్న పర్సవరన్స్‌ రోవర్‌ కారు సైజులో 1,026 కేజీల బరువుంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది.
 • మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా పర్సవరన్స్‌ నిలిచింది.
 • ఈ రోవర్‌ను రోబోటిక్‌ జియాలజిస్ట్, ఆస్ట్రోబయాలజిస్ట్‌గా పరిగణించవచ్చు.
 • అత్యాధునిక శాస్త్ర పరికరాలను, హై రెజొల్యూషన్‌ ఉన్న 3డీ కెమెరాలను, మైక్రో ఫోన్‌ను, 7, 8 అడుగుల లోతులోనూ నమూనాలను సేకరించగల సామర్థ్యాన్ని ఈ రోవర్‌లో పొందుపర్చారు.
 • జెజెరొ బిలంలోని పురాతన నదీమార్గంలో రాళ్లు, మట్టి, ఇతర నమూనాలను ఈ రోవర్‌ సేకరిస్తుంది.
 • పర్సవరన్స్‌ రోవర్‌ సేకరించి, ట్యూబ్స్‌లో సీల్‌ చేసి, అక్కడే భద్రపరిచిన నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు మరో రోవర్‌ను ప్రయోగిస్తారు.
భారతీయ సంతతి శాస్త్రవేత్త...
 • మార్స్‌ 2020 మిషన్‌లో భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి మోహన్‌ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
 • మార్స్‌ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్‌ కంట్రోల్స్‌(జీఎన్‌ అండ్‌ సీ)కి స్వాతి ఆపరేషన్స్‌ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు.
 • మొత్తం ప్రయోగంలో లీడ్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు
 • భారత్‌ నుంచి ఏడాది వయసులో స్వాతి మోహన్‌ తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు.

హెలీనా, ధ్రువాస్త్ర ప్రయోగాలు విజయవంతం
దేశీయంగా రూపొందించిన యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి వ్యవస్థలు(యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌–ఏటీజీఎమ్‌)... ‘హెలీనా’, ‘ధ్రువాస్త్ర’లను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. తద్వారా హెలీనాను ఆర్మీలోకి, ధ్రువాస్త్రను వైమానిక దళంలోకి చేర్చేందుకు మార్గం సుగమమైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లా ఫోఖ్రాన్‌లో ఫిబ్రవరి 19నాటికి ఈ క్షిపణి పరీక్షలు పూర్తయ్యాయి.
హెలీనా, ధ్రువాస్త్రల విశేషాలు...
 • హెలీనా, ధ్రువాస్త్ర క్షిపణులను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
 • అన్ని వాతావరణ పరిస్థితుల్లో, రాత్రి, పగలు కూడా శత్రు ట్యాంక్‌లపై విరుచుకుపడగలవు.
 • యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్స్‌లో ఇవి మూడో తరానికి చెందినవి.
 • వీటిని భూఉపరితలం, హెలికాఫ్టర్‌ నుంచి శత్రు ట్యాంకులపై గురిపెట్టొచ్చు.
 • ఏడు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించగలవు.
 • హెలీనా క్షిపణిని సైన్యంలో, ధ్రువాస్త్ర క్షిపణిని వైమానిక దళంలో చేరుస్తారు.
 • హెలీనా, ధృవాస్త్రలు లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవు. అందుకే వీటిని ఫైర్‌ అండ్‌ ఫర్‌గెట్‌ మిసైల్స్‌ అని కూడా అంటారు.
లైబ్రరీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో కేఎంసీ పరిశోధన పత్రం
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌–19 గురించి దేశంలోని ఇతర ఆరు వైద్యసంస్థలతో కలిసి కర్నూలు మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) బృందం రూపొందించిన పరిశోధనాపత్రం అమెరికాలోని పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. కేఎంసీలోని వైరల్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరి వైద్యులు డాక్టర్‌ పి.రోజారాణి, డాక్టర్‌ జె.విజయలక్ష్మి, డాక్టర్‌ ఎ.సురేఖలు దేశంలోని కోవిడ్‌–19 బాధితుల నుంచి శ్యాంపిల్స్‌ సేకరించి అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ద్వారా మొదటిసారిగా భారతదేశంలో 73 నోవెల్‌ కరోనా వేరియంట్స్‌ను కనుగొన్నారు.
సీఎస్‌ఐఆర్‌/ఐజీఐబీ, ఏసీఎస్‌ఐఆర్‌లతోపాటు భువనేశ్వర్, రాజస్థాన్, ఢిల్లీ, నోయిడాలలో ఉన్న ప్రముఖ వైద్య సంస్థలతో కలిసి కేఎంసీ ఈ పరిశోధనాపత్రాన్ని రూపొందించింది. పరిశోధనలో పాల్గొన్న ఏడు వైద్యసంస్థల్లో దక్షిణ భారతం నుంచి కేఎంసీ మాత్రమే ఉంది.

ఫ్లూరోఫోర్స్‌ తయారీలో ఐఐసీటీ విజయం
జీవకణాల్లోని మైటోకాండ్రియాకు అతుక్కుపోయి వెలుగులు విరజిమ్మే ప్రత్యేక ఫ్లూరోఫోర్స్‌ తయారీ లో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) విజయం సాధించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కీలకమైన ఈ ఫ్లూరోఫోర్స్‌ తయారీ హక్కులను టోక్యో కెమికల్‌ ఇండస్ట్రీ (టీసీఐ) కంపెనీకి అందించినట్లు ఐఐసీటీ ఫిబ్రవరి 5న ఓ ప్రకటనలో తెలిపింది. డాక్టర్‌ సూర్యప్రకాశ్‌ నేతృత్వం లోని శాస్త్రవేత్తల బృందం ఈ ఫ్లూరోఫోర్స్‌ను అభివృద్ధి చేసింది.
మైటోకాండ్రియా పరిస్థితిని తెలుసుకునేందుకు ఇప్పటివరకు విద్యుదావేశమున్న ఫ్లూరోపోర్స్‌ను ఉపయోగించేవారు. వీటిని ప్రత్యేక పరిస్థితుల్లోనే నిల్వచేయాలి. పైగా వీటిని వాడితే కణ స్థాయి లో విష ప్రభావం కనిపిస్తుంది. ఐఐసీటీ సిద్ధం చేసిన ఫ్లూరోపోర్స్‌లో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. గది ఉష్ణోగ్రతల్లో స్థిరంగా ఉండటమే కాకుండా.. సురక్షితమైన పదార్థంతో తయారు చేయడం వల్ల విష ప్రభావాలూ ఉండవు. పైగా విద్యుదావేశం అవసరం లేకుండానే మైటో కాండ్రియాలకు అతుక్కుపోగలవు.

జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా యాంటీబాడీస్‌ (ప్రతి దేహకాలు) అభివృద్ధి చెందాయి. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లు ఫిబ్రవరి 9న వివరాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరాడే యాంటీబాడీస్‌ రాష్ట్ర వ్యాప్తంగా 24.1 శాతం మందిలో ఉన్నట్లు తెలిపాయి. హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నాయి.
2020, మేలో మొదటి సీరో సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 0.33 శాతం మాత్రమే కరోనా యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత 2020, ఆగస్టులో రెండో సీరో సర్వేలో 12.5 శాతం జనాభాలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు తేలింది. 2020, డిసెంబర్‌లో జరిపిన మూడో సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందాయని తేలింది. ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌గా ప్రస్తుతం డాక్టర్‌ ఆర్‌.హేమలత ఉన్నారు. ఎన్‌ఐఎన్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

అంగారక గ్రహం కక్ష్యలోకి యూఏఈ పంపిన అంతరిక్ష నౌక పేరు?
యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ‘అమల్‌’ అనే అంతరిక్ష నౌక ఫిబ్రవరి 9న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది అరబ్‌ దేశాల తొలి గ్రహాంతర ప్రయోగం. ఈ మానవ రహిత అంతరిక్ష నౌక దాదాపు ఏడు నెలల పాటు 30 కోట్ల మైళ్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యను చేరుకుంది. ఇకపై కక్ష్యలో పరిభ్రమిస్తూ అంగారక గ్రహ వాతావరణం గురించి సమాచారం సేకరిస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్‌ డైరెక్టర్‌ ఒమ్రాన్‌ షరీఫ్‌ హర్షం వ్యక్తం చేశారు.
అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన చైనా స్పేస్‌క్రాఫ్ట్‌ పేరు?
చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘తియాన్‌వెన్‌–1’ దాదాపు ఏడు నెలలపాటు ప్రయాణించి, ఫిబ్రవరి 10న అంగారక గ్రహం (మార్స్‌) కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులు, నీటి జాడను అన్వేషించడానికి, మానవ జీవనానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించేందుకు చైనా ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఆర్బిటార్లు మార్స్‌ కక్ష్యలోకి ప్రవేశించడం గమనార్హం. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రయోగించిన ‘అమల్‌’ అనే అంతరిక్ష నౌక ఫిబ్రవరి 9న అరుణ గ్రహ కక్ష్యలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో తన రోవర్‌ ‘పర్సివరెన్స్‌’ను అంగారకుడిపైకి ప్రయోగించేందుకు అమెరికా ఏర్పాట్లు పూర్తి చేసింది.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తోన్న రెండో టీకా పేరు?
కోవిడ్‌–19ను నిలువరించేందుకు ‘‘కోవోవ్యాక్స్‌’’ అనే మరో టీకాను 2021, జూన్‌ నాటికి అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) జనవరి 30న ప్రకటించింది. నోవావ్యాక్స్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందని తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకాను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్‌ టీకాలను ఇస్తున్నారు. కోవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసింది.

ఫిబ్రవరి 2021 అవార్డ్స్

 
డాన్‌ డేవిడ్‌ అవార్డు–2021 విజేత?
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోని ఫౌచీకి ప్రతిష్టాత్మక డాన్‌ డేవిడ్‌ అవార్డు–2021 లభించింది. హెచ్‌ఐవీ, ఎబోలా, జికా, ప్రస్తుతం కోవిడ్‌–19 అంటువ్యాధుల్ని అరికట్టడంలో డాక్టర్‌ ఫౌచి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్టు డేవిడ్‌ ఫౌండేషన్‌ ఫిబ్రవరి 18న ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం లభిస్తుంది.
ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీలో ప్రధాన కార్యాలయం ఉన్న డాన్‌ డేవిడ్‌ ఫౌండేషనల్‌ ప్రతీ ఏడాది మూడే కేటగిరిల్లో పురస్కారాలు ఇస్తుంది. గతంలో చేసిన సేవలు, ప్రస్తుతం చేస్తున్న పోరాటం, భవిష్యత్‌లో ఉపయోగపడేవాటికి ఈ పురస్కారాలు ఉంటాయి. ప్రస్తుతం డేవిడ్‌ ఫౌండేషన్‌ అవార్డు కమిటీ చీఫ్‌గా ఎలిజెబెత్‌ మిల్లర్‌ ఉన్నారు.

పీఆర్‌ఎస్‌ఐ అవార్డు–2020 విజేత?
కోవిడ్‌–19 సమయంలో కమ్యూనికేషన్‌ ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా... తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్‌ మీడియా వింగ్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ)–2020 అవార్డు లభించింది. ‘కమ్యూనికేషన్స్‌ క్యాంపెయిన్‌ ఆఫ్‌ ది ఇయర్, కోవిడ్‌–19’కేటగిరీలో డిజిటల్‌ మీడియా వింగ్‌కు ఈ అవార్డు దక్కింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య చేతుల మీదుగా తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం అవార్డు అందుకున్నారు. ఫిబ్రవరి 23న జరిగిన వర్చువల్‌ సమావేశంలో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ఆర్టీసీకి ఐటీ అవార్డు...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి జాతీయ స్థాయి ఐటీ అవార్డు వచ్చింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగంలో ఈ అవార్డు వచ్చినట్టు ఆర్టీసీ చీఫ్‌ ఇంజనీర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ వంటి వాటిని ప్రవేశపెట్టినందుకుగాను ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఆర్‌.పి.ఠాకూర్‌ ఉన్నారు.

పీఎం–కిసాన్‌ అవార్డులు గెలుచుకున్న ఏపీలోని జిల్లాలు?
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎం–కిసాన్‌ పథకం ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలకు కేంద్ర వ్యవసాయశాఖ ‘‘పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ అవార్డు’’లను ప్రకటించింది. ఈ అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతికపరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డుల్ని సాధించాయి. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అవార్డులు అందుకున్నారు.
గోరఖ్‌పూర్‌లో...
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందుకు ప్రధాన మంత్రి రైతు గౌరవ నిధి (పీఎం–కిసాన్‌) పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019 ఫిబ్రవరి 24న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
రూ. 1.15 లక్షల కోట్లు...
పీఎం కిసాన్‌ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24న ప్రకటించింది.

చాంపియన్స్‌ అవార్డుకి ఎంపికైన భారతీయురాలు?
భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికాలోని జో బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్‌ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది.

వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌ గుర్తింపు పొందిన విమానాశ్రయం?
హైదరాబాద్‌ నగర సమీపంలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు)కు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌’ గుర్తింపు లభించింది. 2020 ఏడాదిలో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఫిబ్రవరి 9న వెల్లడించాయి. కోవిడ్‌–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్‌ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్‌ సదుపాయం కల్పించిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది.
బయో ఆసియా సదస్సు...
ఆసియాలోనే అతిపెద్ద జీవశాస్త్ర, ఆరోగ్య రంగ సదస్సు ‘బయో ఆసియా’ 2021, జనవరి 22, 23 తేదీల్లో వర్చువల్‌ విధానంలో జరగనుంది. కోవిడ్‌–19తో పాటు ప్రపంచ ఆరోగ్యం, ఫార్మా, మెడ్‌టెక్‌ అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు.

జీనియస్‌ ఇంటర్నేషనల్‌ అవార్డును గెలుచుకున్న సంస్థ?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు జీనియస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు లభించింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఆన్‌లైన్‌ వర్చువల్‌ ద్వారా నిర్వహించినందుకు గాను సంస్థకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఫిబ్రవరి 10న తాడేపల్లిలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులకు జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు అందజేశారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీగా జయలక్ష్మి...
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవోగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి ఫిబ్రవరి 10న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డాక్టర్‌ అర్జా శ్రీకాంత్‌ ఈ బాధ్యతలను నిర్వహించారు.

ఫిబ్రవరి 2021 స్పోర్ట్స్

 
ఫిలిప్‌ ఐలాండ్‌ టెన్నిస్‌ టోర్నిలో టైటిల్‌ గెలిచిన క్రీడాకారిణి?
భారత మహిళల నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనా తన కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సాధించింది. ఫిలిప్‌ ఐలాండ్‌ ట్రోఫీ మహిళల డబుల్స్‌ విభాగంలో అంకిత తన రష్యా భాగస్వామి కమిల్లా రఖీమోవాతో కలిసి విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 19న జరిగిన డబుల్స్‌ ఫైనల్లో అంకిత (భారత్‌)–కమిల్లా (రష్యా) ద్వయం 2–6, 6–4, 10–7తో అనా బ్లింకోవా–అనస్టాసియా పొటపోవా (రష్యా) జోడీపై గెలుపొందింది. టైటిల్‌ గెలుపొందిన అంకిత జోడీకి 8000 డాలర్లు ప్రైజ్‌మనీగా లభించాయి.

అడ్రియాటిక్‌ టోర్నిలో స్వర్ణం గెలిచిన తొలి భారత బాక్సర్‌?
అడ్రియాటిక్‌ పెర్ల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అల్ఫియా పఠాన్‌ స్వర్ణపతకం సాధించింది. మాంటెనెగ్రో దేశంలోని బద్వా పట్టణంలో ఫిబ్రవరి 20న జరిగిన 81 కేజీల విభాగం ఫైనల్లో... 2019 ఆసియా జూనియర్‌ బాలికల చాంపియన్‌ అయిన అల్ఫియా 5–0తో డారియా కొజొరెవ్‌ (మాల్డోవా)ను చిత్తు చేసింది. దీంతో అడ్రియాటిక్‌ టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి భారత బాక్సర్‌గా అల్ఫియా నిలిచింది.
మాంటినిగ్రో రాజధాని: పొడ్గారికా; కరెన్సీ: యూరో
మాంటినిగ్రో ప్రస్తుత అధ్యక్షుడు: మిలో డ్యుకనోవిక్‌
మాంటినిగ్రో ప్రస్తుత ప్రధాని: జ్‌రావ్‌కో క్రివోకపిక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌–2021 విజేత?
సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో జపనీస్‌ స్టార్‌ నయోమి ఒసాకా చాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 20న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ ఒసాకా 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడీని చిత్తు చేసింది. దీంతో ఒసాకా రెండోసారి ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్నట్లయింది. గతంలో 2019లో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ను ఒసాకా గెలిచింది. తాజా విజయంతో ఒసాకా... ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్‌ ఓపెన్‌ (2018, 2020) టైటిల్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి.
మెర్టెన్స్‌–సబలెంక జంటకు డబుల్స్‌...
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను రెండో సీడ్‌ ఎలైస్‌ మెర్టెన్స్‌ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్‌) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్‌ జోడీ 6–2, 6–3తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది.
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో...
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బార్బరా క్రెజికొవా (చెక్‌ రిపబ్లిక్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా–రాజీవ్‌ రామ్‌ జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్‌ వైల్డ్‌కార్డ్‌ జంట సమంత స్టొసుర్‌–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పురుషులు సింగిల్స్‌–2021 విజేత?
సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తొమ్మిదోసారి చాంపియన్‌గా అవతరించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 21న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్‌ సవరించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
గతంలో...
 • గతంలో జొకోవిచ్‌ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు.
 • 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో జొకోవిచ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న రోజర్‌ ఫెడరర్, రఫెల్‌ నాదల్‌ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్‌ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు.
అడ్రియాటిక్‌ పెర్ల్‌ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు
అడ్రియాటిక్‌ పెర్ల్‌ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మాంటెనిగ్రోలోని బద్వా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో ఫిబ్రవరి 21న వింకా (60 కేజీలు), సనమచ చాను (75 కేజీలు) భారత్‌కు బంగారు పతకాలు అందించారు. ఫైనల్లో వింకా 5–0తో క్రిస్టినా క్రిపెర్‌ (మాల్డోవా)పై... సనమచ చాను 6–0తో రాజ్‌ సాహిబా (భారత్‌)పై గెలిచారు.
రజతం, కాంస్యం...
48 కేజీల విభాగంలో గీతిక(భారత్‌) రజతం సాధించింది. ఫైనల్లో గీతిక 1–4తో ఫర్జానా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది. 57 కేజీల సెమీఫైనల్లో ప్రీతి(భారత్‌) 1–4తో బొజానా (మాంటెనిగ్రో) చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
మాంటినిగ్రో రాజధాని: పొడ్గారికా; కరెన్సీ: యూరో
మాంటినిగ్రో ప్రస్తుత అధ్యక్షుడు: మిలో డ్యుకనోవిక్‌
మాంటినిగ్రో ప్రస్తుత ప్రధాని: జ్‌రావ్‌కో క్రివోకపిక్‌
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్‌?
శ్రీలంక జట్టు ఓపెనర్, మాజీ కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన 16 ఏళ్ల కెరీర్‌లో తరంగ 31 టెస్టుల్లో 1,754 పరుగులు (3 సెంచరీలు)... 235 వన్డేల్లో 6,951 పరుగులు (17 సెంచరీలు)... 26 టి20ల్లో 407 పరుగులు సాధించాడు. 2007, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్న 36 ఏళ్ల తరంగ 28 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
ఎడ్జ్‌కొనెక్స్‌తో అదానీ జాయింట్‌ వెంచర్‌...
దేశీయంగా డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అమెరికాకు చెందిన ఎడ్జ్‌కొనెక్స్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎడ్జ్‌కొనెక్స్‌లో భాగమైన ఎడ్జ్‌కొనెక్స్‌ యూరప్‌తో తమ అనుబంధ సంస్థ డీసీ డెవలప్‌మెంట్‌ చెన్నై (డీసీడీసీపీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ఆస్ట్రేలియా క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో లీసా స్థాలేకర్‌
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ లీసా స్థాలేకర్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. పుణేలో జన్మించి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన ఆమె 2001–13 మధ్య కాలంలో 8 టెస్టులు, 125 వన్డేలు, 54 టి20లు ఆడింది. నాలుగు ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. ‘‘తాజా గౌరవంతో బెలిండా క్లార్క్, రోల్టన్, మెలానీలాంటి స్టార్‌ క్రికెటర్ల సరసన లీసా చేరింది’’ అని ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ చైర్మన్‌ పీటర్‌ కింగ్‌ తెలిపారు.

అలెన్‌ బోర్డర్‌ పురస్కారం గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌?
ఆస్ట్రేలియా క్రికెట్‌ ఫిబ్రవరి 6న ప్రకటించిన వార్షిక అవార్డుల్లో మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు రెండు పురస్కారాలు లభించాయి. 2020–21 ఏడాదిగానూ మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించిన స్మిత్‌కు ‘అలెన్‌ బోర్డర్‌ మెడల్‌’ తోపాటు ‘వన్డే ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం దక్కింది. మహిళల విభాగంలో బెత్‌ మూనీ ‘బెలిండా క్లార్క్‌’ అవార్డును తొలిసారి గెల్చుకుంది.

2020–21 బిగ్‌బాష్‌ టైటిల్‌ విజేత?
వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్‌ జట్టు... బిగ్‌బాష్‌ టి20 టోర్నమెంట్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టును ఓడించింది.

36వ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఎక్కడ జరగుతోంది?
36వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2021ను అస్సాంలోని గువాహటిలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6న మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అగసారా నందిని అండర్‌–18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని అయిన నందిని లాంగ్‌జంప్‌ ఫైనల్లో 5.80 మీటర్ల దూరం దూకి పసిడి పతకాన్ని దక్కించుకుంది.
లక్ష్మీకి రజత పతకం...
అండర్‌–18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన జెమ్మెల లక్ష్మీ రజత పతకం దక్కించుకుంది. అండర్‌–20 బాలుర షాట్‌పుట్‌ ఈవెంట్‌లో తెలంగాణకి చెందిన మొహమ్మద్‌ మోసిన్‌ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు.

టోర్నీ చాంపియన్‌గా అవతరించిన జట్టు?
అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) కప్‌ పురుషుల టీమ్‌ టోర్నమెంట్‌లో రష్యా జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇటలీ జట్టుతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్లో రష్యా 2–0తో విజయం సాధించింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌గా జరగాల్సిన డబుల్స్‌ మ్యాచ్‌ను నిర్వహించలేదు.
మాజీ బాక్సర్‌ లియోన్‌ స్పింక్స్‌ కన్నుమూత
అమెరికా ప్రొఫెషనల్‌ బాక్సర్, 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లియోన్‌ స్పింక్స్‌(67) కన్నుమూశాడు. క్యాన్సర్‌ కారణంగా అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్‌సన్‌లో ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచారు. లియోన్‌ స్పింక్స్‌... 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో పురుషుల లైట్‌ హెవీవెయిట్‌ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్‌ ఎక్కడ జరగనుంది?
భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్‌లో ఆడనున్నాడు. 2021 మార్చి 2 నుంచి 21 వరకు ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. సెహ్వాగ్, లారా, మురళీధరన్, బ్రెట్‌ లీ, దిల్షాన్‌ తదితర మాజీ స్టార్‌ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం మహారాష్ట్ర రహదారి భద్రత విభాగం, సునీల్‌ గావాస్కర్‌కు చెందిన పీఎంజీ గ్రూప్‌ ఈ టోర్నీని ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్‌ కోచ్‌ పదవికి వసీమ్‌ జాఫర్‌ రాజీనామా
భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్‌ ఉత్తరాఖండ్‌ రంజీ జట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. జట్టు ఎంపిక విషయాల్లో ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ సంఘం (సీఏయూ) సెక్రటరీ, సెలెక్టర్లు జోక్యం ఎక్కువ కావడంతో తాను కోచ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జాఫర్‌ తెలిపాడు.

షూటర్‌ దివ్యాన్ష్ ప్రపంచ రికార్డు
జాతీయ షూటింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో... ప్రపంచ నంబర్‌వన్‌ షూటర్, టోక్యో బెర్త్‌ హోల్డర్‌ దివ్యాన్ష్ సింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఫైనల్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 10న జరిగిన ఈవెంట్‌లో దివ్యాన్‌‡్ష ఫైనల్లో 253.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలవడంతో పాటు ప్రపంచ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. 252.8 పాయింట్లతో హావోనన్‌ యు (చైనా) పేరిట ఉన్న రికార్డును దివ్యాన్‌‡్ష సవరించాడు.
హైదరాబాద్‌ ఎఫ్‌సీ కోచ్‌గా మనొలో...
ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) హెడ్‌ కోచ్‌గా మాన్యుయెల్‌ మనొలో మార్కెజ్‌ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఆయన 2020, ఆగస్టులో హైదరాబాద్‌ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. తాజా పొడిగింపుతో ఆయన 2022–23 సీజన్‌ పూర్తయ్యేదాకా జట్టుకు సేవలందిస్తారు.

మహిళల 1,500 మీటర్లలో సరికొత్త ప్రపంచ రికార్డు
ఇథియోపియా మహిళా అథ్లెట్‌ గుడాఫ్‌ సెగే... 1,500 మీటర్ల ఇండోర్‌ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నార్తర్న్‌ ఫ్రాన్స్‌లో జరిగిన మీట్‌లో ఆమె 1,500 మీటర్ల పరుగును 3 నిమిషాల 53.09 సెకన్లలో పూర్తి చేసింది. గతంలో యూరోపియన్‌ ఇండోర్‌ చాంపియన్‌ లౌరా ముయిర్‌ (3ని.59.58 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును సెగే సవరించింది.
ఉత్తమ అథ్లెట్లు నందిని, యశ్వంత్‌...
జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2021లో తెలంగాణ అమ్మాయి అగసారా నందిని అండర్‌–18 బాలికల విభాగంలో... ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయి యశ్వంత్‌ కుమార్‌ అండర్‌–20 బాలుర విభాగంలో ‘ఉత్తమ అథ్లెట్‌’ అవార్డులు గెల్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో ఫిబ్రవరి 10న ఈ పోటీలు ముగిశాయి. నందిని ఈ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. యశ్వంత్‌ అండర్‌–20 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు.

అంపైరింగ్‌ బాధ్యతలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన క్రికెటర్‌?
ఆస్ట్రేలియా అంపైర్‌ బ్రూస్‌ ఆక్సెన్‌ఫోర్డ్‌ జనవరి 28న అంతర్జాతీయ క్రికెట్‌ అంపైరింగ్‌ బాధ్యతలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2012నుంచి ఐసీసీ ఎలైట్‌ అంపైర్స్‌ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన 15 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 200 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు పనిచేసిన ఆయనకు బ్రిస్బేన్‌లో భారత్‌–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు చివరిది.
తొలి అంపైర్‌గా...
3 వన్డే ప్రపంచకప్‌లు, 3 టి20 ప్రపంచకప్‌లతో పాటు 2 మహిళల టి20 ప్రపంచకప్‌లలో కూడా ఆక్సెన్‌ఫోర్డ్‌ అంపైర్‌గా వ్యవహరించారు. మైదానంలో బ్యాట్స్‌మన్‌ షాట్‌ల నుంచి తప్పించుకునేందుకు ‘ఆర్మ్‌ షీల్డ్‌’ను ఉపయోగించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. అంపైర్‌ కాకముందు క్వీన్స్‌లాండ్‌ జట్టుకు 8 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బ్రూస్‌... ఇకముందు దేశవాళీ మ్యాచ్‌లకు అంపైర్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.

ఆసియా క్రికెట్‌ మండలి అధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు?
ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. నజ్ముల్‌ హసన్‌ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తనయుడైన 32 ఏళ్ల జై షా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందారు.
రంజీ ట్రోఫీకి విరామం
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ (మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్‌లు) రంజీ ట్రోఫీకి 2020–2021 సీజన్‌లో బీసీసీఐ విరామమిచ్చింది. కరోనా కారణంగా ఈ సీజన్‌లో చాలా సమయం కోల్పోయిన కారణంగా తాజా సీజన్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించలేమని జనవరి 30న బీసీసీఐ ప్రకటించింది. 1934–35లో రంజీ ట్రోఫీ మొదలైన తర్వాత టోర్నీ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి.

బీఎఫ్‌ఐ అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి?
భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్ష పదవి మరోసారి అజయ్‌ సింగ్‌కే దక్కింది. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌ కూడా అయిన అజయ్‌ గురుగ్రామ్‌లో ఫిబ్రవరి 3న జరిగిన ఎన్నికల్లో 37–27 ఓట్ల తేడాతో ప్రత్యర్థి, మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్‌ షెలార్‌పై గెలుపొందారు. నాలుగేళ్లపాటు ఆయన అధ్యక్ష పదవిలో ఉంటారు. హేమంత కుమార్‌ కలీటా (అస్సాం) సమాఖ్య కొత్త జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
 

ఫిబ్రవరి 2021 వ్యక్తులు

మెట్రో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన వ్యక్తి?
దేశంలో ప్రజారవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ‘మెట్రోమ్యాన్‌’గా గుర్తింపు పొందిన ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్‌ ఈ. శ్రీధరన్‌ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని కేరళ బీజేపీ చీఫ్‌ కె.సురేంద్రన్‌ ఫిబ్రవరి 18న వెల్లడించారు. అవసరమైతే కేరళ బీజేపీ తరఫున తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడతానని శ్రీధరన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని తెలిపారు.
రష్మీ సామంత్‌ రాజీనామా...
ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు రష్మీ సామంత్‌(22) తన పదవికి రాజీనామా చేశారు. గతంలో వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలోని లినాక్రె కాలేజీలో ఎనర్జీ సిస్టమ్స్‌ విభాగంలో ఎమ్మెస్సీ చేస్తున్న రష్మీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విద్యార్థి సంఘం నేతగా ఎన్నికయ్యారు.

టైమ్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు?
భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లతో టైమ్‌ మ్యాగజైన్‌ ప్రతి ఏడాది ‘‘ఎమర్జింగ్‌ లీడర్స్‌ çహూ ఆర్‌ షేపింగ్‌ ద ఫ్యూచర్‌’’ పేరుతో జాబితాను విడుదల చేస్తోంది. 2021 ఏడాదికి గాను రూపొందించిన జాబితాను ఫిబ్రవరి 18న విడుదల చేసింది. టైమ్‌ 100–2021 జాబితాలో ఐదుగురు భారత సంతతి ప్రముఖులు, ఒక భారతీయుడు చోటు దక్కించుకున్నారు.
ఏకైక భారతీయుడు...
భీం ఆర్మీ చీఫ్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ టైమ్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ‘‘34 ఏళ్ల చంద్రశేఖర్‌ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా భీం ఆర్మీ ఉద్యమిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమించింది’’ అని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది.
ఐదుగురు భారత సంతతి ప్రముఖులు...
టైమ్‌ 100 జాబితాలో ఐదుగురు భారత సంతతి ప్రముఖులకు చోటు లభించింది. ఈ ఐదుగురిలో ట్విట్టర్‌ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దె, యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్, ఇన్‌స్టాకార్ట్‌ వ్యవస్థాపకులు–సీఈఓ అపూర్వ మెహతా, గెట్‌ యూఎస్‌ పీపీఈ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ శిఖా గుప్తా, అప్‌ సాల్వ్‌ సంస్థ వ్యవస్థాపకుడు రోహన్‌ పావులూరి ఉన్నారు.
కర్ణాటకలో తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాది
కర్ణాటక రాష్ట్రంలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. మైసూరులోని జయనగర నివాసి శశికుమార్‌ అలియాస్‌ శశి ప్రస్తుతం ఒక సీనియర్‌ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు. కర్ణాటక ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివిన శశి... 2018లో విద్యావర్ధక లా కళాశాలలో చేరి మూడేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. 14 సంవత్సరాల వరకు యువకుడిగా ఉన్న శశి హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రాజీనామా
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూప్పకూలింది. బలనిరూపణలో ముఖ్యమంత్రి వి నారాయణస్వామి విఫలమయ్యారు. బలపరీక్ష కోసం ఫిబ్రవరి 22న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌కు వెళ్లి పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌కు తన రాజీనామాను సమర్పించారు.
పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌– డీఎంకే, బీజేపీ–ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటములు బరిలోకి దిగాయి. 15 సీట్లు గెలుపొందడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది.
జిందాల్‌ పవర్‌ చైర్మన్‌గా నియమితులైన కోల్‌ ఇండియా మాజీ హెడ్‌?
జిందాల్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) చైర్మన్‌గా కోల్‌ ఇండియా మాజీ హెడ్‌ అనిల్‌కుమార్‌ జా నియమితులయ్యారు. మైనింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనిల్‌కుమార్‌ దన్‌బాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌ నుంచి ఎంటెక్‌ పట్టా కూడా పొందారు. మైనింగ్‌ ప్రణాళిక, ఉత్పత్తి, నిర్వహణ, పర్యవేక్షణ విభాగాల్లో ఆయనకు మూడు దశాబ్ధాల అనుభవం ఉంది.
స్టీల్‌ తయారీ సంస్థ జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) అనుబంధ కంపెనీయే జేపీఎల్‌. ప్రస్తుతం జేపీఎల్‌ చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌ఘర్‌ జిల్లా తమ్నార్‌ వద్ద 3,400 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.
ది శూద్రాస్‌ – విజన్‌ ఫర్‌ ఏ న్యూ పాత్‌ పుస్తక రచయిత?
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, శిశు సంక్షేమం కోసం నాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు ఈశ్వరీబాయి అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కొనియాడారు. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ఈశ్వరీబాయి పోస్టల్‌ స్టాంపును హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో కలసి ఆయన ఆవిష్కరించారు.
ది శూద్రాస్‌ పుస్తక రచయిత...
ప్రముఖ రచయిత కంచ ఐలయ్య షెపర్డ్‌ రచించిన ‘ది శూద్రాస్‌ – విజన్‌ ఫర్‌ ఏ న్యూ పాత్‌’ పుస్తకం అమెజాన్‌ మార్కెట్లో రికార్డు నెలకొల్పింది. సివిల్‌ రైట్‌ కేటగిరీలో బెస్ట్‌ సెల్లర్‌గా ఈ పుస్తకం రికార్డుకెక్కింది. పుస్తకంలో శూద్రకులాలు ఎంత బలహీనంగా ఉన్నాయనే అంశంపై కంచ ఐలయ్య బృందం విస్తృతంగా చర్చించింది.

టై గ్లోబల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి?
ద ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టై) గ్లోబల్‌ చైర్మన్‌గా 2021 సంవత్సరానికిగాను హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ తైలం ఎన్నికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ గౌరవం దక్కించుకున్న తొలి తెలుగువాడిగా ఆయన గుర్తింపు పొందారు. 2018లో టై గ్లోబల్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్‌లో డెంటల్‌ ఆఫీస్‌లను నిర్వహిస్తున్నారు. 1992లో ప్రారంభమైన ద ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌కు 14 దేశాల్లో 61 శాఖలున్నాయి. 15,000 పైచిలుకు వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల ఉన్నతాధికారులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు.
ఎయిర్‌బస్‌–జీఎంఆర్‌ ఒప్పందం
ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగంలో ఉన్న నెదర్లాండ్స్‌ దిగ్గజం ఎయిర్‌బస్, మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆవిష్కరణలు, నిర్వహణ, విడిభాగాలు, శిక్షణ, డిజిటల్, విమానాశ్రయ సేవల వంటి విభాగాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి.

రంగవల్లి నవలను రచించిన తెలుగు రచయిత?
ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్‌లో ఫిబ్రవరి 6న కన్నుమూశారు. 1935 డిసెంబర్‌ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించిన పోరంకి... తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ చేశారు. అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్‌ ఆటో బయోగ్రఫీ ఆఫ్‌ సెయింట్‌’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు.

సినాడ్‌ అండర్‌ సెక్రటరీగా ఎంపికైన తొలి మహిళ?
సినాడ్‌ (బిషప్పుల మహాసభ) అండర్‌ సెక్రటరీ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఫ్రాన్సుకు చెందిన సిస్టర్‌ నథాలీ బెకార్ట్‌(51) రికార్డు నెలకొల్పారు. చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్‌ ఫ్రాన్సిస్‌(రోమన్‌ క్యాథలిక్కుల గురువు) ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్‌ సెక్రటరీ జనరల్‌ కార్డినల్‌ మరియో గ్రెక్‌ ఫిబ్రవరి 7న తెలిపారు. బెకార్ట్‌కు కూడా ఓటింగ్‌ హక్కు కల్పించినట్లు తెలిపారు. బెకార్ట్‌తో పాటు స్పెయిన్‌కు చెందిన లూయిస్‌ మారిన్‌ డీ సాన్‌ మార్టిన్‌ అనే వ్యక్తి కూడా సినాడ్‌ అండర్‌ సెక్రటరీ పదవికి ఎంపికయ్యారు.
సినాడ్‌ ...
క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్‌ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్‌ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్‌కు మాత్రమే ఓటింగ్‌ హక్కులుంటాయి. గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు.
బెకార్ట్‌ గురించి...
ఫ్రాన్సులోని జేవియర్‌ సిస్టర్స్‌ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్‌ఈసీ బిజినెస్‌ స్కూల్‌ నుంచి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. బోస్టన్‌ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు.

భారత టెన్నిస్‌ దిగ్గజ కోచ్‌ అక్తర్‌ అలీ కన్నుమూత
భారత మేటి టెన్నిస్‌ ప్లేయర్, దిగ్గజ కోచ్‌ అక్తర్‌ అలీ(81) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 7న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1939 జూలై 5న జన్మించిన అక్తర్‌ అలీ... 1955లో జాతీయ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచారు. 1958 నుంచి 1964 మధ్యకాలంలో అక్తర్‌ అలీ భారత డేవిస్‌కప్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు కెప్టెన్‌గా ఉన్నారు. 1968లో జాతీయ స్క్వాష్‌ చాంపియన్‌గా నిలిచారు.
భారత జట్టుకు కోచ్‌గా...
ఆటకు వీడ్కోలు పలికిన అక్తర్‌ అలీ... 1966 నుంచి 1993 వరకు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయన కోచ్‌గా ఉన్నపుడే భారత జట్టు రెండుసార్లు (1966, 1974) డేవిస్‌ కప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. మలేసియా (1968–1970; 1991–1993), బెల్జియం (1980–1984) జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2000లో అర్జున అవార్డుతో సత్కరించింది. అక్తర్‌ అలీ తనయుడు జీషాన్‌ అలీ ప్రస్తుత భారత డేవిస్‌కప్‌ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

గ్లోబల్‌ సిటిజన్‌షిప్‌ అంబాసిడర్‌గా ఎంపికైన భారతీయుడు?
ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సిటీ... నార్త్‌ ఈస్టరన్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్పిరిచ్యువాలిటీ, డైలాంగ్‌ అండ్‌ సర్వీస్‌ నుంచి భారత ఆధ్యాత్మిక గురువు, శాంతిదూత, మానవతావాది శ్రీశ్రీ రవిశంకర్‌కి గ్లోబల్‌ సిటిజన్‌షిప్‌ అంబాసిడర్‌గా గుర్తింపు లభించింది. ప్రపంచంలో మానవతా విలువలు పెంపోందించేందుకు చేసిన కృషికి గానూ ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. గ్లోబల్‌ సిటిజన్‌ షిప్‌ అంబాసిడర్‌గా రవిశంకర్‌ను సత్కరించినట్టు వర్సీటీ తెలిపింది.
విభేదాలకు కారణం...
రవిశంకర్‌ ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, కామెరూన్, కొలంబియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాక్, ఇజ్రియెల్, పాలస్తీనా, కెన్యా, కొసావో, లెబనాన్, మారిషస్, మొరాకో, నేపాల్, పాకిస్తాన్, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అమెరికా దేశాల్లో విభేదాల శాంతియుత పరిష్కారానికీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. విభేదాలకు తొలి కారణం కమ్యూనికేషన్‌ దెబ్బతినడం అనీ, రెండో కారణం విశ్వాసం సన్నగిల్లడం అని ఆయన అంటారు.
వర్సిటీ గురించి...
ప్రయోగాత్మక విద్య, పరిశోధనలలో నార్త్‌ ఈస్టరన్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్పిరిచ్యువాలిటీ, డైలాంగ్‌ అండ్‌ సర్వీస్‌ విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా ప్రముఖ స్థానంలో ఉంది. 100కు పైగా దేశాల విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం ఆశ్రయమిస్తోంది. అమెరికాలోని టాప్‌ 50 యూనివర్సిటీల్లో ఈ యూనివర్సిటీ ఒకటి. అలాగే అమెరికాలోని అత్యధిక మంది విదేశీ విద్యార్థులున్న తొలి మూడు యూనవర్సిటీల్లో ఇది ఒకటి.

ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్లు్లగా(ఎండీ) జనవరి 28న స్వామినాథన్‌ జే, అశ్వినీ కుమార్‌ తివారీ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు వీరు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. తాజా బాధ్యతలకు ముందు స్వామినాథన్‌ ఎస్‌బీఐ ఫైనాన్స్‌ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక తివారీ ఇప్పటి వరకూ ఎస్‌బీఐ కార్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బాధ్యతలు నిర్వహించారు.
ఎస్‌బీఐ చైర్మన్‌కు నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లు సహాయ సహకారాలను అందిస్తారు. సీఎస్‌ శెట్టి, అశ్వినీ భాటియాలు ప్రస్తుతం ఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా దినేశ్‌ కుమార్‌ ఖారా ఉన్నారు.

నాసా యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులైన భారత సంతతి మహిళ?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా... శాస్త్ర సాంకేతిక రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న భారత సంతతికి చెందిన మహిళ భవ్యా లాల్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 2న అమెరికా ప్రభుత్వం తెలిపింది. భవ్య ఇప్పటివరకు ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌ ఏజెన్సీ రివ్యూ టీమ్‌’ సభ్యురాలిగా ఉన్నారు. ఇంజనీరింగ్, అంతరిక్ష విజ్ఞాన రంగాల్లో భవ్యా లాల్‌ ప్రావీణ్యం ఈమెకు ఈ పదవి దక్కేలా చేసింది. గతంలో భవ్యాలాల్‌ అనేక ప్రభుత్వ పదవులను నిర్వర్తించారు.
చైనా బెదిరింపులకు పాల్పడుతోంది...
చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందనీ, తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. భారత్‌–చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ యంత్రాంగం ఈ మేరకు తొలిసారిగా స్పందించింది.

సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నియమితులైన ఐపీఎస్‌ అధికారి?
సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా అదనపు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హా ఫిబ్రవరి 3న నియమితులయ్యారు. దీంతో పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించేవరకు సిన్హా సీబీఐ డైరెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లా ఫిబ్రవరి 3న రిటైర్‌ అయ్యారు.

సీబీఐ చీఫ్‌ను ఎవరు ఎంపిక చేస్తారు?
సీబీఐ యాక్టింగ్‌ చీఫ్‌గా 1988 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ప్రవీణ్‌ సిన్హా నియామకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న అత్యున్నత స్థాయి కమిటీ సీబీఐ చీఫ్‌ను ఎంపిక చేస్తుంది.

అమెజాన్‌ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి?
అమెరికాకి చెందిన ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌... చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) హోదా నుంచి అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తప్పుకోనున్నారు. బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ కంపెనీ క్లౌడ్‌ వ్యాపార విభాగం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌.. సీఈవో యాండీ జస్సీ సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారు. బెజోస్‌ ఇకపై ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగనున్నారు. 2021 మూడో త్రైమాసికంలో ఈ మార్పులు అమల్లోకి రానున్నాయని ఫిబ్రవరి 3న కంపెనీ తెలిపింది.
హార్వార్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన జస్సీ... 1997లో అమెజాన్‌లో చేరారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్లౌడ్‌ విభాగం ప్రారంభమైనప్పట్నుంచీ సారథిగా కొనసాగుతున్నారు.
పుస్తకాల విక్రయ సంస్థగా...
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం 1995లో అమెజాన్‌ను నెలకొల్పినప్పట్నుంచీ జెఫ్‌ బెజోస్‌ సీఈవోగా కొనసాగుతున్నారు. ఆన్‌లైన్‌ పుస్తకాల విక్రయ సంస్థగా ప్రారంభమైన కంపెనీ ఆ తర్వాత 1.7 లక్షల కోట్ల డాలర్ల ఈ–కామర్స్‌ దిగ్గజంగా ఎదిగింది. ఈ క్రమంలో బెజోస్‌ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మార్చేసింది.